Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 25

 

                                         13

    రాత్రి ఎనిమిది గంటల ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం కన్నుల పండువగా ఉంటుంది. అందంగా. విశాలంగా ఉన్న రోడ్లపైన అధునాతనమైన, ఆకర్షణీయమైన షాపులు చాలా ఉంటాయి. షాపింగ్ కోసం వచ్చిన వాళ్ళల్లో సివిలిజేషన్ ప్రస్ఫుట మవుతుంది. ఆ మనషులు అందరూ ఒకే జాతివారు కాదు. వాళ్ళల్లో వివిధ రకాల పద్ధతులు, సంస్కారాలూను. అనేకమైన 'జాతుల' వారికి యీ మహా పట్టణం ఆశ్రయ మిచ్సింది.
    కోటీ ప్రాంతం మరీ ముచ్చటగా ఉంటుంది. డబ్బుండాలే గాని నిమిషంలో వందలు మంచి నీళ్ళలా ఖర్చయేందుకు మంచి అవకాశం అక్కడే ఉంది.
    టాక్సీలో కూర్చున్న వాసు ముఖంలో ఆందోళన ఉన్న కొద్దీ ఎక్కువవుతోంది. టాక్సీవాడిని తొందరచేస్తూన్నాడు. తనముందు వంద అడుగుల దూరంలో మరో టాక్సీ వెడుతోంది. వేగంగా. ఆ టాక్సీలో రాజశేఖరరావు ఉన్నాడు. దాన్ని వెంబడించి పొమ్మని తన టాక్సీవాడికి చెప్పేడు వాసు.
    ఎన్నో మలుపులు తిరిగేయి టాక్సీలు. సాలెగూడులాటి ఆ దారులు చూస్తూంటే- మరో ప్పుడైతే ఆనందించేవాడే గాని-ఇది అందుకు అధను కాదు. వాసుకి కావలసింది, ముందు టాక్సీలో-విర్రవీగుతూ, జీవితాన్ని 'ఛాలెంజ్' చేసి గెలుస్తున్నానన్న గర్వంతో మిడిసిపడిపోతున్న రాజశేఖరం!
    ఎన్నాళ్ళనుండో ఈ అదనుకోసం ఎదురు చూచాడు వాసు. పాపం చేసిన మనిషి చట్టం కళ్ళల్లో దుమ్ముకొట్టాడు. చట్టానికి తన ఉనికి తెలీదని, తనేం చేసినా చెల్లుబడి అవుతుందని నమ్ముతూన్న రాజశేఖరానికి శిక్ష ఏమిటి?
    వాసు గుప్పిట బిగించాడు ఈ రెండు చేతులూ చాలు ఒక మనిషి ప్రాణం తీయడానికి ఇప్పుడనిపిస్తుంది-బలిష్టమైన తన చేతులు ఈ శేఖరం ప్రాణాలు తీయడానికేనా ఉన్నది అని వేదాంతిలా నవ్వేడు వాసు.
    వాసుదేవరావుకి చెమట పట్టింది అతని బుర్రలో వెయ్యి మైళ్ళ వేగంతో ఆలోచనలు సాగుతున్నాయి.
    టాక్సీవాడు సడన్ బ్రేక్ వేయడంతో ఆలోచనల నుంచి తెప్పరిల్లి ఉలిక్కిపడ్డాడు వాసు. డ్రైవరు వైపు ప్రశ్నార్ధకంగా చూసేడు.
    తనముందు పరుగెత్తిన టాక్సీ ఒక 'బార్' ముందు ఆగిఉంది. దానివైపు చేయెత్తి చూపించాడు టాక్సీవాడు.
    వాసు టాక్సీ దిగాడు. డ్రైవరుని అక్కడే ఉండమని చెప్పేడు తనూ బార్ లోకి వెళ్ళాడు.
    రాజశేఖరరావు బార్ లో కనుపించాడు అక్కడ ఉన్న ఒక గదిలోకి అతను వెళ్ళి కూర్చోడం గమనించాడు వాసు. మరో అయిదు నిమిషాల్లో బేరర్ విస్కీ, సోడాలు ఆ గదిలోకి తీసుకెళ్ళాడు.
    వాసు చిప్స్ తింటూ ఒక కన్ను ఆ గదివైపు వేసి ఉంచాడు.
    పావు గంటకి గాని రాజశేఖరరావు ఆ గది నుంచి బయటికి రాలేదు అతని వ్రేళ్ళమధ్య సిగరెట్టు కాలుతుంది బయటకు వెళ్ళిపోతూ ఒక మాటు తనవైపు జూచి, గమ్మత్తుగా నవ్వాడు రాజశేఖరరావు. వాసూ బయట కొచ్చేశాడు.
    రాజశేఖరరావు టాక్సీ కదిలింది వాసు టాక్సీ కదిలింది.
    మళ్ళా 'వేట' ప్రారంభమైంది.
    దారి మధ్యలో డ్రైవరు వాసువైపు అదోలా చూచి గభాలున నవ్వేశాడు. వాసుదేవరావు కిదేమీ బోధపడలేదు.
    "ఎందుకు నవ్వావ్?" కాస్త కటువుగా అడిగాడు.
    "మీ బిజినెస్ అర్ధంకాలేదు సార్"
    "నోరుముయి!"
    టాక్సీవాడు అద్దంలోకి చూస్తో-ఏదో నములుతూ తొణకకుండా జవాబు చెప్పాడు.
    "ముందు టాక్సీలో ఉన్న సాబ్ నాకు తెలుసు."
    "అయితే....."
    "మనం ఆ టాక్సీకి వెంటపడే అవసరం లేదు సార్ ."
    "అంటే."
    "ఇప్పుడా టాక్సీ ఎక్కడిక్ వెడుతుందో నాకు తెలుసు."
    "................."
    "ఆ సాబ్ తో మీకేం బిజినెస్ ఉందో చెప్పండి. తీరుబాటుగా వెళ్ళి ఆయన్ని కలుసుకోవచ్చు."
    "అదంతా అనవసరం. నే చెప్పినట్టు చెయ్యి. అ టాక్సీని ఫాలో అవ్వు."
    డ్రైవర్ కులుకుతూ మళ్ళీ నవ్వేడు.
    "నీకేం పిచ్చెత్తలేదుగదా!" అన్నాడు కసిగా వాసు.
    "శేఖరం సాబ్ మంచి మజాలో ఉన్నారు. ఇప్పుడు ఖుషీ కోసం చిక్కడపల్లి వెడతాడు. అక్కడ ఒక చిలకమ్మ ఉంది. తిన్నగా ఆ యింటికే వెడతారు ....పనేమిటో చెపితే.."
    "నే నతన్తో కొన్ని విషయాలు మాట్లాడాలి."
    "ఇప్పుడా సాబ్ ఎవర్తో మాటాడారు."
    "నేనే అతన్తో మాతాడాలి."
    "మీ యిష్టం సాబ్."
    కొన్ని మలుపులు తిరిగిన తర్వాత టాక్సీని ఒక చోట ఆపాడు డ్రైవరు. తలుపు తీస్తో-
    "అదుగో సాబ్..... ఆ డాబా యింట్లో ఉంటారు. దిగి వెళ్ళండి."
    వాసు టాక్సీ దిగాడు.
    "నన్నిక్కడే ఉండమంటారా?" ఎప్పుడూ ఏదో నెమరు వేయడం ఆ డ్రైవరుకి బాగా అలవాటేమో.
    "అవసరంలేదు. నువ్వు వెళ్ళొచ్చు."
    వాసు ఆ యింటివైపు నడిచాడు. ఆ యింట్లో లైట్లు వెలుగుతున్నాయి. తనెదుట నున్న గదిలో గాజు కిటికీ ద్వారా రాజశేఖరరావు కనుపించేడు. అతను కూజాలో ఉన్న నీళ్ళు గ్లాసులో వంచుకున్నాడు. అతని ప్రక్కగా ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆవిడ ఏమిటో అంటుంది. అతను నీళ్ళు తాగి చేతులూపుతూ ఏదో చెపుతున్నాడు.
    వాసు గబగబా ఆ యింట్లోకి ప్రవేశించాడు.
    "నోర్ముయ్ ........ ఆరిందాలా చెప్పొస్తున్నావ్" అతను ఆమెను కసురుకున్నాడు.
    "ఇన్నాళ్ళూ నోరు మూసుకునే మీరు చెప్పేదంతా విన్నాను, ఇంకా నేను సహించలేను."
    "గంగలో దూకు. చేసుకున్న పెళ్ళాంలా సతాయించడం నేర్చుకున్నావ్."
    "మీలో మార్పు రాదా?"
    "గెటవుట్. ముందీ గది వదులు. నన్ను వంటరిగా ఉండనివ్వు. వెళ్ళు."
    ఆవిడ సన్నగా ఏడ్వడం ప్రారంభించింది.
    "నీకే చెప్తూంట, వెళ్ళు."
    ఆవిడ కదలలేదు. అతను చెయ్యి చేసుకున్నాడు. మెడపట్టి గెంటాడు. గది తలుపు వేసుకున్నాడు.
    ఆవిడ కుళ్ళి కుళ్ళి ఏడ్చి, తన గదివైపు మెల్లిగా నడిచి, గదిలోకి వెళ్ళిపోయింది. తలుపులు వేసుకుంది.
    వాసుదేవరావు నిట్టూర్చాడు. ఆ అభాగ్యురాలి పైన జాలి కలిగింది. రాజశేఖరరావు పైన కక్ష కలుక్కుమంది. పాములా బుస కొట్టాడు. గబగబా తలుపు తట్టాడు జవాబు రాలేదు. మళ్ళీ తట్టాడు. లోనుండి మాటలు వినిపించాయి.

 

                               
    "ఇంకో తడవ చెప్తున్నా-నన్ను విసిగిస్తే చంపేస్తా."
    వాసు మళ్ళా తలుపు తట్టాడు.
    తలుపు తెరుచుకుంది. రాజశేఖరరావ్ ఫ్లవర్ వాజ్ తో తనముందు నించుని ఉన్నాడు. తనని చూడగానే ఉలికిపడ్డాడు.
    వాసు అతని ప్రమేయం లేకుండా గదిలోకి వచ్చాడు. తలుపుకి గడియ వేశాడు. ఈ వింత పద్ధతికి రాజశేఖరరావు మరింత కలవరపాటు చెందేడు.
    "నీతో నేను చాలా మాటాడాలి. నాముందు కూర్చో" అన్నాడు వాసు.
    "నన్ను మీరు వెంబడించడం గమనించాను. ఎందుకు? నిజం చెప్తున్నా..... మీ రెవరో నాకు తెలీదు" అన్నాడు రాజశేఖరరావు.
    "ఇప్పుడే చెప్తాను. ముందు కూర్చో."
    రాజశేఖరరావు కూర్చున్నాడు వాసుదేవరావు కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడున్న కూజాలో నీళ్ళు తాగాడు చేత్తో మూతి తుడుచుకుంటూ.......
    "ఈ నీళ్ళు తప్ప ఈ రోజుకి కడుపులో ఏం పడలేదు. అయినా సత్తువ కించిత్తూ తగ్గదు. నీకంటే నేను బలిష్ఠుడిని కదూ."
    రాజశేఖరరావు బిత్తరపోతున్నాడు.
    "నువ్విప్పుడు తాగున్నావ్. అసలే నరంలాంటి మనిషివి."
    "మీ రొచ్చిన పనేమిటో......"
    "నరంలాంటి మనిషి కింత ధైర్యం ఎక్కుడ్నుంచి వచ్చిందో గాని, నిజం చెప్పు ..... జీవితంలో నువ్వెందర్ని మోసం చేశావ్?"
    "మీ రనే దెవరో నా కర్ధం కావడంలేదు."
    "నేను నమ్మను. అన్నట్టు యిప్పుడు నీతో మాటాడి వెళ్ళిన స్త్రీకీ నీకూ సంబంధ మేమిటి?"
    "అసలెవరు మీరు. అనవసరమైన విషయాలు అడగటానికి మీకేమిటి అధికారం?" రాజశేఖరరావు గభాల్న కుర్చీమీద నుండి లేచి నిలబడ్డాడు.
    ఒక్క ఉదుటున అతని భుజాలు పట్టుకుని కుర్చీలోకి తోశాడు వాసుదేవరావు. ఆ దెబ్బతో కుర్చీని అంటిపెట్టుకున్నాడు. రాజశేఖరరావు.
    "నీదగ్గర చాలా డబ్బుంది కదూ?"
    "....................."
    "నే నడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు. ముందు ఆ స్త్రీ ఎవరో చెప్పాలి?"
    ".........................."
    "జవాబు కావాలి' అన్నాడు అతని మీదకి వొరుగుతూ.
    "ఆమె నా భార్య."
    "అబద్ధం నిజం చెప్పు."
    "నిజమే."
    "కాదు."
    "అలాంటప్పుడు మీకు తెలిసి గూడా అడగటం దేనికి?"
    "చచ్చు ఆర్గ్యుమెంట్సు నా దగ్గర పనిచెయ్యవు."
    "అయితే నే చెప్పేదేమీ లేదు" అన్నాడు రాజశేఖరరావు.    
    అతని చెంప చెళ్ళుమంది. దాంతో రాజశేఖరరావుకళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. నోటి పక్కగా కాస్త నెత్తురు కనిపించింది. దెబ్బతో తాగిన మైకం దిగింది.
    "నే నిందాకే అన్నాను, నేను నీకంటే బలవంతుడనని. కాబట్టి నీవంటిమీద శ్రద్ధ తీసుకోడం అవసరం."
    "ఆ అమ్మాయిది తెనాలి. నాతోపాటు వొచ్చింది."
    "ఆమె వొచ్చిందా? నువ్వు తీసుకొచ్చావా?"
    "కాదు..... నేనే తీసుకొచ్చాను" అన్నాడు వణికిపోతూ.
    "గూడ్ .... దార్లోకి వస్తున్నావ్ అన్నట్టు నీకు పెళ్ళంటూ అయిందా?"
    "అయ్యింది."
    "మరి నీ భార్య."
    "పుట్టింట్లో ఉంది."
    "వెళ్ళగొట్టావా?"
    "లేదు."
    "రాజశేఖరం" గదిమాడు వాసు.
    "ఆ.....అవును......వెళ్ళగొట్టాను."
    "నే నెవరో నీకు తెలుసా?"
    "తెలీదు."
    "నిజమే. తెలుస్తే ముందు జాగ్రత్త పడేవాడివి. అవునా."
    "........................"
    "నా పేరు వాసుదేవరావు."
    "నా పేరు ......"
    "తెలుసు. నీ పేరూ తెలుసు, నీ జాతకమూ తెలుసు. ఆడపిల్లల జీవితాల్తో ఆటలాడుకునే రాక్షసుడివి నువ్వు. కదు?"
    ".........................."
    "చదువుకునే రోజులు నీకు జ్ఞాపకం ఉండే ఉంటా యనకొంటాను. అప్పట్లో నీకు ఓ ఆడ పిల్ల పరిచయమైంది పేరు అరుణ."
    "అ.........రు......ణ....."
    "అవును.....ఆమె గురించి నీ కిప్పుడేమైనా తెలుసా?"
    "మిస్టర్ మరోసారి హెచ్చరిస్తున్నా. తల తిరుగుడు సమాధానాలు పనికిరావు. ఇప్పుడు చెప్పు..... నీకా పిల్ల తెలీదా?"
    "కొద్దిగా జ్ఞాపకం వొచ్చింది. అరుణ అని దబ్బపండు ఛాయలో రెండు జడలు వేసుకుని ...."
    వాసుదేవరావు కనుకొనల్లో నీళ్లుండటం గమనించి అతను చెప్పే మాటలు ఆపివేశాడు.
    "మీకా పిల్ల తెలుసునా?"
    "అరుణ నా చెల్లెలు! అతి గారాబంగా పెరిగింది."
    "ఇప్పు డెక్కడుంది?"
    "లేదు. ఆత్మహత్య చేసుకుంది."
    "సూయీ సైడ్ ....... పాపం ....."
    "మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, కట్టుబాట్లలో పెరిగిన పిల్ల కాలు జారితే ఏమవుతుంది? పిరికి గుండె కాబట్టి అర్ధరాత్రి భావిలో దూకి సూయీసైడ్ చేసుకుంది. ఆ పిల్ల మూలంగా పచ్చటి సంసారం నడిరోడ్డుమీద పడి అల్లరిపాలవడం యిష్టంలేక ఆత్మహత్య చేసుకుంది."
    "వాటే ఆఫుల్ ట్రాజడీ! నాకు తెలీదు సుమండీ."
    వాసు కళ్ళు ఎర్రబడ్డాయి.
    "ఆ అవసరం నీ కెందు కుంటుంది. అనుభవించావ్. అరుణ ప్రాణంతో ఆటలాడావ్" అన్నాడు కసిగా వాసు.
    "అబద్దం" అరిచేడు అతను.
    అతని భుజాలపైన చేతులువేసి కిందికి నొక్కుతూ.
    "అరుణ డైరీ, నీ ఫోటో అబద్ధం చెప్తాయా మిస్టర్ ! .... అరుణ పోయిన బెంగతో ప్రాణప్రదం లాంటి మా నాన్న పోయారు. మా సంసారం నిలువునా కూలిపోయింది. ఈ కథకీ, ఈ ఆఫుల్ ట్రాజడీకీ మూల విరాట్టేవరంటావ్ .... ఎవరు?"
    "నేను కాదు."
    రాజశేఖరరావు మెడ చుట్టూ తన రెండు చేతులూ వేసి, మెడని గట్టిగా నొక్కుతూ-
    "నువ్వు నువ్వే కారణం. ఒక ప్రాణిని, ఒక కుటుంబాన్ని చంపిన నువ్వు హాయిగా, నిశ్చింతగా బ్రతకడం నా కిష్టంలేదు."
    వాసుదేవరావ్ చేతులు బిగుసుకు పోతున్నాయి. రాజశేఖరరావు ప్రాణభీతితో కెవ్వున కేకపెట్టాడు. శక్తి నంతటినీ కూడదీసుకుని వాసుదేవరావుని ఒక్క తోపు తోశాడు. వాసు పట్టు సడలింది.
    తలుపు దడదడా శబ్దమైంది. రాజశేఖరరావు తలుపు దగ్గరికి పరుగెత్తి తలుపు తీశాడు. వాసు అతని జుట్టుని పట్టుకుని పొట్టలో రెండు గుద్దులు గుద్దాడు. నేల కూలాడు రాజశేఖరరావు.
    తలుపు అవతల నించున్న యిందాకటి యువతి కెవ్వున అరిచి తలుపు దగ్గరే స్పృహతప్పి పడిపోయింది.
    వాసుదేవరావు రాజశేఖరం గొంతుని మళ్ళా పట్టుకున్నాడు. అతను గిలగిలా తన్నుకుంటున్నాడు.
    "నువ్వు తన్నుకు చావాలి. నీలాటి చీడపురుగు బ్రతికి బట్టకట్టడం నా కిష్టంలేదు. నిన్ను చంపి నేను జైలుకి పోతాను. నీకోసమే యిన్నాళ్ళు బ్రతికాను. గాలించి తిరిగాను. ఇప్పుడు నీ చావు తప్పదు రాజశేఖరం!" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS