Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 26


    "అమ్మకి మళ్ళీ గుండెల్లో నెప్పొచ్చింది. తట్టుకోలేకపోతోంది. నేను డాక్టర్ దగ్గరికి వెళుతున్నాను. నువ్వు వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళు...." అని చెప్పి నిమిషం కూడా వృధా చేయకుండా అతను వెళ్ళిపోయాడు.
    
    తమ్ముడూ, చెల్లెలూ అప్పటికే కారులో కూర్చుని వుత్సాహంగా ఆమెకోసం ఎదురుచూస్తున్నారు. మొదటిసారిగా కారెక్కిన సరదా వారి మొహాల్లో స్పష్టంగా కనపడిపోతోంది.
    
    ధృతికి చాలా విషమ పరీక్షగా అనిపించింది. కానీ సమయం లేదు. చప్పున కారు దగ్గరకెళ్ళి "ప్రేమ్! నవీన్ వాళ్ళమ్మకి సీరియస్ గా వుందట. నేను వెళ్ళాలి. మీరేమీ అనుకోకుండా వీళ్ళని తీసుకునివెళ్ళి వచ్చేయండి. ప్లీజ్...." అని అతను ఆ విషయం జీర్ణం చేసుకునేలోపే పరుగులాంటి నడకతో నవీన్ ఇంటివైపు సాగిపోయింది.
    
                                                              * * *
    
    దయామణి పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పెట్టారు.
    
    నవీన్ నుదురు చేత్తో రాసుకుంటూ బెంచీ మీద కూర్చున్నాడు.
    
    ధృతికి అతనికి దగ్గరగావెళ్ళి పలకరించాడానికి జంకుగా వుంది. మనకి అత్యంత ఆప్తులు బాధపడుతుంటే ఓదార్చడాన్ని మించిన బాధలేదు.
    
    డాక్టర్ నవీన్ దగ్గరకొచ్చి చిన్నగా ఏదో అనటం, తను తలూపడము కనిపించింది. డాక్టర్ వెళ్ళిపోగానే ధృతి గబగబా అటుకేసి అడుగులేసి "ఏమంటున్నారూ?" అనడిగింది.
    
    అతను జవాబు చెప్పలేదు. చేతిలో వున్న చీటీ గుప్పెటలో నలపసాగాడు.
        
    అప్పుడు స్ఫురించిందామెకి సమస్యేమిటో, సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది.
        
    తన అశక్తత ఆమె కనిపెట్టకూడదన్నట్లు అతను తల తిప్పుకున్నాడు.
    
    ఆమె ఆ చీటీ అతని చేతినుండి తీసుకుని బయటికి నడిచింది.
    
    ధృతికి జీతం వచ్చి వారమే అయింది. కానీ ఆమె దగ్గర ఏమీ వుంచుకోలేదు. మొత్తం కలిసి ఓ వంద రూపాయలు వుండవచ్చు. తండ్రి ఏవో చిన్న చిన్న బాకీలు తీర్చేశానని చెప్పాడు. ఏం చేయాలా? అనే ప్రశ్న ఆమె మెదడుని తొలిచేయసాగింది. కానీ ఏదో చేయాలి. ఎన్నోసార్లు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తనని ఆదుకున్న మనిషికి ఒకసారి తను సాయపడగలిగితే ఎంత బావుంటుందీ? ఆమె తన ఆలోచనలలోనే ఇంట్లో కాలుపెట్టింది. అక్కడి పరిస్థితులు పట్టించుకునే స్థితిలో ఆమెలేదు.
    
    "అయిందా సేవ?" కాస్త హేళనగా అడిగింది సుభద్ర.
    
    ఠక్కున తలెత్తి చూసింది ధృతి.
    
    ఆ కళ్ళల్లోని తీక్షణత భరించలేనట్లు సుభద్ర చూపులు తిప్పుకుంది.
    
    "అక్కా! నువ్వు రాలేదని ఆయన నిరుత్సాహపడ్డారు. ఏవీ చూడలేదు. త్వరగా వచ్చేశాము" చెప్పాడు రవి.
    
    ధృతి విసుగ్గా చూసింది. ఆమె మనసులో ఏం చేసి నవీన్ కి డబ్బు సమకూర్చాలా? అనే ప్రశ్న గింగురుమంటోంది. ధర్మానందరావుగారిని అడుగుదామంటే మరీ జీతంవచ్చి వారమే అయింది. అసహ్యంగా వుంటుందేమో?
    
    "అమ్మా! ఇంట్లో డబ్బు ఏమైనా వుందా?" అడిగింది తల్లిని.
    
    "ఏభయ్ రూపాయలున్నాయి. కూరలకని వుంచాను. నువ్విచ్చినవి ఇచ్చినట్లే పంచేశారందరికీ మీ నాన్న" కూతురు తనని లెక్కలడుగుతోందని భావించి చెప్పింది సుభద్ర.
    
    "అక్కా! నీకోసం ఇది కొన్నారు...." అంటూ ఓ బాక్స్ తెచ్చి అందించింది కృతి.
    
    అన్యమనస్కంగానే అందుకుని తెరిచింది ధృతి.
    
    అందులో మెరుస్తున్న గోల్డ్ చైన్ తో 'రోలెన్స్ వాచ్' స్లిప్ లో 'ఫ్రం ప్రేమ్' అని వ్రాసి వుంది.
    
    ఆమె కళ్ళు పెద్దగాచేసి తన చేతిలో వున్న వాచీని చూసింది. ఆ వాచీలో ఆమెకి నవీన్ కనిపించాడు.
    
    "అవసరం మనది ఆ షావుకారిది కాదు. అందుకే అమ్మేశాను" అంటూ ఎంత తేలిగ్గా అన్నాడూ! ఆలోచిస్తూ కూర్చోవడానికి వ్యవధి లేదు.
    
    ఆ వాచీని పట్టుకుని వెళ్ళిపోతున్న కూతుర్ని "ఎక్కడికి?" అని అడిగే ధైర్యంలేక చూస్తుండిపోయింది సుభద్ర.
    
    ఒక సమస్య పరిష్కరించుకుంటూ వుంటే మరో సమస్య ఉత్పన్నమవ్వచ్చు. ఫరవాలేదు! తప్పకుండా పరిష్కారం వుండే వుంటుంది.
    
    "ప్రమాదం గడిచింది. ఇంకా ఫర్వాలేదన్నారు డాక్టర్. నువ్వింటికి వెళ్ళి స్నానంచేసి, భోంచేసిరా!" అంది ధృతి నవీన్ తో.
    
    నవీన్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా "ధృతి! డబ్బెక్కడిదీ?" అనడిగాడు.
    
    ఆమె నవ్వి "దానం నీరులాగా నిత్యం ప్రవహిస్తూ వుండాలి. ఒకే చోట వుంటే కంపొస్తుంది. అందుకే అప్పుడప్పుడూ తమాషాగా పారుతూ మన చేతుల్లోకి వస్తుంది. అవసరమైనప్పుడు తిరస్కరించకుండా వాడేసుకోవాలి" అంది.
    
    "అప్పు చేశావా?" సీరియస్ గా అడిగాడు.
    
    "అలాంటిదే."
    
    "అప్పు ఒకసారి జీవితంలోకి ప్రవేశిస్తే తిష్ట వేసుకుని కూర్చునే అతిథి. అసలు యజమానికన్నా అప్పులవాడికే ఎక్కువ భయపడాలి. ఎందుకంటే, యజమానికి మన శరీరంమీదనే హక్కు, కానీ అప్పిచ్చినవాడికి మన గౌరవం మీద కూడా హక్కుంటుంది" అన్నాడు.
    
    ఆమె మోహంలో నవ్వు యిగిరిపోయింది.
                
                                                               * * *
    
    మరునాడు ప్రేమ్ కనిపించగానే ఆమెకి అతనితో వాచీ సంగతి ఎలా ప్రస్తావించాలో అర్ధంకాలేదు. అలాగనిచెప్పి దాచటం యిష్టంలేకపోయింది.
    
    "నిన్న మీరు నన్ను డిసప్పాయింట్ చేశారు" అన్నాడు ప్రేమ్ బుంగమూతి పెట్టి.
    
    ఆ నిమిషంలో అతను ఆమె కళ్ళకి చాలా చిన్నపిల్లవాడిలా కనిపించాడు. "సారీ! ఏం చేయనూ? నవీన్ తల్లికి చాలా ప్రమాదంగా వుంటేనూ...." అంది. అతను మౌనంగా అయిపోయాడు. ధృతి నెమ్మదిగా "ప్రేమ్! నేను మీకు చాలా కృతజ్ఞురాలినయిపోయాను" అంది.
    
    అతను ఓ నిమిషంపాటు మెరిసే కళ్ళతో ఆమె వైపు చూశాడు. ఆ తరువాత ఏదో అర్ధమయినట్లు అతని పెదవులమీదకి చిరునవ్వు చేరింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS