Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 25


    "మా తమ్ముడూ, చెల్లెలూ చదువులు పూర్తిచేసి ఒక దారిన పడే వరకూ నా వివాహ ప్రసక్తేలేదని వాళ్ళకి తెలుసులెండి" ఘాటుగా చెప్పేసింది.
    
    అతను మాట తప్పించి కాసేపు ఏవో మాట్లాడి వెళ్ళిపోయాడు.
    
                                                                 * * *
    
    ఆదివారం ఇంటికి వెళ్ళగానే తల్లి ఎదురొచ్చి అడిగింది - "ప్రేమ్ బాగున్నాడటే?" అని.
    
    ధృతి చిరాగ్గా చూసి "ఒక్క వారంలోనే ఏమౌతాడూ?" అంది.
    
    "పాపం! చాలా సహాయం చేశాడు. అతనేగాని లేకుంటే ఏమయ్యేదో అసలు" అంది సుభద్ర.
    
    "ఏమయ్యేదీ...... స్పెషల్ రూమ్ వుండేదికాదు. నర్సు బదులు నీవె దగ్గరుండి సేవలు చేయాల్సివచ్చేది అంతేగా! అదే యాక్సిడెంట్ అయిన మరుక్షణం హాస్పిటల్ లో చేర్పించి, మందులూ అవీ కొని, సహాయం చేసిన నవీన్ లేకపోతే ఏమయ్యేదో ఒక్కక్షణం ఆలోచించుకో" అని అనాలనిపించింది కానీ పైకి అన్నా లాభంలేదు. ఆమె అర్ధంచేసుకోలేదు. స్థాయీ భేదం అని వూరుకుంది.
    
    సీతారామయ్య గదిలో పడుకుని అంతా వింటూనే వున్నాడులా వుంది. ఆయన కూడా వంతపాడుతూ, "ఆ అబ్బాయి రుణం తీర్చుకోలేమే. చాలా సహాయం చేశాడు" అన్నాడు.
    
    'అంత తీర్చుకోలేమని తెలిసీ ఋణపడిపోవడం ఎందుకో? మధ్య తరగతి మనస్తత్వం......రుణం దొరికితే చాలు పడిపోవడమే' అనుకుంది ఆమె కసిగా.
    
    "రవిని అదేదో ఇన్ స్టిట్యూట్ లో చేర్పిస్తే కోచింగ్ బాగా యిస్తారుట. నేను చూస్తానులెండి, వాళ్ళు నాకు తెలిసినవాళ్ళే అన్నాడు ప్రేమ్. ఆ సంగతి ఏమైనా చెప్పాడుటే?" అడిగింది సుభద్ర.
    
    "ఓహో! నాకు తెలియకుండా చాలానే జరుగుతున్నాయే?" ధృతి తీవ్రంగా అడిగింది.
    
    సుభద్ర కాస్త తత్తరపాటుతో "ఏదో మాటవరసకి నేనంటేనూ" అంది.
    
    "మాటవరసకి కాదు! వరసగా మాటల్లో మన ఇంటి పరిస్థితులన్నీ ఏకరువు పెట్టేసే వుంటావు. వినేవారుంటే చాలు చెప్పుకోడానికి నీకు ఎక్కడలేని సంగతులూ వస్తాయి" గొంతు హెచ్చించి అరిచింది ధృతి.
    
    "ఏదో పెద్దదాన్ని అన్నానే అనుకో, ఇంతలా నా మీద నోరుచేసుకోవాలంటే? ఆ ఎదురింటి రామారావుగారి ఆబ్బాయి కోచింగ్ తీసుకుని, ఇంజనీరింగ్ లో సీటు సంపాదించాడని విని కనుక్కోమన్నాను" అంటూ సాగదీసింది.
    
    ధృతి గట్టిగా "అదే ఎందుకు? నిన్నగాక మొన్న పరిచయమయిన తను అంత ఆప్తుడయిపోయాడా? పరిచయమంతగా లేనివాళ్ళతో రహస్యాలు పంచుకుని, ఆప్తులయిపోయామని భ్రమపడితే తప్పు మన గురించి వాళ్ళు తేలిగ్గా అనుకోవడానికి అవకాశం ఇవ్వటం మాత్రమే అలా చెప్పడంవల్ల ఒరిగేది" అంది.
    
    సుభద్ర వెంటనే ముఖం నల్లగా చేసుకొని, "నువ్వు మాత్రం ఆ నవీన్ కి ఇంట్లో జరిగే ప్రతి విషయం చెప్పవూ? సాయం చేస్తున్నాడనేగదా! అలాగే ఈ అబ్బాయీ సాయంగా వున్నాడుగదాని అన్నానమ్మా! ఇంత తప్పని నాకు తెలియలేదు" నిష్టూరంగా అంది.
    
    ధృతి సహించలేనట్లు "నవీన్ తో ఎవరినీ పోల్చకమ్మా" అంది.
    
    "ఏం అంత గొప్పవాడా?" ఆవిడ కూడా గొంతు పెంచింది.
    
    "గుణానికి మనకంటే ఎక్కువవారితోనూ, ధనానికి మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకోవాలి. ఏ విధంగా చూసినా నవీన్ కంటే మనం తక్కువే" అని చెప్పి ఇంకక్కడ నిలబడలేనట్లు లోపలికి వెళ్ళిపోయిందామె.
    
    ఆ రోజంతా ఇంటికి ఎందుకు వచ్చానా అన్నంత చిరాగ్గా గడిచింది ధృతికి రవి, కృతీకూడా ప్రేమ్ గురించి ప్రస్తావించి అతడిని పొగడటం ఆమెకి వింతనిపించింది. పేదవాడు చాలా కష్టపడి, తన శక్తికి మించిన సహాయం చేసినా దొరకని గుర్తింపు, గొప్పవాళ్ళు చేసే చిన్న చర్యలకి దొరుకుతుంది. వాటిని తలుచుకుని మురిసిపోతుంటారు.
    
    సాయంత్రం ప్రేమ్ వచ్చాడు. అతని రాక ఎవరికీ ఆశ్చర్యంగా అనిపించాలేదు. వస్తూనే అందర్నీ చాలా హడావుడి చేసేశాడు. "రవీ....కృతీ! క్విక్ గా తయారవ్వండి. మనమంతా ఎగ్జిబిషన్ వెళుతున్నాం....." అన్నాడు.
    
    వాళ్ళు ధృతికేసి చూశారు.
    
    ఆమె కనుబొమలు ముడిపడ్డాయి.
    
    "వాట్ మేడమ్? మీకు ఆహ్వానం సరిపోలేదా?" నవ్వుతూ అడిగాడు ప్రేమ్.
    
    "నాకు పెద్దగా ఇంట్రెస్టు లేదు. ఏం కొనుక్కోవాలని? చేతినిండా డబ్బువుంటే ప్రతి సెంటర్లోనూ యీ షాపులన్నీ వుంటాయి...." అంది విసుగ్గా.
    
    "నేను అడిగినందుకయినా రావొచ్చుగా....?" అన్నాడు. అందులో అర్దింపులేదు.
    
    కూతురు అంతగా బతిమాలించుకోవడం సుభద్రకీ, సీతారామయ్యకీ నచ్చలేదు. కానీ ఏం చెప్పడానికీ వాళ్ళకి ధైర్యం చాలలేదు.
    
    "పోనీ అక్కా వెళ్ళొద్దాం" అంది గునుస్తూ కృతి.
    
    రవికి కూడా వెళ్ళాలనే వున్నట్లు అక్కవైపు ఆశగా చూశాడు.
    
    వలల్కోసమే కదా తను ఇన్నిపాట్లు పడ్తూంట! వాళ్ళ ముఖాల్లో సంతోషం, ఆనందం చూడాలనే కదా తన తాపత్రయం! అది చేతులారా ఎలా పాడుచెయ్యడం? ప్రేమా, పాశం అనే బంధాలే ఏర్పరచుకోలేనివారు హాయిగా, స్వేచ్చగా కాలం గడపగలరు.
    
    "పోనీ పిల్లలు ముచ్చటపడుతున్నారు కదమ్మా...." అన్నాడు సీతారామయ్యగారు ధైర్యంచేసి.
    
    "నాన్నగారు కూడా అడుగుతున్నారు ఇంక కాదనకూడదు....." అన్నాడు ప్రేమ్.
    
    ధృతి తప్పేటట్లు లేదని లోపలికెళ్ళి చీర మార్చుకుని వచ్చింది.
    
    రవి, కృతి కూడా ఉత్సాహంగా తయారయ్యారు.
    
    బైట కారులో కూర్చుని వెయిట్ చేయసాగాడు ప్రేమ్.
    
    "వెళ్ళొస్తానమ్మా" అని చెప్పి ధృతి మెట్లు దిగుతుండగా నవీన్ ఎదురొచ్చాడు సైకిల్ మీద.
    
    అతను చాలా గాభరాపడుతున్నట్లు అతని ముఖం చూడగానే తెలిసి పోయిందామెకి.
    
    "ఏమిటీ?" అడిగింది ఎదురెళ్ళి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS