"రేవతిని పూల్ ను చేసినపుడు తయారుచేసినవి ఉండాలిగా!" అని వెతికింది. డెస్క్ లో దొరికాయి. వాటిని మూలనున్న ఎర్రకాగితంలో ప్యాక్ చేసి పెట్టింది డెస్క్ లో.
ఆ కాగితం మీదున్న రాతల మీదకి దృష్టి పోలేదు. మీసాలు ప్యాక్ చేయడంలో అక్షరాలు కిందవైపు ఉండిపోయాయి.
19
ఇయర్ ఎండింగ్..!
స్టూడెంట్స్ ఎండలతోపాటు సబ్జెక్స్ తో కూడా వేడెక్కి పోయారు. వంటి మీద, భోజనం మీద ధ్యాస పోయింది. సంవత్సరం చదువుకు ముగింపురోజులు!
జూనియర్ సీనియర్స్ కావడానికీ, సీనియర్స్ డిగ్రీలు చేత్తో పట్టుకోవడానికి ఆరాటంతో పోరాటం చేస్తున్నారు. ఎవరికివారే వాళ్ళ రికార్డులు సాధించుకోవడానికి తొందరపడుతున్నారు...., పోటీ పడుతున్నారు.
వాళ్ళతోపాటు ప్రొఫెసర్స్ కి కూడా ఒక విధమైన సీరియస్ నెస్ వచ్చేసింది. ఒక బ్యాచ్ యూనివర్శిటీ నుండి సమాజంలోకి రాబోతుంది. ఒక జనరేషన్ జాబ్స్ కో, పైచదువులకో మెట్లెక్కబోతోంది.
ఆ హడావిడిలోనే కాలేజ్ ఫంక్షన్ ఫేర్ వెల్!
జూనియర్స్ సీనియర్స్ ని సాగనంపడానికి ఎన్నో ఏర్పాట్లు... ఎన్నో ఆనందాలు! ఎన్నో అభినందనలతో ఏర్పాటుచేస్తున్న కార్యక్రమం!
జూనియర్స్ కు ఆనందం- తాము కాబోయే సీనియర్స్ మని! సీనియర్స్ కు బాధ- తాము కాబోయే ఎక్స్ స్టూడెంట్స్ మని! జూనియర్స్ కాకాకొట్టి సీనియర్స్ నోట్స్ లు బుక్ చేసుకుంటున్నారు. తమ నోట్సులు టాలెంటెడ్ వాళ్ళకే చెందాలనీ, అప్పుడే సార్ధకత....అని సీనియర్స్ జాగ్రత్త పడుతున్నారు.
యూనివర్శిటీ క్యాంపస్ లో డయాస్ ని జూనియర్స్ అదృతంగా డెకరేట్ చేశారు. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కో రెస్పాన్సిబిలిటీ తీసుకుని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియర్స్ ఏదైనా పనిచెయ్యబోతే "ప్లీజ్..." అని వారిస్తున్నారు గౌరవంగా!
ప్రొఫెసర్స్ స్పీచెస్ ఇచ్చారు సీనియర్స్ కు- 'మీరు జీవితంలో గొప్పగొప్ప స్థానాలలోకి చేరి,- మా యూనివర్శిటీ స్టూడెంట్- అని చెప్పుకోవడానికి గర్వకారణంగా మిగలాలి!'.... అనే బేసిస్ పైనే అందరూ కాన్ సన్ ట్రేట్ చేశారు. 'మీరు ఏ దేశాల్లో ఉన్నా జీవితాంతం మీ స్టూడెంట్ లైఫ్ మాతోనే, మీ మధురానుభూతులలోనే పెనవేసుకుని ఉంటా, యని తెలియచేశారు. అందరు ప్రోఫెసర్స్ దేశదేశాల్లో మన దేశ ఖ్యాతిని నిలపమన్నారు. క్లాప్స్ తో క్యాంపస్ దద్దరిల్లింది.
డయాస్ మీద గెస్ట్ లు ఖాళీ అయ్యాక కల్చరల్ ఐటమ్స్ స్టార్టయ్యాయి.
"ప్రోగ్రామ్ ఇచ్చే స్టూడెంట్స్ మేకప్ రూమ్ లో హడావిడి పడిపోతున్నారు. తమ ప్రోగ్రామ్ కు తగినట్టుగా డ్రస్ ఉందా, లేదా.... మేకప్ కుదిరిందా, లేదా....అని పదేపదే అద్దంలో చూసుకుంటూ- ఇటుది అటూ, అటుది ఇటూ మార్చుకుంటూ పట్టిన చెమటలు అద్దుకుంటూ- పోయిన మేకప్ సర్దుకుంటూ!
ముందు కొన్ని పాటలూ, బాయ్స్ కు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్సూ జరిగాయి. వయోలిన్ రాగాలు పలికాయి! గిటార్ శృతులు గమకించాయి. మోనోయాక్షన్, మిమిక్రీ ప్రోగ్రామ్ అన్నీ అయ్యాక- డాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్య్యాయి.
తమతమ క్లాస్ మేట్స్ పెర్ ఫార్మెన్స్ చూడాలని ఏ గ్రూప్ కు ఆ గ్రూప్ ఎదురుచూస్తోంది. తమ క్లాస్ మేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే క్లాప్స్ తో ఇన్వైట్ చేసి ఎంకరేజ్ చేసి క్లాప్స్ తో పంపిస్తున్నారు.
అనౌన్స్ మెంట్ అతి నైపుణ్యంగా, తియ్యగా, మెలోడియస్ గా, కామెడీ గా సాగుతోంది!
వీళ్ళ నలుగుర్లో ముందుగా స్ఫూర్తి ప్రోగ్రామ్!
"నౌ! మిస్ స్ఫూర్తి... యాజె రాధిక! స్ఫూర్తీ మీ ఫ్రెండ్.... మోడరన్ రాధికలా మీకు కొత్త ప్రోగ్రామ్ ప్రెజెంట్ చెయ్యబోతోంది! ఈ ఎక్స్ పెరిమెంట్ ని మీరెంతవరకూ ఎంజాయ్ చేస్తారో చూద్దాం!" అని!
"మిస్ స్ఫూర్తి... యాజె గోపిక!" గట్టిగా అనౌన్స్ మెంట్.
స్ఫూర్తి గొల్లమేట్స్ డ్రెస్ లో , పెద్ద జడతో, కడవ నడుం మీద పెట్టుకుని డయాస్ మీదకు వచ్చింది. క్లాస్ మేట్స్ అంతా క్లాప్స్ గోల!
ఈష్ లాస్ట్ రోల్ లో కూర్చుని చూస్తున్నాడు స్ఫూర్తిని! 'ఎంతందంగా ఉందీ... రెండు కళ్ళూ చాలడం లేదు.... తను కృష్ణుడయిపోతే బావుండు!' అని నవ్వుకున్నాడు.
క్లాస్ మేట్స్ క్లాప్స్ తో రిథమ్ స్టార్ట్ చేశారు. ఈష్ కోసం వెతికాయి స్ఫూర్తి కళ్ళు! ఆ వెతకడం కనిపెట్టి లాస్ట్ రోల్ లోంచి బొటనవేలు ఎత్తి సైగ చేశాడు- 'డన్' అని!
అంతే....మ్యూజిక్ స్టార్టయింది. పాదాలు నేలమీద ఆనకుండా నడుం క్షణంసేపు నిలపకుండా ఫాస్ట్ మూవ్ మెంట్స్ తో క్లాసికల్, వెస్టర్న్ కలిపి డాన్స్ స్టార్ట్ చేసింది.
క్లాస్ మేట్స్ కొందరు లేచి వాళ్ళూ డాన్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. గర్ల్స్ షోల్డర్స్ కదిలిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దూరంనుండి ఈష్ అలాగే చూస్తూ ఉండిపోయాడు.
"గోపాలా... గోపాలా!" అని వచ్చినపుడల్లా- అందరూ "అలకెట్ట ఆపాలా!" అని, "చెప్పాలా.... చెప్పాలా!" అన్నపుడు- "గుండె గోల చెప్పాలా!" అనీ రెస్పాన్స్ ఇస్తున్నారు.
అలా ఆగకుండా డాన్స్ చేసి, స్టైల్ గా ఆడియన్స్ కు వంగి నమస్కరించి, కడవ పట్టుకుని థాంక్స్ చెప్పి, మేకప్ రూమ్ లో కెళ్లిపోయింది స్ఫూర్తి!
ఒకటే క్లాఫ్స్!
"వన్స్ మోర్...!" అని అరుపులు.
ఈష్ కళ్ళల్లో ఆనందబాష్పాలు! గబగబా మేకప్ రూమ్ వైపు వచ్చాడు....కంగ్రాట్స్ చెప్పాలని! లోపలికి రానీయకుండా అమ్మాయిలు అడ్డుకున్నారు. "జెంట్స్ రావద్దండీ! మేం డ్రస్సప్పవుతున్నాం...! అని!
వెళ్లి మళ్లీ సీట్ కూర్చున్నాడు.
"మిస్ రేవతి... యాజె లంబాడీ గర్ల్! తన ప్రియుని గొంతుకు ప్రియురాలు పరవశ నృత్యం!"
ఆనంద మైక్ దగ్గరికెళ్లాడు పాడటానికి!
రేవతి లంబాడీ లంగా, వెనుక ఓపెన్ ఉన్న అద్దాల జాకెట్, పైనుంచీ చున్నీ, కాళ్లకూ- చేతులకూ తెల్లటి పెద్దపెద్ద లంబాడీ గాజులూ, చెవులకు జూకాలు.... అచ్చం లంబాడీ అమ్మాయిలానే ఉంది. బొద్దుగా, నిండుగా ఉన్నా - చకచకా గ్రూప్ తో సహా వచ్చి "లాడియో....యాడియో....లంబాడియో!" అని స్పీడ్ గా డాన్స్ చేస్తుంటే- బంతిపూల దండ ఎగురుతున్నట్లనిపించింది ఆనంద్ కు.
"క్లాస్ మేట్స్ కూడా "లాడియో.... యాడియో.... లంబాడియో!" అని ఎగరసాగారు!
ఈష్, క్రాంత్, రేవంత్ లు - 'ఆనంద్ గొంతు డాన్స్ కు సరిగ్గా సరిపోయింది' అనుకుంటుండగా జ్ఞాపిక వచ్చింది హడావిడిగా! తను మోడరన్ డ్రెస్ లో వుంది డాన్స్ కు రెడీ అయిపోయి! కుచ్చుకుచ్చుల మ్యాక్సీ, పెద్ద పూలదండ లాంటి చున్నీ నడుం చుట్టూ తిప్పి పట్టుకుని, హైహీల్సేసి పుల్ మేకప్ లో వచ్చి-
"రేవంత్....ప్లీజ్- మా రూమ్ కెళ్లి మీసాలు పట్రావా! దీని తర్వాత మాదే ప్రోగ్రామ్! మేం మీసాలు మార్చిపోయాం! కామినికి మీసాలు కావాలి!" బ్రతిమాలింది. "తొందరగా వెళ్లు....ప్లీజ్!" తొందరచేసింది.
గబగబా బయటికొచ్చి ఫ్రెండ్స్ తో "నేనిప్పుడే వస్తా..." అనిచెప్పి బైక్ స్టార్ట్ చేశాడు.
స్పీడ్ గా హాస్టల్ కు వచ్చి మేడమ్ కు చెప్పాడు- "జ్ఞాపిక రూమ్ డెస్క్ లో మీసాలు ప్యాక్ చేసి ఉన్నాయట. అవి కావాలిట!" అని!
మేడం అయాని పంపించి తెప్పించింది.
ఎర్రటి కాగితాన్ని పట్టుకుని జేబులో పెట్టుకొబోతూ అక్షరాల మీద కళ్ళుపడి మడత విప్పాడు. అది చదవగానే ఒంటిమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఒక్క పరుగున బైక్ దగ్గరికెళ్లి బైక్ స్టార్ట్ చేసి క్షణంలో మాయమయ్యాడు.
"రేవంత్ క్యాంపస్ లోకి వెళ్లేసరికి రేవతి డాన్స్ అయిపోయి అనౌన్స్ మెంట్ స్టార్టయింది.
"నెక్ట్స్ ప్రోగ్రామ్- జ్ఞాపిక అండ్ కామినీ... యాజె లవ్వర్స్! టీజింగ్ సాంగ్ అండ్ డాన్స్ విత్ ఆఫ్రికన్ డ్రమ్స్ అండ్ ఇండియన్ తబలా స్టెప్స్!" అని.
మీసాల కోసం చూసిచూసీ మీసాల్లెకుండానే రేవంత్ ను తిట్టుకుంటూ డయాస్ మీదకు వచ్చారు... తమ గ్రూప్ తో సహా!
రికార్ట్ స్టార్ట్ అయి రెండు నిముషాలు అయ్యాక సడన్ గా కరెంట్ పోయింది.
టోటల్ క్యాంపస్ చీకటి! హాలంతా విజిల్స్ గోల!
రేవంత్ హాల్లోకి వచ్చాడు. ఏం జరుగుతోందో తెలీదు. ఎవరో రేవంత్ ను రాసుకుంటూ వెళ్లారు. ఆ రాసుకోవడంలో అతని చేతికి గుండ్రంగా అమర్చుకున్న ఇనుపరాడ్ తో చేసిన రింగ్ రేవంత్ రిబ్స్కు తగిలింది గట్టిగా! అలాటి రాపిడితో ఒక గాంగ్ వెళ్లినట్లనిపించింది తన ముందు నుండి.
జరుగుతూంది.... మళ్లీ మారణహొమం జరుగబోతూంది. ముందుగా తెలిసీ జరగబోతోంది! ఆపాలి.... ఎలా?
చీకట్లోనే "ఈష్..!" అని అరిచాడు. ఆ గోల మధ్య ఏవీ వినిపించలా! కుర్చీ మీదకెక్కి రెండుచేతులూ మైక్ లా పెట్టి "ఈష్..." అరిచాడు!
"య్యా.... అయాం హియర్!" మూలనుండి ఆన్సర్ వచ్చింది! ఒక్కుదుటన వెళ్లాడక్కడికి! ఈష్ ఎదురొచ్చి డాష్ ఇచ్చాడు. ఆ స్పర్శ గుర్తు పట్టాడు రేవంత్.
"ఈష్... ఆ గాంగ్ జ్ఞాపీని, స్ఫూర్తినీ ఎత్తుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు!"
"వ్వాట్? నీకెలా తెలుసు...?"
"వాళ్ళు వార్నింగ్ లెటర్ రాశారు! వీళ్ళు చూసుకున్నట్టు లేదు! కరెంట్ కూడా అందుకే పోయినట్లుంది! స్ఫూర్తిని పట్టుకో! నేను జ్ఞాపికను వెతుకుతా!" అని ఫాస్ట్ గా మూవ్ అయి వెళ్లిపోయాడు.
ఈష్ ఎలర్ట్ అయ్యాడు! క్రాంత్ జాయిన్ అయ్యాడు.
ఎక్కడే మవుతోందో తెలీడంలా! ఎవరెక్కడున్నారో తెలీడంలా! గుంపు గోల...!! మేకప్ రూమ్ వైపు రన్ చేశారు ఇద్దరూ!
డయాస్ మీదకు రావడంతోనే కరెంట్ పోవడంతో- జ్ఞాపిక, కామినీ అండ్ గాంగ్ కంగారుపడ్డారు! జనరేటర్ ఆన్ అవుతుందనుకున్నారు. కానీ, అక్కడొక మనిషి దాన్ని ఆన్ కానివ్వడం లేదని వీళ్ళకూ తెలీలా!
"కామీ ...ఎక్కడే?" చీకట్లో వెతికింది జ్ఞాపిక. నలుగురు మనుషులు తనను అమాంతం ఎత్తుకున్నట్లయితే- "ఏయ్ఁ... వాటీస్ దిస్! హు ఆర్ యు?" అని అడిగేలోపలే మోసుకెళ్లసాగారు. గింజుకుని అరవాలని ప్రయత్నించింది. ఒకడు నోటిని గట్టిగా మూసేశాడు. నాలుగువైపులా పిడికిలి చుట్టూ బిగించి పట్టుకున్న ఐరన్ రింగ్ తో కడుపులో కుమ్మారు. మెత్తటి పొట్టకు ఆ మొరటు వత్తిడి మెలితప్పింది- "అమ్మా" అనరిచింది.
దూరంగా ఎక్కడో వెతుకుతున్న రేవంత్- లీలగా జ్ఞాపిక గొంతు వినిపించి అక్కడికి చేరేలోపు వాళ్ళు జ్ఞాపికను అక్కడ్నుంచి మోసుకెళ్లారు.
స్ఫూర్తి మేకప్ రూమ్ లో గోపిక డ్రెస్ మార్చుకోవాలని చున్నీ తీసి తలకూ, జడకూ ఉన్న పూలు తీస్తుంటే కరెంట్ పోయింది. "అయ్యో... జ్ఞాపిక, కామినీ ల ప్రోగ్రామ్ కదా.... ఇప్పుడెలా?" అనుకుని డయాస్ వైపు రాబోతుంటే... తన తీసేసినా చున్నీనే తనచుట్టూ ముసుగుగా కప్పి తనను గాలిలోకి మోసుకెళ్తున్నట్టు పైకెత్తి- ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలీక తను గింజుకున్నా. అరిచినా ఎవరికీ వినిపించలా! ఎవరి గోల వాళ్ళదిగా ఉంది! కరెంట్ పోగానే ఆన్ అవ్వాల్సిన జనరేటర్ ఎందుకు ఆన్ కాలేదో అర్థంకాలా!
"జ్ఞాపీ! జ్ఞాపీ..." అంటూ రేవంత్ ఎంత అరిచినా రెస్పాన్స్ లేదు- డయాస్ మీద!
రేవంత్ ప్రోఫెసర్స్ వుంటారనుకున్న వైపు నడిచాడు.... తొందరగా జనరేటర్ ఆన్ చయించాలని! జనరేటర్ ఆపరేటర్ ను వెతుకుతూ జనరేటర్ వైపు వెళ్లాడు. అంతలో... కాలికో మనిషి తగిలితే వంగి చూశాడు. కాలేజ్ లాబ్ బాయ్! జనరేటర్ అతనే ఆన్ చేసేది!
అతన్ని తట్టి లేపడానికి ట్రై చేశాడు. తాకిన చోటల్లా వేడిగా తడిగా తగలసాగింది. జేబులోంచి ఏదో తగిలింది. అగ్గిపెట్టె! అది కూడా తదిచింది. 'అది రక్తం...' అని ఐడియా రాగానే ఇంకా టెన్షన్ పెరిగింది....'ఇదేదో పెద్ద కుట్ర లాగుంది' అని!
ఇమ్మీడియట్ గా ఒక ఆలోచన! షర్ట్ విప్పాడు క్విక్ గా! అగ్గిపెట్టి నెలాగో గీసీగీసీ వెలిగించాడు. షర్ట్ కొసలకు అంటించాడు. అది అంటుకుని చీకట్లో వేలాడుతున్న కాగడాలా వెలగసాగింది. ఆ వెలుతుర్లో డయాస్ మీద నిలబడి-
"మై డియర్ ఫ్రెండ్స్! ఎవ్వరూ ఎక్కడికీ పోవద్దు! ఇక్కడొక రేప్ గాంగ్ గర్ల్స్ ను కిడ్నాప్ చేసింది. మీరంతా కో ఆపరేట్ చేయాలి. వెంటనే యూనివర్సిటీ గేట్ క్లోస్ చేసి కంపౌండ్ వాల్ ను మనం చుట్టుముట్టాలి. వాళ్ళకు బయటకు వెళ్లే ఛాన్సుండకూడదు. ప్లీజ్....కో ఆపరేట్ వితస్! మీ ఫ్రెండ్స్ కోసం మీరీ పని చెయ్యాలి. మన జనరేషన్ కు ఇదొక సవాలు! ఇద్దరమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. బయటకెళ్లక ముందే ఆ గాంగ్ ను ఆపాలి! ఆపండి! ఆపండి! స్టూడెంట్స్ సత్తా ఏవిటో చూపండి! మనమధ్య మనం పెంచుకున్న అభిమానం విలువ తెలియచేయండి. ఆపండి....ప్లీజ్ వాళ్ళను ఆపండి!" ఆపకుండా అరుస్తూ కామెంట్రీ ఇస్తూనే ఉన్నాడు రెచ్చిపోయిన గొంతుతో!
స్టూడెంట్స్ లో అలజడి తగ్గింది! గ్రూప్స్ గ్రూప్స్ గా కాంపౌండ్ వాల్ వైపు రన్ చేశారు. ఆడామగా తేడా లేదు! అందరూ స్రవంతై కలిశారు.
యూనివర్శిటీ గేట్ మూయబడింది. గేట్ కి అవతల రెడీగా ఉన్న జిప్సీ పరారయింది.
చీకట్లో స్టూడెంట్స్ తమ దగ్గరున్న అగ్గిపెట్టెల్తో అందరి షర్ట్స్ విప్పి ఒక్కొక్క షర్టూ అంటింఛి ఆ వెలుగులో కాంపౌండ్ వాల్ ను చుట్టుముట్టారు. పెట్టేస్ ఉన్న గర్ల్స్ తమ షర్ట్స్ కూడా విప్పి వాళ్ళకిచ్చారు. ఆ వెలుతురు పట్టపగలైంది!
స్పృహ తప్పిన ఇద్దరమ్మాయిలను మోసుకుని గేటువైపు కదులుతున్న కొన్ని ఆకారాలు ఆ వెలుతుర్లో కనిపించాయి. వాళ్ళెవరన్నది ముఖ్యంకాదు. వాళ్ళ పేర్లు అక్కర్లేదు. ఇద్దరు అమ్మాయిలు...అంతే! తమ కాలేజీ స్టూడెంట్స్...అంతే! బలవంతంగా తీసుకెళ్లబడుతున్నారు.
అంతే...ఉద్రేకం పెట్రేగింది స్టూడెంట్స్ అందరూ అటువైపు మండుతున్న షర్టులను వెలిగే జండాలుగా పట్టుకుని పరుగెత్తారు. రేవంత్ హైపిచ్ లో అరుస్తూనే ఉన్నాడు.
"స్టాప్ దెమ్...స్టాప్ దెమ్! మన ఫ్రెండ్స్ ను కాపాడండి! వాళ్ళను ఆపండి! వాళ్ళను ఆపండి.... మన స్నేహపు గౌరవం నిలబెట్టండి!" వాళ్ళను ఆపండి.... మన స్నేహపు గౌరవం నిలబెట్టండి!" అదే పిచ్ లో స్టూడెంట్స్ ను రెచ్చగొడుతూనే ఉన్నాడు. క్రాంత్, ఈష్, ఆనంద్ కూడా గొంతెత్తి "స్టాప్ దెమ్!" అని అరుస్తూనే ఉన్నారు.
రేవంత్ స్పీడ్ గా వెళ్లి ఆ గాంగ్ ను చేరుకొని జ్ఞాపికను లాక్కోబోయాడు.
ఐదు ఇనుపరాడ్స్ చుట్టుబడి చేతులు అతని కడుపులో బలంగా దిగాయి.
"అమ్మా..." అని వెనక్కి విరుచుకుపడేంతలో వెనుకనుంచి స్టూడెంట్స్ గ్రూప్ వచ్చి వాళ్ళను చుట్టుముట్టి ఎటాక్ చేసింది!
నెప్పికి తూలిన రేవంత్ పైకి జ్ఞాపిక జారిపడింది. జ్ఞాపిక నలాగే పొదివి పట్టుకుని కడుపులో దిగిన ఇనుపరాడ్స్ మూలంగా వచ్చిన రక్తం- షర్ట్ లేని శరీరం నుండి కిందకు జారుతుంటే.... ఆ గుంపులోంచి బయటకు లాక్కొచ్చాడు.
క్రాంత్, ఈష్, ఆనంద్..., స్ఫూర్తిని లాక్కొచ్చారు. కామినీ రేవతీ జాయినయ్యారు. జ్ఞాపికను, స్ఫూర్తినీ వాళ్ళకి అప్పచెప్పారు.
కడుపులోంచి కారుతున్న రక్తం చూసి ఓ అమ్మాయి చున్నీ తీసి రేవంత్ కడుపుకు బిగించికట్టింది. స్టూడెంట్స్ అందరూ పిచ్చి ఆవేశంతో ఆ గుంపును కొడుతుంటే అందులోకి వెళ్లబోయారు. కానీ వీలుకాలా! ఎవర్ని ఎవరు కొడుతున్నారో తెలీడంలా! మొత్తానికి చితకగొడుతున్నారు. అలా అరగంట జరిగింది. కాళ్లతో కుమ్మరిమట్టి తొక్కినట్టు తొక్కితొక్కి చిందులు వేస్తున్నారు. ప్రళయ నృత్యమూ, ప్రణవ గణమూ, ప్రథమ నాదమూ ఏకమయినట్టు ఉన్మాదంగా ఉద్రేకపడుతూ ఉన్మరుత్తులను ఊపిరితీస్తున్నారు.
"ఏఁ.... ఏఁ... ఏఁ..." అని అరుపులు తప్ప ఏవీ వినిపించడంలా!
"ఏఁ..." అనే నినాదం విప్లవశంఖమై పూరించబడింది.
స్టూడెంట్స్ లోని ఆ ఆవేశాన్ని, కోపాన్ని ఆపాలని ప్రొఫెసర్స్ అరుస్తూ చుట్టుముట్టారు. ఇంతలోకి జనరేటర్ ఆపరేట్ చేశారెవరో! గుంపంతా అరుస్తూ వెనుకకు మరిలింది.
