Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 25


    స్కూటర్ మీద వెళ్తున్న శ్రీచరణ్ ఆలోచించసాగాడు.
    తను వెళ్తున్నానని చెప్పగానే 'సాయంత్రం త్వరగా రండి...ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం. మధ్యాహ్నం పాపం ఏం తింటారు. రేపట్నుంచి లంచ్ బాక్స్ సర్దివ్వనా?" అని ప్రేమగా అనొచ్చుకదా? ఉహూ! తనెందుకంటుందీ రాకాసి, దెయ్యం. తనకలలు కల్లలు చేయడానికే భార్యగా వచ్చింది. అంత అందమైన ఆమెకు ఇలాంటి రొమాంటిక్, మోడరన్ భావాలుంటే ఎంత బావుండునో అనుకున్నాడు.
    మంచంమ్మీద వెల్లకిలా పడుకొని సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తూ ఆలోచిస్తూ వుండిపోయింది ప్రనూష.
    ఇంకా రాత్రి బామ్మ, తల్లి, ప్రియ అందరూ కలిసి చేసిన అలంకరణలు అలానే వున్నాయి.
    మల్లెలు పూర్తిగా వాడిపోనేలేదు. పూలవాసన ఇంకా మత్తుగా వస్తూనే వుంది. శోభనం గది అని స్పష్టంగా తెలుస్తోంది.
    ఎక్కడో చిన్నబాధ....
    ఈ శోభనం ఎంత మధురంగా వుండాలని ఊహించుకుంది.
    శోభనం రోజు ప్రేమించుకున్న రోజుల తాలూకు అనుభవాలు గుర్తుచేసుకోవాలీ. ఆ అనుభవాలను అనుభూతులుగా మార్చుకోవాలి. తన కలలన్నీ....ఈ అరేంజ్ డ్ మ్యారేజ్ తో పటాపంచలయ్యాయి.
    తనెన్ని కలలు కన్నది.
    ఎన్ని కోరికలను కలలుగా మిగుల్చుకుంది.
    ఓ నిట్టూర్పు విడిచింది.
    ఇప్పుడిక జరిగిపోయిన దాని గురించి బాధపడ్డం అనవసరం....అలా అని యిలా ఈ జీవితాన్ని 'రాజీ మార్గంతో నెట్టుకురావాలా? ఏదో ఒకటి చేయాలి...కానీ, ఏం చేయాలి?
    అలా ఆలోచిస్తూ.... ఆలోచిస్తూ...నిద్రలోకి జారుకుంది.
    ఏ పన్నెండు గంటలకో మెలుకువ వచ్చింది.
    ఆకలిగా అనిపించింది. వెంటనే, కిచెన్లోకి వెళ్ళి కుక్కర్ పెట్టింది. ఫ్రీజ్ లో కూరగాయలేమైనా వున్నాయేమో చూసింది.
    పావుగంటలో అన్నం రెడీ అయింది. టమోటో కర్రీ చేసుకుంది.
    వేడివేడిగా అన్నం తిన్నాక గానీ స్థిమితపడలేకపోయింది. అప్పుడు గుర్తొచ్చాడు శ్రీచరణ్.
    పాపం! సాయంత్రం ఆకలితో వస్తాడు అనుకుంది అన్నం సరిపోతుంది. కూర కూడా సరిపడినంత వుంది అనుకుంది. మళ్ళీ వెళ్ళి పడుకుంది.
    సాయంత్రం ఆరుదాటుతుండగా వచ్చాడు శ్రీచరణ్ హడావిడిగా.
    "ప్రనూషా....త్వరగా తయారవ్వు మా ఎం.డి. ఢిల్లీ నుంచి వచ్చాడు. ఈరోజు రాత్రే ఫ్లయిట్స్ కు వెళ్తున్నాడట. మనల్ని "టీ"కి ఇన్వయిట్ చేసాడు. నేను వెంటనే తీసుకొస్తానని చెప్పాను..." అన్నాడు శ్రీచరణ్.
    నేనా....నేన్రాను..." అంది ప్రనూష.
    "అదేంటి.... అక్కడ మా యం.డి. మనకోసం ఎదురుచూస్తుంటాడు.
    "చూడనీ...నాకేంటి? మనమింకా ఇలా మొగుడూ, పెళ్ళాలా వుండాలా? వద్దా? అనేది డిసైడవ్వలేదు. అప్పుడే నీ భార్యగా పరిచయం ఎందుకు?"
    "నీకు....నీకసలు బుద్ధుందా? ఇప్పుడా ఈ డిస్కషన్. ముందు తయారవ్వు..." అన్నాడు.
    "చూసారా... అప్పుడే అధికారం చెలాయిస్తున్నారు. అందుకే ఈ అరేంజ్ డ్ మ్యారేజెస్ అంటే ఒళ్ళుమంట. అదే లవ్ మ్యారేజి అయితే యిలా పెత్తనం చెలాయించరు."
    ఆమె ఏం మాట్లాడుతుందో అర్ధం కాలేదు ముందు. అర్ధమయ్యాక, రెండు చేతులు జోడించి.
    'మేడమ్ ప్రనూషగారూ...మా ఎం.డి. వెధవగారు "టీ కి ఇన్వయిట్ చేసారు. తమరు దయచేస్తారా? ఈ డబుల్ వెధవ మొగుడు గారి కోరిక తీర్చండి..."అన్నాడు.
    ఈ టైప్లో ఇలా అడుక్కోవడం కొద్దిగా బెటర్ గా వుంది. తమరు పావుగంట బయట వెయిట్ చేయండి, నేను తయారయి వస్తా..." అంది.
    "హమ్మయ్య...బ్రతికిపోయాననుకున్నాడు...మామూలు టైంలో అయితే, ఆట పట్టించేవాడు. కానీ ఇప్పుడు అవసరం తనది.
    అప్పటికీ యం.డి.తో మరోసారి కలుస్తానని చెప్పాడు. వాడి మంచి తనాన్ని పెట్రోల్తో మంటెట్టా....' నువ్వునాకు బాగా నచ్చావోయ్...నీ భార్యను చూసి నేను దీవించి తీరాల్సిందే..." అన్నాడు.
    అందుకే ఈ తప్పని సరిప్రొగ్రాం ఇప్పుడు.
    పావుగంట తర్వాత... వైట్ కలర్ శారీ, వయిట్ వాయిల్ బ్లౌజుతో సింపుల్ గా బయటకు వచ్చింది ప్రనూష. కొత్తగా కట్టిన మంగళసూత్రం పలుచని ఆమె పయిట చాటున మెరుస్తోంది. పొడుగాటి నల్లపూసల గొలుసు పమిట మీద వేలాడుతోంది.
    ముద్దుగా, ముద్ద బంతి పువ్వులా ఉంది. తలంటుకున్న జుట్టుని లూజుగా వాలుజడగా వేసింది. నడుం వరకూ వచ్చిన జడని అబ్బురంగా చూస్తూ....తలలో మల్లెలు కూడా ఉంటే ఎంత బావుణ్ణు' అనుకున్నాడు ఓ క్షణం శ్రీచరణ్.
    కళ్ళార్పకుండా చూస్తున్నాడు శ్రీచరణ్.
    "ఇంతందమైన ఈ అమ్మాయి హాయిగా ఏ జీన్స్, చుడీదరో వేసుకుంటే ఎంత బావుండేది. స్కూటర్ మీద తన వెనక కూచొని తన నడుం చుట్టూ రెండు చేతులూ వేసి, వెళ్తోంటే..ఎంత టెమ్టింగ్ గా వుంటుంది." అనుకున్నాడు.
    "హలో .... ఏంటి మీ వూళ్ళో ఇంత స్టాండర్డ్ అందమున్న అమ్మాయిల్లేరా?" అంది కావాలనే శ్రీచరణ్ ని రెచ్చగొడుతూ ప్రనూష.
    ప్రేమగా ఏదో అనబోయిన శ్రీచరణ్ ఆమె ఏ మాటలకి, కోపంగా... 'బొచ్చెడు....ఇదిగో  బొచ్చెడు మంది వున్నారు గానీ, హాయిగా జీన్స్, చుడీదరో వేసుకోవచ్చుగా..." అన్నాడు శ్రీచరణ్.
    "ఛీ...యాక్..." అంది ప్రనూష.
    'ఛీ....యాక్" అన్నది నీ ఊతపదమా?" అని టైం చూసుకొని సర్లే... పద...పద..." అన్నాడు హడావిడిగా.
    "ఎంత బావున్నావు ప్రనూ..." అంటూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, నుదిటిమీద ముద్దుపెడితే ఈయనగారి సొమ్మేం పోయింది...? అనుకుందో క్షణం.
    వెంటనే....'కొన్రోజులైతే ఎలాగో విడిపోతాంగా అనుకుంది.
    తన ఆలోచనకు పర్యవసానం ఏమిటో తెలియక ప్రనూష.
    రాత్రి పదయింది.
    చల్లగాలి పరామర్శిస్తోంది వాళ్ళిద్దర్నీ.
    టాంక్ బండ్ నుంచి స్కూటర్ మీద ఇంటికి తిరిగొస్తున్నారు.
    యం.డి గ్రీన్ పార్క్ లో గ్రాండ్ గానే పార్టీ యిచ్చాడు శ్రీచరణ్, ప్రనూషలకు పార్టీ అయిపోయే సరికి రాత్రి తొమ్మిదిన్నర దాటింది.
    చలికి చేతులు కొంకర్లు పోతున్న ఫీలింగ్.
    అతని వెనకే కూచున్న ప్రనూష ముడుచుకుపోయింది.
    'అలా ముడుచుకుని మామ్మలా కూచోపోతే, తన నడుం చుట్టూ చేయేయొచ్చు కదా! దగ్గరికి హత్తుకుని కూర్చుంటే తన సొమ్మేం పోతుందో అనుకున్నాడు శ్రీచరణ్.
    నిజానికి శ్రీచరణ్ భుజం మీద తలపెట్టి, నడుం చుట్టూ చేయేసి కబుర్లు చెప్పుకోవలన్న కోరిక కలిగిందా క్షణం ప్రనూషకు.
    అరే... తను పెళ్ళికి ముందే ప్రేమించుకుంటే....ఎంత బాగుండేది?" అనుకుంది.
    చేతిలో రెండు గిఫ్ట్ ప్యాక్ లున్నాయి. హోటల్లో పార్టీ ఇచ్చాక యం.డి రెండు గిఫ్ట్ ప్యాక్లు ఇచ్చి విప్పమన్నాడు.
    ఆ దృశ్యం గుర్తొచ్చింది ప్రనూషకు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS