Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 25


    "ఏమిటా ఆలోచనా?" మొహం ముందు చిటికలేస్తూ అడిగింది అనసూయ.
    
    "ఎంత అందమయిన స్త్రీ అయినా, ఎంతటి ప్రతిభ కలిగిన మనిషి అయినా వివాహం అవగానే భర్త అనే వ్యక్తి చేతిలోని మంత్రదండం ఎటు తిప్పితే అటు ఒంగాల్సిందేనా? మూడుముళ్ళతో అన్నేళ్ళ జీవితాన్ని పూడ్చిపెట్టి కొత్తజన్మ ఎత్తాల్సిందేనా?" బాధగా అన్నాను.
    
    అనసూయ నావైపు కొత్తగా చూస్తూ - "సుమతీ! ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ మాటలు వింటూవుంటే చాలా లోతుగా అనిపిస్తాయి" అంది.
    
    "ఔను నిండా మునిగాక లోతుగాక ఏమిటీ?" అన్నాను.
    
    "నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఆర్ యూ హేపీ?" అడిగింది.
    
    నాకు నవ్వొచ్చింది. "అలా అడిగి సస్పెన్స్ తీస్తే ఎనభై శాతంమంది 'నో' అనే చెప్తారు" అన్నాను.
    
    "నే అడిగేది నీ సంగతి" గట్టిగా అంది అనసూయ.    

    ఏమున్నది చెప్పుకోడానికి? నవ్వేసి వూరుకున్నాను.
    
    "అహల్య పాడకపోయినా ఫరవాలేదు. భర్త కోటీశ్వరుడు. నువ్వు ఈ ఉద్యోగం చేయకపోయినా ఫరవాలేదు. మీ మామగారికి బోలెడు ఆస్తి వుంది. కానీ నాకు అలాకాదు- ఈ ఉద్యోగం పోతే బాబుకి పాలు కూడా కరువే!" బాధగా అంది అనసూయ.
    
    ఆమె దృష్టిలో ఆర్ధికబలం ఒక్కటే మనిషి బ్రతకడానికి ముఖ్యం. మిగతావి పెద్ద లెక్కకాదు. కానీ ఆ డబ్బు వచ్చాకా మిగతా వేలితిలు ఎంతటి నైరాశ్యాన్ని నింపుతాయో తెలుస్తుంది.
    
    నాకైతే రాను రాను ఈ ఆడంబరాలూ, అలంకరణలూ మానేసి ఓ కాషాయం కట్టుకు తిరగాలనిపిస్తోంది. జ్ఞానం పెరిగితే మనిషి వైరాగ్యంలో పడతాడు. కష్టానికి అంతులేకపోతే మనిషి నైరాశ్యంలో పడతాడు. జ్ఞానం చాలా పెద్ద కష్టం.
    
                                                              * * *
    
    "అదంతా నీ అజ్ఞానం! మొగుడితో స్త్రీ జీవితం మొదలవలేదు. మొగుడితో సమాప్తం అవడానికి" అంటూ నా మాటల్ని కొట్టిపారేసింది మాధవి.    
    తలంటి పోసుకున్న దాని జుట్టుని పాయలుగా విడదీసి చిక్కుతీస్తూ "ఎన్ని కష్టాలు పడినా అనసూయ భర్తని వదలలేదు. అహల్య ఎంతటి పేరు ప్రఖ్యాతులు గడించినా భర్తని ఎదిరించి కెరీర్ బిల్డ్ చేసుకోలేదు. ఎందుకనీ?" అన్నాను.
    
    "దే ఆర్ పారసైట్స్! ఏదో రోజులు హాయిగా నీడపట్టున గడిచిపోతున్నాయి కదా అని నత్తగుల్లల్లా బ్రతికే పరాధారతత్వం., బలమైన వ్యక్తిత్వం వున్న స్త్రీ అలా పడుండదు" ఆవేశంగా అంది.
    
    అదెప్పుడూ అంతే! జాలి పడాల్సినచోటల్లా ఆవేశపడుతుంటుంది.
    
    "నువ్వే ఓ నిమిషం ఆలోచించుకో గురుమూర్తిలా ఏ.సీ.కారులో తిప్పేవాడు దొరకకపోతే అనసూయ ఎక్కడో ఇంకోచోట వంటలైనా చేసుకుని నీతిగా బ్రతికేదిగా కానీ ఈ దారిలో ఆమెకి సుఖం వుంది. మేచింగ్ నగలూ, చీరలూ అన్నీ అమిరిపోతున్నాయి. ఆత్మవంచన చేసుకోగలిగితే సుఖంగా బ్రతికేయవచ్చు. మనిషికి వ్యక్తిత్వం వుంటేనే పెద్దకష్టం" అంది.
    
    "మరి అహల్య కూడా అంతేనంటావా? ఆమెకి పాపులారిటి క్రైసిస్ లేదా? నగలూ, చీరలూ, లగ్జరీస్ చాలా?" అన్నాను.
    
    "ఏ స్త్రీకైనా కష్టపడకుండా కూర్చోబెట్టి పెట్టేవాడుంటే చాలనిపిస్తుంది. ఎటొచ్చి వీళ్ళని కాస్త కదిపితే మాత్రం తమలోని సృజనాత్మకతని చంపేస్తారనీ, తమ నిరాసక్తతకి అదే కారణమనీ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు" కోపంగా అంది.
    
    దానికోసం చూస్తుంటే నాకు నవ్వొచ్చింది. రేపు పెళ్ళయితే ఇదేం చేస్తుందో?
    
    "మధూ....ఇలా నీ దగ్గర వుండడం నాకింకా ఆశ్చర్యంగా వుంది తెలుసా? ఆనంద్ కిగానీ, అత్తయ్యా, మావయ్యకీగాని చెప్పకుండా నిన్ను చూడాలనిపించగానే బయల్దేరి వచ్చేశాను" అన్నాను.
    
    "ఎదుగుతున్నావన్నమాట" తృప్తిగా అంది.
    
    "కలెక్టర్ అయితే తప్ప పెళ్ళి చేసుకోవన్నమాట" అన్నాను.
    
    చిరాగ్గా కనుబొమలు చిట్లించకుండా చిన్నగా నవ్వింది.
    
    "ఇట్స్ ఎ గుడ్ సింప్టమ్ ప్రేమలోపడ్డావా?" చిన్నగా చెంపమీద దువ్వెనతో కొట్టి అడిగాను.
    
    "ప్రేమలాంటి పెద్ద మాటలెందుకుగానీ...ఒక వ్యక్తి నన్ను చాలా బలంగా ఆకర్షిస్తున్నాడు" అంది.
    
    "ఎవరే?" కుతూహలంగా అడిగాను.
    
    "ప్రదీప్" అంది.
    
    నాకు నిద్రపట్టడంలేదు. పక్కనే పడుకున్న మాధవి ఆదమరిచి నిద్రపోతోంది. దాని మొహంలో ప్రశాంతత చూస్తూంటే నాకు ప్రదీప్ తెలుసని చెప్పకపోవటం మంచిదేనేమో అనిపిస్తోంది. కానీ అది నా బహిప్రాణం. దాని దగ్గర ఇది దాచిపెట్టాల్సిన విషయమా? ఊరూ....చేసే పనీ అన్నీ అడిగి ఆ ప్రదీప్ ఈ ప్రదీప్ ఒక్కడేనని కన్ ఫర్మ్ చేసుకున్నాను.
    
    నెమ్మదిగా లేచి తలుపు తీసుకుని ఆరుబయటకొచ్చాను.
    
    ప్రదీప్ గుర్తొచ్చాడు. ఎంత సమ్మోహనమైన రూపం....ఆకర్షణీయమైన నవ్వు....మనసులో వున్నది వున్నట్టుగా చెప్పగలిగిన వ్యక్తిత్వం....మాధవి అతన్ని ఎలా భరిస్తుంది? అతను ఒకే స్త్రీకి సొంతం అయ్యే వ్యక్తికాదు. నిరంతరం ప్రేమికుడూ, నిత్యాన్వేషి.
    
    అసలు మాధవికి ఎలా పరిచయమయ్యాడో?
    
                                                                 * * *
    
    "అదంతా చాలా విచిత్రంగా జరిగిందిలే" నవ్వుతూ అంది మాధవి.
    
    నాకు వెంటనే ప్రదీప్ మొదటిసారి నన్ను కలిసి మాట్లాడినప్పుడు నేను పొందిన అలజడి గుర్తొచ్చింది. హీ ఈజే మాగ్నెట్!
    
    మాధవి చెప్తోంది. "నీలిమ మేరేజ్ వాళ్ళ పల్లెటూరులో జరిగిందిగా....ఇతనప్పుడు బస్ లో నా పక్క సీట్లో ప్రయాణం చేస్తున్నాడు. చేతిలో డెబొనేర్ మేగజైన్ వుంది. అది చూస్తూ మధ్య మధ్యలో నవ్వుకుంటున్నాడు. ఆ పరిస్థితి ఎంత ఆక్వర్డ్ గా వుంటుందో వూహించుకో. కాస్త తల పక్కకి తిప్పినా ఆ బొమ్మలు కనిపించి ఇబ్బందిగా వుంది నాకు. ఆ న్యూడ్ ఫోటోలకేసి అతను తదేకంగా చూడడం గమనిస్తే నాకు ఒళ్ళుమండిపోతోంది. అసలు నన్నే బట్టలు విప్పి నిలబెట్టినట్లు రోతగా అనిపించింది.
        
    "లుక్ మిస్టర్....నలుగురిలో వున్నప్పుడు చూడాల్సిన మేగజైన్ కాదిది. లోపల పెట్టేస్తే మంచిది" వీలైనంత పొలైట్ గా చెప్పాను.
    
    అతను తలతిప్పి ఆశ్చర్యంగా చూస్తూ "ఎవరికి మంచిది కాదూ? మీకేమైనా అవుతోందా?" అనడిగాడు.        నాకు అరికాలిమంట నెత్తికెక్కింది - "సివిలైజ్డ్ గా బిహేవ్ చెయ్యండి" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS