Previous Page Next Page 
చదువు పేజి 24

   

   "ఎందుకు రాగూడదూ? చాట నా కియ్యి."

    "నే పట్టుకొస్తాగా?"

    "నేను కూలివ్వనబ్బాయ్. తరువాత నీ యిష్టం!" అన్నాడు సుందరం. వాడి ప్రాణానికది చాలా పెద్ద హాస్యంగా తోచింది.

    శివయ్య ఈ మాటకు నవ్వాలేదు, జవాబు చెప్పాలేదు. చాట మరింత భద్రంగా చంకనపెట్టి సుందరంతోబాటు నడవసాగాడు.

    ఇంటికి పోయినతరువాత శివయ్యను సుందరం తన తల్లికి చూపించి, " ఈ అబ్బాయి నాతో చదువుతున్నా డమ్మా!" అని చెప్పాడు. ఆ అబ్బాయి కులం ఏమిటో వాడు తల్లికి చెప్పలేదు. వాడికి చెప్పటానికి మనసురాలేదు.

    "పాపం, బజారికెళ్ళి చాట పట్టుకొచ్చావు. అప్పడం కాల్చాను, ఇవ్వనుట్రా?" అన్నది సీతమ్మ కొడుకుతో.

    ఆవిడ ఇద్దరికీ చెరొక అప్పడమూ ఇచ్చింది. తల్లి తన కిచ్చిన అప్పడంకన్న శివయ్య కిచ్చిన అప్పడం కొద్దిగా మాడి వుండటం చూసి సుందరం లోలోపల చాలా సిగ్గుపడ్డాడు. కాని ఏమీ చెయ్యలేకపోయినాడు.
 
    సుందరం తన అప్పడం వెంటనే తినసాగాడు. కాని శివయ్య తినటానికి మొహమాటపడ్డాడు.

    "తినవోయ్" అన్నాడు సుందరం.

    "నేను ఇంటికి పోవాలి."

    "తిని పోదుగాన్లే."
 
    ఏమీ అనలేక శివయ్య కొంచెం కొంచెమే అప్పడం తుంచి నోట్లోవేసుకుని నోరు మెదపటం కూడా వినపడకుండా కనబడకుండా తినసాగాడు. సుందరం ఎప్పుడో తన అప్పడం పూర్తిచేసి, కారానికి రోజుకుంటూ లోపలికి పరుగెత్తి మంచినీళ్ళు తాగాడు.

    వంట దగ్గర ఉన్న సీతమ్మ "ఆ అబ్బాయి క్కూడాడ కావాలేమో మంచి నీళ్ళు" అన్నది.

    "గ్లాసుతో ఇయ్యి" అన్నాడు సుందరం.

    "ఆ అబ్బాయి సూద్దరాడు కాదూ!" అన్నది సీతమ్మ.
 
    "అయితే?"

    "కరుచుకు తాగటానికి ఇవ్వకు."

    "ఏమిటమ్మా?" అన్నాడు తల్లి ప్రవర్తనకు కలుగుతున్న చిరాకంతా ఒక్కసారి బయటకి కక్కుతూ.

    సుందరం పుటకతోనే సంస్కారి అనికాదు. క్లాసులో తనకు సమానంగా ఉండేవాణ్ణి  ఇతర విషయాల్లో నీచంగా చూడాలంటే, సంఘస్వరూపం ఎరగని సుందరానికి బాగా పట్టి ఇచ్చింది.

    "సరే పోనీ తాగనీ, తరువాత తొల్చుకుంటాన్లే" అన్నది సీతమ్మ, కొడుకులో తిరుగుబాటు లక్షణాలు కనిపెట్టి.

    శివయ్య మంచినీళ్ళు అక్కర్లేదన్నాడు. సుందరం బలవంతం చేసిన మీదట గ్లాసు ఎత్తుకుని నోట్లో పోసుకున్నాడు గాని, కరుచుకు తాగలేదు.

    "ఇక పోతానండీ" అన్నాడు శివయ్య.

    "నీకు తెలుసా? కృష్ణమూర్తి కూడా మా ఇంట్లోనే ఉంటున్నాడు అవతల భాగంలో."

    "ఉన్నారా కృష్ణమూర్తిగారు?" అన్నాడు శివయ్య చాలా మర్యాదగా.

    "ఏయ్. కృష్ణమూర్తీ!" అని సుందరం పొలికేకపెట్టాడు.
    
    కృష్ణమూర్తి పలికాడుగాని రాలేదు.

    "శివయ్యొచ్చాడు" అని అరిచాడు సుందరం.

    "అట్లాగా?"అని తాపీగా తడిక అవతల నుంచి సమాధానం వచ్చింది.

    "నేను వెళ్ళాలి" అంటూ శివయ్య వెళ్ళిపోయినాడు.
   
                                       *    *    *    *   

    బళ్ళోకి బయస్కోపు వచ్చింది. అలవాటు ప్రకారం బాండుమేళంతో సహా ఒంటెద్దుబండిమీద కాగితాలు పంచి పెట్టారు. ఆఖరు టిక్కెట్టు అణా.

    "అమ్మా, అమ్మా! నేను బయస్కోపు చూడొద్దూ?" అన్నాడు సుందరం.

    "ప్రతిదీ కావాలంటావు, ఎట్లాగురా నీతో?" అన్నది తల్లి.

    సుందరం ఉత్సాహమంతా కుంగిపోయినట్టయింది.

    "అణాయేగా, అమ్మా?" అన్నాడు వాడు.

    "కృష్ణమూర్తీవాళ్ళూ పోతుంటే నువ్వు కూడా పోదూగానిలే" అన్నది తల్లి.

    సుందరం మరింత నీరసించాడు. కృష్ణమూర్తితో బయస్కోపు సంగతి ఎత్తటమూ, కృష్ణమూర్తి తన కటువంటివి ఇష్టంలేదని "బుద్దిమంతనం" ప్రదర్శించటమూ అదివరకే అయింది.

    "కృష్ణమూర్తి చూడట్ట."

    "అయితే నువ్వు మాత్రం దేనికీ?"

    "అట్లా అయితే నాకో సిల్కుచొక్కా కొనిపెట్టు. క్రిష్ణమూర్తి కన్నిఉన్నయ్యే."

    "ఊరుకోరా!" అని సీతమ్మ నోరు నొక్కుకున్నది.

    ఆ రోజు సాయంకాలం బయస్కోపుకు పోవటానికి సుందరం తల్లిదగ్గర ఒక అణా వసూలుచేశాడు. ఈ అణా సంపాదించగలందులకై వాడు, మళ్ళీ ఎన్నడూ బయస్కోపు  చూస్తానని మాట ఇవ్వాలిసొచ్చింది.
 
    ఊరిబయట డేరాలో బయస్కోపు . అప్పటికింకా  ఎలక్ట్రిసీటీ రాలేదు. బయస్కోపులో కథలుండేవికావు.  కార్బైడ్ లైటుతో ఏవేవో దృశ్యాలు తెరమీద చూపించేవాళ్ళు. డేరాకంతకూ ఒక గాసులైటుండేది. "కాబిన్" లోనుంచి ఆపరేటరు ఈలవెయ్యగానే గాసులైటును ఒక్క తొట్టిలోకి దింపి చీకటిచేసే వాళ్ళు ఈ బయస్కోపు ప్రదర్శనాన్ని చూసి సుందరం పరమానందభరితుడైనాడు. ముఖ్యంగా రైలు రావటం రెండుసార్లు చూపారు. చడీ చప్పుడూ లేకుండా రైలు మీదకి వస్తుంటే సుందరానికి ఒళ్ళంతా భయానందాలతో పులకరించింది. నీళ్ళల్లో నుంచి కార్లు పోవటం కూడా భలేబాగుంది.

    సుందరం ఫోనోగ్రాఫు కూడా ఈ ప్రదర్శనంలోనే చూశాడు. ప్రదర్శనం ప్రారంభం కాక పూర్వం ఈ ఫోనో గ్రాఫు మీద పాటలుపాడించారు. "ఓరోరి బండివాడా" పాట పెట్టారు. పాటంతా అయిన తరువాత ఫోనోగ్రాపు ఏదో అన్నది. జనం కొందరు నవ్వారు. ఆ రహస్యం అప్పట్లో సుందరానికి తెలియలేదు. తరువాత మరికొంతకాలానికి ఆ రికార్డు విన్నప్పుడు సుందరానికి పాట చివర "మైనేమీజ్ వనజాక్షి" అన్నమాట స్పష్టంగా వినిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS