సుదర్శనరావు ప్రతి రాత్రీ నన్ను కావాలనుకుంటున్నాడు ఆంటీ.....నిన్నయితే సూటిగా అడిగేశాడు కూడా. అయినా నేను అంగీకరించలేదు. ఎందుకో తెలుసా...."
"బహుశా సినిమాలో నీ పాత్రని రమ్యశ్రీ మూలంగా తగ్గిస్తున్నాడని కావచ్చు.
"ఎస్....కరెక్ట్ గానే గెస్ చేశావు ఆంటీ" నిర్లిప్తంగా అంది సుకృతి. "అయినా నేను అతడితో బెడ్ షేర్ చేసుకున్నది కేవలం డబ్బు కోసం మాత్రమేకాక రేపు ఇంకా డబ్బు సంపాదించే అవకాశాన్ని సాధించడం కోసం.....అంటే మంచి కేరక్టరిచ్చి నన్ను ప్రోత్సహిస్తాడన్న ఆలోచనతో ఇచ్చేవాడేమో.....కానీ రమ్యశ్రీ నాకు అడ్డం పడింది. దానితో నా పాత్ర కుంచించుకుపోయింది. ఇప్పుడిక దేనికి నేను భయపడాలి."
"ఒక పెద్ద డైరెక్టరు కావాలీ అనుకుంటే నీ పాత్రనింకా తగ్గించగలడు. నీకసలు గుర్తింపే లేకుండా చేయగలడు."
"అది ఇప్పటికీ జరిగిపోయింది ఆంటీ.....ఓ మంచి పాత్ర కాస్త జూనియర్ ఆర్టిస్టు స్థాయికి దిగజారిపోయింది. నేను మరో రాత్రి అతనితో గడపకపోతే అసలు పాత్రే లేకుండా చేస్తాడని నువ్వనొచ్చు..... కానీ ఆ అవకాశం లేదంటాను నేను. కారణం ఇప్పటికే వారం రోజుల షూటింగ్ లో నేను ఆ పాత్రలో కమిట్ అయిపోయాను కాబట్టి అసలు నేను ఈ పాత్ర చేస్తూ తెలుసుకున్నది నేను నటిని అవునా కాదా అని కాదు ఆంటీ..... సినిమారంగంలో తెర వెనుక పాత్రల స్వభావాల్ని గ్రహించాను. అందులో సుదర్శనరావులు, రమ్యశ్రీలు, రామన్ లు మాత్రమే కాక శివలూ వున్నారని అర్ధం చేసుకున్నాను. అది చాలు ఆంటీ..... ఇక్కడ బ్రతకటానికి గాని చావులాంటి బ్రతుకుతో రాజీపడటానికిగాని ఈ విశ్లేషణ చాలు అయినా ఏదో జరగబోతూందీ అని ఆలోచించాల్సింది ఇంకా ఏ అనర్ధమూ జరగనివాళ్ళు తప్ప నేను కాదుగా.... ఒకప్పుడు నేనేమైనాగాని ఇప్పుడు మాత్రం పతనమైన ఆడపిల్లని. ఆ అర్హత చాలు శివలాంటి సమర్ధుల్ని కొందరిని కాపాడుకోటానికి.....ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నదీ ఆ ప్రయత్నంలోనే.
ఆ తర్వాత అలివేలు ఇక ఆ విషయం చర్చించలేదు. చర్చించటానికైనా ఏం మిగిలిందని..... ఏదైతే జరగకూడదో అది జరిగిపోయాక ఇంకా దేని గురించి ఆలోచించాలి. అందులోనూ సుకృతీ లేమినుంచి పతనం వైపు పరుగెత్తలేదు. కలిమినుంచి విధివశాత్తు విసిరేయబడిన అమ్మాయిలు అందుకే మరింత కసితో ముందుకు దూసుకుపోవాలనుకుంటూంది. ఇక్కడ సుకృతి తెలుసుకోవాలీ అంటే ఆమె స్థానంలో నిలబడాలి తప్ప ప్రేక్షకురాలై ఆలోచిస్తే జవాబు దొరకదు.
"మేడమ్."
పిలిచారెవరో.....
ద్వారం దగ్గర ఓ వ్యక్తి నిలబడి వున్నాడు. "నారాయణశెట్టి గారి కారు డ్రైవర్ని.....అయ్యగారు పంపేరు."
అలివేలుకి అర్ధమైంది సుకృతి వెళ్తున్నదెక్కడికో.
బయలుదేరుతూ అంది సుకృతి "బహుశా ఈ రాత్రికి నేను రాను ఆంటీ.... కారణం నేను ఇష్టపడి వెళ్తున్న మొదటి రాత్రి కాబట్టి."
సుకృతి వెళ్ళిన అరగంటదాకా తేరుకోలేదు అలివేలు.
ఊబిలోకి దిగజారడం ఎవరికీ ఇష్టమైన విషయం కాకపోయినా ఇక్కడ దిగజారటమే తన జీవిత ధ్యేయం అన్నట్టు తొలిసారి చెప్పి వెళ్ళింది సుకృతి.
అది చాలు కృతిలా బ్రతకలేని సుకృతి తన ఆకృతిని చేజేతులా ఎంత చిదిమి చెరుపుకుంటున్నదీ గ్రహించటానికి.
అలివేలు కళ్ళనీళ్ళు రాలాయి ఆర్ద్రంగా. "భగవంతుడా! ఏ ప్రయోజనమూ లేనిదానిలా బ్రతుకుతున్న నేను ఎప్పుడూ నిన్ను తిట్టుకోలేదు. కానీ దురదృష్టకరమైన మలుపు తిరిగిన సుకృతి బ్రతుక్కి కారణం నువ్వే అని నిన్ను అర్ధంచేసుకోమంటున్నాను. రాయిగా మారిన యీ అహల్యను మళ్ళీ మనిషిగా మారే అవకాశం యివ్వొద్దని అర్ధిస్తున్నాను. ఎందుకంటే మనిషిగా మారిన మరుక్షణం గతాన్ని తలచుకొని కుమిలిపోవటం తప్ప మరో వుపయోగం వుండదు కాబట్టి."
* * * *
"ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నారు?"
సుకృతి ఫ్లాట్ లోకి అడుగుపెట్టి అయిదు నిమిషాలు కావస్తున్నా నారాయణశెట్టి యింకా తేరుకున్నట్టులేదు.
"మిమ్మల్నే....." అతని భుజంపై తలానించి గోముగా అడిగింది సుకృతి.
"నమ్మలేకపోతున్నాను" గొణుగుతున్నట్టుగా అన్నాడు శెట్టి.
"నిజం సుకృతీ! ఓ మహానటి కూతురు, అమెరికాలో చదువుకున్న అమ్మాయి....పైగా నా వయసులో వున్నవాడితో...."
"మీ వయసెంతని....ఏభై దాటివుంటుంది అంతేగా!" మృదువుగా నవ్వుతూ కాంక్షగా అతడ్ని చూసింది. అతడికి అభిముఖంగా సోఫాలో కూర్చుని "అమెరికాలో చదివిన నాకు మీదో పెద్ద వయసనిపించదు శెట్టి గారూ! ఎందుకంటే అక్కడ ఎనభయ్యేళ్ళ వయసులో వున్న మగాళ్ళూ పెళ్ళి చేసుకోవడం మామూలు కాబట్టి."
