Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 27


    
    "బావుందా?" అడిగాడు చూపులతో ఆమె ముంజేతిని వెదుకుతూ.
    
    "బాగా వుపయోగపడింది" చెప్పింది.
    
    "టైమందరికీ వుపయోగమే"
    
    "కానీ అది సరిగ్గా టైంకి వుపయోగపడింది."
    
    అర్ధంకానట్లు చూశాడు.
    
    "మీరు ఇచ్చిన కానుక ఒక ప్రాణాన్ని కాపాడింది."
    
    "అంటే?"
    
    "ప్రేమ్! మీరు కొన్న వాచీ అమ్మేయాల్సొచ్చింది."
    
    "ధృతీ!" అతను ఎర్రబడిన మొహంతో గట్టిగా అన్నాడు.
    
    ఆమె ఈ పరిస్థితి ముందే వూహించడం వలన పెద్దగా కంగారుపడలేదు. "మీకు కోపం రావడం సహజమే! కానీ ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం గత్యంతరం లేకపోయింది. నవీన్ వాళ్ళమ్మగారికి చాలా ప్రమాదం ముంచుకొస్తే...."
    
    "శెభాష్! నీ స్నేహం యొక్క గొప్పతనం నిరూపించుకోవడానికి నా స్నేహం అమ్మేశావన్నమాట."
    
    "అపార్ధం చేసుకోవద్దు! నేను ఆ పని చేయడం వలన మన స్నేహం మరింత గట్టిపడిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సమయంలో నా మనసులో ఒక మనిషి ప్రాణం ఎలా కాపాడాలా అనే తపన తప్ప మరో ఆలోచన లేదు కాబట్టి మీరు అర్ధం చేసుకుంటే మాత్రం సంతోషిస్తాను."
    
    ప్రేమ్ కాస్త మెత్తబడి "ఇట్సాల్ రైట్" అన్నాడు.
    
    "థాంక్యూ!" మనస్ఫూర్తిగా చెప్పిందామె.
    
    అతను అక్కడనుండి ఏదో పని ఉన్నట్లుగా లేచి వెళ్ళిపోయాడు.
    
    ధృతికి నవీన్ గుర్తొచ్చాడు. ప్రేమ్ ఇచ్చిన వాచీ తను అమ్మేసిందని తెలిస్తే ఏం అనేవాడో! ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచించే విశ్లేషిస్తాడు. సహాయాలు చేసే స్నేహితులున్నవాళ్ళు అదృష్టవంతులు! అసలు సహాయాలు పొందే అవసరమే లేనివాళ్ళు మరీ అదృష్టవంతులు అంటాడేమో! నిజమైన స్నేహం దుఃఖాన్ని భాగిస్తుంది. ఆనందాన్ని హెచ్చిస్తుందీ....అని ఎక్కడో చదివిన గుర్తు. నవీన్ తో తన స్నేహం....చాలా గాఢమైనది. లేకపోతే అసలు ప్రేమ్ ఇచ్చిన బహుమతి తను తీసుకునేదే కాదు. ఇష్టమైనవాళ్ళ కోసం ఏదైనా, ఎలాగైనా చెయ్యాలని అనిపించడమేగా ప్రేమంటే! ఆమెకి లీలతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. ప్రేమిస్తే వాళ్ళకోసం ఏదైనా చెయ్యడానికి సిద్దంఅయిపోడమేనా?" అన్న ప్రశ్నకి జవాబు దొరికినట్లయింది.
    
                                                             * * *
    
    ధృతి ఆ రోజు ఉదయమే లేచి త్వరత్వరగా పనులు ప్రారంభించింది. ఆ రోజు కనీసం ఓ గంట ముందు బయల్దేరి నవీన్ ని కలిసి అక్కడి నుండి ఆఫీసుకి వెళ్ళాలని ఆమె ఆలోచన. ఆ రోజతడి పుట్టినరోజు. నవీన్ కి యిష్టమని దయామణి ఎప్పుడూ మైసూర్ పాక్ చేస్తుంది. 'ఆంటీ ఈసారి బహుశా చేసి వుండదు. ఒంట్లో బాలేదుగా' అన్న వూహ రావడం ఆలస్యం, మైసూర్ పాక్ చెయ్యడం మొదలెట్టింది.
    
    ప్లేట్లో పాకంపోసి ముక్కలు కోస్తుండగా తలుపు చప్పుడైంది. అదలాగే వదిలి బయటికి వెళ్ళి చూసింది. సుబ్బరాజు నిలబడి వున్నాడు.
    
    "మిమ్మల్ని అయ్యగారు వెంటనే రమ్మన్నారండీ!" అన్నాడు.
    
    "అలాగే! పద" అంటూ లోపలికొచ్చింది. మిగతా పని పూర్తిచేసి ముక్కలు టిఫిన్ బాక్స్ లో సర్దుతుండగా నాలుగు ముక్కలు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాలన్న ఆలోచన కలిగింది. వెంటనే చిన్న గిన్నెలో నాలుగు ముక్కలు పెట్టుకొని ధర్మానందరావుగారింటికి బయల్దేరిందామె.
    
    హాల్లో కూర్చుని పేపరు చదువుకుంటున్న ఆయనా రోజు చాలా హుషారుగా, ఉత్సాహంగా కనిపించారు. తలంటు పోసుకున్నట్లున్నారు. తెల్లని జుట్టు పట్టుకుచ్చులా గాలికి ఎగురుతోంది. తెల్లని లాల్చీ ధోవతీలో ప్రశాంతంగా, హుందాగా వున్నారు.
    
    "హల్లో.....గుడ్ మార్నింగ్!" అన్నాడు నవ్వుతూ.
    
    "గుడ్ మార్నింగ్ సర్" అంటూ ధృతి తనతో తెచ్చిన స్వీట్ ఆయనముందు పెట్టింది.
    
    "ఇంత పొద్దుటే స్వీట్ తెచ్చావు. ఏమిటి విశేషం?" అన్నారు తీసుకుని నోట్లో వేసుకుంటూ.
    
    "ఈరోజు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు" అంది.
    
    ఆయన వింటున్నవాడల్లా ఆగిపోయి ధృతివైపు ఆశ్చర్యంగా చూశాడు. అంతలోనే సర్దుకుని "అతనూ లేక ఆమే చాలా అదృష్టవంతులు. వారిమీద అభిమానమంతా రంగరించి చేసినట్లున్నావు. చాలాబావుంది" అన్నారు.
    
    సుబ్బరాజు కాఫీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. కాఫీ తాగగానే తనకి ఓ గంట పర్మిషన్ కావాలని అడుగుదామనుకుందామె.
    
    ఇంతలో "ధృతీ! నువ్వు నాతో ఇవాళ ఒకచోటికి రావాలి.....పది నిమిషాల్లో బయల్దేరుదాం" అన్నారు. ధృతి నోరు తెరిచి ఏదో చెప్పబోయే లోగా...."సరిగ్గా పది నిమిషాల్లో! ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదు" అన్నారు.
    
    ఇంక ఏం చెప్పడానికీ ధైర్యంలేక తలాడించి వెనుతిరిగి వచ్చేసింది. కొంతమంది స్వరంలో అధికారపూరితమైన ఆప్యాయత ఎల్లప్పుడూ ధ్వనిస్తూ వుంటుంది. ఆ స్వరానికి ఎదురుచెప్పలేకపోవడం అశక్తత వల్ల కాదు. ఆయనని అంతరాంతరాల్లో
గౌరవించబట్టే ఆ నిమిషంలో ఎదురు చెప్పలేకపోయింది. నిరంతరం కష్టపడుతూ ప్రతి పనీ క్రమబద్దంగా చేస్తూ తప్పుచేసినవాళ్ళని దండిస్తూ అవసరమైనప్పుడు వారి బాగోగులు మృదువుగా అడిగి తెలుసుకుంటూ తనదంటూ ఒక ప్రత్యేకత నిలబెట్టుకున్నారాయన ఆమె దృష్టిలో.
    
    ధృతి వచ్చేసరికి ఆయన తోటలో నిలోబడి మాలిచేత గులాబీలు కోయించి బుట్టలో వేయిస్తున్నారు. ఆమె పసుపురంగు నేత చీరలో రావడము చూసి ఓ పసుపు గులాబీ తీసి అందించారు.    

    ఆమె అందుకుని "థాంక్స్" చెప్పి తలలో పెట్టుకుంది.
    
    "ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు" అన్నారు నవ్వుతూ.
    
    ధృతి నవ్వేసింది. ఆమెకి ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తొచ్చాయి.
    
    "ఏభై ఏళ్ళంటే యవ్వనానికి ముసలివయసూ, ముసలితనానికి పడుచువయసూ" అని.
    
    కారు ఒక విశాలమైన ఆవరణలోకి ప్రవేశించింది. తన ఆలోచనలలో తనుండి ఆమె ఎంత దూరం వచ్చిందో, ఎక్కడకు వచ్చిందో గమనించలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS