పుస్తకాలు అడ్డం తీసి నవ్వాపుకుని, "నీ అంత ప్లాస్ట్థింకింగ్ మాకు రానందుకు మేము సిగ్గుపడుతున్నాము" కామిని అంది.
"ఇంతకీ ఏం ప్రోగ్రామ్...?" జ్ఞాపిక అడిగింది.
"సారీ.... చెప్పను- సస్పెన్స్! చెబితే మా ఐడియా మీరు కొట్టేస్తారని ఆనంద్ చెప్పోద్దన్నాడు!" తనూ సీరియస్ గా బుక్ అడ్డం పెట్టుకుంది మొహానికి.
"ఇంత తెలివి నీకెక్కడిదా అనుకున్నాంలే! అదీసంగతి.... ఆనంద్ చెప్పాడా?" కామిని దిగులుగా కూర్చుంది. జ్ఞాపిక కూడా ఆలోచనలో పడింది- తనేం చెయ్యాలా?.... అని!
వీళ్ళిద్దరి చదువూ చెడగొట్టి తను సీరియస్ గా థియరీ రాసుకోసాగింది రేవతి! వాళ్ళలా సాయంత్రం వరకూ ఆలోచిస్తూనే ఉన్నారు పాపం! రేవతి చదువుకుంటూనే ఉంది ఏ డిస్టర్బెన్సూ లేకుండా!
స్ఫూర్తి వచ్చింది. వీళ్ళవైపు చూపైనా తిప్పకుండా రూమ్ లోకి రాగానే ఒక రౌండ్ అలాగ్గా తిరిగి శాండిల్సయినా విప్పకుండానే-
"తత్తరారా తత్తరారా తత్తరారా రా
తదత్తరారా తదత్తరారా తందనావరా!
గుండెలోన మోగాయి గుండిగంటలేనురా
వేకువయ్యే వేళాయే ఊర్పులింక ఓపలేనురా!
నువ్వొస్తానని హృది తెస్తావని
మల్లెపూలు పల్లకెక్కే తేనెపట్టు పెదవి పట్టే!
ఏడు మల్లె లెత్తున్న లేత కావ్యనాయిక
పాల కడవ మోయ్యలేదు దింపవేమికా!
గోపాలా గోపాలా నీ అలకెట్ట ఆపాలా?
చెప్పాలా చెప్పాలా చెప్పలేని గుండెగోలా!"
నడుం మీద కడవ మోస్తూ, నాజూగ్గా నడుస్తూ గిరుక్కున తిరుగుతూ డాన్స్ చేస్తూనే ఓవర్ కోట్ విప్పేసి రేవతి మీదకు విసిరేసింది.
రేవతికి తగిలి కళ్ళద్దాలు కిందపడ్డాయి. కోట్ విసిరేసి కళ్ళద్దాలు వెతుక్కుంది తడిమి తడిమి. పెట్టుకుని కళ్ళు విచ్చుకుని చూడసాగింది.
అలాగే తిరుగుతూ టీషర్ట్ విప్పేసి విసిరేసింది.
జ్ఞాపిక మీద పడిందది.
లోపల పెట్టీ జీన్ లో ఉంది. కామినికి కంగారేసింది- అవి కూడా విప్పేస్తుందేమోనని! గభాల్న తలుపు మూసి తలుపుకానుకుని నిలబడి విస్తుపోయింది.
ఇవేవీ పట్టించుకోకుండా అలాగే గిర్రున తిరుగుతూ హెయిర్ పిన్, రబ్బరుబాండ్- లాగేసి విసిరికొట్టింది.
హెయిర్ పిన్ వెళ్లి తలమీద, రాబ్దరు బాండ్ తెరిచిన నోటిమీద పడ్డాయి కామినికి!
జుట్టు అలల్లా ఎగురుతుంటే... ఇంకా స్పీడ్ గా తిరుగుతూ డాన్స్ చెయ్యసాగింది.
వెంట్రుక పెదవికి తగిలి, చిరాగ్గా రబ్బరుబాండ్ తీసి స్ఫూర్తి వైపు విసిరింది కామిని.
దాన్ని అలాగే పట్టుకుని దాన్ని బాల్ లాగా ఎగరేస్తూ, పట్టుకుంటూ డాన్స్ చేస్తూనే కాలితో శాండిల్ విసిరేసింది.
అది ఎగిరెళ్లి జ్ఞాపిక ఒళ్ళో పడింది.
రేవతి టక్కున కుర్చీ అడ్డం లాక్కుంది- తనమీద ఏవీ పడకుండా! తలమీద స్టడీ పాడ్ పెట్టుకుంది- తలకు దెబ్బతగలకుండా!
అదే జోష్ లో పెట్టీ విప్పడానికి రెండుచేతులూ పైకెత్తి, చేతులు మడిచి వీపు వరకూ పైకి లేపింది - ట్విస్ట్ చేస్తూ.
"ఓం....నో! ప్లీజ్...!" అని లైటార్పేసింది కామిని.
మసకచీకట్లో వెతికి, బిగించిపట్టుకుని బలవంతాన కాట్ మీద కూర్చోబెట్టారు జ్ఞాపికా, రేవతి.
"లైటెయ్యి కామీ!" అంది జ్ఞాపిక.
లైట్ వేశాక-
"ఓ మైగాడ్! ఇది ఇంకా పెట్టీ విప్పలేదు. నాకు దడుచుకుని జ్వరం వస్తుందనుకున్నా!" తన వీపు మీద తనే చరుచుకుంది రేవతి.
"వాటీజ్ ద మాటర్? ఎప్పుడు లేంది ఈ బట్టలిప్పి విసిరేయడం ఏవిటే?" కామిని దగ్గరికొచ్చి ఆడిగింది.
"ప్లీజ్! లీవ్ మీ! డోంట్ స్టాప్! నేనూ, ఈష్ ఇచ్చిన ఐడియా ప్రకారం మోడరన్ విరహిణి రాధికలా ట్విస్టూ, క్లాసికల్ కలిపి ఫ్యాన్సీ డ్రస్ వేయబోతున్నా ఫేర్ వెల్ లో! అదే ప్రాక్టీస్ !" అని మళ్లీ "తత్తరారా...." అని మొదలెట్టి లేవబోయింది.
"డయాస్ మీద కూడా ఇలానే బట్టలిప్పి ఆడియన్స్ మొహాల మీద విసిరేస్తావా?" అనుమానం వచ్చింది రేవతికి.
"నో! అప్పుడు నేను విరహిణి రాధ డ్రస్ లో ఉంటా! ఆ డ్రస్ ఊహించుకుని ఈ జీన్ ఫ్యాంట్, టీషర్ట్ విప్పి విసిరేయాలనిపించి వేస్తున్నా!" అని మెల్లగా నడుము మూవ్ చేస్తూ లేవబోయింది.
ముగ్గురూ కలిసి బలవంతాన స్ఫూర్తిని బాత్ రూమ్ లోకి నెట్టి తలుపెస్తూ- "ఇప్పుడు విసిరేయ్!" అని తలుపేశారు.
"టవల్! టవల్ లేదే...!" అరిచింది స్ఫూర్తి.
"డాన్సంతా అయ్యాక పిలువ్.... టవలిస్తాం!" జ్ఞాపిక చెప్పి బయటినుండి గడియపెట్టింది.
ముగ్గురూ గుండెల మీద చెయ్యేసుకుని, "అమ్మయ్య...దీని జోష్ తట్టుకోలేక చచ్చాం కదే! పాపం....ఈష్!" అంది కామిని.
"ఏయ్ ఁ.... నా బ్యాగ్ లో విష్షుంది ఇవ్వండే!" అరిచింది స్ఫూర్తి.
"దీని ఎనర్జీ మండిపోనూఁ... ఇప్పుడు కూడా ఇంత అలాగ్గా డాన్స్ చేస్తుందేవిటే ఇది?!"
"అసలు ఇప్పుడే ఎక్కువ జోష్ ఉండేలా ఉంది దీనికి!" తిట్టుకుంటూ హ్యండ్ బ్యాగ్ లోంచి తీసి అందించింది కామిని.
అది అందించేపుడు దాంతోబాటు బాండ్ చేయబడ్డ ఓ ఎర్రటి పేపర్ కిందపడబోతుంటే... పట్టుకుని నలిపి మూలకు విసిరేసింది కామిని.
దాన్ని తీసి చదివి ఉంటే చాలా బావుండేది....
దానిమీద 'ఒసేయ్ స్ఫూర్తీ, జ్ఞాపికా! మిమ్మల్నీ ఫేర్ వెల్ రోజు పదిమందిమి రేప్ చెయ్యబోతున్నాం! చెప్పిమరీ చేస్తున్నాం ఈ పని. దమ్ములుంటే మీ బాయ్ ఫ్రెండ్స్ ను ఆపమను. నా ఇద్దరు ఫ్రెండ్స్ ను పొట్టన పెట్టుకున్నారు. మీ పొట్టను చితక్కొట్టి తీరతాం!' అని రాసుంది.
తరువాత టవల్, ఆ తరువాత డ్రస్ అన్నీ ఇచ్చి- బయటకొచ్చేసరికి రెడీగా ఉన్నారు విషయమేమిటో తెలుసుకోవడానికి!
"ఇంతకీ....మాటరేంటే?" బయటకొచ్చాక మర్యాదగా అడిగారు.
"చెప్పాగా.... నేను మోడరన్ విరహిణి రాధలా ఫ్యాన్సీ డ్రస్ ప్రోగ్రామ్ ఇస్తున్నా!"
"అంటే.... గ్రూప్ డాన్స్ లోకి రావా?" జ్ఞాపిక అడిగింది.
"రాను! నాదంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి. నేనంటూ స్పెషల్ గా గుర్తించబడాలి. దీన్నే 'సెల్ఫ్ ఐడెంటి ఫికషన్' అంటారు. ఈ జనరేషన్ కు కావలసిన ముఖ్యమైన మానసిక బలిమిది. మీకు లేదులే అది! మీరు గ్రూప్ డాన్స్ చేసుకోండి!" అని స్టైల్ జుట్టు వెనక్కి జరుపుకుంది.
"నీ మొహంఁ.... నీకంటే నాకు ముందే వచ్చేసిందది! నేను లంబాడీ గళ్ ఫ్యాన్సీ డ్రస్ వేస్తున్నా!" తెలీకుండానే తన రహస్యం చెప్పేసింది.
"ఏం బాడీ....లంబాడీనా? వెరీగుడ్! వెరీగుడ్! నీకు బాగా సూటవుతుంది!" స్ఫూర్తి.
పర్ ఫార్మెస్ చూస్తే అదిరిపోతారు. బ్యాగ్రౌండ్ లో ఆనంద్ పాడతాడు. డయాస్ మీద నేను డాన్స్ చేస్తా! మగగొంతు, ఆడడాన్స్... న్యూ కాంబినేషన్ పాట.... చెప్పాలా!" అని బుక్ విసిరేసి కుర్చీ పక్కకునెట్టి హ్యాంగర్ కున్న జ్ఞాపిక లాంగ్ మిడ్డీ- నైటీ మీదే వేసుకుని లంగా లాగా కొసళ్లు పట్టుకుని బట్టలాగా చేసి గబుక్కున లేచి అతి స్పీడ్ గా ఫోక్ స్టెప్స్ తో ఎగరసాగింది.
"లాడియో... యాడియో...లంబాడియో!
నీ అద్దాల జాకెట్టు అద్దమేల మెరిసింది
లాడియో... యాడియో...లంబాడియో!
నీ కుచ్చెళ్ళ లంగాకు కులుకెవరు నేర్పింది
లాడియో... యాడియో...లంబాడియో!
ఆ కులుకులకు నా మనసు కువకువ లాడింది
లాడియో... యాడియో...లంబాడియో!
ఏయ్ఁ పిల్లా.... వస్తావా వస్తావా వస్తావా
మునిమాపు ఆశలెన్నో తెస్తవా తెస్తవా తెస్తవా!"
ఏ కాలూ నేలమీద ఆగకుండా చేతులు, కడియాలు కదుపున్నట్లు రేవతి లంబాడీ స్టెప్స్ వేస్తుంటే... స్ఫూర్తి తల తుడుచుకోవడం మరిచిపోయి.., కామినీ, జ్ఞాపిక నోరు మూసుకోవడం మరచిపోయి చూడసాగారు.
డాన్స్ అయిపోయాక రొప్పుతూ- "రోజూ ప్రాక్టీస్ చెయ్యి, ఫేర్ వెల్ నాటికి నువ్వు స్లిమ్ గా అయిపోతావ్' అన్నాడు ఆనంద్!" అని గర్వంగా చెప్పింది.
"మరి! ఈ ఎగురుడుకు స్లిమ్ కాకేం చేస్తావ్...డాన్సయితే కదా!" స్ఫూర్తి నిరాశపడింది. తనదే ఎక్సపర్ మెంటనుకుంది. రేవతి కాంపిటీషన్ కు వస్తుందనుకోలా!
"నాది ఎగురుడు! నీది డాన్సా! నీ మొహం చూస్తే కుళ్ళు కొబ్బరికాయ గుర్తొస్తుంది నాకు!" రొప్పుతూ చెప్పింది.
"అలా బయటికెళ్లవే... కారిడార్ లో చల్లగాలికి కొంచెం ఆయాసం తగ్గుతుంది!" జ్ఞాపిక సలహా ఇచ్చింది. రేవతి బయటికెళ్ళింది. వెనకాలే స్ఫూర్తీ వెళ్లింది- మళ్లీ తగాదాకి ఏదో ఐడియా వచ్చుంటుంది.
"వీళ్ళిద్దరూ ఇలా విడివిడిగా ప్రోగ్రామ్స్ ఇస్తే మరి గ్రూప్ డాన్స్ ఎలా చేస్తామే?" జ్ఞాపిక అంది.
"మనిద్దరమే చేద్దాం!"
"ఛ! ఇద్దరే ఏం బావుంటుంది? కనీసం నలుగురయినా ఉండాలి. లేపోతే గ్రూప్ డాన్స్ లా ఉండదు. డ్యూయె ట్ లా ఉంటుంది!" జ్ఞాపిక నిరుత్సాహపడింది.
"ఐడియా! మనిద్దరం ఒక మంచి డ్యూయట్ కు యాక్షన్ చేద్దాం!"
"ఏంటీ... ఇద్దరమ్మాయిలు కలిసి ఒక డ్యూయెట్! చెప్పులూ. కోడిగుడ్లూ విసిరి మరీ కొడతారు!"
"కాదు. ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి!" కామిని ఎక్స్ ప్లైన్ చేసింది.
"అదెలాగే...?"
"నేను క్రాంత్ డ్రస్ వేసుకుని అబ్బాయి..., నువ్వు అమ్మాయి! కాలేజ్ గర్ల్ అండ్ బాయ్ డ్యూయెట్! అదిరిపోద్ది డయాస్ డాన్స్ తో, ఆడియన్స్ చప్పట్లతో!" కామినికి ఉషారొచ్చింది.
"మరి పాట...?"
"మోడరన్ ఆఫ్రికన్ డ్రమ్స్ కలిసిన ధనాధన్ స్టెప్స్ తో ఉన్నది!"
"నేను రెడీ! పాట కంపోజ్ చేసుకుని సింగర్స్ తో ప్రాక్టీస్ చేయించాలి."
"య్యా.... చెలో! మనం కూడా ప్రిపరేషన్ లో పడదాం!"
ఇద్దరూ లేచి సీరియస్ గా కైనటిక్ తీసుకుని ఎక్కడికెళ్లారో కారిడార్ లోని స్ఫూర్తికీ, రేవతికీ అర్థంకాలా!
వస్తూ వస్తూ ఒక ప్రైవేట్ కాసెట్ పట్టుకొచ్చారు. అది వింటుంటే దాని స్పీడ్ ముందు రేవతి, స్పూర్తీ స్టెప్స్ డల్ గా అనిపించసాగాయి.
"కానీ, ఈ స్పీడ్ అందుకోగలమంటావా మనం?" కామినికి భయంవేసింది.
"అందుకోవాలి! లేపోతే వీళ్ళద్దరి దృష్టిలో మనం దద్దమ్మలం అయిపోతాం రేపట్నుంచీ 'కర్ట్ బాత్' అని పిలుస్తారు మనల్ని!" జ్ఞాపిక ఎంకరేజ్ చేసింది. కామిని భయపడుతూనే కమిటయింది.
"వాళ్ళు రూమ్ లో లేనపుడు ప్రాక్టీస్ చేద్దాం! సస్పెన్స్!" జ్ఞాపిక అంది.
ఒప్పుకుంది కామిని.
తలూపి క్యాజువల్ గా కాసెట్ పెట్టారు.
"కళ్ళల్లోనా కాంపేసి
ధిధిక్ ధిన్ ధిధిక్ ధిన్ ధిన్
గుండెల్లోనా గుడిసేసి
ధిధిక్ ధిన్ ధిన్ ధిధిక్ ధిన్
కబుర్లు చెప్పి గుబుర్లు రేపి
గుటకేయిస్తున్నావ్!
ఏ వూరు నీది? అరె ఏం పేరు నీది?
క్యాంపసంతా గాలించి
తకథై తకధిమి
తకథై తకదిమి
క్లాస్ రూమ్ లో పట్టేసి
తకథై తకధిమి
తకథై తకధిమి
తికమక పెట్టి మకతిక రేపి
మతి తింటున్నావ్!
మావిళ్ళ దారి, మాది కోయిళ్ళ జాతి!"
"ఇదేంటే....ఆఫ్రికన్ డ్రమ్స్, కూచిపూడి తబలా కలిసింది?" కంగారుపడింది కామిని.
"అదే స్పెషాలిటీ! ఆఫ్రికన్స్ డ్రమ్స్ నీవి. కూచిపూడి స్టెప్స్ నావి!"
"సారీ సారీ....కూచిపూడి స్టెప్స్ నావి, ఆఫ్రికన్ డ్రమ్స్ నీవి!"
"నువ్వబ్బాయివే! కూచిపూడి కంటే ఆఫ్రికన్ స్టైలే బావుంటుంది. అమ్మాయికి ఆఫ్రికన్ డ్రమ్స్ బావుండవే! ప్రభుదేవా లెవెల్లో చెయ్యాలి నువ్వు. భానుప్రియ లెవెల్లో నేను చేస్తా!"
"సారీ.... నేను అబ్బాయిగానే భానుప్రియ లెవెల్లో చేస్తా! నువ్వు అమ్మాయిగానే ప్రభుదేవా లెవల్లో చెయ్యావే! ప్లీజ్ ప్లీజ్....నాకు ఆఫ్రికన్ డ్రమ్స్ కు స్టెప్స్ రావే! వెయ్యలేనే...!" జ్ఞాపిక గడ్డం పట్టుకుంది.
"అలా వేస్తే ఆడియన్స్ ఇద్దర్నీ కలిపి వాయిస్తారే!"
"అప్పుడు అండమాన్ స్టెప్స్ వేద్దాం!" అంది కామిని.
"అవేంటే..?" అర్థంకాలా జ్ఞాపికకు.
"మరేం లేదూ! జీవిత ఖైదీలు జైల్లోంచి పారిపోయినట్టు పారిపోవడం.... అండమాన్ స్టెప్సంటే!"
"సరేలే....అబ్బాయి కూచిపూడి! అమ్మాయి ఆఫ్రికన్ డ్రమ్స్! సరే...ఇదో కొత్త ప్రయోగం!" పాటలోని రిథమ్ ను మార్చడంలో, తమకు వెనకాల సైడ్గాంగ్ ను సెలెక్ట్ చేయడంలో మునిగిపోయారు ఇద్దరూ.
"ఏయ్ఁ.... మీసా లెలాగే?" కామిని కంగారుపడింది.
