Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 25


    
     'ఒంటరిగా వచ్చారే!' అన్నాడు.
     అతను పలకరిస్తాడని ఆమె అనుకోకపోవటం వల్ల కొంచెం తికమకపడి, వెంటనే తేరుకుని అందామె.
     'శారద లేదుగదండీ.'
    ఆమె సరళ సమాధానం వినగానే శ్రీధర్ తలకిందులయాడు. లోలోపల రుసరుసలాడాడు.  తన రహస్యం శారదకి చెప్పిందో లేదో అడగాలనుకున్నాడు. నోటిదాకా వచ్చింది. కాని సాహసించలేకపోయాడు. ఇంతలో చిత్రం ప్రారంభించారు. చిత్రం అంతా బాగాలేదు. శ్యామ ఉనికికూడా అతనికి  అశాంతి కలిగించ సాగింది.  కాసేపు కూర్చొని బయటికి వచ్చేశాడు. తిన్నగా హోటల్ కి వెళ్లి ఎంగిలిపడ్డాడు. ఇంటికి వెళ్లాలనిపించలేదు. కాళ్లు తీసుకువెళ్ళిన దారినే వెడుతున్నాడు.  దూరంలో రికార్డ్ల సంగీతం వినిపించసాగింది. దగ్గరకు వెళ్లిన కొద్దీ  ఆసంగీతం  వినవచ్చే స్థలంనించి దూరంగా వెళ్లమని అంతరంగం  ప్రబోధించసాగింది.
     అది అమ్మయూజ్ మెంట్ పార్కు.
     అయిష్టంగానే లోపలికి వెళ్లాడు శ్రీధర్.
     రకరకాల ఆటలు జనాన్ని ఆకర్షిస్తున్నాయి ఎందరెందరో తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. శ్రీధర్ కుతూహలంతో ఆ ఆటలు ఆడే తీరుని గమనించ సాగాడు. ఒకచోట  గోడకి ఒక చక్రం అమర్చబడి వుంది. ఆ చక్రాన్ని కొన్ని భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రంగు వేశారు. ఒక రంగు మీద పందెంకాసి, చక్రం తిరుగుతున్నప్పుడు అదే రంగుమీద బాణం వేస్తే పందెం కాసిన డబ్బుకి మూడురెట్లు లబిస్తుంది.  శ్రీధర్ కి ఇందులో కొంతనేర్పు వుందనిపించింది. ఆ ఆట ఆడి తన అదృష్టం పరీక్షించుకోవాలనే ఉత్సాహం కలిగింది. కాని లాటరీ వెయ్యటం అతని కెప్పుడూ అలవాటు లేదు. ఈ జంజాటంలో ఒక్కసారి చిక్కితే ఇక వదిలించుకోవటం కష్టమని భయపడ్డాడు. కాని పెల్లుబికి వస్తున్న ఉత్సాహాన్ని  అదుపులో పెట్టుకోలేక పోయాడు. చిన్నప్పుడెప్పుడో అలాటి అమ్యూజ్ మెంట్ పార్కులోకి వెళ్లాడతను. అందులో పాల్గొనాలనే కోరిక కలిగినా డబ్బు లేక ఆ కోర్కె  తీర్చుకోలేక పోయాడు. ఇప్పుడు తను స్వతంత్రుడు. బాధ్యత ఎరిగినవాడు. తన మనసుని అదుపులో పెట్టుకోగలిగినంత వరకు ఏంచేసినా పరవాలేదనుకున్నాడు శ్రీధర్. ఇక మరేమీ ఆలోచించకుండా జేబులోంచి డబ్బుతీసి  చూశాడు. ఇవరై రూపాయలున్నాయి. ఒక రంగు మీద  పందెం వేసి బాణంవేశాడు. ఓ! తను అదృష్ట వంతుడైనాడు గెలుపు తనదే. సునాయాసంగా పెట్టుబడికి మూడురెట్లు సంపాదించాడు.
     శ్రీధర్ సంతోషంతో పొంగిపోయాడు. మళ్లీపందెం కాసాడు. మళ్ళీ తనే గెలిచాడు. ఇన్నాళ్లనుంచీ ఆవైపు రానందుకు తనని నిందించుకొన్నాడు. శ్రీధర్. దేనికైనా సాహసించాలి. నెల పొడుగునా చాకిరీ చేస్తే గిట్టేకూలీ డబ్బులతో జీవిత సుఖాలేం అనుభవించ గలడు. కలిసి వస్తే ఇలాగే ఏలాటరీలోనో రావాలి.  మళ్లీ మళ్లీ పందెం  వేసాడు. అతని అదృష్ట మేమో కాని, అప్పుడప్పుడు ఓడినా మొత్తం మీద గెలుపే ఎక్కువసార్లు లభించింది. ఆట చాలించాడు.  మరొక ఆకర్షణ  వైపు నడుస్తూ సంపాదించిన డబ్బు లెక్కచూసుకోసాగాడు. అయిదు వందల మొత్తం లెక్క పెట్టేసరికి ఏకాగ్రతకి భంగం కలిగింది.
     "నమస్కారమండీ." అన్నాడు ఒక యువకుడు, శ్రీధర్ తలెత్తి అతని వైపుచూసి ఏం కావాలన్నట్టుగా తల ఎగర వేశాడు.
    నా పేరు శేఖరమండీ. బి. ఏ. ప్యాసైనాను.  ఒక ఉద్యోగం సందర్భంలో ఈ ఊరు వచ్చాను. ఇంటర్వ్యూ ఐ పోయింది. ఇక తిరిగి వెళ్లాలని స్టేషన్ కి టిక్కెట్టు కొనటానికి జేబులో చెయ్యి పెట్టేసరికి పర్స్ కనిపించలేదు. ఎవరో కొట్టేశారు. ...అన్నాడు యువకుడు.
     శ్రీధర్ అతన్ని నఖశిఖ పర్యంతం చూసాడు. అతన్ని నమ్మాలో, నమ్మకూడదో అతనికి తెలియలేదు. ఇంతలో ఆ యువకుడు చేతిలోని ఫైల్ తెరిచి డిగ్రీ సర్టిఫికెట్ చూపించి కొంచెం ప్రాధేయ పూర్వకంగా అడిగాడు.
     ఈ ఊరు నాకు కొత్త స్నేహితులెవరూ లేరుదయచేసి ఒకఇరవై రూపాయలిస్తే ఇంటికి వెళ్లగానే పంపిస్తాను. శ్రీధర్ ఆలోచనలో పడ్డాడు. అనుకోకుండా తనకి లభించిన అదృష్టంలో భాగం పెట్టటానికి అతని మనసొప్ప లేదు. ఎప్పుడూ లేని పీనాసితనం అతన్ని పట్టుకుంది. కాని ఇవ్వనని ఎలా చెప్పాలో అతనికి తెలియలేదు. అతని నిజాయితీ  శంకింప దగిందిగా రుజువుచేస్తే తనకా బెడద తప్పు తుందనుకున్నాడు.
     'సరే, ముందుపోలీస్ రిపోర్టు ఇద్దాంపదండి' అన్నాడు.
     'రిపోర్టు ఇచ్చే ఇలా వచ్చానండీ' అన్నాడు శేఖరం.
     శ్రీధర్ ముఖం చిట్లించుకుని టిక్కెట్టెంతవుతుంది? అన్నాడు. అతను వెంటనే 'పందొమ్మిది రూపాయల ఎనభై నయా పైసలండీ.' అన్నాడు.
     శ్రీధర్ కొంచెం ఆశ్చర్యంగా ధర్డ్ క్లాసేనా?అనడిగాడు.
    'సెకండ్ క్లాసండీ' అన్నాడు శేఖరం.
     శ్రీధర్ కి నవ్వు వచ్చింది. ఆ యువకుడు చెప్పింది వాస్తవమేననీ, అతనిలో లౌక్యం బొత్తిగా లేదనీ, వట్టి అమాయకుడని గ్రహించాడు. ఇక ఆలస్యం చెయ్యక వెంటనే అతనడిగిన డబ్బు ఇచ్చివేశాడు. శేఖరం కృతజ్ఞతా పూర్వకంగా నమస్కారం చేసి శ్రీధర్ అడ్రస్ కాగితంమీద రాసుకొని వెళ్లిపోయాడు.
     శ్రీధర్ గడియారం చూసుకొన్నాడు. ఎనిమిదిన్నర దాటింది. సరిగా ఎనిమిదిన్నరకి అమ్యూజ్ మెంట్ పార్కులో డాన్సుప్రోగ్రాం వుంది. ఫస్టుక్లాస్ టికెట్ కొనుక్కుని వెళ్లాడు. డాన్సు చాలా చవకబారుగావుంది. కూర్చోలేక పోయాడు. బయటికి వచ్చేశాడు. అతని వెనుకే మరోవ్యక్తి వచ్చి మాటలు  కలుపుతూ డాన్సు ఏమీ బాగా లేదుకందడీ? అన్నాడు. మర్యాద కోసం "అవునండీ' అన్నాడు శ్రీధర్ వ్యాఖ్యానం చెయ్యటం ఇష్టం లేకపోయినా. ఆ స్థలంలో అంత కంటె ఎక్కువ తరగతి నృత్యం ఆశించడంలో అర్దంలేదు.
    'తలనొప్పి వదిలేట్టులేదు. ఏమండీ, ఒక ఆటవేద్దాం వస్తారా? ఇక్కడే ఓ చిన్న క్లబ్బుంది. అన్నాడు ఆ వ్యక్తి. శ్రీధర్ కిష్టం లేకపోయినా అతను బలవంతం చెయ్యటంవల్ల అతనివెంట వెళ్లాడు.  ఆ క్లబ్ వాతావరణం శ్రీధర్ కి ఏమీ నచ్చలేదు. ఎవరో కొంతమంది పేకాట ఆడుతున్నారు. 'సోడాపుచ్చుకోండి' అన్నాడావ్యక్తి శ్రీధర్ ని ఉద్దేశించి అతనికి అర్దమైంది. మర్యాద  కోసమైనా చూడకుండా వెంటనే గిరుక్కున వెనక్కి తిరిగాడు. క్లబ్బు బయటికి రాగానే స్వేచ్చగా గాలి పీల్చివొదిలాడు. ఇంకానయం, తను వెంటనే మేల్కొన్నాడు.
    శ్రీధర్  తిరిగివస్తుంటే అతను మొదట పందెం వేసిన చోట జనం గుంపుగా కనిపించారు. ఒకసారి ఒక్కడికి వెళ్లితొంగి చూడాలని పించిందతనికి. అతన్ని చూడగానే ఆ ఆట నడిపే ఆసామీ 'రండి రండి బాబుగారూ, గెలిస్తే మీరేగెలవాలి' అని అహ్వానించాడు. శ్రీధర్  కి విసుగు పుట్టినా అతని ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాడు. అతనికి మరో అవకాశం ఇవ్వకుండా గెలిచిన డబ్బుతో తను వెళ్లిపోటం అన్యాయం అనికూడా అనుకున్నాడు. వాళ్లందరూ డబ్బు పోగొట్టుకుని తను గెలిస్తే అది తనకి గర్వం కారణమని భావించాడు. పందెం వేశాడు. మళ్లీ గెలిచాడు. ఉత్సాహంతో వున్న డబ్బంతా పందెం కాసాడు. గురి తప్పింది. అంతా పోయింది. శ్రీధర్ ముఖం పాలిపోయింది. క్షణంలో భాగ్యవంతుడై మరుక్షణంలో మామూలు పరిస్థితికి వచ్చాడు. తను అదృష్ట వంతుడనుకొన్నాడు కాని వట్టి దురదృష్ట వంతుడని తేలిపోయింది.
     చేసేదేమీలేక కాళ్లీడ్చు కుంటూశ్రీధర్ ఇంటి ముఖం పట్టాడు. నడమంత్రంగా వచ్చింది పోతే పోయింది కాని తనస్వంతం ఇరవై రూపాయలు కూడాపోయాయి.
     జరిగిందానికి పశ్చాత్తాపపడుతూ శ్రీధర్ ఇంటికి చేరుకునేసరికి గుమ్మందగ్గర ఒకవ్యక్తి కనిపించి  నమస్కారమండీ. అన్నాడు. స్పష్టమైన కాంతిలో అతని ముఖాన్ని పరకాయించి చూసి శ్రీధర్ ఆశ్చర్యపడ్డాడు. అతను శేఖరం.
    'మీరా?' అన్నాడు శ్రీధర్.
    'అవునండీ. స్టేషన్ కి వెళ్లేసరికి అనుకోకుండా నా ముఖ్య స్నేహితుడొకడు కనిపించాడు. అతను కూడా ఏదో ఇంటర్వ్యూకి వచ్చాడట.  అతని దగ్గర  డబ్బు తీసుకొన్నాడు. ట్రెయిన్ కి ఇంకా చాలా టైం వుంటే స్వయంగా మీ ఋణం తీర్చుకోవాలని ఇలా వచ్చాను. చాలా సహాయం చేసారండీ మీ మేలు మర్చిపోను' అని శేఖరం ఇరవై రూపాయలు శ్రీధర్ చేతిలో పెట్టాడు.
     ఆ మొత్తం అందుకుంటుంటే శ్రీధర్ మనసు ఏయే భావాలతో ఉక్కిరి బిక్కిరయిందోగాని. శేఖరంకి కృతజ్ఞత తెలియ చేయాలని కూడా అతనికి తోచలేదు.
                                     *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS