Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 25


    
    "అవునూ! భలే కనిపెట్టావే... ఓసారి నెల్లూరుకు  పెళ్ళికి వెళ్ళాం. అప్పుడేదో ఎగ్జిబిషన్  జరుగుతోంది. దాన్ని చూడడానికి వెళ్ళాం. అక్కడ ఫోటోలు తీస్తున్నారంటే అందరం దిగాం" కాఫీపొడి వేసొచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఫోటోలో ఎవరెవరు వున్నదీ చెబుతోంది.


    పెళ్ళయిన ఆడపిల్లలకి పట్టింటి సంగతులు మాట్లాడమంటే చాలా మక్కువ. అందుకే చాలా సేపటివరకు ఆకబుర్లకే పరిమితమైంది చింతామణి. పుట్టింట్లోని అమ్మానాన్నల్ని , ఆమె బంధువుల్ని, ఆమె స్నేహితురాళ్ళనీ అందరి గురించి అడిగి మరీ తెలుసుకుంది. అంతేగాకుండా పుట్టింట్లో ఆమెకు మరీమరీ  జ్ఞాపకం వచ్చే విషయల్నీ చెప్పించుకుంది.


     "ఎప్పుడైనా  టౌన్ కి  సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఎంత బావుడేదో ఫస్ట్ షోకి వెళ్ళాలంటే  మధ్యాహ్నంనుంచీ తయారుయ్యేవాళ్ళం. ప్రతి దాంట్లోనూ  నాకూ, మా సరళకీ పోటీ- సరళంటే మా చిన్నాన్న కూతురు.


    నేను ఏరకం చీరకొంటానో. అదీ అదేరకం చీర కొనేది.చివరికి చెప్పుల్లో కూడా మాకు పోటినే. అది వందరూపాయలది కొంటే నేను  నూటయాభైకి కొనేదాన్ని" ఇలా చెబుతూంటే చింతామణి ప్రతిమాటకీ రియాక్షన్ ఇస్తూ వింది.


    కాఫీలయ్యాక "అలా వరండాలో కూర్చుందాం రా. వచ్చేపొయ్యేవాళ్ళని చూడడం కాలక్షేపంగా వుంటుంది" అని పిలిచింది చింతామణి.


    అలానే తల ఆడించి పింగాణీ ప్లేట్ లో సన్నజాజుల్ని వేసుకుని కుట్టే సరంజామా తెచ్చుకుంది. శశిరేఖ. వరండాలో ఇద్దరూ చెరోవైపు కూర్చీమీద కూర్చున్నారు.


    చాలా రోజుల తరువాత పుట్టింటి సంగతులు మరో వ్యక్తికి చెప్పడం కాబోలు  మనసంతా ఏదో ఆనందంగానూ, ఉత్సాహంగానూ వుంది శశిరేఖకి.


    "ఇంకేమిటి విశేషాలు?" చింతామణి అడిగింది.


    "విశేషాలా! ఏముంటాయ్- అంతా మామూలే."


    "మీ ఆయన పని దగ్గర వున్నాడా?"  అని అడిగింది చింతామణి ఏమీ తెలియనట్టు.


    "లేదు- ఆయన అస్సాం వెళ్ళారు" అని ప్రారంభించింది ఏ పరిస్థితుల్లో వెళ్ళిందీ, తనను విడిచి ఎంత బాధగా వెళ్ళిందీ చెప్పుకొచ్చింది. చివరికి  ఇక్కణ్ణుంచి మా అమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కూడా అనుకున్నాం. కానీ నేనే వద్దనుకున్నాను. ఒంటరిగా వుండడం కూడా అలవాటు కావాలి కదా అందుకే గంగారత్నం తోడు వుంటుంది కాబట్టి మా ఆయన్ని ఒప్పించి ఇక్కడే వున్నాను"  అని మొత్తం  వివరంగా  చెప్పింది.


    "నీకు  ఠక్కున కోటిరూపాయలు వచ్చాయనుకో- ఏం చేస్తావ్?" మధ్యలో ఠక్కున సరదాగా అడుగుతున్నట్లు అడిగింది చింతామణి.


    "కోటిరూపాయలా- నాకా? ఏమీ చేయను- అంత డబ్బుతో ఏం చేయాలో నాకు తెలీదు. అయినా ఓ మనిషి బతకడానికి అంత డబ్బెందుకు?" ఆ ప్రశ్న విన్నప్పుడు ఆమె మామూలుగా వుండడాన్ని చింతామణి గుర్తించింది. ఆమె డబ్బు మనిషికాదని, డబ్బుమీద యావకూడా లేదని అర్థం చేసుకుంది.


     తిరగి మామూలు విషయాల్లో పడ్డారు.


     మరికొంత సేపయ్యాక "దేవుడు నీకు కనిపించి ఏదైనా వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావ్?" ఈ ప్రశ్న కూడా సరదాగానే  అడిగింది చింతామణి.


    ఇలాంటి సరదా ప్రశ్నలువేసి వాటి జవాబుల్తో అవతలి వ్యక్తి మనసు ఏమిటో ఆమె కనిపెట్టెయ్యగలదు.


     " మా ఇద్దరికీ ఓ చక్కటి బాబునివ్వమని" ఠక్కున చెప్పింది శశిరేఖ.


    ఆమెను పీడించే సమస్య ఏదైనా వుందంటే అదేనని అప్పటికి గ్రహించింది చింతామణి. ఈ జవాబుతో తను గెస్ చేసింది కరెక్టేనని తేలిపోయింది.ఆదంపతుల మధ్య ఆ సమస్యతప్ప మరేం లేదనీ గ్రహించింది.


    తిరిగి మామూలు విషయాల్ని చర్చించుకుంటున్నారు.


    కొద్ది కొద్దిగా చీకట్లు పడుతున్నాయి.


    చింతామణి సురేష్ వర్మ కోసం అటూ ఇటూ చూస్తోంది. అంత వరకూ అతను రాకపోవడాన్ని భరించలేకపోతోంది. కోపమొస్తోంది కోపమొస్తోందికానీ దాన్ని అణుచుకోవడం తప్ప చేసేదేంకూడా లేదు. మరి కొంతసేపైతే వీధిలో వెళ్ళే సురేష్ ను శశిరేఖ గుర్తించే అవకాశంలేదు. దాంతో ముందు వేసుకున్న ప్లాన్ పూర్తిగా విఫలమైపోతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS