Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 24

    "సరేగానీ డాక్టర్....మీరు మమ్మల్ని  నర్సింగ్ హోంలో  అడ్మిట్ చేసేస్కోండి  డాక్టర్" అన్నాడు డేవిడ్.

    "కానీ మిమ్మల్ని  నర్సింగ్ హోంలో  అడ్మిట్   చేయాల్సిన  అవసరం  లేదయ్యా బాబూ" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

    "కానీ మాకు అవసరం వుంది డాక్టర్" అన్నాడు  డేవిడ్.

    "అవును డాక్టర్....ప్లీజ్  డాక్టర్....మమ్మల్ని  అడ్మిట్  చేస్కోండి  డాక్టర్"

    "కుదరదయ్యా బాబూ...." అన్నాడు డాక్టర్  శ్రీనివాస్.

    "మీరు తల్చుకుంటే  కుదుర్తుంది  డాక్టర్ గారూ...." అన్నాడు డేవిడ్.

    "ప్లీజ్....మా కోసం తల్చుకోండి  డాక్టర్...." అన్నాడు జాకబ్.

    డాక్టర్  శ్రీనివాస్  డాక్టర్ సింగినాధం   అన్న  మాటలు  గుర్తుకువచ్చాయ్. వాళ్ళిద్దరూ  పరమ సోదిగాళ్ళనీ....అతని బుర్రని  తినేశారనీ  సింగినాధం  అన్నాడు.

    వీళ్ళతో  ఇక లాభంలేదని  అనుకున్నాడు డాక్టర్  శ్రీనివాస్.

    "ఓక్కే....ఓక్కే....ఒక్క క్షణం మీరు నిశ్శబ్దంగా  వుండండి...." అన్నాడు  వాళ్ళిద్దర్తో.

    ఆపరేషన్ థియేటర్  మూలకి  వెళ్ళి  కాటన్ మీద  క్లోరోఫాం  వేస్కుని వాళ్ళిద్దరి  మంచాల మధ్యకి వెళ్ళి  ఇద్దరి  ముక్కులమీదా  రెండు చేతుల్తో  క్లోరోఫాంతో  తడిచిన  కాటన్ ని   పెట్టి  వత్తాడు.

    డేవిడ్, జాకబ్ లు స్పృహ  తప్పారు.


                                        10


    డేవిడ్, జాకబ్ మెల్లగా కళ్ళు తెరిచారు. ఎదురుగా వాళ్ళకి డాక్టర్ శ్రీనివాస్  మొహం మసక మసగ్గా కనిపించింది. ఇద్దరూ కాస్త గట్టిగా తల వదిలించి  చూశారు.

    ఈసారి  డాక్టర్ మొహం కాస్త స్పష్టంగా  కన్పించింది.

    "ఏంటి....? మాకేమైంది....?? మేం ఎక్కడున్నాం???...." అని అడిగాడు డేవిడ్.

    "మేరు మా నర్సింగ్ హోంలో  ఉన్నారు....మీకేం కాలేదు" చిరునవ్వుతో అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

    "అంటే  మమ్మల్ని  మీ నర్సింగ్ హోంలో  అడ్మిట్  చేస్కున్నారా?" అడిగాడు జాకబ్.

    "అడ్మిట్ చేస్కోడం  ఏంటి? ఇప్పుడు కాస్సేపట్లో డిస్చార్జ్  కూడా చేసేస్తున్నాం"

    "అదేంటి డాక్టర్....అప్పుడేనా?" జాకబ్ అడిగాడు.

    "పనై పోయిందిగా....ఇంకెందుకూ? మీరు తీస్కోవల్సిన  జాగ్రత్తల గురుంచి చెప్పాలని వచ్చా....ఓ నాలుగైదురోలు  మెల్లగా నడవండి. కంగారు కంగారుగా  నడవడంగానీ, పరిగెత్తడంగానీ చెయ్యొద్దు"

    "కానీ ఈ జాగ్రత్తలన్నీ  మాకెందుకు చెపుతున్నారు?" బుర్రకాయ్ గోక్కుంటూ అడిగాడు డేవిడ్.

    "ఎందుకేమిటి....మీ ఇద్దరికీ ఇప్పుడు పిల్లలు  పుట్టకుండా ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేశాను
కదా...." అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

    "బాబోయ్...." అంటూ ఒక్కసారిగా  గావుకేక పెట్టారు డేవిడ్, జాకబ్ లు.


                                 *    *    *    *


    గజదొంగ మంగులు డెన్. మంగులు  కాళ్ళమీదపడి  భోరున విలపిస్తున్నారు డేవిడ్, జాకబ్ లు.

    వాళ్ళ వ్యవహారం చూస్తే మంగులుకి ఒళ్ళు  మండిపోయింది. తన రెండు కాళ్ళనూ విదిలించి కొట్టాడు.

    వాళ్ళిద్దరూ ఎగిరి వెల్లకితలా  పడ్డారు.

    "ఏరా....అసలు మిమ్మల్ని డిప్పల్లో  నర్సింగ్ హోమ్ కి  ఎందుకు పంపించాను? కుటుంబ నియంత్రణ  ఆపరేషన్  చేయించుకురావడానికా?" కోపంగా  అరిచాడు  మంగులు.

    "మాకసలు కుటుంబ  నియంత్రణ  ఆపరేషన్ చేయించుకునే ఉద్దేశమే లేదు బాస్....వాళ్ళే చేసేశారు...." నెత్తి  కొట్టుకుంటూ   అన్నాడు డేవిడ్.

    "కుటుంబ నియంత్రణ  ఆపరేషన్   మాకెందుకూ....వద్దని చెప్పలేరా? మీరేమైనా మూగమొద్దులా?"

    "వద్దని చెప్పడానికి ఆపరేషన్  ముందు  మాకు  చేస్తున్నట్టు చెప్తేకద  బాస్...." అన్నాడు డేవిడ్.

    "అంటే ఆపరేషన్ చేస్కొండని  హాయిగా  చెప్పేశారన్నమాట" చికాకుగా అన్నాడు మంగులు.

    "కాదు బాస్....ఆపరేషన్ చేసినట్టే  మాకు తెలీదు బాస్....మా ఇద్దరికీ మత్తుమందు ఇచ్చి చేసేశారు బాస్" ఘొల్లుమన్నాడు జాకబ్.

    "ఆ....!! అంతపని చేశారా?!"

    "అవును బాస్....ఈ విషయం తెలిస్తే మా  ఆవిడ  తంతుంది బాస్...." ఏడుపు గొంతుతో అన్నాడు డేవిడ్.

    "వాడికయినా పెళ్ళాం వుంది....ఈ విషయం తెలిస్తే నాకు పిల్ల నెవరిస్తారు  బాస్" ఘొల్లుమన్నాడు  జాకబ్.

    మంగులు కూడా జుట్టు  పీక్కుంటూ  "ఆ....హాహాహా....హయ్యో" అంటూ బాధపడ్డాడు.

    డేవిడ్, జాకబ్ లిద్దరూ  ఆశ్చర్యంగా  చూశారు.

    "మీరేంటి  బాస్  మాకంటే  ఎక్కువ బాధపడుతున్నారు?" అడిగాడు డేవిడ్.

    "మీరిప్పుడు నాకు పెద్దపని  పెట్టారుకదరా....హయ్యో....ఆహాహాహా...." బాధపడ్తూ అన్నాడు మంగులు.

    "పనా....! ఏంటి బాస్ అది?" ఆశ్చర్యపోతూ  అడిగాడు జాకబ్.

    "మీకు ఫామిలీ  ప్లానింగ్  చేసి  పంపించిన  ఆ  డాక్టర్  గాడిని  చంపు తానని నా చేతులు కాల్చుకుని  శపథం చెయ్యాలి కదరా  దరిద్రులారా....హబ్బా...." బాధగా అన్నాడు మంగులు జుట్టు పీక్కుంటూ.


                                *    *    *    *


    రాంబాబుకీ, లింగారావ్ కీ  డిప్పల్లో  నర్సింగ్ హోంలో  హాయిగా గడిచిపోతూంది. ముందు ఎప్పుడెప్పుడు  అక్కడినుండి  బయటపడదామా  అని ఆలోచించిన  వాళ్ళిద్దరూ  ఇప్పుడు అక్కడే  సెటిలయిపోతే  బాగుణ్ను  అన్న స్టేజీకి  వచ్చారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS