Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 26


    "పెళ్ళి" అనే పదం వాడి అతన్నెంత ఇన్ స్టయిల్ చేసిందీ అంటే ఉద్విగ్నంగా ఆమెను సమీపించిన శెట్టి నెల్లూరులో వున్న ముసలి భార్యని క్షణంపాటు తలచుకుని ఏవగింపుగా మొహం పెట్టాడు. వెంటనే "నిజమా" అన్నాడు ఆమె పక్కనే కూర్చుంటూ.
    "నిజం శెట్టిగారూ! వయసన్నది మనసుకి సంబంధించిందన్నది అక్కడి అమ్మాయిల అభిప్రాయం. అఫ్ కోర్స్....నేనూ అదే నమ్ముతాను కాబట్టే సెట్ కి వచ్చిన ప్రతిసారీ మీ చూపుల్ని గమనించిన నేను,.....నీ మొహమాటాన్ని అర్ధంచేసుకుని ఈ రోజు నేనే అడిగేశాను."
    "థేంక్స్" అన్నాడు శెట్టి వుత్సాహంగా.
    "మీరింకా దేనికోసం సంకోచిస్తున్నారు....?" అంది ఆమె ఇంకా ప్రారంభంకానీ వ్యవహారానికి తను అందించే ఆహ్వానంలా.
    సన్నగా కనిపించాడు శెట్టి. నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ "మరేంలేదు సుకృతీ! అర్జెంటుగా నన్ను కలవాలనుకుంటున్న పెద్దమనిషి ఓ పదినిమిషాలలో వస్తానన్నాడు. అతడు వెళ్ళాక....."
    "ఎవరతను....?" ఉదాసీనంగా చూసింది. తనను మించిన మరో వ్యక్తి వ్యవహారానికి అతడంత ప్రాముఖ్యత యివ్వడం నచ్చలేదు. "అతడిని కలుసుకోవడం అంత అవసరమా?"
    "వచ్చేది రామన్...." ఇబ్బందిపడుతూనే చెప్పాడు శెట్టి. "కాదనే వాడ్నే! మరీ ప్రాధేయపడుతున్నాడు. వచ్చే నెల ప్రారంభం కాబోతున్నది అతడి పిక్చరుకి ఫైనాన్స్ చేస్తున్నది నేనే...."
    మరో వ్యక్తయితే అంత ఆసక్తి చూపించేదికాదేమో. కానీ ఆడిప్పుడు మాట్లాడుతున్నది సాక్షాత్తు తనను కాదన్న తన తండ్రి గురించి. "మీ నుంచి ఫైనాన్స్ తీసుకోటానికి రామన్ అంత లేనివాడేం కాదే.....
    "నీకు తెలీదు సుకృతీ! సినిమాకి లక్షలు ఖర్చుచేసే నిర్మాత తను పెట్టే లక్షల ఖర్చూ ఫైనాన్సర్ నుంచే తీసుకుంటారు. అది యిక్కడ సాంప్రదాయం."
    కొత్త విషయం వింటున్నట్టుగా చూసింది.
    "ఆశ్చర్యంగా వుంది......!"
    "అదంతే సుకృతీ! కోటి రూపాయల ఖర్చుతో లీయబడే సినిమాలో నిర్మాత పెట్టుబడి కేవలం పది లక్షలు మించి వుండదు. తన దగ్గరున్న డబ్బుతో పేరున్న నటులకు, టెక్నీషియన్స్ కీ అడ్వాన్స్ ల్ని యిస్తాడు. ఆ తరువాత నిర్మాణ దశలోనే సినిమాని అమ్మడం ప్రారంభిస్తాడు. అలా సినిమాని జిల్లాలగానో, ప్రాంతాలవారీగానో కొంటామనే బయర్స్ మొత్తం డబ్బు యివ్వరు. వాళ్ళు అడ్వాన్సులే యిస్తారు. దానితో కొన్ని రోజులు షూటింగ్ కొనసాగిస్తూ మిగతా డబ్బుకి ఫైనాన్సర్ మీద ఆధారపడతాడు నిర్మాత."
    "మరి ఫైనాన్సర్ మొత్తం డబ్బు రాబట్టుకునేదెప్పుడు?"
    "మొత్తం సినిమా పూర్తయి ఫస్ట్ కాపీ వచ్చాక.....అంటే  రిలీజ్ కి ముందు."
    వివరంగా చెప్పాడు సినిమారంగంలో అసాధారణమైన అనుభవమున్న నారాయణశెట్టి.
    "ఒకటి రెండు రోజులలో సినిమా రిలీజ్ అవుతుందనగా లేబరేటరీలో సినిమా ప్రింటులు తీయబడతాయి. ఆ ప్రింటుల్నే బయర్స్ థియేటర్లకు తీసుకువెళ్తారు. అయితే మొత్తం బకాయి చెల్లించేదాకా ప్రింటులు వాళ్ళకి అందవు. అలా అటాచ్ మెంట్ కి కారణమవుతాడు ఫైనాన్సర్..... మొత్తం డబ్బు అలా అందగానే తాను ఫైనాన్స్ వడ్డీతో తీసుకుంటాడు."
    "ఒకవేళ బయర్స్ వెంటనే డబ్బు సర్ధలేమంటే?"
    "ప్రింటు ఇవ్వబడదు. ఇస్తే ఆ తర్వాతయినా సవ్యంగా చెల్లించబడుతుందన్న నమ్మకం లేదు కాబట్టి. ఒక్కోసారి కొన్ని థియేటర్స్ లో అనుకున్న తేదీకి పిక్చరు రిలీజ్ కాకపోవటానికి కారణం పోర్టేషన్ ఒక్కటే కాదు.....ఇలాంటి తతంగం కూడా!"
    నారాయణశెట్టి చెప్పేదంతా సావధానంగా విన్న ఆమెకు అర్ధమైంది. ఈ సినిమారంగంలో ఏ నిర్మాతా సినిమాకయ్యే మొత్తం భరించడు! కారణం అది చాలా రిస్క్ కాబట్టి. ఒకవేళ మొత్తం అతడే భరిస్తే రిలీజ్ అయ్యాక పిక్చర్ ప్లాప్ కావచ్చు. అప్పుడు నడిరోడ్డునపడే అవకాశముంది. అందుకే నిర్మాణ సమయంలోనే ప్రాంతం వారీగానో, జిల్లాలవారీగానో కొనుగోలుదార్లకి సినిమాని అమ్మి అప్పుడు నష్టమైనా, నాశనమైనా బయర్సే! అయితే సినిమాని బయట అమ్మేటప్పుడే సరిపోయినంత లాభాన్ని దృష్టిలో పెట్టుకుని బేరసారాలతో పూర్తిచేస్తాడు నిర్మాత.
    "ఏమిటి ఆలోచిస్తున్నావు?" అడిగాడు నారాయణశెట్టి.
    "ఇక్కడి వ్యాపారం గురించి కాదు శెట్టిగారూ! నేను ఆలోచిస్తున్నది ఒక్కటే! నా తల్లిని మోసం చేసి సంపాదించిన ఆస్తి వుండగా మీ మీద ఆధారపడాలనుకుంటున్న నా తండ్రి గురించి."
    అతి స్వల్పకాలంలో సుకృతి అతడిపై ఎంత ప్రభావం చూపించిందీ అంటే ప్రతి విషయాన్ని వ్యాపారంతో ఆలోచించే నారాయణ యిప్పుడు ఓ ఆత్మీయుడిలా అన్నాడు- "ఇదో విచిత్రమైన ప్రశ్న సుకృతీ! ఇక్కడ నైతిక విలువలుండవు. అవకాశం దక్కితే అవతలి వాళ్ళను దోచుకోవటం యిక్కడ ఆనవాయితీ....! ప్రతివాడూ గురిపెట్టి చూస్తుంటాడు. షూట్ చేస్తాడు. తగిలిందీ అంటే లక్షలు రాలతాయి. లేదూ అంటే......"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS