"అవున్లే, మన కనకయ్యకు పురాణంవినే ఓపికా, తీరికా ఎక్కడిది?" అన్నాడు రెండో ఆయన.
గుడ్డివెన్నెల్లో వాళ్ళ నవ్వుల్ని కనకయ్య పసికట్టాడు.
"మీరంతా పురాణం విని కట్టుకొన్న పుణ్యంకంటే ఎక్కువే సంపాదించాను ఇవ్వాళ." ఉండబట్టలేక ఉక్రోషపడుతూ అన్నాడు కనకయ్య.
"అదేదో మా చెవినికూడా వేస్తే విని ఆనందిస్తాంగా?" అన్నాడో ముసలాయన.
"బలరామయ్యగారికీ సాంబయ్యగారికీ బంధుత్వం కలిపా!"
అందరూ నోళ్ళు తెరుచుకొని క్షణకాలం అలాగే వుండిపోయారు!
"ఏంటి అట్లా చూస్తారు? బలరామయ్యగా రమ్మాయిని సాంబయ్య కొడుకు వెంకటపతికి మాట్లాడాను."
"ఇది, అసలు నమ్మాల్సినమాటే కాదు!"
"ఈ నెల్లోనే పెళ్ళి మీరే చూస్తారుగా?" అంటూ ధీమాగా నడిచి వెళ్ళిపోయాడు కనకయ్య.
"అయితే కనకయ్య కట్టుకొన్నది పుణ్యమా పాపమా?" ఏదీ తేలక వృద్ధుడు నోరు వెళ్ళబెట్టాడు.
"నూరు అబద్దాలాడయినా ఒక పెళ్ళి చేయమన్నారు" అన్నాడు రాంభద్రయ్య.
"వెయ్యి అబద్దాలాడయినా ఈ పెళ్ళి కుదర్చడం కష్టం!" అన్నాడు రాంకోటయ్య.
"ఇదేగనక నిజమైతే రావణాసురుడు సీత నెత్తికెళ్ళిందానికంటే ఘోరమైందే!" అన్నాడు వృద్ధుడు.
"వీరభద్రయ్యగారి మనవరాల్ని సాంబయ్య కొడుక్కు ఇస్తున్నారా?" బలరామయ్యకు దూరపుబంధువైన వీరయ్య నమ్మలేక అన్నాడు.
కనకయ్య వదిలినవార్త, చలికాలం పిడకలగూటి పొగలా తెల్లవారేటప్పటికి ఊరంతా వ్యాపించిపోయింది.
కనకయ్య ఉదయాన్నే సాంబయ్యదగ్గిర కెళ్ళాలని తయారైనా మళ్ళీ ఆగాడు.
పోనీ కొంచెం ఆగితే? అప్పుడు సాంబయ్యే కబురు పంపుతాడు? అప్పుడు వెళ్తే బెట్టుగా, నిండుగా వుంటుంది. అలా అనుకుంటూ ఇంటి ముందు కూర్చున్నాడు కనకయ్య.
అన్నం వేళదాకా ఎదురుచూసినా సాంబయ్యమనిషి రాలేదు. ఇక ఉండబట్టలేక సాంబయ్యగారింటికి బయలుదేరాడు.
త్రోవమధ్యలో సాంబయ్యగారి చినజీతగాడు ఎదురై "అయ్యగారూ మీ కోసమే వస్తున్నారు" అన్నాడు.
పల్చబడిన రక్తం చిక్కబడినట్లై కనకయ్య అంగలు పంగలు వేసుకొంటూ సాంబయ్య ఇంట్లో వాలిపోయాడు.
"కాయా, పండా?" సాంబయ్య అడిగాడు.
"ఈ కనకయ్య చేతిలోపడితే కాయ అయినా పండుగా మారుతుంది." కనకయ్య కంఠంలో గర్వం తొణికింది.
"పళ్ళు రాల్తాయ్ అన్నావే మరి?" సాంబయ్య గుర్రుగా చూస్తూ అన్నాడు.
"ఊరుకోవయ్యా! నీ వరస పోనిచ్చావ్ కావు? చచ్చీ, చెడీ పని సాధించుకొచ్చాను. మరొకడు వెళ్తే నువ్వన్నంతపనీ చేసేవాడే బలరామయ్య!" అప్పటికీ సగం చచ్చి అన్నాడు కనకయ్య.
ఈ సాంబయ్యకు పోసిన ఉగ్గుపాల్లోనే వుంది చేదంతా అనుకున్నాడు కనకయ్య.
సాంబయ్య కళ్ళలో వెలిగిన కాతిని పసిగట్టడం కొంచెం ఆలస్యమే అయింది అతనికి.
"మరి కట్నం ఏమిస్తారంట?" కనకయ్య కణతలకు వసిగొయ్య తగిలినట్లు ముఖం పెట్టాడు.
"ఇంకా కట్నం కానుకలుకూడానా? ఏంటి సాంబయ్యా, నువ్వు మాట్లాడేది? బలరామయ్య నీతో వియ్యమందటమంటేనే కోటి రూపాయల ఎత్తు! కళ్ళ కద్దుకొని మరీ నువ్వు ఒప్పుకోవాలి." అన్నాడు కనకయ్య చిరుకోపంతో.
"ఏం? నేనంత తీసివేసినవాన్నా? నా కొడుక్కేం తక్కువ? కట్నాలూ, కానుకలూ ఇస్తామని నా కాళ్ళావేళ్ళా ఎంతమంది పడ్డారో నీకు తెలియందా ఏం?" అన్నాడు సాంబయ్య.
ఓరి సాంబయ్యా? ఎంత పొగరుగా మాట్లాడుతున్నావ్! అందేదాకా నా కాళ్ళమీద పాకులాడి ప్రాధేయపడ్డాడు. తీరా చేతికి చిక్కాక ఒంటికాలుమీద దూకుతున్నాడు. నిజంగా సాంబయ్య ధోరణి కనకయ్యకు కంపరం ఎత్తించింది.
"ఇదుగో సాంబయ్యా! సంబంధం మాట్లాడమన్నావ్, మాట్లాడాను. కట్నం సంగతి ఇప్పుడు లేవనెత్తడం మనకు మర్యాదకాదు. అతనికున్నదేదో పిల్లకిచ్చుకుంటాడు బ్రాహ్మడ్ని పిలిపించి, లగ్నం పెట్టించి, నిశ్చితార్ధాలు చేసుకోవడం మంచిది."
ముందు కట్నం సంగతి తేల్చుకురా! మా కాడిగట్టు పద్దెనిమిదెకరాలుందిగా? అది కట్నంగా ఇస్తామంటే రేపే నిశ్చితార్ధం చేసుకోవచ్చు. ఏమంటావ్?"
"నా శార్ధం పెట్టుకోవచ్చు." నోటిదాకా వచ్చింది. కాని గుటక మింగేశాడు కనకయ్య. కనకయ్యకు కళ్ళుతిరిగి వళ్ళు చెమటలు పట్టినంత పనైంది.
"అంతే నంటావా?" లేచి నిలబడి బెదిరింపుగా అన్నాడు కనకయ్య.
"ఆహ! అక్షరాల అంతే!" సాంబయ్య, ఇంకా కనకయ్య అక్కడ నిలబడివుండగానే ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
కనకయ్య వీధిలోకి వచ్చిపడ్డాడు. వెళ్తూ నోటికొచ్చిన తిట్లన్నీ, బయటకు కొన్నీ, లోపలకు కొన్నీ తిట్టుకొంటూ, బలరామయ్య ఇంటిముందు కొచ్చాడు.
ఇప్పుడు బలరామయ్యకు ఏమని చెబుతాడు? ఆయన ముఖం తను ఎలా చూస్తాడు? కాడిగట్టు పొలంమీద కన్నేసి ఇంత నాటకం ఆడాడు సాంబయ్య. అది తనకు తాకట్టులో వున్న సంగతి సాంబయ్యకు తెలియదు. ఆ మాటకొస్తే తనకూ, బలరామయ్యకూ తప్ప మూడో కంటివాడికి తెలియదు. ఈ సంగతి తెలిస్తే సాంబయ్య అసలు సంబంధం వదులుకుంటాడు. జరిగిందేదో జరిగింది. అన్నిటికీ ఆ భగవంతుడే వున్నాడు. నాలుగు రోజులు తను మొహం దాటేస్తే అటు సాంబయ్యా, ఇటు బలరామయ్యా అసలు సంగతే మర్చిపోతారు. వేంకటపతికి బలరామయ్య కూతుర్నిస్తే తనకేం? దొమ్మరోడి కూతుర్నిస్తే తనకేం?
తన్ను తాను తిట్టుకొనేస్థితిలోపడ్డ కనకయ్యను అడ్డరోడ్డుమీద దుమ్మురేపుకుంటూ వస్తోన్న బస్సు కనిపించింది. పైపంచ విసురుతూ అతడు రోడ్డుకేసి పరుగెత్తాడు.
అలా పోయిన కనకయ్య వారం రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చాడు. కనకయ్య మెదడులో పెళ్లిని గురించిన విషయం దాదాపు అడుగున పడింది. ఈ వారం అంతా ధాన్యం అమ్మే పనిలో నిమగ్నమై వున్నాడు. హఠాత్తుగా రేటు పెరిగింది. మిల్లులో కొనిపారేసిన ధాన్యం అంతా పెరిగిన రేటుమీద అమ్మేశారు. కనకయ్య వాటాకు ఇరవైవేల దాకా లాభం వచ్చింది. మనిషి సంతోషంతో రెట్టింపయిపోయాడు. ఇలా నాలుగేళ్ళు కలిసివస్తే ఇంకేం కావాలి? తన్ను పట్టడానికి వీలుంటుందా? సాంబయ్యతప్ప తనతో సరితూగ గలవాళ్ళు ఎవరుంటారు. ఈ ఏటితో కొడుకు 'లా' పూర్తిచేస్తాడు. వచ్చే ఏడునుంచి వాడు వకీలయి సంపాదన మొదలుపెడ్తాడు. కొడుకు వకీలు - ఆర్జనపరుడైన తండ్రి. మిల్లులో వాటా. తాకట్టుకింద పెట్టుకొన్న భూమి పుట్రా అంతాకలిపిచూస్తే తనకేం తక్కువ? ఎవరికీ తోసిపోడు కనీసం లక్ష కట్నం అయినావస్తుంది తనకొడుక్కు బస్సుదిగి ఆలోచిస్తూ తన్మయత్వంలో పడి నడిచి ఇంటికి వచ్చిన కనకయ్యమీద గడపలో ఎదురైన పెళ్ళాం విరుచుకుపడింది.
"ఏంటీ అల్లరి? ఊరంతా ఒకటేగోలగా వుంది?"
కనకయ్య నెత్తికి ద్వారబంధం తగిలినట్టు దిమ్మెరపోయాడు.
"ఏమిటే నీ వాగుడు? ఏమైందిప్పుడూ?"
"ఇంకేం కావాలి? మనిషిమీద మనిషిని తోల్తున్నాడా బలరామయ్య మనిషిని ఊళ్ళోకి రానీయ్ అంతుతేలుస్తానంటున్నాడట బలరామయ్యగారి బంధువు వీరయ్య" అని కనకయ్యభార్య చివాలున ఇంట్లోకి నడిచింది. భార్యవెనకే పిల్లిలా అడుగులు వేస్తూ "నువ్వేం ఖంగారుపడకు! అంతా నే సరిచేస్తానుగా." ఖంగారుగా అన్నాడు కనకయ్య.
చొక్కావిడిచి భార్యచేతికి అందిస్తూ "నే వెళ్ళాక బలరామయ్య కూతురు పెళ్ళిసంగతి ఊళ్ళో పెద్ద గొడవయిందన్నమాట?" అన్నాడు సాలోచనగా. కనకయ్య బుర్రలో దారంబంతి ఊడిపోతూ చిక్కుపడసాగింది. మళ్ళీ చిక్కుతీసి చుట్టాలనే ప్రయత్నంలో భార్యను గుచ్చిగుచ్చి అడగసాగాడు.
కనకయ్యకు తను వేసిన తప్పటడుగు స్పష్టంగా కన్పించసాగింది. ఆ రాత్రి పురాణంనుంచి వస్తూ తన కెదురైనవాళ్ళకు పెళ్ళి కుదిరిందని తను తొందరపడి చెప్పాడు. అక్కడే వచ్చింది చిక్కు!

