-: పద్మకోశ హస్త లక్షణము :-
శ్లో!! విరాళాః కించిదంగుష్యః కుంచితాః పద్మకుట్మలః
ఋషిర్విధిర్జ నిర్విష్ణో శ్వేతవర్ణశ్చ భార్గవః !
అధిదైవం యక్షజాతి ర్వినియోగోస్య కధ్యతే !!
చేతివ్రేళ్ళన్నియు కొంచెము ఎడముగా పట్టిన, పద్మకోశహస్తము వచ్చును. ఈ పద్మకోశమునకు ఋషి బ్రహ్మ, విష్ణువు వల్ల పుట్టినది. తెలుపు వర్ణము, అధిదేవత భార్గవుడు. యక్షజాతి.
వినియోగములు :-
పాము, పుట్ట, కమలము, ఘంట, బంతి, అద్ధము, చకోరము, కొప్పు గుండ్రని వస్తువు, రధచక్రము, (చక్రవాకము) వికాసము, మామిడిపండు, పూలవర్షము, చెంబు, కొబ్బరిబొండము మొదలగునవి. పూమొగ్గ, కొండగోగు తీగెలు మొదలైనవి వంచుట కారణము, శృంగారము, స్తనములు, వీనియందు హస్తము చెల్లును.
-: మృగశీర్ష హస్త లక్షణము :-
శ్లో!! సర్పళీర్షే కనిష్టాంగుష్టోన్నత్యా మృగశీర్షకః !
గౌర్యాజనిర్హ రోదైవ, మృషిర్మార్కండ ఉచ్యతే,
మునిజాతి శ్వేతవర్ణో, వినియోగోస్య కధ్యతే !!
సర్పశీర్షహస్తమందలి కనిష్టికాం గుష్టములను, చాచిపట్టిన మృగశీర్ష హస్తము వచ్చును. నిది పార్వతివల్ల పుట్టినది. శివుడు దైవము. మార్కండేయుడు ఋషి. ముని జాతి. తెలుపు వర్ణము.
వినియోగములు :-
పసిపిల్లలు, స్త్రీ వాదము, సంతోషము, ప్రత్యక్షముచేయుట, అవుట, చెమట తుడుచుకొనుట, వస్త్రము, శరీరము, గొడుగుపట్టుకొనుట, గుఱ్ఱము, పైరు ,గృహము, పక్షిముక్కు, గంధము మొదలగునవి పూయుట. సోపానములు, శాంతము, సమానము, గోడ, పుణ్యము, మృగముఖము, సిగ్గు, చమత్కారము, సంజ్ఞ, రంగవల్లి (ముగ్గు) ఇష్టము, శివలింగము, నేను అను అర్ధము. కన్యక, ఎద్దు. ("సరిగమపదని") యను సప్తస్వరముల యందలి "గ" యనుస్వరము. గాంధారము, శిశ్నము, తెరపించుట, బవ_బాలవాదికరణములు లేక త్రికరణములు. జింక, వీనియందు సమయోచితముగ మృగ శీర్షహస్తము వినియోగించుచున్నది.
-: లాంగూలహస్త లక్షణము :-
శ్లో!! పద్మకోశే నామికాచేల్లాంగూలః కుంచితాభవేత్
ఋషిరగ్నిర్జని శ్శంభో, ర్గౌరోవర్ణో అధిదేవతా.
లక్ష్మినాధశ్శిద్ధజాతి ,ర్వినియోగో అస్యకధ్యతే !!
పద్మకోశమందలి అనామికను అరచేతిలోకి వంచిన లాంగూల హస్తమగును, అగ్నిహోత్రుడు, ఋషి ఈశ్వరునివలన పుట్టినది. గౌరవరణము, అధిదేవతలక్ష్మినాధుడు. శిద్ధజాతి.
వినియోగములు :-
పూగుత్తి, పండు, గజ్జె, (కింకిణి) గుండ్రనివస్తువు (గోలి), చాతకపక్షి, చకోరపక్షి వక్క, నిమ్మ, నేరేడు, ద్రాక్షపండు, వడగండ్లు, కరక్కాయ, సీసము, మితభోజనము, పగడము, గడ్డము పట్టుకొనుట, రుద్రాక్ష పుష్యరాగమణి, నక్షత్ర సముదాయము, ప్రాశస్తము, వీనియందు లాంగూల హస్తము వినియోగించును.
-: సింహవదన హస్త లక్షణము :-
శ్లో!! మధ్యమానామికాంగుష్ట శిఖరామేళనాత్తధా !
అన్యప్రసారణాత్సింహవదనః పరికీర్తితః.
ఆముష్యక్షత్రియాజాతిః వినియోగోనిగధ్యతే !!
మధ్యమ_అనామికాంగుష్టములు గూర్చి పట్లి కనిష్టిక తర్జనులు చాచి పట్టిన, సింహవదన హస్తమగును, దీనికి ఋషి బ్రహ్మ. తండ్రి దక్షుడు. వర్ణము నీలము. దైవము శివుడు. జాతి క్షత్రియ.
వినియోగములు :-
కమలము, పూలమాల, చిరునవ్వు, సువాసన, ఎద్దు, మంగళస్తానము, సింహము, హోమము, వైద్యము, నీతి, మోక్షము, సంధానము, దర్భను కదలించుట, కంచు, శుద్ధిచేయుట, ధైర్యము, వంటకము, వజ్రమణి, గాంధారము, (సప్త స్వరములలో నొకటి) సింహాసనము, ఉప్పు, చెవి, జపమాలధరించుట, గున్నఏనుగు, వీనియందు ఈ సింహవదన హస్తము చెల్లును.
