Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 25


                      కరక్కాయ ముక్క అరక్కాయ కుక్క
    
    ఇవాళ బస్సులో ఒక దొంగ నా జేబు కొట్టేశాడు. ఛఛ!
    అందుకే అందరూ అంటారు. నాకు కథలు రాయడం
    చేతకాదని! పద్యాలూ, పాటలూ ఆఖరికి వచన గీతాలో
    రాసుకోకుండా నేనేమిటి కథా రచనకి పూనుకోవడమేమిటి?
    అన్నట్టు ఇటీవల నా పాటల్లో కూడా పస తగ్గిపోయిందని
    కొందఱు సినిమా పండితులు నా మీద ఒక గుస గుసల
    ఉద్యమం ప్ర్రారంభించారట. అయినా నిన్న "మనుషులు
    మారాలి" లోనూ నేడు "దేశమంటే మనుషులోయ్"లోనూ
    నా పాటలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనం
    వింటూనే వున్నారు లెండి. అయితే (రామప్ప పంతులు
    చెప్పినట్టు) అది వేరే కథ.    
    
    "అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులూ వేటకి వెళ్ళి ఏడు చేపల్ని పట్టారు." అన్న దానిలో ఉన్న కథన శక్తి బస్సూ, దొంగా, జేబూ అన్నదానిలో ఉందా? లేదు. ఉండదు. వుండటానికి వీల్లేదు. ఏమో! వుంటుందేమో! సరే చూదాం.
    ఇవాళ 1970 అక్టోబరు 15వ తేది సమయం బాల భాస్కరుని లేత కిరణాలు ముద్ర బారుతున్న సమయం. మాంబళం వెళ్ళాలని బయలుదేరాను. పనిలో పనిగా మందపల్లి పోస్టాఫీసులోకి వెళ్ళాను. రెండు వుత్తరాలు వచ్చాయి. ఒకటి కార్డు, ఒకటి కవరు కావలి నుండి రమణారెడ్డిగారు వ్రాశారు కార్డు. రమణారెడ్డి అంటే సినిమా నటుడు రమణారెడ్డి కాదు ఇటీవల ఏర్పడ్డ విప్లవ రచయితల సంఘ కార్యదర్శి మీకు తెలిసే ఉండొచ్చు. దానికి నేను అధ్యక్షుణ్ణి కవితా సంకలనం వేశాం. కథల సంపుటి వేస్తాం.
    కవరు బెంగుళూరు నుంచి వచ్చింది. నా కవితలు కన్నడంలోకి అనువదించడానికి లిఖిత పూర్వకంగా అనుమతి ఇవ్వవలసిందని కోరుతూ! (కవరు చింపక ముందే ఈ సంగతి ఎలా తెలిసింది? అందుకే ముందుగా కవరు చింపాననీ, తర్వాత ఉత్తరం చదివాననే వ్రాయాలి. స్ట్రెయిటు నేరేషన్ కీ, అబ్లిక్ నేరేషన్ కి అక్కడే వుంది తేడా) వ్రాసినతని చిరునామా ఉత్తరం కాగితంలో ఉంది కాబట్టి కాగితం మడచి జేబులో పెట్టుకుని కవరు చింపి పారేశాను. ఉత్తరం నాలుగు మడతలు.
    రమణారెడ్డి ఉత్తరం కూడా చదవబోయానోలేదో కోడంబాక్కం వెళ్ళే 12బి(బి), బస్సు కదలబోతోంది. తొందరగా బస్సెక్కాను. కిటికీల వైపు సీట్లన్నీ నిండిపోయాయి. కుడి వరసలో మధ్యని ఒకాయనికి ఎడం పక్క కూర్చున్నాను. కార్డు రెండుగా మడిచి కుడి జేబులో పెట్టాను. బెంగుళూరు ఉత్తరం కూడా ఆ జేబులోనే వుంది. బస్సు కదిలింది.
    ఎడం జేబులో డబ్బుంది. ఒక నూరు రూపాయల నోటూ, ఒక రూపాయి నోటూ, ఈ రాస్తున్న పెన్ను కూడా ఆ జేబులోనే వుంది.
    కండక్టరు వచ్చాడు. రెండు నోట్లలో పెద్దది కార్డు మడతలో పెట్టి రూపాయి నోటిచ్చి "మాంబళం పవర్ హౌస్" అన్నాను. "పవర్ హౌస్" అని మాత్రమే అంటే కోడంబాక్కం పవర్ హౌస్ టిక్కెట్టిచ్చే ప్రమాదముంది.
    కండక్టరు మొదట టిక్కెట్టూ, తర్వాత చిల్లరా యిచ్చాడు. టిక్కెట్టూ చిల్లర ఎడం జేబులోనూ, కార్డు (మడతలో నూరు రూపాయిల నోటుతో సహా) కుడి జేబులోనూ పెట్టుకున్నాను. ఇదంతా నా ముందు రెండు మూడడుగుల దూరంలో నిలుచున్నా ఒక మనిషి చూస్తున్నాడని అప్పుడు నాకు తెలియదు. ఏదో నోటు దాచానేగాని నూరురూపాయిల నోటని అతనికి తెలియదేమో! ఎంచేతంటే అదీ రెండుగా మడిచి వుంది.
    బస్సు పోతోంది.
    స్టాపుల వద్ద ఎక్కే వాళ్ళెక్కుతూ వుంటే దిగేవాళ్ళు దిగిపోతున్నారు.
    రమణారెడ్డిగారి వుత్తరం చదువుదామనుకున్నాను. అలా చేసినా బాగుండును లేదా ఎడమవైపు పెన్ను కుడివైపుకి మార్చుకున్నా బాగుండును. జేబుకి సీలువేసినట్టయి, డబ్బు సురక్షితంగా వుండేది.
    మాంబళం వెళ్ళేక సావకాశంగా రమణారెడ్డిగారి వుత్తరం చదువుకోవచ్చులే అనుకున్నాను. రాసింది కార్డు అయినా బరువయిన విషయాలు వున్నాయందులో ఆఫ్రో-ఏషియన్ సభలు, అరసం, విరసం మొదలయినవి. (కార్డు చూసుకున్నప్పుడు అక్కడ అక్కడ కనబడ్డవి.)
    ఎదురుగుండా విండ్ స్క్రీన్ కింద తిరువళ్ళువర్ పటమూ, దాని పక్క తిరుక్కురళ్ నుండి నీతి కురళ్ళూ వున్నాయి. "కరక్కాయ ముక్క. అరక్కాయ కుక్క" అని కూడబలుక్కుంతూ చదివాను. నాకు అరవక్షరాలు చదవడం అంతా బాగా రాదు. ఎప్పుడేనా సొంతంగా గానీ గురుముఖతాగాని చదువుకుంటేనా? పొద్దుట్నించి సాయంత్రం దాకా ప్రతీ గోడమీద కనిపించే అరవ పోస్టర్లని ఇరవై సంవత్సరాలనించీ చదవ గలిగాను. కానీ నేను చదివింది రైటు కాదని నాకే తెలుసు. అర్ధం కాకపోయినా అవే గొప్ప నీతి వాక్యాలని కూడా తెలుసు.
    ఆళ్వారు పేటకి ఇవతలి బస్సుస్టాపు వద్ద బస్సాగింది. కండక్టర్ ఈల వేస్తే కదిలింది. మళ్ళీ రెండు ఈలలు వేస్తే ఆగింది. ఏమిటని వెనక్కి చూశాను. ఆ చూడడం అవకాశం చూసుకొని జేబుదొంగ నూరు రూపాయల నోటుతో సహా కార్డ్ లాగేశాడు.
    కాని నేనది చూడలేదనుకున్నాడు. కాని చూశాను. చూశాను అనడంకన్నా ఫీలయ్యానంటే కరెక్టు. జరిగిందేమిటంటే బస్సు బయలుదేరుతుండగా ఒక కుక్క లోపలికొచ్చింది. అందుకు రెండీలలు అందరూ కుక్కను తరిమేశారు. బస్సులో కుక్కలకి ప్రవేశం లేదని పాపం ఆ కుక్కకేం తెలుసు.
    జేబు చూసుకున్నాను. కాగితం వుంది కాని కార్డు లేదు. రెండోజేబు తడుముకున్నాను అందులోనూ లేదు. నిలుచుని పంట్లాం జేబులు చూసుకున్నాను. కార్డులేదు. ఒక జేబులో సిగరెట్టు పెట్టి, ఇంకోదానిలో అగ్గిపెట్టి వున్నాయి. ముందుకు దూకాను. అటు నాకు వీపు చూపుతూ నిలుచున్న వాడిని ఇటువైపు త్రిప్పాను. "మర్యాదగా ఇచ్చెయ్!" అన్నాను అరవంలో "ఎన్నా?" అన్నాడు వాడు. "ఎన్న ఎన్న? ఎన్న కార్డు" అన్నాను.
    "నాకు ఒకటీ తెలియదు" అన్నాడు అరవంలో కళ్ళలో కొంచెం భయంతో.
    అప్పుడు నాకు హఠాత్తుగా స్ఫురించింది. అప్పుడే వీడు దాన్ని మరోడి కందించాడని నేను జేబులు తడుముకున్న కొద్దిపాటి వ్యవధిలో.
    "డ్రైవర్ స్టాప్ ది బస్" అని అరిచాను. డ్రైవర్ బస్సాపలేదు. మద్రాస్ బస్సు డ్రైవర్లు కండక్టర్ల ఆజ్ఞలు మాత్రమే పాటిస్తారు.
    "ఇదిగో చూడండయ్యా! ఈ బస్సులో ఇద్దరు దొంగలున్నారు. ఒకడు నా జేబు కొట్టి ఇంకొకడి కిచ్చాడు. వాడూ ఇక్కడే వున్నాడు. ఒకటికాదు. రెండుకాదు. నూర్రూపాయలు" అని సుమారుగా అర్ధం వచ్చేటట్లు అరవంలో అరుస్తున్నాను.
    నూర్రూపాయలన్న మాటవిని డ్రైవర్ బస్సు ఆపాడు.
    "మర్యాదగా ఇచ్చెయ్యాలి లేకుంటే అందర్నీ చెక్ చేస్తాను." అని హెచ్చరించాను అరవంలో!
    అప్పుడే ఒక కుర్రవాడు ఎగ్జిట్ మెట్లవద్ద నా కార్డు పడేసి, బస్సులోంచి దిగి పారిపోయేడు. "వాడే వాడే" అంటున్న నా తెలుగు ఎవరు ఖాతరు, చెయ్యలేదు.
    "ఓడిట్టా ఓడిట్టా" అనే వాళ్ళేగాని ఒక్కడూ బస్సు దిగలేదు.
    కార్డు చూసుకున్నాను. కార్డు మాత్రమే నోటు లేదు వాడా "ఓడి" పోయాడు? నేనా?
    "నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నట్లు" అసలు దొంగ నావేపు చూస్తున్నాడు. ఆ చూపుల్లో వెనకటి భయం లేదు.
    "నిజమా నూర్రూప్పా పోచ్చా?" అన్నాడు వాడు.
    "వాయి మూడు" అన్నాను నేను.
    బస్సు కదిలింది.
    ఒక సాహితీ పరుడు మరో సాహితీ పరుడికి వ్రాసిన వుత్తరం నా చేతిలో మిగిలింది.
    కాని ఆ తర్వాత ఏమయినట్లు?
    వాస్తవానికి విడాకులిచ్చి కల్పనతో వ్యభిచరించడానికి కావలసినన్ని మార్గాలుంటాయి. కాని వాట్శావాన్ని ఆధారం చేసుకొని కొన్ని ఊహాగానాలు మాత్రం చేస్తాను.
    అరగంట తిరక్కముందే తోడు దొంగలిద్దరూ ఇది వరకే నిర్ణీతమైన సంకేత స్థలంలో కలుసుకున్నారు. వాళ్ళ మధ్య ఇంచు మించుగా ఇలా సంభాషణ సాగింది అరవంలో.
    "ఏదిరా నా వాటా?"
    "వెధవ బోడి పదిరూపాయల్లో నీకో వాటా కూడాను నా వాటా నాకు పోను, నిన్ను కాపాడినందుకు మరో అయిదో పదో అదనంగా నాకే నువ్వియ్యాలి."
    "అందులో వున్నది పది రూపాయలేనా? నూర్రూపాయలన్నాడు మరి ఆ పెద్ద మనిషి."
    "ఓ అంతా పెద్ద మనుషులే ఎవరినీ నమ్మని వాడివి నువ్వెలా వాడిని నమ్మేవురా?"
    ఇంకో ఊహాగానం, ఎల్లుండి వాళ్ళు కలుసుకుంటారు. ఈ లోగా రెండో వాడు తన ప్రియురాలితో సరదాగా తిరగేసి డబ్బంతా కరిగించేస్తాడు. అప్పుడూ అదే సంభాషణ!
    లేదా దొంగల్లో కూడా ఒక విశిష్టమైన నీతి నిజాయితీ వుంటాయి కాబట్టి (అలా మన పెద్దలంటారు కాబట్టి)
    మరో ఊహాగానం!
    సాయంకాలానికి అన్న దొంగని వెతుక్కుంతూ వెళ్ళాడు తమ్ముడు దొంగ.
    "అన్నా! ఇంద తీసుకో నీ యాభై రూపాయలు! దోపిడీ వ్యవస్థలో ఈ యెగుడు దిగుడు సమాజంలో చేసిన కష్టాన్ని చెరి సగం పంచుకుంటున్న వాళ్ళం మనం ఇద్దరమే!"
    అందుకే ఏనాడో అన్నాడు మహానుభావుడు తిరువళ్ళువర్ :
    "కరక్కాయ ముక్క, అరక్కాయ కుక్క" అని.
    
                                        ---౦౦౦---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS