Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 24

   
    మాలక్ష్మి సున్నంతో తెల్లబడిన చేతులతో కొప్పు సవరించుకొంటూ అక్కడికి వచ్చింది. బాబుని చూసి ఆశ్చర్యపడి  "దొంగ యెదవ ఇలా పారిపోయొచ్చావ్" అంది. బాబు మొహం కోపంతో జేవురించింది. గౌరీనాథం ఏమిటని అడిగాడు తల్లీ దండ్రీ పోగానే తాను జాలితలచి యింట్లో పెట్టుకున్నట్టూల, ఉన్నట్టే ఉండి పారిపోయినట్టూ మాలక్ష్మి చెప్పింది.

    "ఈడి తండ్రి కొద్దిగా డబ్బుసేసుకుని మమ్మల్ని లోకువగా సూసేవాడు. ఈడి తల్లి ఉత్తి దొంగముండ. దొంగతనం చేసి డబ్బు సంపాదించింది. ఈడికి ఎంతపొగరు బాబూ, ఇదివరకులాగ ఆడికి మంచంలేదంట, యిదివరకటిలాగ బళ్ళోకి వెళ్తుడంట..... సేపలకూర నేందే వణ్ణం సయించదంట....... సివరికి తండ్రి వ్యాపారంలో డబ్బు తగలేసుకుని సచ్చాడు. అందరూ సచ్చినా యీడికి పొగరు సావలేదు. పాలేరు పని సేసుకుంటూ యింటికాడ ఉండకూడదూ" అంది.
 
    "దొంగముండ, అంతా అబద్దం చందాలదాకా పని సేయించుకుని కూడెట్టేది కాదు" అన్నాడు బాబు.

    "ఓరి నీ జిమ్మడా...." అంది మాలక్ష్మి.
 
    "మా బాబు డబ్బున్నాడని దీనికి ఈసు" అన్నాడు బాబు.

    "పోనీ నాతో వచ్చెయ్యి. ఈ యేడాది నుంచీ ఎక్కడున్నావ్" అంది మాలక్ష్మి.
 
    "ఓ అనేక చోట్ల..... " అన్నాడు బాబు.

    "నీ పిన్నమ్మతో వెళ్ళిపోరా" అన్నాడు గౌరీనాథం.

    "నాను యెల్లను. ఎదవ గుడిసె యెదవ కూడూ..... అత్తమానూ దీని మొగుడు సావకొడతాడు"

    "ఓరి గుడిశేటికొడకా. యాడు నీకు గంజి పోత్తాడో సూత్తాను. దిక్కులేక సత్తావులే" అంటూ మాలక్ష్మి కోపంతో వెళ్ళిపోయింది. గౌరీనాధం వీరన్న కేసి అర్ధవంతంగా చూసి మాలక్ష్మి వెనకాతలే వెళ్ళాడు.

    బాబు చెక్కలు మోసుకొస్తున్నాడు పని చప్పబడింది. కార్ఖానాలో వీరన్న, రాములూ, బాబుని ఆక్షేపణగా ఎత్తిపొడుస్తున్నారు. సూర్యుడు క్రమంగా పడమరకు వాలుతున్నాడు. కాలిన భూమి నెరదల్లోంచి వేడి వేడి ఆవిరి పైకి వస్తోంది.

    "నీ అమ్మ ఎంతమందితో తిరిగేది?" అన్నాడు వీరన్న.

    "నంజకొడక" కోపంతో తిట్టాడు బాబు.

    "తిడితే సంపేత్తాను. మళ్ళీ తిట్టు."

    "నువ్వంటే నేను తిడతాను"

    "నీ అమ్మ ఎంతమందితో....." వీరన్న అన్నాడు.

    "నంజకొడక-" అన్నాడు బాబు.

    వీరన్న ముందుకు దుమికి "సత్తావురా నాకొడక" అన్నాడు. బాబు భయంతో మోసే ఆ చెక్కల్ని కింద పడేసి పారిపోయాడు.

    "ఏయ్ గంగీ -నా సంగీత పెట్టి యిలా యివ్వు" అన్నాడు బాబు గౌరీనాధం ఇంటికెళ్ళి.

    "నీదేంటిరా సచ్చినోడ -నాదీ" అంది.

    "నాకు అచ్చంగా యివ్వనేదూ" అన్నాడు బాబు.

    "ఏడుత్తున్నావని యిచ్చాను."

    "దొంగముండ - నీ జత లేను" అంటూ బాబు అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

    ఎప్పటికీ బాబు రాకపోవడం చూసి గంగి వెతకడానికి బయలుదేరింది. సర్వి చెట్లక్రింద బాబు నేలమీద పడుకొని నిద్రపోతున్నాడు.

    "ఇక్కడ తొంగున్నాయేంటి, యెర్రి యెదవ" అంది గంగి పెద్దదానిలా మొహం పెట్టి.

    "ఆలోచిత్తుంటే నిదరట్టింది" బాబు లేచి యిటూ అటూ చూసి  "ఏదే దొంగముండ నా కత్తి" అన్నాడు. నేలమీద చేతులు పెట్టి వెతికి తుప్పు పట్టిన విరిగిన కొడవలి పైకితీశాడు.

    "ఎందుకిదీ?" అంది గంగి.

    "సంపెయ్యడానికి"

    "ఎవణ్ణీ?" అంది గంగి అర్ధమవక.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS