ఆ నిద్ర కళ్ళతో సుబ్బి తన వరండాలో నేల మీద అలానే నిద్రపోయింది ఆ రాత్రి పదింటిదాకా.
"లే, ఆ గౌను విప్పు- ఆ గొలుసు తియ్యి-అలాగే నిద్రపోతావా దున్నపోతులా...లే!" -కాలితో తన్నాడు మాధవరావు.
కళ్ళు నలుపుకుంటూ లేచిన సుబ్బి చెప్పినట్టే చేసింది.....తీసుకోరనుకుంది అవి! సుబ్బికి గొలుసు యిచ్చేయాలనిపించింది కానీ, గౌను యివ్వాలనిపించలేదు.
"ఇది నేను వేసుకుంటానయ్యగారూ!" అంది మెల్లగా.
జానకి ఆ గౌను, గొలుసు తీసి లోపల దాచేసింది.
సుబ్బికి చాలా ఏడుపొచ్చింది - అసలీ అంకుల్ ఎవరూ! తెల్లారేసరికి సుబ్బి చింపిరి జుట్టు, మాసిన గౌనుతో, వీధి గుమ్మం ఊడుస్తోంటే ఇంట్లోకొచ్చిన చెన్నమ్మకి ఎవరి మీదో కోపం వచ్చింది.
వంటింట్లో గిన్నెలు జారిపడ్డాయి.... కాఫీ ఒలికిపోయింది....గాజు కప్పు చేయి జారిపడి ముక్కలైంది.
"ఏమైందే నీకు పొద్దున్నే- నీ మొగుడు కొట్టాడా?" అంది జానకి వంటింటి గుమ్మంలో నిలబడి.
"మళ్ళీ వస్తారా అమ్మా... ఆ అయ్యగారూ?" అంది.
"ఎందుకొస్తారూ మళ్ళీ? ఏమో... ఏ రెండు నెలలకో వస్తే వస్తాడు"
చెన్నమ్మకి ఆ రాజీవ్ గురించి చాలాచాలా తెలుసుకోవాలని వుంది..... కానీ ఎలా?
సుబ్బి నేల తుడుస్తోంది మూలమూలల నుంచి! చింపిరి జుట్టు పైకి తోసుకుంటోంది.
"ఆ గౌను బావుందమ్మా!" అంది.
"ఆ"- జానకి కాఫీ చప్పరిస్తోంది.
"ఆ అయ్య తెచ్చిన పరికిణీ కుట్టించండమ్మా సుబ్బికి... పండగొస్తోందిగా!" అంది చెన్నమ్మ.
"ఆ..!" అంది జానకి కాఫీ కప్పు కిందపెట్టి.
రైల్లో వెడుతున్న రాజీవ్ అనుకున్నాడు- ఈమాటు సుమతితి అన్ని విషయాలూ చెప్పాలి... అయినా భార్య దగ్గర రహస్యమేమిటీ! ఎలాగైనా ఒప్పించాలి- నా పిల్లని నేను తెచ్చుకుంటే! ఏనాడైనా ఆ తల్లి మళ్ళీ కనిపిస్తే పిల్లని, తల్లిని ఒకచోట చేర్చాలి! - రాజీవ్ మనసు చాలా తృప్తిగా వుంది... మమత చాలా బాగా పెరుగుతున్నందుకు!
సతీష్ వస్తే బాగుండననిపించింది సుబ్బికి.
'ఆరోజు ఫోన్లో పౌడరు డబ్బా తెస్తానన్నాడు.... ఆ పౌడరు ముఖానికి రాసుకుంటే ముఖం అందంగా కనిపిస్తుంది. చిన్న స్టిక్కరు బొట్టు పెట్టుకోవాలి- మళ్ళీ షాంపుతో తల రుద్దుకోవాలీ... ఏ- నేను మాత్రం టీవీలో వచ్చే పాపలాగ వుండనా?'
సుబ్బి నేలమీద కూచుని పాత పుస్తకంలో బొమ్మలు తిరగేస్తోంది...
అమ్మగారు ఇంట్లో లేనపుడు పెదాలకు ఎర్రని రంగు పూసుకుని, ఆ మంచి గౌను వేసుకుంటే తను ఎంత బావుంటుందో..! సుబ్బి బుగ్గ మీద చేయి వేసుకుని చూస్తూ, తల గోక్కుంది.
అప్పుడే లోపలకొస్తున్న మాధవరావు సుబ్బి తల గోక్కోవటం చూసాడు.
"ఇలా రా! జానకీ...నువ్వు కూడా ఇలా రా!" అన్నాడు.
జానకి వచ్చి భర్త పక్కన కూచుంది. సుబ్బి నిలబడింది.
"పది నిమిషాల్లో దాన్ని హెయిర్ కటింగ్ సెలూన్ కి తీసికెళ్ళి బోడిగుండు చేయించు"
"అయ్యో... అదేమిటీ?" అంది జానకి వెంటనే.
"నేను చేయించుకోను" అంది ఏడుపు ముఖం పెట్టి సుబ్బి.
"వద్దులెండి- తలలో పేలుంటే పేలమందు రాస్తే అవే పోతాయి!" అంది జానకి సుబ్బికి గుండు చేయించడం ఇష్టంలేక.
గుమ్మంలో నిలబడ్డ చెన్నమ్మ ఇక చూస్తూ ఊరుకోలేకపోయింది-
"వద్దయ్యా... అదీ ఆడపిల్లే! ఆడపిల్లకి జుత్తే అందం... వద్దు" అంది.
మాధవరావుకి అహం దెబ్బతింది. సుబ్బి ఏడుస్తూ వద్దంటుందా, దానిమీద ఎక్కడలేని ప్రేమతో జానకి వద్దంటుందా, వంట మనిషి చెన్నమ్మ నాకు సలహా యిచ్చి వద్దంటుందా-పురుషాహంకారం కట్టలు తెంచుకుంది...
"సుబ్బీ- కార్లో కూచో... ఊ- నడు!" గుడ్లు ఉరిమి చూసాడు.
అంతే... సుబ్బి ఏడుస్తూ కారులో ఎక్కింది.
"ఇట్టాంటి పనులు దేముడు మెచ్చడు- పేలుంటే మందు రాసుకోవాలి, జుట్టు శుభ్రం చేసుకోవాలి కానీ, బోడిగుండు చేయిస్తారా?... అమ్మా, మీరు చెప్పండి- తప్పుకాదూ! పైగా... ఈమధ్యే పెద్దమనిషైన పిల్ల -పెద్ద జుట్టు దానికి ఎంత అందాన్నిస్తోందీ?!" అంది జానకితో.
"చెన్నమ్మా... ఏం చెప్పను? నా మాట ఒక్కటీ వినరు" అంది జానకి. దుఃఖంలో, బాధలో, కష్టంలో ఆడవాళ్ళు ఒకళ్ళ మనసు ఒకళ్ళ ముందు విప్పి చెప్పుకోవటానికి వెనుకాడరు. అక్కడ సేవకురాలు, యజమానురాలు అన్న తేడా వుండదు. ఊరట కావాలి, ఆవేదన బయటకి పోవాలి.
"ఎప్పుడూ ఇంతే చెన్నమ్మా! ఈమధ్య మరీ ఎక్కువైపోయింది- పిల్లని తెచ్చినప్పటి నుంచీ..." జానకి పమిటతో కళ్ళొత్తుకుంది. చెన్నమ్మా కళ్ళొత్తుకుంది.
"ఆయనెవరమ్మా.... అదే-రాజీవ్ గారూ" అంది వెంటనే చెన్నమ్మ.
వీధిలో కారు ఆగిన చప్పుడు.... జానకి గబుక్కున గదిలోకెళ్ళిపోయింది.
సుబ్బి వెక్కుతూనే వుంది. జుట్టు లేకపోవటం ఎంత అనాకారితనమో అర్ధమవుతోంది సుబ్బిని చూస్తుంటే! నల్లని పెద్ద జడవున్న సుబ్బిని బోడిగుండుతో చూడటం మహా బాధనిపించింది చెన్నమ్మకి. దాని ముఖం చూడలేకపోయింది జానకి. తనేదో తప్పు చేసిన భావం గుండెల్ని పిండేసింది.
చిన్న పౌడరు డబ్బా జేబులో దాచుకుని వచ్చిన సతీష్- విస్తుపోయాడు సుబ్బిని చూసి-
"ఆంటీ, వండ్రఫుల్- ఇది ఎలా వుందో తెలుసా. పర్సీస్ కంబట్టీ లాగా- ఆ పాశ్చాత్య నటీమణి ఎప్పుడూ ఇలాగే వుంటుంది. ఇదే ఫాషన్!" అన్నాడు పగలబడి నవ్వుతూ.
సుబ్బి గబుక్కున లోపలకెళ్ళిపోయింది.
"బోడీ, టీ తీసుకురా!" అన్నాడు సోఫాలో కూచుని టీవీ చూస్తూ.
చెన్నమ్మ ఒళ్ళు భగభగలాడిపోతోంది సతీష్ ని చూస్తుంటే! అసలీ అబ్బాయిని ఇంటికి రానీయకూడదు! ఎవరికి చెప్పనూ!!
సుబ్బి బోడిముఖంతో అందం పోయింది. చిక్కిపోయింది. తిండి తినటం తగ్గించేసింది... జానకి ఈ విషయం కనిపెడుతున్నా చూసీ చూడనట్టు ఊరుకుంటోంది. చెన్నమ్మ ఊరుకోలేకపోతోంది.
"బోడీ, బూట్లు తీసుకురా!" అన్నాడు మాధవరావు.
"బోడీ లేదా అంకుల్?" అంటూ లోపలకొచ్చిన శంకరన్-
"బోడీ, ఆంటీ నడిగి కాసెట్ పట్రా, మా మమ్మీచూసి యిస్తుందట!" అన్నాడు.
"బోడీ, ఈ గ్లాసు!" - జానకి టక్కున నాలుక్కరుచుకుంది. ఛీ.... తను కూడా అలానే పిలుస్తుందా!!
"సుబ్బీ, నిన్నే... వినిపించటం లేదా? ఆ గోడపైన చూడు- ఎంత బూజుందో, కళ్ళు కనిపించటం లేదా?" అంది కోపంగా.
మెల్లగా బోడీ, బోడీ అని సుబ్బిని పిలవటం ఇంట్లో ఎక్కువైపోయింది. దానికి 'సుబ్బి' అంటే పలక్కుండా 'బోడీ' అంటే పలికేవరకు వచ్చేసింది పరిస్థితి..!
చెన్నమ్మ అంతా గమనిస్తూనే వుంది.
"చెన్నమ్మా, ఇల్లు చూసుకో... మేమంతా పిక్ నిక్ వెడుతున్నాం!" అంది జానకి ఓరోజు.
"నేనూ, బోడీ కూడా వస్తామమ్మా!" అంది చెన్నమ్మ- తరువాత అటు ఇటూ చూసి, 'హమ్మయ్య పిల్ల వినలేదు' అనుకుంటూ తన చెంపలు తను వాయించుకుంది చెన్నమ్మ.
* * *
చంద్రయ్య మళ్ళా ఆ ఇంటి జాడలకి రాకపోవటం ఎంతో మనశ్శాంతి కల్గించింది తులసమ్మకి, లీలకి కూడా..!
ఆశ్రమంలో బాధ్యతలన్నీ లీలవే. తులసమ్మకీ ఒకనాడు ఇలాటి బెంగే వుండేది. కానీ, నేడు లీలని చూస్తుంటే ధైర్యం కలిగింది. సుధాకర్ జాడ తెలియదు. అప్పుడప్పుడు ఇంకా మనసులో ఓ చిన్న ఆశ... పిల్ల బతికుందేమోనని..! తల్లి దగ్గర చేర్చగలదనీ- కానీ, ఈ ఆశకి కూడా అర్ధం చేర్చగలదనీ- కానీ, ఈ ఆశకి కూడా అర్ధం లేదనిపించగానే తులసమ్మకి నిస్పృహ వచ్చేస్తుంది..!
ఆరోజు తులసమ్మ ఆశ్రమవాసులందరినీ ఒకచోటికి రమ్మంది.
అంతా కృష్ణ విగ్రహమున్న ముందు ఖాళీస్థలంలో వచ్చి కూర్చున్నారు. ఎందుకు పిలిచింది తులసమ్మగారని ఎవరికీవారే అనుకుంటున్నారు మనసులో.
లీలకి కూడా తెలియదు తులసమ్మ మనసులో ఏముందో!
ఆ మాటా ఈ మాటా చెప్పాక, తులసమ్మ గట్టిగా అంది-
"మీరంతా ఇక్కడ ఎంతో హాయిగా, సుఖంగా వున్నారు- మీతోపాటు ఈ లీలని మీరు సొంత పిల్లలా చూస్తున్నారు. ఈ లీల ఎవరో మీకు తెలియదు. ఇది నా అక్క మహాలక్ష్మి కూతురు. దీనికి తల్లి లేదు, భర్త లేనట్టే! - దీనికున్నది మనమే!" అంది. ఆ మాటంటూంటే తులసమ్మ గొంతు గాద్గదికమైంది.
"ఈ ఆశ్రమ బాధ్యతలు పూర్తిగా లీలకి అప్పగించేస్తున్నా... మీకెవరకీ అభ్యంతరం లేకపోతే!" అంది.
