లోపల వుండి వాళ్ళ మాటలు వింటున్న శీతల్ అయ్ గారు అనే కొండ బాస్ అనడం గమనించింది.
"శీతల్ చర్యలు చూస్తుంటే అనుమానించడానికి ఎక్కడా ఆస్కారం కనపడడం లేదు. అలా అని నమ్మకూడదు ఏదీను. మహా నటిలా ఏక్షన్ చేస్తున్నదేమో! సి.బి.ఐ. వాళ్ళమని చెప్పి శీతల్ ని ఎత్తుకెళ్ళి దేనికో వాడు కోవాలని ప్లాన్ వేసి సురేంద్రనాథ్ ని బుట్టలో వేసుకుని కుమారసంగుడు ముఠావాళ్ళు విడిదింట్లో దూరారు. వాడి పథకం తెలిసిన మనం పెళ్ళి వాళ్ళలో కలిసిపోయి సరిఅయిన సమయానికి శీతల్ ని ఎత్తుకొచ్చేశాము. ఇదేమి శీతల్ కి తెలియదు. ఆంటీ అనే ఆవిడ మన మనిషనే అనుకుంటున్నది. అలాగే నేను తన అంకుల్ ననే అనుకుంటున్నది. అలా అనుకుంటున్నదా, నటిస్తున్నదా అన్నది తెలుసుకోవడం ముఖ్యం. శీతల్ ది నటన అయితే మాత్రం ఎప్పుడో మన కళ్ళుగప్పి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అది గుర్తుంచుకోండి" లోకేశ్వరరావు అన్నాడు.
"ఈ ఇల్లు చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి మా కళ్ళు గప్పి శీతల్ రాణి బైటికి వెళ్ళలేదు బాస్! ఆమె పరారి కాకుండా మేము చూసుకుంటాము, మిగతాది మీరు చూసుకోండి" కొండ చెప్పాడు.
"ఇంకా ఎంత పదిరోజులు చాలు. అప్పటిదాకా శీతల్ బుద్దిగా వుంటే ఆ తర్వాత..."
"ఉంటుంది బాస్! నాకలా అనిపిస్తున్నది."
"ఉంటే మంచిదే. వీలైతే మాటల్లో కలిపి చూస్తాను."
"అలా చేయండి బాస్. తాడో పేడో తేలిపోతుంది."
"ఏది తేలినా నామాట చెల్లాల్సిందే. పద శీతల్ గదికి వెళ్ళి మాట్లాడివద్దాము" అంటూ లోకేశ్వరరావు లేచాడు.
లోకేశ్వరరావు, కొండ కలిసి ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయారు.
బాత్ రూమ్ అవసరం ఎన్ని రహస్యాలు తెలియజేసింది! వాళ్ళ సంభాషణ తను వినగలగడం చాలా అదృష్టం ఇంకా పదినిమిషాలు వాళ్ళు మాట్లాడినట్లయితే వాళ్ళ చరిత్ర మొత్తం తెలిసేదేమో! చూచాయగా కొంతయినా తెలుసుకోగలిగింది కాబట్టి ఇహపై ఏ చిన్న అనుమానానికి ఆస్కారం రానివ్వకుండా తాను మెలగాలి. "ఇంకా పదిరోజులు శీతల్ బుద్దిగా వుంటే చాలు" లోకేశ్వరరావు ఎందుకు అన్నాడు! పదిరోజులు తర్వాత నా బ్రతుకు ఏమికానుంది?
శీతల్ ఆలోచిస్తూ బాత్ రూమ్ లోంచి బయటకు వచ్చింది. అటునుంచి అటే పక్క గదిలోకి వెళ్ళి ఆ వెనుకవేపు వున్న తలుపు తీసుకుని పెరటివేపు భాగానికి వచ్చింది. అక్కడవున్న పూలకుండీల దగ్గర ఆగి కుండీలలో పూలని పరీక్షిస్తూ ఉండిపోయింది.
శీతల్ తన గదికి వెళ్ళక తెలివిగా నాటకం ఆడింది.
లోకేశ్వరరావు, కొండ ఆమె గదిలోకి వెళ్ళి చూశారు. గదిలో శీతల్ లేదు. "అమ్మాయిగారు అటే వెళ్ళారు" అని అటుసైడు కాపలా కాసే అతను చెప్పాడు. లోకేశ్వరరావు కంగారుగా మళ్ళీ వచ్చినవేపు వెళ్ళి చూస్తే ఆమె కనపడలేదు. శీతల్ ని వెతుకుతూ పెరటివేపు వచ్చారు. అక్కడ ఆమె పూలను సరిచేస్తూ కనిపించింది. ఇరువురు అటు నడిచారు.
శీతల్ దగ్గరగా వెళ్ళి నిలబడి "ఏం చేస్తున్నావమ్మా!" అని పలకరించాడు లోకేశ్వరరావు.
ఆమె చేస్తున్న పని ఆపి చిన్న ఉలికిపాటు, అంతలోనే తెప్పరిల్లి ఆనందించినట్టు ముఖంపెట్టి "హాయ్ అంకుల్! ఊరినుంచి ఎప్పుడొచ్చారు?" అంది.
"ఇప్పుడే వచ్చాను. ముందుగా నిన్ను చూద్దామని నీ రూమ్ కెళ్ళాను. అక్కడ నీవు లేవు. వెతుక్కుంటూ యిలా వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నావు శీతల్!" మృదువుగా అడిగాడు లోకేశ్వరరావు.
"పుస్తకాలు చదివి చదివి బోర్ కొట్టింది. పోనీ చిత్రాలు చూద్దామా అంటే ఎన్నని చూడను కళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇలా వచ్చాను. ఈ పూలకుండిలను చూడంగానే ఈ చెట్టు పూలుతుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టుపూలు తుంచి ఈ చెట్టుకు అమర్చి సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ కొత్త అందాలు చూస్తున్నాను. కావాలంటే మీరు చూడండి అంకుల్! పెసరబద్దలంత ఆకులున్న యీ చెట్టు ఇంతంతేసి పెద్దపూలు కాస్తే ఏం బాగుంది? ఈ చెట్టు ఆకులు చూడండి సరిగ్గా తాటి ఆకులంత ఉన్నాయి. పూలు చూడబోతే సన్నజాజులకన్నా సుకుమారంగా పూచాయి.
ఆమె చిన్నపిల్లలా కళ్ళు తిప్పుకుంటూ చెపుతూ "ఎస్ ఎస్" అంటూ తల తాటించాడు లోకేశ్వరరావు.
"నేను చేసింది యెలా వుంది అంకుల్?" అని అడిగింది.
"చాలా బాగుంది. ఆ దేముడే దిగివచ్చి నీవు చేసింది చూస్తే ఈ ఐడియా నాకు రాలేదని సిగ్గుపడతాడు."
"కాని పెద్దవాళ్ళు అనడం దేముడు ఏ పనిచేసినా దానికో కారణం ఉంటుంది అంటారు కదా?"
"అవునవును అంటారు" అంతకన్నా ఇంకేమనాలో తెలియక తల తాటిస్తూ అన్నాడు లోకేశ్వరరావు.
"ఓ! మీతో కొండ కూడా వచ్చాడే! అలా మొన్న ఏమీ తోచక అలా సముద్రందాకా షికారు వెళదామని బయటికొచ్చాను. కొండ నన్ను బయటికి పంపించనన్నాడు. పైగా బయట పులులు, తోడేళ్ళు వున్నాయని భయపెట్టాడు. నేనేమన్నా ఇప్పుడే నడక నేర్చిన పసికూననా!" శీతల్ ముందుకు నడుస్తూ అంది.
"ఏరా కొండా! అలా అన్నావా?" ఆమె ముందు నడుస్తూ అడిగాడు.
