సాధారణంగా రానే రాదు. వస్తే మాత్రం కష్టమే!
మామూలుగా మనం కొంచెం గట్టిగా మాట్లాడితే వచ్చే ధ్వని, శ్రీశ్రీగారు కోపం వస్తే మాట్లాడిన ధ్వనికన్నా ఎక్కువగానే వుంటుంది.
ఆయన చేతి ఉంగరం తగిలినందువల్ల నాకు దెబ్బ తగిలింది.
ఆ ఉంగరం ప్రస్తుతం నా చేతినే వుంది. దానికో పెద్ద చరిత్ర వుంది. ఆ ఉంగరం శ్రీశ్రీగారి పెద్ద భార్య రమణమ్మగారు చేయించారు. నా కన్నా ఆ ఉంగరమే ఎక్కువ కాలం శ్రీశ్రీగారితో కలసి వుంది. ఆ ఉంగరానికి, శ్రీశ్రీగారికి ఏభై సంవత్సరాల పరిచయం వుంది. అది మాట్లాడలేదు. నేనుగలను.
దెబ్బ తగలడానికి కారణం బాత్ రూమ్ లో పడడమేనని చెప్పడం వల్ల, ప్రొడ్యూసర్స్ పనివాళ్ళ మీద విరుచుకుపడి శుభ్రం చేయించారు. ఆ బాత్ రూము కూడా అలాగే ఏడ్చింది కాబట్టి అన్ని విధాలా కలిసి వచ్చింది.
మా అమ్మతో నిజం చెప్పలేదు. చెబితే పని వద్దంటుందేమోనన్న భయంతోపాటు, మా అమ్మగానీ మా నాన్నగారితో చెప్తే నిజంగానే నన్నిక శ్రీశ్రీగారితో పనిచేయడానికి పంపారన్న భయంవల్ల అబద్దం చెప్పాను.
నుదురంతా బాగా నొప్పిగా వుంది. ఈ నొప్పికన్నా శ్రీశ్రీగారి అతిమౌనమే నన్నెక్కువ బాధపెట్టింది.
ఏమీ జరగనట్టు "ఏవండీ రాద్దామా" అన్నాను.
"మీ అమ్మతో అబద్దం ఎందుకు చెప్పావు?" అనడిగారు.
"లేకుంటే మీ దగ్గర ఉద్యోగం వాళ్ళే ఊడగొట్టేస్తారు. అందుకనే అబద్దం చెప్పాను. ఆపదకి పాపంలేదు.
మా నాన్నగారి సంగతి మీకు తెలీదు. నేనంటే ప్రాణం. మీ దగ్గర పని కొచ్చి నెల్లాళ్ళయినా కాలేదు. ఇలా జరిగిందంటే ఊరుకుంటారా? పని చెయ్యనివ్వరు. అదే నా భయం" - అన్నాను.
"నిజంగా ఇప్పుడు కూడా నా దగ్గర పనిచెయ్యడం నీ కిష్టమేనా?"
"ఏం చేస్తాను? రెక్కాడితేగానీ డొక్కాడదు. మరొకరి దగ్గరైనా చెయ్యాలి కదా! నాకది ఇష్టంలేదు పనిచేస్తే మీ దగ్గరే చెయ్యాలనుకుంటున్నాను.
"నేను నిజంగానే నిన్ను కొట్టాననుకుంటున్నావా?"
"లేదు"
"మరి"
"ప్రమాదవశాత్తు తగిలిందని నాకు తెలుసు. అయినా అంత తాగినప్పుడు కూడా ఎంతో శాంతంగా వుండేవారు. అప్పుడేమయిందండీ! బాగానే ఉన్నారుగా?
అదీకాక - అంత పొరపాటు నేనేం చేశాను? నా అవస్థంతా మనం కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటే నాలుగు రాళ్ళు సంపాదిస్తాం. అనేగానీ, లేకుంటే మీకు చెప్పేటంత గొప్పదాన్నా? మీ పాదధూళికి కూడా పనికిరానండీ. అర్ధం చేసుకోడానికి ప్రయత్నించరేం?"
"సారీ సరోజా! ఇంకెప్పుడూ ఇటువంటి పొరపాటు జరగదు. ఇంత దెబ్బ తగులుతుందని నేనూ అనుకోలేదు. జరిగింది చెప్తే నిజంగానే నా దగ్గర పనిచెయ్యడానికి మీ వాళ్ళు ఒప్పుకోరు." కదూ -
"చెప్తాను. చూస్తారేమిటి?"
"నీ యిష్టం"
"చూడండి, మీ బాధ నాకు అర్ధమయింది. నేను అబద్దమాడేననేగా! వేరే దారి లేదండీ! మీ దగ్గర నేను పనిచెయ్యాలనుకుంటే, దయచేసి ఆ విషయం మరిచిపోండి.
నేనంత సులభంగా ఏ నిర్ణయానికీ రాను. వస్తే మాత్రం డానికింక తిరుగుండదు"
ఈ మాటలు, గొడవలతో ఆ రోజు ఉదయం ఆఫీసయిపోయింది.
"మిగిలిన పాటల కాగితాలు నా కిస్తావా?" అన్నారాయన.
"ఏం చేస్తారు? ఉన్నవి కొంచెమేగా? నేను లేకుండా రాసేస్తారా?".
"నేను త్వరగా పని పూర్తి చేస్తే నీకూ సంతోషమేగా-"
"అవును"
"ఆ పాటలు నా చేతికిస్తే జేబులో భద్రంగా దాస్తాను-"
మరేం మాట్లాడకుండా ఇచ్చేశాను.
మళ్ళీ - 'అయామ్ సారీ" అన్నారు.
"ఆ సంగతి మరచిపోండి. కావాలని చేసిన దానికి ఈ సారీలు కానీ, ఏక్సిడెంటెల్ గా జరిగిన దానికి ఎవరం ఏం చెయ్యలేం" - అన్నాను.
"థాంక్స్" - అన్నారాయన.
ఇళ్ళకి చేరుకున్నాం. నాన్నగారు ఇంట్లో లేరు. కాలేజీకి వెళ్ళి పోయారు. 'బతికానురా రాత్రి చూసుకోవచ్చు' - అనుకున్నాను.
పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఇంజక్షనిచ్చారు. నేను పుట్టిన తర్వాత నాకు తెలిసి, నేను తీసుకున్న మొట్టమొదటి ఇంజక్షన్ అది "కాస్త జ్వరం వస్తుంది భయపడకండి. ఈ మాత్రలు వేసుకోండి" - అన్నారు డాక్టర్.
జ్వరం రానే వచ్చింది. ముఖం వాడిపోయింది. పైకి 'కుయ్-కయ్' మంటే ఒట్టు.
ఆ రోజు ఒక గంట ఆలస్యంగా శ్రీశ్రీగారు వచ్చారు.
ఆఫీసుకి వెళ్ళాం.
కాఫీలు స్ట్రాంగ్ గా తెప్పించారు. కారణం అర్ధం కాలేదు.
జేబులో పేపర్లు తీసి, "ఇదిగో నీకిచ్చేస్తున్నాను. చూసుకో" - అన్నారు. కాగితాలు విప్పి చూస్తే, మొత్తం బాలన్స్ పాటలు, పద్యాలు పూర్తి చేసేశారు.
అంత బాధలోనూ "ఏమండీ, నిజంగానే నమ్మలేకుండా వున్నానండీ" - అని తెగ మురిసిపోయాను.
నా వైపు నుండి ఆ విధమైన రియాక్షన్ కోసమే ఆయన ఎదురు చూశారనుకుంటా.
"ఇప్పుడు సంతోషమేనా? నా పొరపాటుకి క్షమిస్తావా?"
"ఏది ఎలాగున్నా ఈ దెబ్బతో మీరిక్కడ పని పూర్తి చేశారు. అక్కడ బాత్ రూమ్ రెండు పూటలా అద్దంలా తయారౌతోంది" - అన్నాను.
"నొప్పి ఎలా వుంది".
"డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను".
"గుడ్ అయితే, ఈ రోజు పని ఎగ్గొట్టేద్దాం".
"మీరు రెస్ట్ తీసుకోండి. ఈ పాటలన్నీ ముందు నేను ఫేర్ చేస్తాను".
"నీ రెస్ట్ కోసమే పని ఎగ్గొట్టడం. తెలుసా?" అన్నారు.
ఈలోగా ప్రొడ్యూసర్ వచ్చి, "ఎలాగుందమ్మా! జాగ్రత్త. మీరు పడకేస్తే మేం చచ్చిపోతాం. ముందు భానుమతిగారి పాట రికార్డ్ చెయ్యాలన్నారు."
"ఏం ఫరవాలేదు సార్! మీ పాటలన్నీ అయిపోయాయి. శ్రీశ్రీగారి రాత పని పూర్తయిపోయింది. పాటలు నేనే ఫేర్ చెయ్యాలి" అన్నాను.
"అలాగే పాడేవాళ్ళకి కూడా కాపీలు రాసిపెట్టెయ్యండమ్మా! రేపు మ్యూజిక్ డైరెక్టర్ ఇబ్రహీం వస్తున్నారు. మీరు తెలుగు పాటలన్నీ చెప్తే ఆయన అరవంలో రాసుకుంటారు. రేపు రోజంతా ఆయనతో కలసి పాటలు చూసుకోవడమే పని" - అని ప్రోగ్రామిచ్చేశారు.
"అలాగే సార్!" అన్నాను.
అప్పుడు శ్రీశ్రీగారు, "రేపు ఉదయం ఇద్దరం కలసి ఆఫీసుకొచ్చేద్దాం. నేను ఒక గంట వుండి వెళ్ళిపోతాను. స్ట్రయిట్ పిక్చర్ కి పాట రాయాలి. మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకి వస్తాన"న్నారు.
"అలాగే" నని రాత్రి ఎనిమిది గంటలదాకా కూర్చొని, మొత్తం పాటలు ఫేర్ చెయ్యడం, ఒక్కొక్క పాట కార్బన్ పెట్టి మూడు కాపీలు తియ్యడం కూడా పూర్తి చేసేశాను. ఇంటికెళ్ళేసరికి నాన్నగారు నాకు తగిలిన దెబ్బచూసి మా అమ్మ మీద ఎగిరిపోయారు.
అది "బాత్ రూమ్ లో కాలు జారిపడితే నేనేం చెయ్యనండి" - అంటూ పాపం మా అమ్మ బిక్కముఖం వేసింది.
చిన్న చలితో జ్వరం వచ్చి దాని నైజం చూపించింది.
జ్వరం వచ్చిందని కాదు నా భయం.
ఇప్పుడిప్పుడే మంచి పిక్చర్ వచ్చింది. కష్టపడి పనిచేస్తున్నాం. నేను పడకేస్తే నా పని సంగతి ఎలా పరిణమిస్తాందో?
ఇంట్లో కూడా అందరూ సాఫీగా జీవితంసాగుతోందని తృప్తిగా వున్నారు. మన కోసం పిక్చర్ ఆగిపోదుగా! మరి శ్రీశ్రీగారు ఏంచేస్తారో! ఇలా అనవసరపు ఆలోచనల్తో బుర్ర చెడగొట్టుకుంటున్నాను.
దెబ్బ బలంగానే తగిలింది. కనుక చురుక్కుమంటోంది. గట్టిగా కళ్ళు మూసుకున్నాను. నిద్ర పట్టేసింది. లేచేసరికి తెల్లవారిపోయింది. కాస్త నీరసంగా వుంది. "ఈరోజు రెస్ట్ తీసుకో అమ్మా!" - అని నాన్నగారన్నారు.
"ఫరవాలేదు నాన్నగారూ! ఈ రోజు పనేమీ లేదు. మ్యూజిక్ డైరెక్టర్ గారికి తెలుగు పాటలు చెప్పడమే. ఆయన అరవంలో రాసుకుంటారు. తర్వాత పాటలన్నీ చెక్ చెయ్యడం - అంతే!" అన్నాను.
అమ్మా, నేను కలసి శ్రీశ్రీగారితో పాటు ఆఫీసుకు వెళ్ళాం. మ్యూజిక్ డైరెక్టర్ ఇబ్రహీం గారిని పరిచయం చేశారు.
శ్రీశ్రీగారు పది గంటలదాకా వుండి నా చేత పాటలు చెప్పిస్తూ, ఇబ్రహీం గారు రాసుకుంటూ వుంటే సూపర్ వైజింగ్ చేస్తూ కూర్చున్నారు. మధ్యలో ఆయన చెప్తున్నారు.
