"అట్లా అనవాకే పిల్లా. ఎవరు చెప్పారో గుర్తుచేసుకోకుండా ఆ కథ చెప్పటం అంత మంచిపనికాదు" అంది అమ్మమ్మ.
అమ్మమ్మ చెప్పినమాటలో అర్థం బోధపడక "ఏం, ఎందుకు మంచిదికాదు?" అన్నాను.
"మా అమ్మమ్మ కథ చెబితే ఒకరకంగా వుంటుంది. మా నాయనమ్మ కథ చెబితే ఒకరకంగా వుంటుంది" అంది అమ్మమ్మ.
"ఎవరు చెప్పినా ఆ కథేగా! విసిగించక చెప్పుదూ!" అన్నాను విసుక్కుంటూ.
"కథ అదేననుకో! కాని మా అమ్మమ్మ ఆ కథనే ఒకరకంగా చెప్పేది. మా నాయనమ్మ మరోరకంగా చెప్పేది." అంటూ అమ్మమ్మ ఆ కథ తనకు ఎవరు చెప్పారో జ్ఞాపకం చేసుకొనే ప్రయత్నంలో పడిపోయింది.
నాకు వళ్ళు మండిపోయింది.
"అమ్మమ్మకూ నాయనమ్మకూ భేదం ఏమిటో చెప్పు ముందు" అన్నాను.
"ఈ మాత్రం తెలియదటే పిల్లా! పైగా చదువుకున్నావ్! అమ్మమ్మ అంటే అమ్మకు అమ్మ. నాయనమ్మ అంటే నాయనకు అమ్మ" అంది అమ్మమ్మ తన చమత్కారానికి తానే మురిసిపోతూ. నాకు మండుతున్న అగ్నిమీద నెయ్యి పోసినట్లనిపించింది.
"నేనడిగింది అది కాదమ్మమ్మా! మీ అమ్మమ్మ చెప్పే కథకూ, నాయనమ్మ చెప్పే కథకూ భేదం ఏమిటీ అని?" అన్నాను మాటల్ని కొంచెం సాగదీస్తూ.
"కథ ఒకటేనే పిచ్చితల్లీ ?" అంది అమ్మమ్మ.
అమ్మమ్మ పడుకున్న ఆ మంచాన్ని దొర్లించాలనిపించింది. అయితే మా యిద్దరికీ మధ్య అమ్మ ఒకటి వుండిపోయిందని వూరుకున్నాను.
"నువ్వే చెప్పావుగా ఏదో తేడా వుందని, బోడి తేడా!" అన్నాను ఉడుకుబోతుతనంగా.
"ఓసి భడవా! నేను అన్నానటే అలాగని?" అమ్మమ్మ దబాయింపు ధోరణికి నేను ఆశ్చర్యపోయాను.
"ముసల్దానివి. నీకు మతిమరుపు సహజమేలే. ఇందాక అన్నావు! బాగా గుర్తుచేసుకో!" అన్నాను దబాయిస్తున్నట్లు.
"నీ వయస్సెంతే పిల్లా!" అడిగింది అమ్మమ్మ తాపీగా.
"ఇప్పుడు నా వయస్సు సంగతెందుకే? నిన్ను కథ చెప్పి చావమంటుంటేనూ!" ఆపైన ఏమనాలో తోచక కోపాన్ని దిగమింగుకున్నాను.
"పోనీ నా వయస్సెంతో చెప్పుకోవేచూద్దాం" అంది అమ్మమ్మ ముసిముసిగా అదే బోసిబోసిగా నవ్వుకుంటూ_
"నీ తికమక తగలెయ్యా! ఇప్పుడు వయస్సుల సంగతెందుకే కథ చెప్పమంటుంటేనూ!" అన్నాను కసిగా. అమ్మమ్మే నాకంటే చిన్నదైవుంటే రెండు మొట్టికాయలు పెట్టి ఉండేదాన్ని.
"ఓసి పిచ్చికట్టే! ఈ మాత్రానికే ఇంత తికమకలో పడేదానివి. ఇహ కథవింటే ఏమయిపోతావే అమ్మాయ్?" ఉన్న రెండుపళ్లు ఊగిసలాడుతుంటే పకపక నవ్వబోయి-రాక అమ్మమ్మ నవ్వే నవ్వేసింది అమ్మమ్మ.
ఆ నవ్వు చూస్తుంటే కాదు వింటుంటే....కాదు అసలు వినబడందే! అవే చూస్తుంటే ఒక గుద్దుగుద్ది ఆ వున్న రెండు పళ్ళూ ఊడపెరకాలనిపించింది. కాని అమ్మమ్మ అయిపోయిందని ఊరుకున్నాను.
"అదేమిటే అమ్మమ్మా! పైగా నేను తికమక పడుతున్నానంటావ్? అంతా నువ్వే తికమక చేసి!" అన్నాను ఆశ్చర్యంగా.
"ఓసి రాలుగాయి, నువ్వుగదే తికమక తిరగేసి మకతికచేశావు?" అంది అమ్మమ్మ నిర్లక్ష్యంగా.
"ఓసి నీతిక్కచావ! ఆ చెప్పేడ్చేదేదో సరిగా చెప్పి ఏడవరాదూ?" అన్నాను కోపంగా.
"వేలెడంతున్నావ్ నీకెంత పొగరే? ముందు నీ తిక్క కుదిరిస్తేగాని నేను చెప్పేది నీకర్ధంకాదు." అని అమ్మమ మూతి ముడుచుకుంది. ముడుచుకోవటానికి పళ్లులేవుగా అందుకని లోపలికి తీసుకుంది. అమ్మమ్మ తీసుకోవటం ఏమిటి? మూతి దానంతటదే లోపలికి పోయింది. ఇప్పుడు పోవటం ఏమిటి. ఎప్పుడూ లోపలికే వుంటుందిగా? సరే. యెట్లాగొట్లా చచ్చిందిలే ఆ మూతి గొడవ ఇప్పుడెందుకు! ఇప్పుడు నాకు కావాల్సింది కథ. కాని అమ్మమ్మకు కోపం వచ్చిందిగా.
"ఇంతకూ కథ చెబుతావా లేదా!" అన్నాను.
"నేను చెప్పనన్నానుటే? చెబుతూనే వున్నాగా" అమ్మమ్మ అంది. అమ్మమ్మకూ కథ చెప్పాలనే వుంది. కాని మధ్య చాదస్తం అడ్డుపడుతుంది అనుకున్నాను.
"అయితే చెప్పు ఊరికే సాగదీయకుండా!" అన్నాను.
"సాగదీయకపోతే అది అసలు కథ యెలాగవుతుందే?" అమ్మమ్మ నిలదీసినట్లు ప్రశ్నించింది. నాకు జవాబు తోచలేదు.
"కట్టే__కొట్టే__తెచ్చె__అన్నట్లు కథ చెప్తే అది కథ కానేకాదు." అంటూ అమ్మమ్మ బిగదీసుకుపోయింది. వంగిపోయిన అమ్మమ్మ బిగదీసుకుపోవటం ఏమిటిగాని .... ముడుచుకుపోయిది. ముడుచుకుపోవటం ఏమిటి అంతా ముడతలుపడ్డ శరీరమేగా! ముడుచుకోబోయి, కాదు బిగదీసుకోబోయి, ఏదో అయిపోయిందనుకుంటాను. ఇంకాసేపు అమ్మమ్మ దగ్గర కూర్చుంటే నేనుకూడా ఏదో అయిపోవచ్చు.
"నన్ను వెళ్ళిపొమ్మన్నావా? కథ చెబుతావా?" విసుక్కుంటూ అడిగాను.
"అసలు కథ అంటే.... ...."
"కథ అంటే ఏమిటో నువ్వు చెప్పొద్దుగాని....నువ్వు చెప్పదలచుకున్న ఆ కథ ఏమిటో త్వరగా చెప్పు?" అన్నాను అమ్మమ్మను ప్రాధేయపడుతూ.
"అంటే పిల్లా! నీ ఉద్దేశ్యం....కథంటే ఏమిటో నాకు తెలియదనేనా?" కస్సున లేచింది అమ్మమ్మ.
