Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 24

 

    మోహన్ కు కాఫీ కప్పు అందిస్తూ గీత అడిగింది.
    "కొత్త సినీరధం తెచ్చిస్తానని మాట్లాడకుండా వూరుకున్నారేం?"
    "ఆ పత్రిక్కి అంత్య క్రియలు కూడా జరిగాయి... ఇంకా నేనేం తేనూ?" అన్నాడు మోహన్ కప్పు పెదాల దగ్గర ఉంచుకుంటూ.
    గీత అర్ధం కానట్టు చూసింది.
    "జనన మరణ సంచికలు రెండూ అ ఒక్క సంచికేనండి, రధం కదలటం మానేసింది...."
    గీత బుగ్గలు సొట్టలు పడ్డాయి.
    "పాఠకుల నందరినీ ఏప్రిల్ ఫూల్ చేసిందన్న మాట!... పాపం! మీ ప్రయాసంతా వృధా! అలాంటి చచ్చు పత్రికలో ఫోటో వేయించుకున్నారు కదా? ఎవరు చూస్తారని?"
    మోహన్ ఆ మాట వప్పుకోలేదు.
    "ఎందుకు చూడరు ? సినిమాలన్నా , సినిమా పత్రికలన్నా వెర్రి లేని వాళ్ళేవరు ఈ రోజుల్లో?"
    మోహన్ కాఫీ త్రాగేసి కప్పు కింద పెట్టాడు.
    "అందుకే నేమిటి? అంతా కలిసి సినీ రధానికి సమాధి కట్టారు!--" అంటూ గీత పకపక లాడింది.
    మోహన్ తెల్లబోయాడు, ఆడవాళ్ళ మాటల్లో తెలివి తక్కువ, తికమక ఎక్కువ!
    "మీకు తెలీదండి! ఆంధ్రుల్లో ఒకరు పుస్తకం కొంటె అది పదిమంది పుచ్చుకు చదువుతారు....సినీ రధం పెట్టినతను నాకు పరిచయస్థుడు. అయినా ఫోటో వూరికే వేసుకోలేదు లెండి.... నాకు తప్పకుండా చాన్సు వస్తుందని నా అంతరాత్మ చెబుతున్నది.... కొన్నాళ్ళు ఆగి చూద్దాం!" అంటూ మోహన్ కుర్చీలో నుంచి లేచాడు. గీత గేటు వరకు వెళ్ళి సాగనంపి వచ్చింది.

                            *    *    *    *
    ఉష బస్సు స్టాపు లో నిలబడి ఉంది. మరో ఇద్దరు కాస్త దూరంలో వెనకాతలి గోడ నానుకుని మాట్లాడుకుంటున్నారు.
    "హలో ఉషా! ఎక్కడికో ప్రయాణం కట్టారే?"
    ప్రభాకర్ ప్యాంటు జేబులో చెయ్యి దూర్చి నవ్వుతూ దగ్గర కొచ్చాడు.
    "మా స్నేహితురాలింటికి.... ఇదే మొదటిసారి వాళ్ళింటికి వెళ్ళటం. ఎక్కడ ఉందొ ఏమో వెళ్ళి వెతుక్కోవాలి. మీరు కాస్త దిగబెట్టి వెళ్ళారంటే ఎంతైనా పుణ్యం ఉంటుంది...."
    "వాళ్ళిల్లు ఎక్కడుంది?"
    ఉష చెప్పింది.
    "ఆ లోకాల్టీ సరిగా నాకూ తెలీదు. అయినా మీకు తోడూ రమ్మంటే వస్తాను. ... అక్కడికి వెళ్ళి నాలుగు వీధులు తిరిగితే అదే తెలుస్తుంది..." అన్నాడు ప్రభాకర్ జేబులో నుంచి పేపర్ ఇవతలకు తీస్తూ.
    "వార్తలేమిటి?' అనడిగింది ఉష.
    "బ్రహ్నండమైన వార్త. ఆ వార్త చెప్పాలనే మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను...." అన్నాడు ప్రభాకర్ పేపరు పూర్తిగా తెరిచి రెండు చేతులతో పట్టుకుంటూ.
    "మీరు పేపరు చదువుతానంటే నేను నమ్ముతాననుకోకండి!" అంటూ ఉష హేళన చేసింది.
    "రోజూ చూస్తాను ఉషారాణీ! యెంత మాటన్నారు! 'వాంటెడ్ , 'మాట్రిమోనియాల్' కాలమ్స్ మట్టుకే ఎర్రబడింది.
    "మాట్రిమోనియాల్ కాలం వూరికే చూడ్డమేనా? జవాబులు కూడా రాస్తారా?"

                   
    ప్రభాకర్ గాభరాగా పేపరు సగానికి మడిచి పట్టుకున్నాడు.
    "మీకు బొత్తిగా అనుమానం!.... చదవటానికి తమాషాగా ఉంటాయి.....' వంట , కుట్టు వీణ వచ్చ్ఘిన వధువు కావలెను...."
    ఉష నవ్వింది. ప్రభాకర్ తేలిక పడ్డారు.
    "మీరు కిలకిలా నవ్వుకున్నారు. నేనూ అందుకే చదువతానంటే నమ్మరు కదా!"
    మనిషికి తిండి, బట్ట ముఖ్యం. తర్వాత వినోదం కావాలి. పెళ్ళానికి వంట రాకపోతే వంటమనిషిని జీతమిచ్చి పెట్టుకోవాలి. కుట్టు వస్తే టైలరు ఖర్చు మిగులుతుంది. పొతే వీణ సరదాగా ఉన్నప్పుడు అతనికి వినోదం! మగవాళ్ళు ఎంత గడుసు వాళ్ళు!
    "మీ మగాళ్ళు ఎంత గడుసు వాళ్లండీ! చివరికి టైలరు ఖర్చు కూడా లేకుండా ఎంతెత్తు వేశారో చూశారా?" అంది ఉష ప్రభాకర్ ను దెప్పుతున్నట్టుగా.
    ప్రభాకర్ చిలిపిగా నవ్వాడు.
    "అతని సంగతి అలా ఉంచండి. మీరు కుట్టిన షర్టులు, పంట్లాములు వేసుకుంటే నాకు పిలిచి ఉద్యోగం యిస్తారు...."
    "అదేమిటి?" అంది ఉష ఆశ్చర్యంగా.
    "సర్కస్ లో బఫూన్ ఉద్యోగం!"
    ఉష మూతి ముడిచింది. ఇంతలో బస్సు వచ్చి ఆగింది. ఇద్దరూ గబగబా లోపలికి చొర బడ్డారు. డబుల్ సీట్లో కిటికీ పక్కన ఉష కూర్చున్నది. ఉష పక్కనే ప్రభాకర్ కూర్చున్నాడు. రష్ ఎక్కువైతే ఆ పక్క సీట్లు, ఈ పక్క సీట్ల మధ్య చోటు చూసుకునే వారిలో కొంతమంది బస్సు కుదుపు లకు మీద వాలితే కిమ్మనకుండా వారి బరువును మోయాలి పాపం! ప్రభాకర్!
    మెల్లిగా బస్సు నిండిపోయింది.
    ఏ స్టాపింగు లో దిగాలో తెలియదు కాబట్టి కండక్టరు ను కనుక్కోమంది ఉష.
    ఇటు చూసేటప్పటికి కండక్టరు కనిపించాడు. ప్రభాకర్ టక్కున అడిగాడు. అతడు తెల్లబోతూ "నాకు ... తెలీదు...." అని చెప్పాడు తడబడుతూ.
    ఉష నోటికి పమిట చెంగు అడ్డం పెట్టుకుని నవ్వింది. ప్రభాకర్ చిరాకు పడ్డాడు ఉష నవ్వినందుకు కండక్టరు గాడికి ఏమీ తెలీనందుకు.
    "కాకీ బట్టలు కట్టుకున్న వాళ్ళంతా కండక్టర్లేనా మరి?" అని మళ్ళా నవ్వింది ఉష.
    ప్రభాకర్ మొదట తెల్లబోయాడు. తర్వాత  తనూ నవ్వాడు. కాకీ బట్టలు వేసుకున్నవాడు ముందరి వరుస ల్లోని ఒక సీటులో కూర్చుని ఉన్నాడు! ఇంతలో నిజం కండక్టరు కాకీ బట్టలు, మెడలో పెద్ద తోలుసంచి , చేతిలో టిక్కెట్లతో దగ్గరకు రానే వచ్చాడు. ప్రభాకర్ కండక్టరు ను ఎంక్వయిరీ చేసి రెండు టిక్కెట్లు తీసుకున్నాడు.
    ఉన్నాట్టుండి ఉష అడిగింది. "ఇందాక ఏదో వార్త అన్నారు?" అని.
    ప్రభాకర్ మళ్ళా పంట్లాం జేబులో నుంచి పేపరు తీయబోయాడు. ఉష చేత్తో వారించింది.     
    "చెప్పండి చాలు!"
    ప్రభాకర్ మొదలు పెట్టాడు.
    "ఇన్నాళ్ళూ ఎస్త్రాలజీ అంటే ఏదో పనికి రాణి సబ్జక్టు అనుకున్నాను సుమండీ! మీరు పామిస్ట్రీ లో ఇంటరెస్టు కలిగించాక చూద్దును కదా, ఎంత మజాగా ఉందనుకున్నారు! శ్రమ పడక్కర్లేదు. బోలెడంత గడించు కోవచ్చు...."
    '[సైడ్ బిజినెస్ పెట్టాలను కుంటున్నారా?"
    ప్రభాకర్ నిట్టూర్చాడు.
    "ఎం.బి. బి. ఎస్. లో చేరక ముందైనా చెప్పారు కాదు. మూడో ఏడు దాటలేక రెండేళ్ళ బట్టి అవస్థ పడుతున్నాను....ఇంతకీ అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. "హిందూ" లో భేషైనా ప్రకటన పడింది. జ్యోతిష శాస్త్రా చర్య పోస్టు ఖాళీగా ఉందట. స్టార్టింగ్ ఆరు వందలట...."
    ఉష బ్రహ్మాండం గా ఆశ్చర్య పోయింది.
    "ఆ పోస్టు కు అప్లయ్ చేయాలను కుంటున్నారా?
    "ఇస్తే చేస్తాననుకొండి. అయితే ఎవరిస్తారు? జ్యోతిష్యం కోర్సు చదువు కునుంటే నిక్షేపంలా వచ్చేది.... ఎం.బి.బి.ఎస్ లో దండయాత్రలు వేసే బదులు ఇప్పుడన్నా ఆ కోర్సు లో చేరితే మరో నాలుగేళ్ళ కి దర్జాగా అరువండలు సంపాదించుకోవచ్చు.... ఎం.బి.బి.ఎస్ అంటారా? అది పాసయ్యే నాటికి నాకు రిటైరయ్యే వయస్సు వస్తుంది. అప్పుడు నేను గడించేదెం ఉంటుంది?"
    ఉష నవ్వాపుకుంటూ అడిగింది.
    "అయితే ఇప్పుడెం చేద్దామని?"
    ప్రభాకర్ సాలోచనగా క్రాపింగ్ లో చేతి వ్రేళ్ళు మారుస్తూ అన్నాడు.
    "జ్యోతిష్యం కోర్సులో చేరదలచిన వాళ్ళ కోసం కూడా ప్రకటన వేశారు."
    ఉష ఉలిక్కి పడింది. ఏదో అపాయం తప్పించుకుందామని అబద్ద మాడితే దాన్ని బంకలా పట్టుకుని వదలటం లేదే?
    "వూరుకోండి! అలాంటి మాట లనకండి! ఎం.బి.బి.ఎస్ ను వదిలేసి ఆ దిక్కుమాలిన చదువుకు వెళ్తానంటారేమిటి?"
    ప్రభాకర్ ఉష కేసి చూశాడు.
    "దిక్కుమాలిన చదువన్నారు! ఆ దిక్కుమాలిన దాన్లో కూడా నాకు సీటు వచ్చేలా లేదు...."
    ఉష స్థిమిత పడి ప్రశ్నార్ధకంగా చూసింది.
    "నాకు వయస్సు దాటి పోయింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి మరో మూడేళ్ళు ఎక్కువున్నా చేరూకుంటారు. కాని నాబోటి వాళ్ళకు ఇరవయ్యో కటి దాటితే చేర్చుకోరు."
    సీటు ఎలాగూ రాదని తెలిసాక ఉషకి ప్రభాకర్ ను విడిపించబుద్దేసింది.
    అందుకని "కులానికి ముందు కొండ చేర్చుకుంటే మీరు కూడా ట్రిబ్ లోకే వస్తారు. అలా అని ఒక సర్టిఫికేట్ పుట్టించుకొచ్చారంటే అందరి కన్నా ముందు మీకే సీటిస్తారు...... నా క్లాసు మేటు ఎం.బి.బి.ఎస్ లో చేరటానికి ఈ పాచికే వేసింది. పాచిక చక్కా ఫలించింది కూడా! మీరు కూడా కావాలంటే ప్రయత్నించుకోవచ్చు." అని చెప్పింది ఉష నిజంగా జరిగిన ఒక సంగతిని విన్నవిస్తూ.
    ఆ క్లాసు మేటిప్పుడు ఆంధ్ర లో చదువుతున్నదని ఉష చెప్పింది.
    ప్రభాకర్ ఆశ్చర్యంతో తల మునకలయ్యాడు.
    "నిజంగా ? అయితే నేను కొండ బ్రాహ్మడినని చెప్పుకుంటే సీటిస్తారా?"
    "అలా ఆశ్చర్య పోతారెందుకు? కొండల్లో మాత్రం బ్రామ్మలుండరా?"
    ప్రభాకర్ ఏదో గుర్తొచ్చినట్లుగా గభాలున సర్దుకుని కూర్చుని "అవునండోయ్! ఈ మధ్య వీక్లీ లో కొండ బ్రహ్మల గురించి చదివినట్టే గుర్తు."
    ఉష కంగారు పడింది.
    "ఉంటె ఉన్నారు! మీరు మాత్రం అలా అని అప్లికేషన్ పెట్టకండి. తిన్నగా కీల్సాక్ తీసుకెళ్తారు? ఎం.బి.బి.ఎస్ వదిలి వెళ్ళనని ఒట్టు వెయ్యండి." అంటూ ఉష చెయ్యి చాచింది.
    ప్రభాకర్ ఉష చేతిలో తన చెయ్యి ఉంచాడు. బస్సులో నుంచి దిగి కాస్త దూరం నడవగానే ఉష స్నేహితురారిల్లు కనబడింది.... ఉష ఎంత భయపడి పోయిందో పాపం!
    ఉష ప్రభాకర్ ను పంపించేసి లోపలి కెళ్ళింది. ప్రభాకర్ మెల్లిగా నడుస్తూ బస్సు స్టాపు చేరుకున్నాడు. ఉష కి ఎం.బి.బి.ఎస్ ఎక్కడ మానేస్తానో అని భయం -- తను మానేస్తానంటే ముందు నాన్న తన ప్రాణాలు తీసేయ్యడూ? అయినా నాన్నంటే తనకేం భయం -- తను మానేస్తానంటే ముందు నాన్న తన ప్రాణాలు తీసేయ్యడూ? అయినా నాన్నంటే తనకేం భయం లేదు-- కాని ఉష ...! ఉష కోసం తను తప్పకుండా డాక్టరు కావాలి!
    బస్సు వస్తున్నదేమోనని చూశాడు. కనుచూపు మేరలో ఏదీ కనబడలేదు. బస్సుల కోసం ఎదురు  చూడటం లో సగం జీవితం కాబోలు గడిచి పోతుందని ఒకాయన వ్రాసిన వ్యాసం చటుక్కున జ్ఞాపకం వచ్చింది. ఎవరు వ్రాశారో జ్ఞాపకం లేదు, ఎంత జీవితం వెస్టన్నాడో జ్ఞాపకం లేదు. ప్రభాకర్ కు నవ్వొచ్చింది. చదవటం వల్ల ఏం ప్రయోజనం? ఇలా చదివి అలా మర్చి పోవటానికెగా?
    "ఏమిటి? తీరిగ్గా నిలబడి కలలు కంటున్నారు"
    ప్రభాకర్ ఆశ్చర్య పోయాడు.
    "మీరు....మీరేనా ఉషారాణి?"
    ఉష జడ ముందుకు వేసుకుని అల్లుకుంటూ నవ్వింది.
    "ఆ! నేనే! నేను కాక మరెవరు? మా స్నేహితురాలు ఉంటానని చెప్పి సినిమా కెళ్ళింది.... అందుకని తిన్నగా ఇంటికి వెళదామని ఇలా వచ్చాను...."
    ప్రభాకర్ హుషారుగా చూశాడు.
    'అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? అలా ఏ హోటలు కైనా వెళ్దాం రండి...."
    "మళ్ళా ఏం గొడవ తెచ్చి పెడతారు?" అంటూ ఉష కిలకిల లాడింది.
    ప్రభాకర్ సిగ్గు పడుతున్నట్టుగా నవ్వి మీరింకా మర్చి పోలేదన్న మాట!" అన్నాడు.
    ఇద్దరూ కలిసి నడక పుచ్చుకున్నారు.....

                             *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS