Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 26


                             బొజ్జమ్మా బొచ్చుకుక్కా
    
    బొజ్జమ్మ అన్న పేరు పాత చింతకాయ పచ్చడిలా
    ఉండొచ్చు ఆ పేరు వినగానే యాభైయేళ్ళ ఆడవాళ్ళు
    గుర్తుకురావచ్చు. కాని ఆ పద్దెనిమిదేళ్ళ పడుచు పేరు
    మాత్రం అదే వాళ్ళ తాతలు జమీందార్లు అంచేత
    అమ్మమ్మలు కూడా జమీందారిణులవడంలో ఆశ్చర్యం
    లేదు తాతల పేర్లు మనవలకీ, అమ్మమ్మలపేర్లు
    మనవరాళ్ళకీ ఆస్తులతోపాటు రావడం వంశ పారంపర్య
    హక్కులాంటిది. అలాగే ఈవిడ అమ్మమ్మ పేరు బొజ్జమ్మన్నా
    రావు. రావడం ఆ పేరే అయినా పిలవడంలో సౌకర్యం
    కోసం అది బొజ్జమ్మగా రూపాంతరం చెందింది.
    
    బొజ్జమ్మకి పేరుతోపాటు ఇంకో ఏభై మంది మరో ఏభై ఏళ్లపాటు అజీర్తి రోగం వచ్చేలా తిన్నా తరగని ఆస్థుంది. తిరగడానికో లారీ లాంటి చిన్న కారుంది. కాలేజీలో అయిపోని చదువుంది. బతికుండి ప్రాక్టీసు చెయ్యని తండ్రి లాయరున్నాడు. ఆయనకి యీవిడ నోట్లో మాట బయటకి రాకముందే అమలుపరిచే మంచి మనసుంది.
    ప్రపంచంలో రకరకాల మనుషులకి రకరకాలైన సరదాలు, ఇష్టాలూ ఉంటాయి. కొందరికి కొబ్బరుండలంటే ఇష్టం ఉండొచ్చు. కొందరికి కొత్తబట్టలంటే ఇష్టం ఉండొచ్చు. కొంత మందికి సింహాలంటే ఇష్టం ఉండొచ్చు. ఇంకొంత మందికి సీతాకోకచిలకలంటే ప్రేమ కలగొచ్చు కాని సాధారణంగా చాలామందికి కుక్కల్ని పెంచడం అన్న సరదా చాలా పెద్ద హాబీ లాంటిది. బొజ్జమ్మకీ ఆ సరదా ఉంది. కాని ఒకేరకమైన ఇష్టంలో మళ్ళీ చాలా రకాల ట్విస్ట్ లుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పెసరట్లంటే ఇష్టం ఉందనుకుందాం. వాళ్ళంతా పెసరట్లు ఒకేలా ఉంటే అంత యిదిగానూ తింటారనుకోవడం చాలా పొరపాటు కొంతమంది ఉత్త పెసరట్టు, ఇంకొందరు దాన్ని ఉప్మాతో కలిపి మరికొందరు అందులో అల్లం, జీలకర్ర, ఉల్లి, ఎక్కువగా వేసి తినడం అంటేనూ ఎలాగయితే తేడాలు చూపిస్తారో అయ్యదే రీతిని శునకములను పెంచుటయందు కూడ అనేక తెగలవారు కలరు. అల్సేషియనులవారు. వేటకుక్కలవారు, బుల్ డాగులవారు, ఊరకుక్కలవారు, బొచ్చుకుక్కలవారు అందు ముఖ్యులు. అయితే బొజ్జమ్మకి దీంట్లో చివరగా చెప్పిన బొచ్చుకుక్క తెగకి రాణీ లాంటిది. ఆమెకి బొచ్చుకుక్కలంటే ఎంత ప్రాణం అంటే హఠాత్తుగా భగవంతుడే గనక ప్రత్యక్షమై నీకు జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తానంటే ఆమె కళ్ళనీరు పెట్టుకొని తనకింకొక్క జన్మలో బొచ్చుకుక్క జీవితాన్ని యివ్వాల్సిందని ప్రాధేయ పడుతుందనడంలో అతిశయోక్తి ఉండదన్నవారని అమ్మ శక్తి తిని వేయును.
    అందువల్ల యీనాడు బొజ్జమ్మ దగ్గర కొంచెం రక్తమాంసాలు, ఒక ప్రాణం ఇవన్నీ కనపడనంత బొచ్చు ఉన్న ఓ కుక్క ఉంది. అయితే ఇది కేవలం బొచ్చుకుక్కగా పిలువబడదు. దీనికి పేరుంది. ఆపేరు పెట్టడానికి బొజ్జమ్మ చాలా కష్టపడింది. చరిత్రలు చూసింది. పురాణాలు చదివింది. పెద్దల్నడిగింది. పిన్నల్ని బతిమాలింది. చివరకి ధీరోదాత్తంగా ఉంటుందని 'సీజర్' పేరు స్థిరపరిచింది. ముద్దుగా 'సీజూ అనీ, మరీ ముద్దొచ్చినప్పుడు (సాధారణంగా వచ్చేది) 'జూ' అనీ పిలుస్తుంది.
    అయితే రోజులన్నీ ఓలాగే ఉండవు. ఎంతమంచి వాడికైనా కష్టాలు తప్పవు. అలాగే బొజ్జమ్మక్కూడా వచ్చింది. మనసు భూకంపం వచ్చినట్లు తల్లడైంది. యుద్దంలో ఓడిపోయి ఖైదీగా చిక్కిన నెపోలియన్ కాని, భార్యా పిల్లల్ని రాజ్యాన్ని కోల్పోయిన హరిశ్చంద్రుడు కాని. ఆశరీరవాణి మాటలు విన్న కంసుడు కాని అలా అయిపోయుండరు అందుకు కారణం ఆవిడ పరీక్ష పోవడం, దొంగలు మనసునికాక యింట్లో వస్తువుల్ని ఎత్తుకపోవడం, తండ్రికి జబ్బు చెయ్యడం లాంటివేమీ కాదు. ఆమె ఆరాధ్య జంతువు సీజర్ రెండు రోజులనుంచి తిన్న మాంసాహారాలు, బ్రిటానియా బిస్కత్తులు శ్రేష్టమైన పాలు కడుపులో ఉంచుకోక గర్భిణీ స్త్రీలా వాంతులు చేసుకోవడమే అందుక్కారణం అయితే అందుక్కారణం తెలియని బొజ్జమ్మ రెండురోజులపాటు నిద్రాహారాలు మాని కాలేజీని తాత్కాలికంగా మానేసి హుమయూను పక్కన బాబరులా దాని ప్రక్కనే గడిపింది. అయితే ఫలితం లేకపోవడం వల్ల వెంటనే దానికి ప్రత్యేక భటుడినిచ్చి పశువులాస్పత్రికి పంపించింది.
    అయితే తిరిగొచ్చిన సీజరుకి పాతజబ్బుపోయి దాని స్థానే కొత్త జబ్బు ప్రవేశించింది. ఈ జన్మలో ఉన్నవాడికి హఠాత్తుగా పాత జన్మ జ్ఞాపకం వచ్చినట్లుగా మారిపోయింది. ఇంట్లో మనుషులందరినీ బొజ్జమ్మతోసహా చూసినపుడు వింతగా మొరగటం మొదలుపెట్టింది. ఆమెకీ మార్పు ఆస్కారు ఎవార్డు వచ్చిన ఇంగ్లీషు సినిమాలా అర్ధం కాకుండా పోయింది. అంతే కాక అది తన వాసన కూడా చూట్టం లేదన్ని బెంగ పుస్తకానికి పట్టిన చెదలా పట్టుకొంది.
    అయితే కొన్నాళ్ళకి ఎలాగయితేనేం మళ్ళీ ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు నెలకొన్నాక దాన్ని ఒళ్ళోకి తీసుకొని పసిపిల్లవాడిలా నిమిరే కన్నతల్లిలా దాన్ని తడిమి చూసిన బొజ్జమ్మకి వెంటనే షాక్ తగిలినట్లయింది.
    "అవును అది తన సీజరు కాదు తన సీజరుకి ఎడం చెవికింద చిన్న మచ్చ ఉండేది. ఈ నకిలీ సీజరుకి లేదు. తన 'జూ' కుడి కన్ను దగ్గర కొంచెం బొచ్చు ఊడిపోయి ఉండేది కాని యీ డూప్లికేటు కలా లేదు. కాని ఏవిటిది? ఎలా జరిగింది? వైద్యం చేస్తే వికారాలు పోతాయి కాని ఆకారాలు మారతాయని ఎక్కడా లేవే కాబట్టి అక్కడే ఆస్పత్రిలోనే ఏదో జరిగింది. ఎవరో తన ఒరిజినల్ని ఎత్తుకు పోయారు. బహుశా స్పై సినిమాల్లో లాగ డిటెక్టివ్ నవల్లోలాగ ఏ వెయ్యిరూపాయలో దీని కడుపుకి కట్టి ఫలానా చోట వదుల్తే తన సీజర్ని తనకిస్తామని ఎవరేనా దుండగులు అనడానికి చేసుండొచ్చు. ఆ అభిప్రాయం కలిగేక అటువంటి ఉత్తరం కోసం ఎదురుచూసింది. కాని అవేమీ జరక్క పోవడంవల్ల చేయగలిగిందేమీ లేక 'ఏ బొచ్చుకుక్క అయితేనేమి' అన్న వేదాంతాన్ని అవలంబించి దీంతోనే సర్దుకోవడం మొదలుపెట్టింది. (దాని జ్ఞాపకాలు మరుపురాకపోయినా)
    
                                2
    
    సాధారణంగా ఎదిగిన పక్షులు గూళ్ళలోంచి ఎగిరిపోతాయి. ఎదిగిన మగ పిల్లలు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. అలాగే ఎదిగిన ఆడపిల్లలు అత్తారిళ్లకు వెళ్ళడం పరిపాటి బొజ్జమ్మ నాన్నగారికి ఆమె (కుంపట్లకాలం పోవడంవల్ల) గుండెలమీది గాస్ స్టవ్ లా ఉందని అనిపించింది. అందువల్ల ఆయన జీవితంలో చేసే ఈ ఒక్క పనైనా బాగా చేద్దామన్న ఉద్దేశంతోటి తన కారుకి కొత్త టైరులరిగేలా తిరిగాడు. అయితే వచ్చిన సంబంధాలన్నింటిని బొజ్జమ్మ టెన్నిస్ లో అవతలివాడి బంతిని ఇవతలవాడు షాట్ కొట్టినట్టు తిరగ్గొట్టేసింది. అయినా అవి ఓపికున్న ఆటగాడి బంతుల్లా బంగాళాఖాతం లోని వాయుగుండాల్లా రావడం మానలేదు. ఈ ఆటలో బొజ్జమ్మ తండ్రి నోరు లేని ఎంపైర్ అయిపోయాడు.
    అయితే అన్ని సంబంధాల్లోకి ఒక్కసంబంధం మాత్రం ఆయనకి చాలా బలమైన కేసులా కనబడింది. ఆ కుర్రవాని పేరు శివరావు. పేరుకి బూడిద రాసుకునే వాడైనా అతను బంగారంలాంటి ఉద్యోగం. చాలా ఆస్తి చచ్చిపోయిన బంధు బలగం ఉన్నవాడు జనరల్ గా మగవాడికి అందం అక్కరలేదని అభిజ్ఞుల అభిప్రాయమైనా అందంగా ఉండడం అతని తప్పుకాదని మాత్రం వారు ఒప్పుకోక తప్పదు. అందువల్ల బొజ్జమ్మ తండ్రి బొజ్జమ్మని ఒక్కసారి హీరో ఛాన్సిమ్మని బతిమాలే చవక నటుడిలా బతిమాలి పెళ్ళి చూపుల్ని జరిపించేశాడు. ఈ సంబంధంలో అనంగీకారానికి కారణాలు కానీ అంగీకారానికి అర్ధం కాని బొజ్జమ్మకి కనపడలేదు. కాని అంతకు మించి అతన్ని చూడగానే యీ నకిలీ సీజరెందుకలా పెళ్ళి పెద్దలా హడావిడిగా తిరిగిందో మాత్రం అర్ధం కాలేదు.
    
                                  3
    
    ఒకరోజు మధ్యాహ్నం ఇంగ్లీషు సినిమా మేట్నీకి వెళ్ళిన బొజ్జమ్మకి హాల్లో శివ సాక్షాత్కారం జరిగింది. సినిమా వదిలేక అతనామె పాదధూళి తనింట్లో పడెయ్యమని మర్యాదగా అడగడం ఆమె కూడా మర్యాదకోసం వొప్పుకోవడం జరిగాయి.
    అయితే ఇంట్లోకి వెళ్ళగానే మాత్రం అచ్చు సీజరు (నకిలీ) లాంటి బొచ్చుకుక్కే ఆమె చుట్టూ సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలాగ తిరుగుతూ మూలుగుతూ గెంతడం మొదలెట్టింది. ఆ జాతిమీద తనకున్న అవ్యాజానురాగాన్ని పురస్కరించుకుని ఆఫీసరింటికెళ్ళి చొంగ కార్తున్న వికారపిల్లాడిని ఎత్తుకున్న గుమాస్తాలా కాకుండా చాలా సహజంగా ఎత్తుకుంది. కుతూహలం కొద్దీ పరీక్షించిన ఆమెకి తన గుండె హఠాత్తుగా ఎడమనుంచి కుడివైపుకి మారినట్లనిపించింది. తనున్న ఈ శివుడి ఆశ్రమం హఠాత్తుగా నిజం కైలాసంగా మారినట్లనిపించింది. కారణం ఆమె చేతుల్లో ఒదిగిపోతున్నది ఆమె ఒరిజినల్సీజరు. ఆమె ఆనందం ఒక్కసారి పగిలిన కుండలోని నీళ్ళలా ప్రవహించబోగా అతికష్టం మీద నిగ్రహించుకొని అతనితో.
    "మీ కుక్క చాలా మంచిదండి కొత్త వాళ్ళని చూసి కూడా అసలు అరవదు అంది.  
    "అవునవును అలాగే ఉంది. ఇది పూర్వం నన్ను చూస్తే ఏండ్రోకల్స్ ని చూచిన సింహంలా ఉండేది కాని ఇప్పుడు ఏనుగును చూచిన సింహంలా చూస్తోంది. పోనీలెండి కనీసం మిమ్మల్నయినా గౌరవించింది" తపించాడు శివరావు.
    "ఎప్పట్నించీ నండీ యిలాగ?" ప్రశ్నించింది.
    "ఆ మధ్య దానికి జబ్బు చేస్తే హాస్పిటల్ కి పంపించానండి. ఆయనేం చేశాడో తెలీదుగాని కొండ నాలుక్కి మందిస్తే ఉన్న నాలుక కూడా ఊడిందని యిలా తయారయ్యింది."
    దాంతో బోజ్జమ్మ సందేహాలన్నీ తెలుగు సినిమా చివరిసీనులో హీరోమీద హీరోయిను కున్న అనుమానాలు పటాపంచలయినట్లు విడిపోయాయి. కాసేపెలాగో అతనితో మాట్లాడింది.
    "ఇంక వెళ్ళొస్తానండి" అని చెప్పి కణ్వాశ్రమాన్ని వీడలేక వెళ్ళిన శకుంతల్లా సీజర్ను వదల్లేక వదల్లేక ఇంటికి వెళ్ళిపోయింది.
    ఆరోజు రాత్రి ఆమెకి నిద్రపట్టలేదు. "అయితే అదన్నమాట అసలు కథ అందుకే ఇలా అయ్యింది. తనింట్లో ఉన్న నకిలీయే అతనన్నమాట. పోనీ ఇప్పటికైనా అతనితో జరిగిందంతాచెప్పి మళ్ళీ తన సీజర్ని తను తెచ్చుకుని దీన్ని తనకిచ్చేస్తే? కాని అలాగయితే ఇది తన కుండదు. ఎంత తను చిన్నప్పటినుంచి పెంచకపోయినా ఇది మాత్రం తనంటే ఎంతో ప్రేమగా ఉంటోంది. చూస్తూ, చూస్తూ ఎలా వదులుకొనేది. అయితే మరెలా? అవ్వా కావాలి. బువ్వా కావాలంటే ఎలా కుదురుతుంది" అని మనసులోకి ఏపాయింటూలేక అవస్థపడుతున్న లాయరుకి కేసులో అతి ముఖ్యమైన పాయింట్ తట్టినట్లు మెరుపులాంటి ఆలోచన వచ్చినది. "పోనీ" అతన్ని పెళ్ళాడిస్తే! అవును అంతకు మించి వేరే మార్గం లేదు. అందులోనూ అతనేవీ కురూపికాడు. ముష్టివాడు కాడు పై పెచ్చు బొచ్చుకుక్కలంటే ప్రేమున్నవాడు. అంతా సంతోషిస్తారు. తన కోరికా నెరవేరుతుంది" అన్న నిశ్చయానికి వచ్చింది.
    
                                 4
    
    మొదటి రాత్రి గదిలో కొచ్చిన బొజ్జమ్మని బుజ్జగించిన శివరావు -
    "నువ్వు నన్ను కాదంటావేమో అనుకున్నాను. అందర్ని కాదన్న నీకు నాలో కనబడ్డ ప్రత్యేకత ఏమిటి?" అని అడిగేడు.
    "మిమ్మల్ని చూసికాదు మీ కుక్కని చూసి" అన్న బొజ్జమ్మ మాటలోని నిజం అర్ధంకాని శివరావు ఆమెలోని హాస్యానికి ఆనందించేడు.
    
                                        ---౦౦౦---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS