మనవడి బ్రతుకేమవుతుందో తేలిక వీర్రాజు నెట్టేసిన మాణిక్యమ్మ కనిపించని దేవుళ్ళకు మొక్కుకుంటున్న తరుణాన......
అశ్రుసిక్త నయనాలతో బయటికి పరుగెత్తింది కిన్నెర.
ఏమిటి? రాఘవ అలాంటి కవిత చెప్పాడెం?
"ఆడుకునే టప్పుడు తప్ప పోరాడే టప్పుడు
నీ ప్రియ నేస్తాన్ని కానూ అంటూ నిక్కచ్చిగా చెప్పింది.
నేల కొరిగిన గరికపోచని చూసి సుడిగాలితో బాటు
తనూ నవ్వింది మృతిలా ఆకృతి లేని కృతిలా....."
* * * *
భుజం పైన బలంగా దెబ్బ తగలడంతో స్కూటర్ పైనుంచి జారిపడ్డాడు రాఘవ.
మాణిక్యమ్మ గొల్లుమంది మరోసారి వీర్రాజు పాదాల్ని చుట్టేస్తూ.
ఏదో ఆలోచిస్తూ వస్తున్నాడే తప్ప అక్కడ నిలబడింది తనకోసమే అని తెలీని రాఘవ, ముష్కరుల్లా మీద కలియబడుతున్న వ్యక్తుల్ని చూస్తూ ప్రతిఘటించలేదు . కేవలం తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
వీర్రాజు తను అనుచరుల్ని రెచ్చగొట్టాడు మరింత రెచ్చిపోతూ.
వెనుక నుంచి ఓ గడకర్ర రాఘవ తలని తాకేదే......
ముందు అడ్డం వచ్చింది కిన్నెర మరుక్షణం ఆ వ్యక్తి చెంప పగిలేట్టు బలంగా చెప్పుతో కొట్టింది.
అది వీర్రాజు మాత్రమే కాదు- ఆ ఊరి జనం కలనైనా ఊహించని సంఘటన!
రెండు పదుల వయసు మాత్రమే అయితేనేం, ఏడు జన్మల్ కాలమంత విస్తరించిన కిన్నెర ముందు గొడుగులా రాఘవను పొదివి పట్టుకుంది. మరుక్షణం పిడుగులా తండ్రిని చూసి కేక పెట్టింది. "ఆపండి నన్నా!"
ఆ కేక వీర్రాజుక్కాదు, రాఘవ పని పూర్తి చేయాలనుకున్న గుండాలకు ఓ హెచ్చరికలా మారింది. హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
వీర్రాజు పిడికిలి బిగుసుకుంది. స్వేదం శరీరం నుంచి ధార కడుతుంది.
మహల్లో రాచిలుక ఇప్పుడు రాకూడని చోటికి వచ్చింది. మొహం చెల్లని పరిస్థితి సృష్టించడమే కాక, హరప్పా, మొహంజోదారు సంస్కృతిని ప్రశ్నించి తనను నిలదిస్తుంది.
పదిమంది ఎదుటా నిలబడి కనుపాప, కనురెప్పను భక్షిస్తున్నట్టు మొండిగా చూస్తుంది.
"కొట్టండి నాన్నా! రాఘవను ఒక్కన్నే కాదు, రాఘవతో పాటు నన్ను కూడా!"
ఏమిటి? ఏమైంది తన రాజసం? పగిలిన అగ్నిపర్వతంలా ప్రకంపించిన తను లావాను సైతం వెనక్కి లాక్కుని యింత బాహాటంగా తన వ్యక్తిత్వాన్ని చంపుకుని చూస్తున్నాడెం?
ఏమైంది తనకు? తాతే అయితే కిన్నెర తల నరికేవాడు.
తన తండ్రి లాంటి తత్వం కలవాడే అయితే.....
ఇప్పుడు తను ఆచరించబోయింది అదే సిద్దాంతంగా......
తనను కాక తన మిద ఆశపడ్డ చాకలిదాన్ని జుట్టు కత్తిరించినట్టు కిన్నేరను కాక రాఘవను నరికి పోగులేయాలనేగా ఇంతసేపూ ఆలోచించింది!
చిత్రమైన స్తబ్ధత.
కూతురుగా కిన్నేరని ప్రేమించాడు కాని, ఎంత ప్రేమించింది ఇప్పటికి అర్ధమైనట్టు అప్రతిభుడై వీర్రాజు నిలబడి ఉండగానే......
"వీర్రాజుగారూ!"
రాయుడు కంఠం వినిపించింది. "నా మాట విని ఇంటికి నడవండి"
గాయపడ్డ సింహంలా చూశాడు వీర్రాజు.
"నలుగురి ముందూ మీ గౌరవాన్ని......" రహస్యంగా అన్నాడు రాయుడు. "మీ ఉనికిని మీ అమ్మాయి యింకా ప్రశ్నించక ముందే మీరు యిక్కడి నుంచి బయలుదేరటం మేలు."
"కాని...." వీర్రాజు గొంతు వణికింది ఉద్రేకంగా.
పరువు పోయినందుకు కాదు, అహం దారుణంగా గాయపడినందుకు ఆయన బాధ పడుతున్నాడని బోధపడిపోయింది.
"ఒక తండ్రిగా , పైగా అసాధారణమైన చరిత్ర గల ఒక వంశానికి చెందిన వ్యక్తిగా, మీరీ సన్నివేశాన్ని జిర్ణించుకోలేక పోతున్నారని నేనుహించగలను వీర్రాజుగారూ! కాని, ఇది అనార్కలికి సజీవ సమాధి చేసిన మొగలాయిలా కాలం కాదు, నిండు కొలువులో ద్రౌపది బట్టలూడదీసి అవమానించగల ద్వాపర యుగమూ కాదు. అదే అయితే అసలు మీ అమ్మాయి సైతం బయటకు వచ్చేది కాదుగా?"
జూదంలో మాయ చేయాలని కాక, శకుని పాండవులకు మేలు చేయాలని అనుకుని ఉంటే, దృతరాష్ట్రుడికి నూరు తద్దినాల బాధ తప్పేది. రాయుడు అంతటి లోక్యం గలవాడే! బ్రతకనేర్చిన మనిషి తప్ప మరొకర్ని బ్రతకనివ్వని తత్వం కాదు.
అదే రాయుడి వ్యక్తిత్వం అయితే యిద్దరు ప్రత్యర్ధులకు అంత చేరువయ్యేవాడు కాదు కూడా.
చల్లబడిపోయాడు వీర్రాజు. కాదు చల్లబడక తప్పలేదు.
* * * *
"నా బిడ్డే నా పరువు తీసింది రాయుడు! తరతరాల నా వంశ ప్రతిష్టకి న కూతురే తలవంపు తీసుకొచ్చింది."
సలసల కాలిపోతున్న రక్తాన్ని చల్లబరుచుకోలేక విపరీతంగా తాగుతున్నాడు వీర్రాజు. "వాడి తల నారికేవాణ్ణి, కాని, ఘోషాలో బ్రతకాల్సిన నా కూతురు మధ్యలోకి వచ్చి....."
"అబ్బా!" అర్ధోక్తిలో అన్నాడు రాయుడు "సముద్ర ఘోషకు సైతం భాష కూర్చగల ఈ శతాబ్దంలో ఉంటూ ఘోషా అంటూ యిలా ఘోష పెట్టడం భావ్యంగా లేదు వీర్రాజుగారూ! ఎంత ప్రతిష్టగల వంశానికి చెందిన పిల్లయితే మాత్రం హైస్కూల్లో చదవటానికి, కాలేజీల్లో చదవటానికి ఘోషా పెట్టిస్తానంటే కుదుర్తుందా చెప్పండి! అసలు భోజరాజు పితలాటకం మీరు అర్ధం చేసుకోరేం?"
