Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 25

 

    "ఏమో అత్తా, కళ్ళు తిరిగితేనూ" అంది నీళ్ళు నములుతూ.
    
    "సరేలే చేంతాడు తీసుకో"
    
    సుమతి బిందెతో నీళ్ళు చేదుకుని వచ్చేసింది. అప్పట్నుంచి మనసు మనసులో లేదు. నెల తప్పితే ఏం చేయాలన్నది ప్రశ్న. అదే భయం గుండెల్లో కాపురం పెట్టేసినట్టుంది.
    
    సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తోంది.
    
    అయిదు గంటల ప్రాంతాన నారాయణ ఇంటికి రావడం కనిపెట్టింది.    

    ఏం కారణం చెప్పి నారాయణ ఇంటికి వెళ్ళాలా అని ఆలోచనలో పడింది.
    
    వంట ప్రారంభించింది. కూరలో వేయడానికి చిటికెడంత మిరప్పొడి వుంది. అది సరిపోతుంది కూరకి. కానీ దాన్ని పెరట్లో కిందపోసి వరండాలో విస్తర్లు కుట్టుకుంటున్న తల్లి దగ్గరికి వచ్చింది.
    
    "మిరప్పొడి అయిపోయింది. మరిప్పుడు కూర్లోకి ఏమెయ్యమంటావ్?" అని అడిగింది విసుగ్గా.
    
    "కొద్దిగా వున్నట్టుందే"
    
    "ఏం లేదు"
    
    "మరి ఆ ఎదురింటికన్నా వెళ్ళి బదులు అడిగి తీసుకో"
    
    "ఆ పిల్ల చేయి విదల్చడం లేదు ఏమడిగినా"
    
    "మరిక ఏం చేద్దాం? నారాయణ ఇంటికన్నా వెళ్ళు"
    
    ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న సుమతి ఠక్కున నారాయణ ఇంటికి బయల్దేరింది.
    
    నాగభూషణం వీధి అరుగుమీద కూర్చుని ఎద్దులకు ముక్కు తాళ్ళు పేనుకుంటున్నాడు.
    
    "ఈ గిన్నెడు మిరప్పొడి బదులు కావాలి" అని అడిగింది సుమతి.
    
    ఆయన ఆమె తెచ్చిన గిన్నె చిన్నదా పెద్దదా అని ఒకసారి పరిశీలించి "రేయ్! నారాయణ మిరప్పొడి బదులంట ఇవ్వు" అని అరిచాడు.
    
    సుమతి వెళ్ళి ద్వారం దగ్గిర నిలబడింది.
    
    తండ్రి అరవడంతో ద్వారం కేసి తిరిగిన నారాయణకి ఆమె కనపడింది. ఆమె రాకను అతడు ఊహించలేదు. అందుకే తడబడ్డాడు.
    
    ఏమైనా స్పెషల్ కారణం వుందా అని అడగాలని వున్నా తండ్రి వుండడం వల్ల ఆ ప్రయత్నం మానుకున్నాడు.
    
    నిశ్శబ్దంగా వెళ్ళి మిరప్పొడి డబ్బాను అందుకుని సుమతి దగ్గరకు వచ్చాడు.
    
    ఆమె అంతకంటే నిశ్శబ్దంగా మిరప్పొడి తీసుకుని అప్పటికే రెడీగా వుంచుకున్న చీటిని ఆ డబ్బాలో జార విడిచింది.
    
    "వస్తాను" అని నారాయణ కి కాకుండా నాగభూషణానికి చెప్పి వచ్చేసింది.
    
    నారాయణ లోపలికెళ్ళి ఆతృతతో చీటీ విప్పాడు.
    
    "నేను నెల తప్పాను" ఇది ఇంట్లో తెలిసిందంటే ఇక అంతే సంగతులు. కాబట్టి ఈ గండం నుంచి నన్ను కాపాడే మార్గం ఆలోచించు" అని అందులో వుంది.
    
    నారాయణ గుండెల్లో రాయి పడింది. బొత్తిగా అనుభవం లేని మనిషి ఏం చేయాలో పాలుపోక కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి.
    
    ఠక్కున డబ్బాను అక్కడ పడేసి, చీటీని చొక్కా జేబులో కుక్కుకుని బయటికి పరిగెత్తాడు.
    
    ఎక్కడెక్కడో తిరిగాడు గానీ ఎవర్నీ సలహా అడగలేకపోయాడు.
    
    తిరిగి ఇంటికి వచ్చాడు గానీ కంగారుతో కాలు నిలబడలేదు. సైకిల్ ఎక్కి టౌన్ కి వెళ్ళాడు. అతనికి తెలిసిన డాక్టర్ ఒకడున్నాడు. ఆయన దగ్గరకెళ్ళి విషయమంతా చెప్పాడు.
    
    "నిజంగా నెల తప్పుంటే అబార్షన్ తప్ప మరేదీ పనిచేయదు. ఇంకేమైనా కారణాల వల్ల సమస్య మొదలై వుంటే- ఇవిగో ఈ మాత్రలతో పని అయిపోతుంది" అంటూ మాత్రలిచ్చాడు.
    
    వాటిని తీసుకుని రథం మీద వచ్చినట్టు వచ్చాడు. ఆ రాత్రే నానా తంటాలూ పడి సుమతిని కలుసుకుని మాత్రలిచ్చాడు. అంతా చెప్పి "ఓ ముద్దు పెట్టరాదూ" అని అడిగాడు.
    
    "ఇలా నంగనాచి ముఖం పెట్టే నట్టేట ముంచావ్. వెళ్ళెళ్ళు" అంది ఆమె విసుగ్గా ముఖం పెట్టి.
    
    రెండోరోజు నుంచే ఆమె నీళ్ళ కోసం వీధిలోకి రాగానే సమస్య తీరిందా అన్నట్లు సైగ చేసేవాడు. ఆమె లేదన్నట్టు ముఖం అడ్డంగా తిప్పేది.
    
    వారం గడిచింది గానీ సమస్య తీరలేదు.
    
    దాంతో ఆమె పార్వతమ్మ దగ్గరికెళ్ళి తన గోడంతా చెప్పుకుంది.
    
    "ఇలాంటి వాటివల్ల లాభం లేదు. నాకు తెలిసిన లేడీ డాక్టరుంది పది నిముషాలు చాలు" అంది అంతా విన్నాక పార్వతమ్మ.
    
    "మరి మా ఇంట్లో పంపరే"
    
    "అదంతా నేను చూసుకుంటాను" అని హామీ ఇచ్చింది ఆమె.
    
    రెండోరోజు ఆమె కాంతమ్మ దగ్గరికెళ్ళి అవి ఇవీ మాట్లాడి "సుమతిని సాయంకాలం నాతో టౌన్ కి పంపాలి. స్టీలు బిందె కొనాలి. నాకేమో చూపు సరిగా ఆనదు. ఆయన్ని రమ్మంటే రాడాయే. నీకు తెలుసు గదా మీ ఆయనలాగే ఆయన ఎప్పుడూ ఆ కంప గట్ల కిందే కాలం వెళ్ళబుచ్చుతున్నాడు" అంది చివరగా.
    
    "అలానే- తీసుకెళ్ళు" అని పర్మిషన్ ఇచ్చింది కాంతమ్మ.
    
    ఆ విధంగా సుమతి సమస్య తీరింది. కానీ వెంటనే మరో సమస్య వచ్చి పడింది.
    
    ఓరోజు సుబ్బరామయ్య, రామచంద్రయ్య- అందరూ కలిసి పేకాడుకుంటున్నారు.
    
    పాయింట్ల కౌంటింగ్ దగ్గిర వాళ్ళిద్దరికీ పేచీ వచ్చింది.
    
    ఒకరికొకరు అరుచుకుంటున్నారు. ఆ కోపంలో రామచంద్రయ్య "కూతురు కడుపులు పోగొట్టుకుంటున్నా తెలియదు. అలాంటివాడివి- నేను పాయింట్లు తప్పు చెప్పానని మాత్రం తెలిసిందా" అనేశాడు.
    
    అంతే సుబ్బరామయ్య సీరియస్ గా అక్కన్నుంచి లేచి వచ్చేశాడు.
    
    నిజం ఏమిటో తెలుసుకోవాలని కోపంలో వచ్చేశాడు గానీ ఆమె కూడా తనకి తెలియదంది.
    
    డైరెక్టుగా కూతుర్ని అడగలేదు. భార్యని అడిగాడు గానీ ఆమె కూడా తనకి తెలియదంది.
    
    అదిగో ఆ రాత్రే నా దగ్గరకొచ్చాడు.
    
    "నా కూతురు ఎవర్తో తిరుగుతుందో కూపీ లాగి చెప్పాలి. ఫీజు కింద రెండు మూటలు ఒడ్లు ఇస్తాను" అని తేల్చి చెప్పాడు.
    
    సరేనన్నాడు.
    
    మరి ఆ కుర్రాడెవరో ఎలా తెలుసుకోవడం? నాలో టెన్షన్ మొదలయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS