Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 25


    "సంగీతంలో శక్తి కావలసిన వాళ్ళకి శక్తి, రక్తి కోసం పాకులాడే వాళ్ళకి రక్తీ, భక్తి పారవశ్యంలో ఉన్నవాళ్ళకు భక్తీ, ముక్తికై తపించే వాళ్ళకు ముక్తీ దొరుకుతాయమ్మా! నువ్వు వినలేదా, శిశువులనీ, పశువులనీ కూడా ఊరడించి, ఉపశమనంకలగజేసి, ఉర్రూతలూగించేశక్తి సంగీతానికి ఉందని?"
    అస్పష్టంగా తల ఊపింది సృజన.
    "తల్లీసంగీత శిక్షణ సరళీ స్వరాలతోశుభారంభం అవుతోంది. సా.... సా.... సా.... అనడం సాధనచెయ్యాలి ముందు. ఏదీ నాతో పాటు పలుకు. సా"
    మెల్లగా చెప్పింది సృజన.
    "నేను మా ఇంటిదగ్గర సంగీతం నేర్చుకుంటున్నానండీ! సరళీ స్వరాలు వచ్చు."
    "ఓహో అలాగా మంచిది! మంచిది! అయితే ఎంతవరకూ వచ్చావూ?"
    "జంటస్వరాలూ, అలంకారాలూ, గీతాలూ నేర్చేసుకున్నానండీ! వర్ణాలూ! కృతులూ ఇప్పుడే నేర్చుకుంటున్నాను"
    "భేష్ భేష్! కృతులదాకా వచ్చావూ? ఎన్నాళ్ళయిందమ్మా నేర్చుకోవడం మొదలెట్టి"
    "రెండు నెలలయిందండీ!"
    ఆయన తెల్లబోయినట్లు చూశాడు.
    "రెండు నెలల్లోనే కృతులా? ఎవరమ్మా నేర్పింది?"
    "కోమలగారండీ!"
    "అలా చెప్పు!" అన్నాడు సుబ్రహ్మణ్యం. ఆయన మొహంలో అవహేళన కనబడింది. "కోమలఅంటే, ఇవాళ పాఠాలు చెప్పడం మొదలెట్టిసంవత్సరం తిరక్కుండానే కచేరీలు చేయించే ఆవిడ కదూ? నీ చేతకూడా అర్జెంటుగా కచేరీలు పెట్టించేస్తానని ఆశపెట్టిందా ఏమిటి?"
    "లేదండీ!"
    "మరి రెండు నెలల్లోనే కృతులదాకా వచ్చానంటున్నావు. ఏదీ! ఒక్కటి పాడి వినిపించు! ఏ మాత్రం నేర్పిందోచూద్దాం!"
    కొన్ని సెకండ్లపాటు స్తబ్దంగా ఉండి, తర్వాత గొంత సవరించుకుని స్వరాలు పలికి సరిచూసుకుంది సృజన.
    సా....సా..... సా....
    స్వాధీనంలోనే ఉంది గొంతు.
    తర్వాత గళమెత్తింది.
    త్యాగరాజస్వామివారి కీర్తన.
    "రామాననుబ్రోవరా
    ప్రేమతోలోకాభిరామా
    నను బ్రోవరా....."
    కళ్ళు మూసుకుని ఆలకిస్తున్న సుబ్రహ్మణ్యం, ఆమె పాట పూర్తి కాగానే కళ్ళు తెరిచి చూశాడు. ఆయన మొహంలో మెప్పుదల కనబడింది.
    "అమ్మాయ్! నువ్వు రెండు నెలల్లోనే ఇంత చక్కగా పాడగలుగుతున్నావంటే, అది నిశ్చయంగా ఆ కోమలి గొప్పతనం మాత్రంకాదు. అది నాకు బాగా తెలుసు. అసాధారణమైన ధారణశక్తి నీకు ఉండి ఉండాలి. ఇవాళ ఈ దీపం ఎదుట చెబుతున్నానమ్మా! నీకు గనుక మనసు కుదిరిశ్రద్దపెట్టి నేర్చుకున్నావంటే, సంగీతంలో నీకు తిరుగుండదు. నిజం చెబుతున్నానమ్మా! నా యాభయ్ అయిదేళ్ళ జీవితంలో ఇంతమధురమైన స్వరం నేను వినలేదు.
    నువ్వు గొప్పదానివి అవుతావు తల్లీ! చాలా గొప్పదానివి అవుతావు"
    తలవంచుకుంది సృజన.
    "ఇవాళ్టికి ఇంక చాలిద్దామమ్మా! ఇవాళ ఊరికే ఉపోద్ఘాతం! రేపటినుంచి పాఠాలలోకి వద్దాం" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    అప్పటికే ఒక ట్రేలో సర్ది వుంచిన ధోవతులు, చాపూ, తాంబూలం, అయిదు వందరూపాయలనోట్లు తెచ్చి సృజనకు అందించింది రంగేలీ.
    ఆ సుబ్రహ్మణ్యం చేతుల్లో పెట్టి ఆయన పాదాలకు నమస్కరించింది సృజన.
    ఆయన దీర్ఘంగా సృజనవైపు చూసి, అస్పష్టంగా పెదిమలు కదిలిస్తూ ఆశీర్వదించాడు.
    "మళ్ళీ రేపు వస్తానమ్మా!"
    తల ఊపింది సృజన.
    సుబ్రహ్మణ్యం వెళ్ళిపోయాడు.
    "రేపటి నుంచి డాన్సు మాస్టారుకూడా వస్తారు. రెడీగా ఉండు" అంది రంగేలీ.
    విని ఊరుకుంది సృజన.
    మర్నాడు వచ్చాడు డాన్సు మాస్టారు.
    "ఈయన గురుస్వామిగారు. కూచిపూడి, భరతనాట్యం రెండూ నేర్పిస్తారు" అంది రంగేలీ.
    నమస్కరించింది సృజన.
    గురుస్వామి ఆమెని అంచనా వేస్తున్నట్లు తదేకంగా కాసేపు చూసి తర్వాత అన్నాడు.
    "చక్కని కనుముక్కు తీరమ్మా నీది! దానికి తోడు భావాలని సునాయాసంగా పలికించే అంశాల నయనాలు నీకు ఉన్నాయి. చాలా పొడగరివి నువ్వు. నాట్యానికి తగిన రూపురేఖలమ్మా నీవి!" అన్నాడు.
    ఏం మాట్లాడాలో తోచక ఇబ్బందిగా చూసింది సృజన."
    "తామరతాడుల్లాంటినీ చేతులూ, పొడుగాటి వేళ్ళూ, ఓహ్ నువ్వు గనుక పతకముద్ర పడితే, నీ కీర్తిపతాకం దిశదిశలా, దేశదేశాలా రెపరెపలాడిపోదూ!" అన్నాడు గురుస్వామి తన్మయంగా, "నీలాంటి శిష్యురాలికినాట్యం నేర్పిస్తేనేనా విద్యకు సార్ధకత! మంచిదమ్మా! ఇవాళ ఊరికే చూసిపోదామనివచ్చాను. రేపటినుంచి కఠోరదీక్షతో శిక్షణ మొదలు! సరేనా?"
    తల ఊపింది సృజన.
    ఆయనకుకూడా గురుదక్షిణ సిద్దంగా ఉంచింది అహల్య. అది ఆయనకు ఇచ్చింది సృజన. గురుస్వామి శెలవు తీసుకుని వెళ్ళపోయాడు.
    "ఏం సృజనా? నెకెఉ బాగుందా? ఆటా, పాట నేర్చుకోవడం తప్ప వేరే పనేం లేదు అవునా?" అంది అహల్య చిరునవ్వుతో.
    ఏం మాట్లాడకుండా ఉండిపోయింది సృజన.
    కానీ ఆమెకి అనిపించింది. ఆటపాటలతో గడిపెయ్యవలసిణవయసు తనది.
    కానీ ఇక్కడ తను నేర్చుకుంటున్న ఆటా పాటా వేరు!
    అయినారాజీ పడక తప్పదని తెలుసు సృజనకి. పదిమంది పక్కల్లో పొర్లేకంటే, ఇదే పదివేల రెట్లుమేలు!
    అప్పుడు ఉస్మాన్ వచ్చాడు అక్కడికి. ఒకప్పుడు తనని చిత్రహింస పెడతానని బెదిరించిన ఉస్మాన్! కామాక్షినీ, చిలకలచిన్నారావునీ నిర్దయగా చిత్రహింసలు పెట్టిన ఉస్మాన్!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS