Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 26


    
    ఊర్లో ఎవరికీ తెలియదు. నారాయణకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అందువల్ల ఎవరికీ తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి సంబంధాలని మగవాళ్ళే చెప్పుకుంటారు తప్ప ఆడవాళ్ళు చెప్పుకోరు.
    
    ఎలానూ కేసు ఒప్పుకున్నాను గనుక సుమతి మీద ఓ కన్నేసి వుంచాను. వాళ్ళింటికి తరచూ వెళ్ళి వస్తున్నాను.
    
    ఓ రోజు అలానే వెళ్ళి కాంతమ్మతో ఆ మాటా ఈ మాటా మాట్లాడుతున్నాను. సుబ్బరామయ్య యథాప్రకారం పేకాటకి వెళ్ళిపోయాడు.
    
    మధ్యాహ్నం భోజనాలయ్యాక వెళ్ళాను గనుక ఇక సాయంకాలం వరకు పనీపాటా లేదు. అందుకే తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాను.
    
    వంటిల్లంతా సర్ది సుమతి కూడా మాతో పాటు చేరింది.
    
    ఊరకనే ఉండడం ఎందుకు నేనూ విస్తర్లు కుడుతున్నాను.
    
    సాయంకాలమైంది.
    
    సూర్యుడు పడమటి కొ౦డల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇంటికొచ్చిన అతిధి దిష్టి తీసి, ఆ నీళ్ళను కుమ్మరించినట్టు సంధ్య కాంతి లోకాన్ని ఎర్రగా చుట్టేసింది. కడుపు నిండా మేసిన పశువులు ఇళ్ళకు తీరిగ్గా చేరుకుంటున్నాయి. పక్షులు తమ గూళ్ళను వెతుక్కుంటూ సాగిపోతున్నాయి.
    
    "నే వస్తా వదినా ఈరోజు చీటీ కదా డబ్బులు సమకూర్చాలి" అంటూ లేచాను.
    
    కాంతమ్మ ఉలిక్కిపడింది.
    
    "ఈరోజు చీటీనా!"
    
    "ఆ ఒకటో తేదీ కదా" అన్నాను.
    
    వెంటనే కాంతమ్మ సుమతివైపు చూసింది.
    
    "సుమతీ! నారాయణ ఉన్నాడేమో చూడు. అయిదొందలు పట్టుకొస్తే రెండురోజుల్లో ఇచ్చేస్తాం. ఇప్పటివరకూ మాట పోకుండా ఇచ్చేస్తున్నాం కదా" అంది.
    
    నాకు అనుమానం మొదలైంది. నారాయణ వయసులో వున్న కుర్రాడు. అతని దగ్గరికి కాంతమ్మ కూతుర్ని పంపిస్తూ వుందంటే వాళ్ళిద్దరి మధ్య మంచి చనువే వుండాలి. అందులోనూ ఇది మొదటిసారి కాదని కూడా స్పష్టంగా తెలుస్తోంది.
    
    బహుశా నారాయణే సుమతి ఫ్రెండ్ అయి ఉండాలనుకున్నాను.
    
    ఇలా అనుకుంటే చాలదు కదా రుజువులు చూపాలి.
    
    ఇంత ఆలోచించినా ఇవేమీ ముఖంలో కనిపించకుండా జాగ్రత్తపడి వచ్చేశాను.
    
    రెండురోజుల తరువాత మళ్ళీ ఓరోజు మధ్యాహ్నం వెళ్ళాను.
    
    మామూలుగానే వరండాలో కూర్చుని విస్తర్లు కుడుతున్నాం.
    
    అదిగో అప్పుడే నారాయణ వీధిలో పోతూ ముఖాన్ని మావైపు తిప్పాడు.
    
    "నారాయణా!" అంటూ పిలిచాను.
    
    నారాయణ లోపలికి అడుగు వేశాడో లేదో కుక్క ఒక్కసారిగా మొరగడం ప్రారంభించింది. దాని అరుపులకి నేను కూడా జడుసుకున్నాను. మొదట్లో నామీద కూడా అలాగే అరిచి మీద పడబోయింది గానీ ఆ తరువాత అలవాటైపోయింది.
    
    కాంతమ్మ అదిలించడంతో అది తోక ముడిచి తన స్థానంలోకి తాను వెళ్ళి పడుకుండిపోయింది.
    
    నారాయణ లోపలికి వచ్చాడు.
    
    సుమతి అక్కణ్నుంచి వెళ్ళిపోవడం గానీ, దొంగచూపులు చూస్తూ వుండడం గానీ చేయలేదు. తన పని తాను చేసుకుంటూ పోతోంది.
    
    అంత తెలివైంది కాబట్టే ఇంత గ్రంథం నడిపిస్తున్నా ఎవరికీ అనుమానం రాకుండా లాక్కొస్తోంది.
    
    నారాయణతో వ్యవసాయం గురించి మాట్లాడి పంపించేశాను అనుమానించ తగ్గది ఏమీ కనబడలేదు నాకు.
    
    నారాయణ మీద డౌట్ పడడం కేవలం నా అపోహ మాత్రమే అనుకున్నాను.
    
    నారాయణ కాకుంటే మరెవరు?
    
    అలా నాలో నేనే తర్జన భర్జన పడుతున్నాను.
    
    పదిరోజులు గడిచాయి.
    
    పదకొండో రోజు చిన్న క్లూతో సుమతి ప్రియుడ్ని కనిపెట్టేశాను.
    
    ఆరోజు మధ్యాహ్నం కాంతమ్మ ఇంటికి వెళ్ళడం కుదరలేదు. సాయంకాలం వీలైంది.
    
    లోకం నల్లటి కంబళిని మీదకి లాక్కుంటున్నట్టు మసక చీకట్లు అలుముకుంటున్నాయి. చీకటిని చూసి భయపడి చెట్లన్నీ ముడుచుకుంటున్నట్లు ఆకుల రెపరెపలు కూడా లేవు.
    
    నేను వెళ్ళేసరికి కాంతమ్మ నులక మంచం మీద వాలిపోయి సేద తీరుతుంది.
    
    నన్ను చూసి లేచి కూర్చుంది.
    
    "మధ్యాహ్నం రాలేదే" అంటూ నేను కూర్చోవడానికి మంచంలో జాగా ఇస్తూ సర్దుకుంది.
    
    సుమతి కింద చాప పరుచుకుని మల్లెపూలను దండగా కుడుతోంది. వరండాలో కిరసనాయిలు దీపం మద్రాసు ఐ వచ్చిన కన్నులాగా ఎర్రగా మండుతోంది.
    
    "వేరే పనుండి రాలేకపోయాను వదినా ఏమిటి విశేషాలు?" అంటూ కబుర్లు ప్రారంభించాను.
    
    అరగంట గడిచింది కాబోలు ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది.
    
    ఆ వచ్చిన వ్యక్తి కంచె దగ్గరే నిలబడి వున్నాడు.
    
    "ఎవరూ?" అంటూ పలకరించింది కాంతమ్మ.
    
    "నేను నారాయణను. కాఫీపొడి తెమ్మన్నారు కదా. తెచ్చాను"
    
    "లోపలికి రా నాయనా" అంది కాంతమ్మ.
    
    అతను మా దగ్గరికి వచ్చాడు.
        
    విచిత్రం- కుక్క కూడా దగ్గర్లో వున్నా అతన్ని చూసి అరవలేదు. పైపెచ్చు అతన్ని చూసి తోకాడిస్తూ దగ్గరికి వెళ్ళింది.
        
    అప్పుడు నా బుర్ర పాదరసంలా పనిచేసింది.
    
    సందేహం లేదు- సుమతి ఫ్రెండ్ నారాయణే అందుకు కుక్కే సాక్ష్యం.
    
    పగలు అతన్ని చూసి అరిచిన కుక్క రాత్రి అరవలేదు. అంతే కాకుండా బాగా అలవాటై పోయిన మనిషిలాగా ప్రేమనంతా కనబరుస్తోంది.
    
    అంటే నారాయణ రాత్రిపూట ఆ ఇంటికొస్తున్నాడన్న మాట.
    
    కేసు పట్టేశాను కనుక ఆనందంగా ఇంటికి వెళ్ళడానికి లేచాను. అలా నా రెండో కేసు పట్టుకున్నాను. కొత్త సంబంధం బయటపడకుండా వుండాలంటే మనం కలుసుకునే ఇంట్లో ఇలా కుక్కలు వున్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ కుక్కలున్న ఇల్లయితే చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది రెండో పాయింట్" రంగనాయకి నవ్వుతూ లిఖితవైపు చూసి చెప్పింది.
    
    అప్పుడు టైమ్ మధ్యాహ్నం రెండు గంటలైంది. ఆకాశం తన కంటే ఎక్కువ సైజువున్న చొక్కా వేసుకున్నట్టు మబ్బులు తప్ప మరేమీ కనిపించడం లేదు. వర్షం మరికాసేపట్లో వచ్చేస్తుందని గాలి చల్లగా వీస్తోంది. జితేంద్ర శనగతోటకు నీళ్ళు కడుతున్నాడు. సబిత క్యారియర్ తెచ్చి ఓ చెట్టు కింద పెట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS