జ్ఞాపిక కూడా క్లాప్స్ కొట్టింది.
జ్ఞాపిక చెయ్యి పట్టుకుని "థాంక్యూ...థాంక్యూ జ్ఞాపీ!" రెండుచేతుల్నీ ముద్దు పెట్టుకున్నాడు.
"మమ్మా.... నువ్వెలాటి కోడల్ని తెచ్చినా కళ్ళు మూసుకుని హారతిస్తాననన్నావు గుర్తుందా?"
"ఎందుకు గుర్తులేదురా? నీ సెలెక్షన్ మీద నాకు నమ్మకముంది."
"నేనూ-నువ్వు ఎలాటి డాడీని తెచ్చినా హారతిచ్చి ఆహ్వానిస్తా మమ్మా!" ఉద్వేగంగా చెప్పాడు.
"సర్లే! జ్ఞాపికకి లేటవుతోంది. మళ్లీ వార్డెన్ తో తిట్లు పడతాయి. డ్రాప్ చేసి వార్డెన్ ను కలిసి రా!" అంది టాపిక్ ఆపేయాలని.
"బై మమ్మా.... గుడ్ నైట్!" అని జ్ఞాపిక బైక్ మీదెక్కింది.
ఒక్క ఉదుటున స్టార్ట్ చేసి ముందుకు దూకించి స్పీడ్ గా వెళ్లసాగాడు.
"మెల్లగా..!" జ్ఞాపిక హెచ్చరించింది. అయినా స్పీడు ఆపలా! భయమేసి అలానే వీపుకు అతుక్కుపోయింది. హాస్టల్ కు కొంచెం ఇవతల ఆపి-
"జ్ఞాపీ... ఐ లైక్ యు! నా జీవితంలో మరచిపోలేని సాయం చేశావు. నా బ్రతుకు రాసిచ్చేస్తా నీ సాయానికి!" ఉద్వేగం అణుచుకోలేక అన్నాడు- తన చేతిని బిగించి పట్టుకుని!
"నీ జీవితం, నా జీవితమూ వేరుకాదుగా రేవంత్- నువ్వు నాకూ, నేను నీకూ రాసిచ్చుకోవడానికి! నీ ఇష్టాలూ, నా ఆశయాలూ, ఆశలూ అన్నీ కలబోసుకోబోయే వాళ్ళం. మనిద్దరికీ సంబంధించిన బాధ్యత ఇది. ఇద్దరం కలిసి నెరవేరుద్దాం! ఇందులో నువ్వు థాంక్స్ చెబితే నాకు హాయిగా, గిల్టీగా వుంటుంది!" లాలనగా చెప్పింది.
"గ్రేట్ జ్ఞాపీ.... యు ఆర్ గ్రేట్! అండ్ ఐయాం లక్కీ- వెరీవెరీ లక్కీ! నీలాంటి అమ్మాయి నాకు జీవిత భాగస్వామి అయితే ఎవరెస్ట్ నేక్కెస్తా ఈజీగా!" ఆనందం ఎంతాపుకుందామన్నా ఆగడంలా! గొంతులోంచి తన్ను కొచ్చేస్తోంది.
"అక్కడే ఉండిపోకు. తొందరగా వచ్చేయ్! లేపోతే నేను ముసల్దాన్నయిపోతా!" జోకేసింది.
"ఛ...నేనింత టచింగ్ గా చెబుతుంటే నీకు జోక్ గా ఉందా?! మనిద్దరం జీవితంలో కలిసి సాధించిన మొదటి విజయమిది.... తెలుసా?" సీరియస్ గా అడిగాడు.
"లేటయితే వార్డెన్ తిట్టిమరీ మరో విజయం సాధింపచేస్తుంది! నేను సరాసరి మీ ఇంటికొచ్చి కాపురం పెట్టి రెండోవిజయం పూర్తిచేయాల్సివస్తుంది!" అంది జ్ఞాపిక. రేవంత్ ఆనందం అర్థమవుతోంది తనకు. అతను అంత అనందంపడిపోతుంటే ఏమూలో భయం....' ఈ ఆనందం శాశ్వతమేనా?' అని! ప్రతి ఆడవాళ్ళకీ ఎందుకో ఈ సెంటిమెంట్ లాగి పెడుతుందెందుకో! వాళ్ళు ఎక్కువ దుఃఖాన్నే కాదు; ఎక్కువ ఆనందాన్నీ భరించలేరేమో!
"బై...." చెప్పిన రేవంత్ ను-
"జాగ్రత్తరా బిట్టూ! మెల్లగా వెళ్లు! జోష్ లో కళ్ళు మూసుకోకు!" అచ్చం మమ్మాలా చెప్పి, "బై...." చెప్పింది. ఈలపాట పాడుకుంటూ సాగిపోయాడు రేవంత్.
రూమ్ కెళ్ళేసరికి ముగ్గురూ సీరియస్ గా చదూకుంటున్నారు.
"ఏవిటేఁ... ఇంత లేటు? ఏదైనా సైటు సీయింగా?" స్ఫూర్తి అంది.
"అయుండదు. పైవ్ స్టార్ బిల్లేసి ఉంటుంది నెత్తిన!" రేవతి అంది.
"కాదులేవే! సీరియస్ గా ఉంది! ఏదో పోట్లాడుకునుంటారు!" కామిని అంది.
"దీన్తో పోట్లాడి గెలిచేదెవ్వరు పాపం! రేవంత్ జీవితం దీనికి బలి!" స్ఫూర్తి అందుకుంది.
"షటప్! నన్ను చెప్పనిస్తారా? మీకో గుడ్ న్యూస్! రేవంత్ మమ్మాని పెళ్ళికి ఒప్పించాం!"
"వావ్ఁ...! రియల్లీ గ్రేట్!వాటె గుడ్ న్యూస్! కంగ్రాట్స్!" చుట్టుముట్టి గట్టిగట్టిగా అరచారు. ఒకరి చేతికి ఒకరు చప్పట్లు కొడుతూ, జ్ఞాపిక చుట్టూ తిరుగుతూ- "మా జ్ఞాపీ పెళ్ళికూతురాయనే! మా రేవంత్ కు ఆజన్మ శిక్షాయనే!" అని కోరస్ గా పాడసాగారు.
"షటప్! మా పెళ్ళికి కాదు! ఆవిడ పెళ్ళికి!"
"ఓఁ...! నో...! తలలు పట్టుకు కూర్చున్నారందరూ.
వీళ్ళ అరుపులకు పక్కరూములవాళ్ళూ, వార్డెన్ వచ్చారు కంగారుగా. ఒక గుంపుయింది. "ఏవయింది.... ఏవయింది.... ఏవయింది?" అడిగారు కలగాపులగంగా!
"జ్ఞాపీ...ఏవయింది?" రేవతి.
"ఏవోఁ...? స్ఫూర్తీ ఏవయిందే?"
"నాకేం తెలుసు! కామీ.... ఏవయిందే?"
"షటప్!" నన్నడుగుతావేం? రేవూ.... ఏవయిందే?"
"అవునూఁ.... జ్ఞాపీ ఏవయిందే?" మళ్లీ సర్కిల్ స్టార్టయింది.
అప్పుడు ఏదో ఒకటి చెప్పాలని-
"లిజర్డ్! లిజర్డ్! గోడ మీంచి బల్లి దూకింది!" జ్ఞాపిక కంగారుగా చెప్పింది.
ఊహూఁ..! కిటికీలోంచి ఈవిల్ పిలిచింది!" రేవతి భయపడింది.
"షటప్!"
వార్డెన్ గట్టిగా అరిచి, "వాట్ హ్యపెండ్! ఒక్కరు...ఒక్కరు చెప్పండి! అంది.
"ఒకరి మొహం ఒకరు చూసుకుని కోరస్ గా-
"నథింగ్ మేమ్!" అన్నారు- వార్డెన్ కు కోపం రావడం - ఫేస్ ఎక్స్ ప్రెషన్ లో చూసి!
"సారీ మేమ్! అన్నారు మళ్లీ కోరస్ గా.
"ప్లీజ్! బి యాజ్ ఎ మెచ్యూర్డ్ పర్సన్స్! యు ఆర్ నాట్ చిల్డ్రన్!" అని వార్నింగిచ్చి వెళ్లిపోయింది.
"ఒకర్ని చెప్పమంటే- నేను చెప్తానుగా....నువ్వెందుకు మధ్యలో చెప్పావ్?" స్ఫూర్తి రేవతిని కొట్టింది.
"నేనే చెప్పేదాన్నిగా! నువ్వెందుకు చెప్పావ్?" రేవతి తగాదాకు దిగింది.
వెళ్తున్న వార్డెన్ వెనుకకు తిరగడంతో.... జ్ఞాపిక- స్ఫూర్తి నోరూ, కామిని- రేవతి నోరూ గట్టిగా మూసేశారు.... గింజుకుంటున్నా వదలకుండా!
18
ఫేర్ వెల్ సెలబ్రేషన్ లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ!
సీనియర్స్ సీరియస్ గా ప్రిపేరవుతుంటే... జూనియర్స్ ఫేర్ వెల్ సెలబ్రేషన్ ఏర్పాట్లలో హడావిడి పడుతున్నారు.
అందరికీ ఇన్ ఫామ్ చెయ్యడమైంది౦ కల్చర ల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసి పేట్ చేసేవాళ్ళు నేమ్స్ ఇమ్మనీ , ఇంకా ఇతర ఏర్పాట్లు సమర్థత ప్రకారం కొందరికి కేటాయించబడతాయని! కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఎవరెవరు ఏం చేస్తారన్నది సీక్రెట్ గా మెయిన్ టెయిన్ చెయ్యమనీ, అది సీనియర్స్ కూ, గెస్ట్స్ కూ సర్ ప్రైజింగ్ గా ఉంటుందనే ఆలోచన కూడా పంపించడమైంది అందుకే అందరూ సీక్రెట్ సీక్రెట్ గా తమ తమ ప్రోగ్రామ్స్ గురించి ఆలోచించుకుంటున్నారు.
స్ఫూర్తి ఎందుకో హడావిడి పడుతోంది. అడిగినా చెప్పే మూడ్ లో లేదని అడగ లేదెవ్వరూ! బాత్ రూమ్ లోకి పెట్టేస్ టవల్ తీసుకుని వెళ్లి మళ్లీ హడావిడిగా వచ్చి అందరి సూట్ కేస్ వెతకసాగింది.
"ఏవిటేఁ.... పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం అవదు! నాకేవీ నీ డైమండ్ పెట్టీ అక్కర్లేదు జస్ట్... ఒక 'విష్' చాలు!" అని రేవతి సూట్ కేస్ తీసింది.
రేవతి ఎగిరిదూకి, అమ్మో... ఒక్కటే ఉంది. ఈరోజు నాకు కావాలి!" టక్కున సూట్ కేస్ లాక్కుని మూసేసింది.
"పిసినారి పీడ!" అని రేవతిని తిట్టి కామిని సూట్ కేస్ దగ్గరకు రాబోయింది.
"నాకూ ఒక్కటే ఉందేఁ... నాకూ ఆఫ్టర్ నూన్ కు కావాలి!" ప్లీజింగ్ గానే అభ్యంతరం చెప్పింది.
"అన్నింటికీ నాతో అందరూ కాంపిటేషన్! జ్ఞాపీ.... నువ్వివ్వవే! నువ్వే నిజమైన ఫ్రెండ్!" స్ఫూర్తి జ్ఞాపికను మునగచెట్టు ఎక్కించబోయింది.
"సారీ... ఉన్న ఒక్కటీ యూజ్ అయిపోయింది మాణింగ్! కావాలంటే సూట్ కేస్ తీసుకో!" తలెత్తకుండానే చెప్పింది.
"వెధవ భారతదేశం- కోఆపరేషనే లేదు! నేనేవయినా మీ డ్రస్సు అడిగానా, రబ్బరు బాండ్స్ అడిగానా, హెయిర్ క్లిప్స్ అడిగానా, కనీసం... నోట్ బుక్స్ అడిగానా? విష్షేగా అడిగింది! ఆమాత్రం సాయం చెయ్యలేరా?" కోపం వచ్చింది. "అందరికీ ఈరోజే అవసరం వచ్చినట్టు వెధవ ఫోజ్...., మీరూనూ!" మళ్లీ తిట్టింది.
"ఇదేం ఫోజ్ కొడితే రాదు! నేచురల్ గా వస్తుంది. అయినా.... ఆడపిల్లవు- ఆ మాత్రం జాగ్రత్త ఉండక్కర్లా? పెళ్ళయ్యాక అన్నీ ఈష్ చూసుకుంటానన్నాడు కదా.... అనుకుని ఇది కూడా మర్చిపోయుంటావు. ఇక చిందులేయి మరి!" రెచ్చగొట్టింది రేవతి.
"ప్లీజ్.... అర్జంటే! ఒక్కటి దానం చేయండే! భవతీ విష్ దానం తల్లీ!" అని చున్నీ చాసింది కళ్ళు మూసుకుని!
చున్నీలోకి ఏదో బరువుగా పడితే సంతోషంగా కళ్ళువిప్పి చూసుకుంది. మూడు కర్చీఫ్ లు పడివున్నాయి. విసిరి నేలకొట్టి, "మీరే మాడ్రన్ అమ్మాయిలు...., నేను అమ్మమ్మననా మీ ఉద్దేశం?" కచ్చగా అడిగింది.
"అవి తప్పితే ఏం లేవు ఈ పూటకు.... సర్దుకో! సాయంత్రం దానం చేస్తాం!" అని రేవతి చెప్పింది.
జ్ఞాపికా, కామినీ డిస్టర్బ్ కాకుండా చదూకుంటున్నారు. కాలు నేలకేసి బలంగా కొట్టి విసురుగా వెళ్లబోయింది. తలుపుకు కాలు తగిలి- "అమ్మా..." అనరించింది!
"జాగ్రత్తగా వెళ్ళు! కాలు చితికిందంటే అందులో ఒక కర్చీఫ్ వేస్టయి నీకు అవి కూడా గతుండవు!" రేవతి మళ్లీ రెచ్చగొట్టింది.
"నెక్ట్స్ మంత్ చెబుతా నీ పని!" అని విసురుగా వెళ్లిపోయింది స్ఫూర్తి.
"అవునూఁ.... మనందరి 'విష్' లూ ఒకసారే ఉంటాయేవిటే?" రేవతికి అనుమానం వచ్చింది.
"నేనో చోట చదివా! దీన్ని 'సింక్రొనీ' అంటారట!" జ్ఞాపిక తల్తెతకుండా అంది.
కామిని తలెత్తి చూసింది అనుమానంగా.
"సింక్రోనీ' ఏవిటేఁ... చింపాంజీలూ!" రేవతికి అనుమానం వచ్చింది.
"సింక్రోనీ' అంటే- ఒకే విధమైన ఆలోచనలూ, ఒకే విధమయిన అభిరుచులు కలిగిన అమ్మాయిలు ఒకేచోట కలిసి నివసిస్తూ, ఒకే విధమైన పనులు చేస్తుంటే వాళ్ళ పీరియడ్ డేట్స్ లో తేడాలున్నా- ఆరు లేదా ఏడు నెలలలో ఆ తేడాలు పోయి ఒకేరోజు కొన్ని గంటల తేడాతో ఏర్పడతాయట! మానసికంగా ఏర్పడే అనుబంధం అందుకు కారణమట! ఎంతో అభివృద్ధి సాదించాక కూడా స్త్రీలలో ఈ స్థితి ఎందుకు కనిపిస్తున్నదనే విషయం ప్రపంచసైన్స్ కు ప్రశ్నగానే ఉందిట. ఇది రాతియుగం నాటి నుండి కూడా ఉందని పరిశోధనల్లో తేలిందట! ఇది స్త్రీజాతి ఐక్యమత్యానికి ప్రకృతి ప్రత్యక్షసాక్ష్యం అంటున్నారట అందరూ!"
"మరి-ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే పోట్లాడుకుంటుంటే- కోపంతో అనుకుంటారు చాలామంది కానీ ప్రేమతో, అనుబంధంతో అని తెలుసుకోరు. ఎంత పూల్స్!" రేవతి సంబరపడిపోయింది.
"ఏ జంతుజాతుల్లోనూ లేని అనుబంధం- కలిసి జీవించే మహిళల్లో ఉంటుందనదానికి ఇదే ప్రాపంచిక సాక్ష్యం!" జ్ఞాపిక కూడా ఒప్పుకుంది.
"అవునేఁ.... ప్రేమకు ఆడవాళ్ళే నిదర్శనం!" రేవతి గబగబా చెప్పింది.
"నోర్మూసుకో! ప్రేమంటే నీకిప్పుడు ఐస్ క్రీమ్ ఫ్యామిలీఫ్యాక్ గుర్తొస్తుంది!" కామిని తిట్టింది.
స్ఫూర్తి మెల్లగా నడుచుకుంటూ వచ్చి-
"ఏమాత్రం జాలి కూడా లేదు నామీద! ఒక్కటంటే ఒక్కటి కూడా లేదా! కావాలని కక్ష సాదిస్తున్నారుగానీ, స్నేహం అంటే ఎలా ఉండాలీ! ప్రాణానికి ప్రాణం ఇచ్చేయాలి! మీరూ ఉన్నారు ఎందుకూ- చిన్న సాయం కూడా చేయని రాక్షసులు! కావాలంటే నన్నడగండి- ప్రాణం కూడా ఇచ్చేస్తా మీకోసం! మీలాంటి కఠినులతో స్నేహం చేశాను చూడూ.... అదీ నా తప్పు!"
"స్ఫూర్తి కళ్ళు తడిచాయి. ఏడుపు గొంతులోకి వచ్చింది.
రేవతి ఐసయిపోయింది.
"నువ్వలా బాధపడకే! పోనీ, నేను ఈవినింగ్ దాచుకుంది ఇచ్చేస్తా! నాతో ఎప్పడూ పోట్లాడకుండా ఉంటావా?" కాంప్రమైజ్ కొచ్చింది.
"ప్రామిస్...పోట్లాడను! పైగా - ఇన్నాళ్లూ పోట్లాడినందుకు క్షమించు!" అంది స్ఫూర్తి ఎంతో బాధగా!
తన హ్యండ్ బ్యాగ్ లోంచి తీసిచ్చింది రేవతి.
అది చేతిలోకి రాగానే-
"విడ్త్ డాంకీ! నీ దగ్గరుంచుకుని కూడా లేదంటావా... పాపీ? వచ్చే జన్మలో ఏ అనుభూతూలూ లేని మగవాడిగా జన్మింతువుగాక!" అని గబగబా వెళ్లింది.
"చూడవేఁ.... అది ఇచ్చేవరకూ ఏడుపుమొహం పెట్టి ఇచ్చాక తిట్టిపోతోంది!" కంప్లయింట్ చేసింది ఇద్దరికీ. "అవునూఁ 'విడ్త్ డాంకీ' అంటే ఏవిటే?" అంది రేవతి.
"మాకు తెలుసు....నువ్విచ్చాక తిడుతుందని! 'విడ్త్ డాంకీ' అంటే అడ్డగాడిద!" నింపాదిగా చెప్పారు.
"ఛీ.... బకిరీ!" తలమీద కొట్టుకుని తనను తనే తిట్టుకుంది రేవతి.
"థాంక్స్.... మా ఎనర్జీ మిగిల్చావు!" మెచ్చుకున్నారిద్దరూ.
"ఇంతకీ ఫేరవెల్ లో మనమేం చేద్దామే?" జ్ఞాపిక అడిగింది బుక్ మూస్తూ.
"డిన్నర్ చేద్దాం!" రేవతికి అయిడియా వచ్చింది.
"ఆహాఁ.... ప్లేట్లూ, గ్లాసులూ కడుగుదాం అనుకున్నాం మేము!"
"అదికాదే.... కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసి పేట్ చేయొద్దా? లాస్టియర్ చేసాంగా గ్రూప్ డాన్స్?!" కామిని అంది రేవతితో.
"ఈసారి నేను గ్రూప్ డాన్స్ లో చెయ్యను. మీరు ముందుకువచ్చి నన్ను వెనకాల వేస్తారు. యూనివర్సిటీ మేగజైన్ లో ఫోటోలో మీరేమో చక్కగా పడతారు. నాది లంగానో, చెయ్యో, కాలో పడుతుంది. 'అది నాదే' అంటే మీరు కూడా చస్తే నమ్మరు. ఇంక బయటవాళ్ళెవరు నమ్ముతారు?" కొంచెం కోపంగానే అంది రేవతి.
ఈసారి నమ్ముతాం లేవే.... కాళ్లూ చేతులూ, నీవేనని!" జ్ఞాపిక లాలించింది.
"ఏం వద్దు! అందుకే నేనూ, ఆనంద్ కలిసి స్పెషల్ ప్రోగ్రామ్ ఇద్దాం అనుకుంటున్నాం.
"వ్వాట్...?" ఇద్దరూ ఒకసారి అరిచారు.
ఎందుకే... అంత కుళ్ళు మా జంటంటే?!" మాకు ఫస్ట్ ప్రయిజ్ వస్తుందనా?" రేవతికి అనుమానం వచ్చింది.
జ్ఞాపికా, కామిని ఒకరి మొహాలు ఒకరు చూసుకుని పుస్తకాలు అడ్డం పెట్టుకున్నారు.
"అంతలా సిగ్గుపడకకండే! ఇది 20వ శతాబ్దం! కాస్తా ఫాస్ట్ గా ఉండాలి!" ఎంకరేజ్ చేసింది.
