Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 25

    "కోర్టు చెట్టు క్రింద ఎవడితోనో వుంటే లాక్కొచ్చాను సార్" బాలకిషన్ చెప్పాడు. పడిపోతున్న టోపీ పైకి లాక్కుంటూ.    
    "పడుకున్న మాట నిజమే సార్' అన్నదావిడ రొప్పుతూ. ఆమెకి ముఫ్ఫై అయిదేళ్ళుంటాయి. వయసుని కాలం అవసరం కన్నా ముందే అధిగమించింది.    
    "....కానీ ఎందుకు పడుకున్నావని అడగరేం?" అందరి వైపు చూస్తూ అంది.    
    ఎవరూ మాట్లాడలేదు. ఎవరూ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. అసలా దృశ్యమే వింతగా వుంది. ఆశ్చర్యంగా వుంది. అనూహ్యంగా వుంది. దానికామె ఇచ్చిన వివరణ హృదయ విదారకంగా వుంది. ఎర్రటోపీని ప్రశ్నిస్తూ- శ్వేతపత్రం మీద గీసిన ప్రశ్నార్ధకంలా వుంది.    
    "మా ఆయన్ని లాకప్పులో పెట్టారు బాబూ ఎక్కడో గుళ్ళో నగలు పోయాయని లాకప్పులో పెట్టారు. ఎన్నాళ్ళు వుంచుతారో, ఎక్కడ వుంచుతారో తెలీదు. ఈ రోజు ఆగష్టు పదిహేను మనకి స్వతంత్రం వచ్చినరోజు స్వతంత్రం రోజునైనా అన్నం పెట్టవా అమ్మా అని అడిగే నా బిడ్డల ఆకలి చూడలేక కోర్టు మూసేసేక ఆ బయట సీకట్లో చెట్టుక్రింద ఎవడితోనో ఎంగిలిపడ్డ మాట నిజమే. వ్యభిచారం చెయ్యడం తప్పో, అక్కడ ఆ పని చెయ్యడం తప్పో నాకు తెలీదు కానీ, ఆడిచ్చిన అయిదు రూపాయల్తో నా పిల్లలకి అరగుప్పెడు అన్నం వండి పెడతామనుకుంటే ఇదిగో ఈ పోలీసాయన నా చేతిలో నోటుకాస్తా లాక్కున్నాడు. చీకట్లో దొంగేమో అనుకున్నా కాలరట్టుకుని వెల్తుర్లోకి తీసుకొస్తే పోలీసోడు! న్యాయం ఇక్కడే తేలాలని ఇట్టగే లాక్కొచ్చాను. నేరం చేసినందుకు నన్ను జైల్లో పెట్టండి బాబూ కానీ డబ్బు మాత్రం మా పిల్లలకి పంపించండి. సొంతంత్రం రోజునన్నా కడుపారా తినమని సెప్పండి. ఈ దొంగనాయాల్తో మాత్రం పంపకండి సావీ మధ్యలోనే మందుకొట్టి..."    
    బాలకిషన్ ఆవిడ మీదకు లంఘిస్తూ "ఏమిటీ ఊరుకున్న కొద్దీ-" అనబోయాడు.    
    "బ్రహ్మానందం...." గద్దించాడు రాణా. "ఆవిడ దగ్గిర డబ్బు తీసుకున్నావా లేదా?"    
    "రాత్రి కోర్టు బయట చెట్ల క్రింద..."    
    "నా ప్రశ్నకి సమాధానం అదికాదు" రాజు ఎర్రబడ్డ మొహంతో అడిగాడు.    
    "తీసుకున్నాను."    
    "అదిచ్చి వెంటనే పంపించు వెం....ట....నే" అరిచాడు రాణా ఆ అరుపుకి పోలీసు స్టేషన్ అదిరినట్టు అనిపించింది. బ్రహ్మానందం బెల్టులోంచి నోటు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. ఆవిడ దాన్ని చూసింది.    
    మళ్ళీ పరీక్షగా చూసింది.    
    ఆ తరువాత వదిలేసింది.    
    గాలిలో తేలుతూ బల్లమీదకు వచ్చి చేరిన ఆ కాగితంవైపు చూశాడు రాణా.    
    ఆగష్టు పదిహేనున గోడలకి కట్టే కాగితం జెండా అది.    
    కాషాయరంగు తుపాకిలో ఆకుపచ్చటి మందు దట్టించి కొడ్తే నేలరాలిన తెల్లపావురంలా పడివుంది ఆ కాగితం.    
    ఆవిడ నవ్వింది. ధర్మచక్రాన్ని కదిపేసే నవ్వు అది. మానవత్వాన్ని కుదిపేసే నవ్వు అది.    
    "అయిదు నిమిషాల యవ్వారానికి అయిదు రూపాయలకన్నా ఎక్కువ ఇవ్వనని ఆడన్నప్పుడు ఏడ్చినా బాబూ ఇచ్చిన కాగితాన్ని సీకట్లో అయిది రూపాయల నోటనుకొని ఈడు లాక్కున్నప్పుడూ ఏడ్చినా బాబూ కానీ ఇప్పుడు ఈ వెలుతురులో మన దేశం జెండా ఖరీదే అయిదు రూపాయలని తెలిసినప్పుడు.....నవ్వొస్తోంది. నాకు నవ్వొస్తోంది. నాకు నవ్వొస్తోంది" అంటూ వేగంగా అక్కడనుంచి వెళ్ళిపోయింది.    
    కాలం పఠేలున పగుల్తే అందులోంచి వ్యాపించిన నిశ్శబ్దం గుండె శూన్యత్ని వెక్కిరిస్తోంది. విరిగిపడే కెరటం అక్కడే నిశ్చలమైపోతే, విషాదార్ణవపు ఉప్పెనకి విముక్తేది?    
    అందరూ శిలా ప్రతిమలా నిలబడి వున్నారు. ఆ శూన్యతలోంచి, ఆ పోలీస్ స్టేషన్ గుహాంతర్భాగ చీకట్లోంచి ఒక వ్యక్తి రోదన వినిపించింది.    
    "ఊరుకో రాంబాబూ ఊరుకో...." సెల్ లో తోటి ఖైదీ అనునయిస్తున్నాడు. రాంబాబు ఏడో తరగతి చదివి వడ్రంగి పని చేసుకుంటున్నాడు.    
    "ఎలా వూరుకోన్రా?.....అది నా పెళ్ళాం" రాంబాబు వణికిపోతూ అన్నాడు.    
    ఆ పైన పూనకం వచ్చినట్టు ఒక్కసారిగా జైలు ఊచలు పట్టుకుని ఊపేస్తూ అరిచాడు. "మేమేం తప్పు చేశామని మమ్మల్ని జైల్లో పెట్టావు ఇన్ స్పెక్టర్? రోజుల తరబడి, నెలల తరబడి మమ్మల్ని ఈ చీకటి కొట్లో పెట్టి కొడుతున్నారు. నేరం వప్పుకొమ్మని బలవంతం చేస్తున్నారు. మా ఆడాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. మా పిల్లలు తిండిలేక చస్తున్నారు. మేము ఒకప్పటి దొంగల మైనందుకా ఈ శిక్ష? బావుంది ఇన్ స్పెక్టర్ చాలా బావుంది" అతడి రోదన నవ్వులోకి దిగింది. బిగ్గరగా నవ్వుతూ అన్నాడు, "చేయని నేరం వప్పుకోనందుకు మేమేమో తన్నులు తింటున్నాం. చేసిన నేరానికి ఎన్నో సాక్ష్యాలున్న ఆ వీరదాసు మంత్రులతో కలిసి కేకులు తింటున్నాడు. సెల్యూట్ ఇన్ స్పెక్టర్..... స్టూవర్ట్ పురం పోలీస్ కి సెల్యూట్..." తెరలు తెరలుగా వచ్చే నవ్వు! అతడి నవ్వు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ నీరవం రాణాని సవాలు చేస్తున్నట్టు నిలచింది. వీరదాసు సెల్ లో అటు తిరిగి వున్నాడు. అతడి పెదవులమీద నవ్వు కదలాడుతూ వుండి వుంటుందని రాణాకి తెలుసు. ఎదురుగా నిలచిన ప్రశ్న- రెండు మొహాలలో ఒకటి ఏడుపు- ఒకటి నవ్వుగా అతడిని సమాధానం చెప్పమన్నట్టు చూస్తుంది.    
    అతడికి సమాధానం దొరికింది. డ్రాయర్ లోంచి తాళాలు తీసుకుని లాకప్ సెల్ తీశాడు. దొంగల్ని "బయటకి రండి" అని పిలిచాడు.    
    తన సెల్ లోంచి వీరదాసు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాణా అతడి దగ్గరికి వచ్చాడు. "చూడు వీరదాసూ- అంతా విని నవ్వుకున్నావుగా ఇప్పుడు నీ మొహంలో నవ్వు మాయమైందనుకుంటాను. నగలు దొరక్కుండానే దొంగల్ని ఎలా వదిలేశానని కదూ నీ అనుమానం? రేపు రికార్డుల్లో ఏం చూపిస్తానని కదూ నీ సంశయం? ఈ అనుమానాలన్నిటికీ సమాధానం దొరకాలంటే రాత్రంతా నిద్రమేల్కొని ఆలోచించు" అని దొంగల్తో కలిసి బయటకు నడిచాడు.    
                                             12    
    ఆ ప్రదేశమంతా చీకటిగా వుంది. దూరంగా ఎక్కణ్ణుంచో కీచురాళ్ళ చప్పుడు రాత్రి ఒంటిగంట కావొస్తుంది.    
    వాళ్ళతో కలిసి రాణా అక్కడికి చేరుకున్నాడు. వాళ్ళు మొత్తం నలుగురు నలుగురూ నాలుగు రంగాల్లో ప్రసిద్దులు. ఒకప్పుడు వాళ్ళు స్టూవర్ట్ పురంలో పేరుమోసిన దొంగలు. తరువాత సంస్కరింపబడిన వాళ్ళు. ఆ తరువాత రౌడీల చేత, వీరదాసు చేత చిక్కిన వాళ్ళు.    
    గుడి దొంగతనం నేరం మీద ప్రస్తుతం జైల్లో వున్నవాళ్ళు.    
    వాళ్ళనే రాణా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చింది.    
    అందరూ ఎమ్మెల్యే నాయుడి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. రాణా వాళ్ళతో అన్నాడు. "నన్ను క్షమించండి. నేనీ విధంగా కోరకూడదు మిమ్మల్ని! కానీ, నేను నిస్సహాయుడిని అధికార యంత్రాంగంలో చిట్టచివరి మెట్టుమీద వున్న అతి చిన్న బోల్టు లాంటి వాడిని. పైన ఎక్కడో..... పై అంతస్థు మీద వున్న రాజకీయ నాయకులు నా ప్రత్యర్ధులు. వాళ్ళు నా పోలీస్ స్టేషన్ లోనే మీటింగ్ లు పెట్టుకోగల సమర్ధులు. చీకట్లో మీ భార్యల చేతుల్లో జెండాలు పెట్టగల నీచులు వారితో పోరాడటానికి అధికారం, న్యాయం, ధర్మంలాంటివి పనికిరావు. ముల్లుని ముల్లుతోనే తీయాలి. నేరాలు మానేసినవారు మీరు మీతో తిరిగి నేరం చేయించడం నా ధర్మంకాదు. కానీ మిమ్మల్ని శాశ్వతంగా లాకప్ నుంచి బయటకు తీసుకు రావలంటే మీరీ పని చేయక తప్పదు" అంటూ చేయవలసింది చెప్పాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.    
    ఆ తరువాత ప్రారంభమైంది అసలు పని.    
    వారు పైపులైను పట్టుకుని పైకి ఎక్కారు. ఆ నిశ్శబ్దంలో వాళ్ళు అలా పైకి పాకుతూంటే చెట్ల కొమ్మలమీద అలికిడి లేకుండా పరుగుదీసే ఉడుత గుర్తొస్తుంది.    
    నలుగురిలో మొదటివాడు మేడపై బాల్కనీలోకి వెళ్ళాడు. వేసివున్న తలుపు తీయడం పెద్ద కష్టం కాలేదు. ముఖద్వారాలు తెరవడంలో అతడు ఘటికుడు. అతడిని అనుసరించి ముగ్గురూ లోపలికి వెళ్ళారు.....రెండోవాడు బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. నాయుడు నల్లతుమ్మ మొద్దులా పడుకుని వున్నాడు. అతడి భార్య సన్నగా గురక తీస్తోంది.    
    రెండోవాడు ఆమె దగ్గరకు చేరి కాలిమీద అరచేత్తో రాశాడు. చిన్ని చక్కిలిగిలి లాటిది. ఎంతో ప్రొఫెషనలిజమ్ తో కూడుకున్నది. అది నిద్రా భంగం కలిగించదు. కానీ పక్కకి తిరిగేలా చేస్తుంది.    
    ఆవిడ పక్కకు వత్తిగిల్లగానే దిండు క్రింద చెయ్యి పెట్టి తాళాల గుత్తి తీశాడు. ఇనప్పెట్టె తెరచి అందులోని డబ్బు తీసుకున్నాడు.    
    మూడోవాడు గుండెల్నిండా గాలి పీలుస్తూ ముందుకు సాగిపోయాడు. చివరికి బాత్ రూమ్ లో చేరాడు. అక్కడే నిలబడి గాఢంగా మరొకసారి శ్వాస పీల్చి- క్రిందకి వంగి రాయిమీద తడిమి చూశాడు. తరువాత నాలుగో వాడివైపు చూశాడు. నాలుగో వాడు ఈ లోపులో వంటింట్లోంచి అట్లకాడ తెచ్చాడు. శబ్దం కాకుండా, ఎవరికీ నిద్రాభంగం కాకుండా- పని క్షణాల్లో జరిగింది.    
    రాయి పైకి లేపారు.    
    క్రింద వుంది "బ్లాక్ మనీ" దానితోపాటు బంగారం మొత్తం అరవై - డెబ్బై లక్షలదాకా వుంటుంది. నలుగురూ దాన్ని మూట కట్టారు. ఈ మొత్తం ఆపరేషన్ అంతా అయిదు నిముషాల్లో జరిగి పోయింది. అయిదు నిముషాల్లో అరవై లక్షలు.... నిజంగా స్టూవర్ట్ పురం దొంగలే తల్చుకుంటే ఎంత సులభంగా దొంగతనం చేయగలరో చెప్పడానికి అది ఉదాహరణ. 'మేమిది చేయకపోవడానికి కారణం చేతకాక కాదు. మామూలు మనుష్యుల్లా బ్రతుకుదామన్న ఆశతో! మా జీవితాలు లాకప్ రూమ్ లకీ, మా కుటుంబ సభ్యుల జీవితాలు జైళ్ళ చుట్టూ తిరగడానికి పరిమితం చేయకుండా వుండటం కోసం! మేము మారదామనుకున్నాం. మేమే మారక పోతే - ఒక రాజకీయ నాయకుడు అయిదు సంవత్సరాల్లో సంపాదించింది మే మొక సంవత్సరంలో సంపాదించగలం కానీ ఒకందుకు మేము సంతోషిస్తున్నాం. ఇన్నాళ్ళూ రౌడీలకీ, రాజకీయ నాయకులకీ భయపడి నేరాల్ని వప్పుకున్నాం. ఇప్పుడొక నిజాయితీ గల ఇన్ స్పెక్టర్ కోసం సంతోషంగా ఈ దొంగతనం చేస్తున్నాం....' అన్న సంతృప్తి వున్నది వాళ్ళల్లో.    
    బంగారం, డబ్బు మూట కట్టుకుని, వాళ్ళు బయల్దేరటానికి సిద్దమయ్యారు.    
    అప్పుడే బయట్నుంచి కాలింగ్ బెల్ మోగింది.    
    నాయుడు నిద్ర లేచాడు.    
    లైటు వేస్తూ "ఎవరదీ?" అన్నాడు.    
    పక్కనే వున్న భార్యకూడా కళ్ళు తెరిచి, "ఇంత అర్ధరాత్రి పూట ఎవరండీ?" అంది.    
    "చూసొస్తానుండు" అని మెట్లు దిగిక్రిందకి వచ్చాడు. తలుపు తీయగానే ఎదురుగా రాణా వున్నాడు.    
    "ఏమిటింత అర్ధరాత్రి ఇలా వచ్చావ్?"    
    "మీ ఇంట్లో దొంగతనం చేయబోతున్నాం- అని ఎవరో ఫోన్ చేశారు. అది చెప్పటానికి వచ్చాను."        
    నాయుడు నవ్వేడు. "ఇలా నన్ను మంచి చేసుకుందామని చూస్తున్నాన్నమాట. చూడు రాణా, నీ పనిపూర్తయింది. ఇంకా నన్ను ఎంతకాలం కాకా పట్టి నా లాభం లేదు."    
    "ఒక్కసారి మీ బెడ్ రూమ్ లో ఇనప్పెట్టె చూడనివ్వండి."    
    "ఇంకానయం బాత్ రూమ్ చూస్తానన్నావ్ కాదు."    
    "ఏం? బాత్ రూమ్ లో కూడా ఏమైనా దాచారా?"    
    నాయుడు మొహంలో నవ్వు మాయమైంది. "నేను ఎక్కడెక్కడ ఏవేం దాచానో నీ కనవసరం అర్ధరాత్రి తీరిగ్గా నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS