Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 25

 

    అది కాదు అక్కగారూ! ఇలా ఏమీ తినకుండా వుంటే ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి. ఇవాళంటే మీరొచ్చారు. ఎప్పుడూ మీరు రావడానికి కుదురుతుందా చెప్పండి. చెప్తే వినదు. నా మాట కొంచెం మోటుగా ఉంటుంది కదూ! అందరూ పిచ్చి ముండా కొడుకునని తోసిపారేస్తారు" అన్నాడు మాటల్లో ఎంతో నిజాయితీ ఒలకబోస్తూ!
    కౌసల్య అతని వాక్చాతుర్యానికీ, తెలివితేతలకీ, అతనాడుతున్న నాటకానికీ ఆశ్చర్యపోతూ అతనికేసి అలా చూస్తుండిపోయింది.
    పానకాలు భోజనం చేసి, కాస్సేపు పడుకుని లేచి, రాధ చేసిచ్చిన కాఫీ తాగి వెళ్లొస్తాను కౌసల్యా , జాగ్రత్త! అవసరమైతే ఎవరిచేతనైనా జగన్నాధవరావుగారింటికి ఫోను చేయించు.' అంటూ వెళ్ళిపోయాడు.
    "అతను మునుపటి కంటే చాలా మారాడు కౌసల్యా! అదివరకు మరీ 'రూడ్' గా మాట్లాడేవాడు ఇప్పుడు చూడు. మర్యాదగా మాట్లాడుతున్నాడు " అంది రాధ.
    కౌసల్య కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్ళు కనబడకుండా జాగ్రత్తపడి, పక్కకి తిరిగి తుడుచుకుంది.
    ఇప్పుడామె పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది. అది వరకు తన బాధ అన్నయ్యతోటి , వదిన తోటి చెప్పుకుని తృప్తి పడేది. ఇప్పుడు అక్కడ కూడా చెప్పుకోవడానికి లేకుండా చేసేశాడు పానకాలు. అతని తెలివితేటలతో తనవిపుకు తిప్పేసుకున్నాడు వాళ్ళని. కడుపులో బాధ కడుపులోనే దాచుకోవాలి తప్ప చెప్పుకోవడానికి దిక్కులేదని వెక్కి వెక్కి ఏడ్చింది కౌసల్య, వదిన గారు చూడకుండా.
    ఆ సాయంత్రం పరుగెత్తుకువొచ్చాడు సుధాకర్. శ్వేతా, స్మితా 'అత్తయ్యా' అంటూ కౌసల్య మంచం మీద చేరారు. "ఏమయిందంమ్మా? ఎలా వుంది ఒంట్లో?" అడిగాడు సుధాకర్.
    "ఏమండీ! మరో నాలుగు రోజుల్లో కౌసల్యకీ ఏడో నెలోస్తుంది. మనం సీమంతం చెయ్యాలి. పురిటికి తీసుకెళ్ళాలి" అంది రాధ.
    "అలాగే! రాత్రి బావగారితో మాట్లాడదాం" అన్నాడు సుధాకర్. రాధ అందరికీ అక్కడే వంట చేసింది.
    రాత్రి దాదాపు తొమ్మిది దాటింతరువాత ఇల్లు చేరుకున్నాడు పానకాలు. భోజనాలు ముందర ఈ సంగతి కదిపాడు సుధాకర్. "అలాగే, చాలా సంతోషం. కాకపోతే కౌసల్యని విడిచి నేను అన్ని రోజులు ఉండగలనా అని ఆలోచిస్తున్నానంతే" అన్నాడు పానకాలు నవ్వుతూ.
    "ఎంతదూరం కనుక? మీరు అక్కడికే వొచ్చేయండి. మళ్ళీ కౌలస్య తిరిగొచ్చేదాకా ఈ ఇంటికి తాళం పట్టేయండి బావగారూ!" అన్నాడు సుధాకర్.
    "ఓ యస్!" అన్నాడు నవ్వుతూ పానకాలు.
    కౌసల్యకి జ్వరం తగ్గాక ఆమెని తీసుకుని రమ్మని చెప్పి సుధాకర్ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మెల్లగా రాధ లేని సమయం చూసి పానకాలు కౌసల్య దగ్గరి కెళ్ళి "ఏయ్! ఇదే సమయమని చెప్పి పుట్టింట్లో కూర్చుందామనుకుంటున్నావా? వాళ్ళు పిలిచినా నేను రాను అని చెప్పు. నేను ఒద్దన్నానని చెప్పావో మీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. జాగ్రత్త!" అంటూ దగ్గర కెళ్ళి ఏది ఒక ముద్దియ్యి' అంటూ బుగ్గ కోరికేశాడు ఏడవడానికి కూడా ఓపిక లేనిదానిలా మంచం మీద పడిపోయింది.

                                                          *    *    *    *

    జ్వరం జారడానికి దాదాపు వారం రోజులు పట్టింది. ఆ వారమంతా రాధ అక్కడే ఉండిపోయింది. అక్కడ స్మితా, శ్వేతల స్క్లులు గొడవలు సుధాకర్ చూసుకుంటూ పనిమనిషి చేత వంట చేయించుకున్నాడు తనకీ పిల్లలకీ.
    ఒక మంచి రోజు చూసీ ముహూర్తం పెట్టింది రాధ కౌసల్యని తీసికెళ్ళడానికి కౌసల్య రానంది. అక్కడే ఉంటానంది. రాధ ఆశ్చర్యపోయింది. "అతను వెళ్ళమన్నడుగా ఏమిటీ అభ్యంతరం? అందులోనూ ఒంట్లో కూడా బాగుండటం లేదు కదా! నీకు రెస్టు కావాలి. అందులోనూ ఎన్నో తెలీని విషయాలు ఏవేవో కోరికలూ ఉంటాయి. ఈ సమయంలో, అవి చెప్పుకోవడానికి తెలుసుకోడానికి పుట్టింట్లో అయితేనే ఆడపిల్లకి  ఆ స్యాతంత్ర్యం ఉంటుంది. తృప్తి కలుగుతుంది. అతన్నడిగితే! 'అంతా కౌసల్య ఇష్టం. తప్పకుండా పట్టుకేళ్ళండి" అన్నాడు. పదమ్మా వెళదాం" అంది రాధ.
    కౌసల్య గుండె తరుక్కుపోతోంది. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో పాలుపోవడం లేదు. "అతనలాగే  అంటాడు. అతనికిబ్బందవుతుంది. పైగా ఇప్పుడిప్పుడే దగ్గరకవుతున్నాం ఇద్దరం. ఈ సమయంలో మళ్ళీ నేనోచ్చేస్తే అతను మారిపోవచ్చు. పైగా ఒకే ఊరు కదా ఎక్కడుంటేనేం?" అంది రాధ మరి మాట్లాడలేకపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS