వీళ్ళిద్దరి మాటల్తో ప్రమేయం లేనట్టు వాసు గుర్రుపెట్టి నిద్రపోయేడు.
* * *
ఆ ఉదయం ఆఫీసు వాతావరణం చాలా హాయిగా ఉంది. ఎవళ్ళకి వాళ్ళు సీరియస్ గా పనిచేసుకు పోతున్నారు. ఇది కాస్త విడ్డూరంగా కనిపించింది శంకరానికి. రోజూ ఆఫీసు ఇంత హాయిగా, మనసుకి ఉల్లాసంగా ఉంటే ఎంత బావుండునో అనిపించింది శంకరానికి.
ఆ మధ్యాహ్నం శంకరానికి ఒక ఉత్తరం వచ్చింది. కవరుమీద రాత చూశాడు. అదెవరో కొత్తవాళ్ళు రాసినట్టుంది. ఆత్రంగా కవరు చించేడు. పెద్ద ఉత్తరం. అక్షరాలు అందంగా ఉన్నాయి. ఒకసారి చివరి పేజీ చూశాడు. 'సుజాత' అని రాసిఉంది. అతను ఆశ్చర్యపోయేడు. ఇన్నాళ్ళకి తనకి ఉత్తరం వ్రాయడం చిత్రంగా కనిపించింది. చదవడం ప్రారంభించేడు.
శ్రీ శంకరంగార్కి నమస్కారములు.
మీరు బెజవాడలో ఉద్యోగం చేస్తున్నట్టు తెలిసింది. సంతోషం. ఇక్కడకొచ్చి వెళ్ళిపోవడం బాధగా ఉన్నా కారణం అడిగేందుకు నాకు అధికారం లేదు గదా.
మీ 'చెదిరిన మనసులు' చదువుతున్నాను. నాకు నచ్చని అభిప్రాయాలు దాన్లో కొన్ని ఉన్నా,
మొత్తానికి నవల చాలామందిని ఆకర్షించవచ్చని అనుకుంటున్నాను.
ఇక్కడే ఒక చిన్నమాట.....
నేను చాలా నవలలు చదివేను. నవలల్లో నాకు కనిపించింది అవాస్తవికత, అసందర్భమైన సన్నివేశాలూను. కథలు రాయాలనే సంకల్పమూ, ఉత్సాహమూ నాలో యింకా చావలేదు కనుక, నాకు కనుపించిన ప్రతి రచననీ శ్రద్దగా చదవడం బాగా వంట పట్టింది.
ఏదో రాయవలసి వచ్చింది కాబట్టి రాస్తూన్నా మని రాస్తే అది రాణించగల రచన కానేకాదు. ఒక దృక్పథం, ఒక పటిష్టమైన అభిప్రాయం, పరిశీలన నవలకి అవసరం. రచయిత సిన్సియారిటీ ప్రతి వాక్యంలోనూ కనుపించాలి.
సంఘాన్ని ఉద్దరించండని నేను చెప్పడం లేదు. 'కేవలం', రచనలవల్ల సంఘం ఉద్దరింపబడే దయితే యీ మహత్తర కార్యం రెండు దశాబ్దాల వెనకే సఫలీకృతమయ్యేదేమొ? నే చెప్పేది-మనం రాసే ప్రతిధీ ఒక పాఠమై ఉండాలి. దానివల్ల చైతన్యం కలుగుతే సంతోషమే-కలగదూ మనకి మనమే ఒక మంచి నవల రాశామనే తృప్తి ఉంటుంది. నవల రాసేముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి-ఇది సబబా? దీన్ని జనం హర్షిస్తారా? రాసేదాంటో 'వస్తువు' ఎలాటిది? ఈ వస్తువుతో పాత్రల కెలాటి సంబంధముంటుంది.? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఎలా మాట్లాడుతారు? దీన్లో జీవితాన్నెంత వరకూ వాడుకున్నాం?

ఇలాటి యక్ష ప్రశ్న లన్నిటికే జవాబు చెప్పుకోవాలి. అది సంతృప్తికరంగా ఉంటేనేగాని కాయితంమీద పెట్టరాదు.
రచన మూలకంగా సమాజానికిగాని, ఎక్కడో ఉన్న ఒకానొక వ్యక్తికిగాని లాభించకపోవచ్చు. అది వేరే విషయం కాని - నిత్యమూ జరిగే జీవిత విధానమూ కావాలంటాను. దాని వెనుక రచయిత కృషి, సిన్సియారిటీ అవసర మంటాను.
అంతేగాని-లేనిపోని ఊహాగానాలు, అర్ధంలేని త్యాగాలూ, 'నీ పవిత్ర హృదయంలో నాకు చోటు లేదా' 'నీ పాదధూళి నా నెత్తిని వెయ్యరాదా' లాటి నినాదాలూ, చచ్చు అపార్ధాలూ, తెలివి తక్కువ అనుమానాలూ, చాతకాని పాత్రపోషణా గుప్పించి చదివేవాడి ప్రాణం తీయడం అన్యాయం. అవి కదనలు కావు. కాలేవు.
ఉదాహరణకి ......
ఒక ఆడపిల్ల ధనికులింట్లో పుట్టి పెరిగింది. ఆ పిల్లకి అన్నయ్యలూ, అక్కయ్యలూ, చెల్లాయిలే లోకం, సర్వమూను. బయట ప్రపంచం తెలీదు. ఇలా ఆ పిల్లకి రంగు పులిమి, మధ్యలో ఎవ్వడితోనో పరిచయమై, రెండు సినిమాలకి వెళ్ళి-ఆమీద వాడితో 'లేచిపోవడం' కథ. చెప్పండి. ఇదెంత దారుణం? లేచిపోవడం అంత సులభమైన పనా? రెండు సినిమాలకి కలిసి వెళ్ళినంత మాత్రాన లేచిపోవడమేనా? అదేమంటే 'మనసు' అని చెప్తారూ? ఇలాటి మనసులు బయట ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి?
ఆపిల్ల ఆ పిల్లాడితో లేచిపోవడం (కథకునుద్దేశ్యంలో) తప్పనిసరైతే, ఆ ఘనకార్యానికి ముందు రెండు మూడు చోట్ల ఆ పిల్లలో కలిగిన సంఘర్షణ, వెర్రిమొహం లాటి గుణాలు గాని, వాళ్ళిద్దరి పరిచయం పది నెలల వరకూ పెంచడంగానీ - అక్కడ బలమైన సన్నివేశాలు చిత్రించడం గానీ జరుగులే బాగుండేదేమో. అదేమీ లేకుండా అమాంతంగా ఆ పిల్ల లేచిపోవడం శోచనీయం. తాను సృష్టించిన పాత్రపైన తనకే 'కంట్రోల్' లేకపోవడం ఘోరం. ఇది నా అభిప్రాయం.
క్షమించండి. మిడిమిడి జ్ఞానానికి కథలు రాయాలనే ఉత్సాహం తోడై ఆ కథలు తిరిగొచ్చే యడంతో కక్ష పుట్టుకొచ్చి, ఏం చెయ్యాలో తోచక, చదివిన ప్రతి కథనీ విమర్శించేందుకు పూనుకుంటూన్న దుస్థితికి నేను రాలేదు. రాను గూడా.
పై నుదహరించిన అభిప్రాయాల్లో రచయిత లైన మీరుగాని, పాఠకురాలినైన నేనుగాని భుజాలు తడుముకోడం భావ్యంకాదు.
నా గురించి .......
ప్రస్తుతం పుట్టింట్లో ఉంటున్నాను. ఆయన గారు మారిపోయారు. ఆయ నిష్టానికి నే నెప్పుడు ఎదురు చెప్పలేదు గాని, నా మనసుకి నొప్పి కలిగించేలా మాటాడొద్దని ప్రాధేయపడ్డాను. ఆ మనిషికి ఎదుటి మనిషిని అర్ధం చేసుకునేపాటి సంస్కారం కరువైపోయింది. ఇది నా ఖర్మ.
ఆయన నన్ను ఆ యింటినుంచి గెంటెయ్యలేదు. ఆ పరిస్థితి రాకమునుపే నాకై నేను వెళ్ళి పోవడం మంచిదనుకున్నాను. కాబట్టి-పుట్టింట్లో మకాం పెట్టడానికి ముఖ్య కారణం నేను.
నేనీవూరు వొచ్చేసిన తర్వాత ఆయనకి పెద్ద బరువు తగ్గినట్టయింది కాబోలు-కులాసాగా ఉన్నారట. ఉద్యోగానికి రాజీనామా యిచ్చారని విన్నాను. విజయనగరం హోటల్లో ఒకనాటి రాత్రి ఒక చక్కటి ఆడపిల్లతో గడిపినట్లు మా దూరబ్బందు వొకరు మా అన్నయ్యకి ఉత్తరం రాశారు.
మనిషి తప్పుకి భయపడాలని శాస్త్రం చెపుతుంది. భయపడకపోతే మానె, భయపడుతున్నట్లు నటించినా ఆయనిందరి నోళ్ళలో పడకపోను. ఆ తెలివి తేటలూ లేవాయనకి. అందుకే ఆయనంటే నాకు జాలి. ఆ మనిషి ఎప్పుడో ఒకప్పుడు గట్టిగా దెబ్బతిని మళ్ళా నాకోసం పరుగెత్తుకుని రాకమానరు.
మన పురాణాలూ, పెద్దలూ, పాతివ్రత్యం గురించీ చాలా చెప్పేరు. భర్త ఎంత నీచుడైనా అతని అడుగులకు మడుగులొత్తడం నారీమణి ధర్మంట. ఈ పాఠం బాగా బుర్ర కెక్కింది కాబోలు. ఆయనలాటి చాలామంది పురుషులు ఆడదాన్ని లోకువచేసి పారేస్తున్నారు. 'ఆడది అబల కాదు' అంటున్న యీ రోజుల్లో గూడా మగావాడు అధికారం చెలాయిస్తూనే ఉన్నాడు.
పోనీలెండి-ఆడదాన్ని వెనకేసుకొచ్చి మగవాళ్ళనందర్నీ తిట్టటం నాకిష్టంలేదు. ఎవరి సంసారం వాళ్ళది-దీనికి భేద మెందుకు?
చాలా పెద్ద ఉత్తరమైంది!
అన్నట్లు-ఈమధ్య నాలుగు కథలు పంపుతే మూడు కథలు తిప్పినంపి నాలుగో కథ వేస్తూన్నట్లు ఉత్తరం రాశారు పత్రికవాళ్ళు. మీ రన్నారు గుర్తుందా నలుగుర్ని చంపి డాక్టరైనట్టే ...... నేనూ కథకురాలిని అవుతున్నా నండోయ్!
ఈసరికి విసుగుపుట్టి ఉంటుదని తలుస్తాను. మీ మోడస్టీని ఆధారంగా తీసుకుని నా (విలువ యిస్తారా?) అభిప్రాయాలూ, సొంత కథా చెప్పి అమూల్యమైన మీ కాలం వృధాపరచి నందుకు క్షమించమని కోరుకుంటూ-
సుజాత."
ఉత్తరం చదువుతూ మరింత ఆశ్చర్యపోయాడు శంకరం. ఒక పక్కన తను అనుభవిస్తోన్న క్షోభని దాచుకుంటూ మరో పక్కని 'కథలూ చిత్రీకరణా' అని వ్రాయడం అతనికి చిత్రంగా ఉంది.
ఏమైనా సుజాత అంత త్వరగా అర్ధమయ్యే మనిషి కాదు.
* * *
వాసుకి ఏమీ తోచడంలేదు.
సెలవు తీసుకుని గదిలో కూర్చున్నంత మాత్రాన మనసుని అదుపులో పెట్టుకోడం-తేలికైన పనికాదు. మరచిపోదా మనుకుంటూన్న నాన్న, ఆయన వ్యక్తిత్వమూ అనుక్షణం గుర్తు కొచ్చి కలవరపెడుతుంది. ఏదో ఆలాపన రావడం, నాన్న యింకా బ్రతికే ఉన్నాడనిపించడం-వెను వెంటనే కట్టలు తెంచుకుని దుఃఖం పెల్లుబికి రావడమూను.
చాలామంది జీవితాలు గారడీగా ఉంటాయి. గడిచినదీ, గడిచేదీ, గడుస్తున్నదీ అంతా పెద్ద గారడి. వాసు వయస్సునీ, అతని జీవితాన్నీ పరిశీలించి చూస్తే ప్రతి అంశమూ ఒక గమ్మత్తూ, గజిబిజి, ఒక పిచ్చుక గూడు.
ఇన్ని సమస్యల మధ్య, ఇంత చిత్రమైన వాతావరణంలో అతని బ్రతుకు ఒక 'థ్రిల్లింగ్' లా ఉంది. ఒక్కోసారి నవ్వూ, ఒక్కోసారి విసుగూ, జాలీ, భయాలూ ఇలా అన్నివిధాలైన అనుభూతులూ తనమీద తనకే కలుగుతూంటాయి.
పదమంది మధ్యా నిలబడి ఘొల్లున ఏడ్చేయాలనీ అనిపిస్తుంది.
వాసు చిరాకుగా లేచి నిలబడ్డాడు. బట్టలు మార్చుకుని బజారు వెంట నడిచాడు. హోటల్లో కూర్చుని కాఫీ తాగేడు. సిగరెట్టు ముట్టించి పొగ వదిలాడు. అంతే ..... అతను నిలువెల్లా కంపించిపోయాడు.
అతను-రాజశేఖరరావు, అదే హోటల్నుంచీ మునుపొచ్చినట్టే, బయటికి వచ్చి నిలబడ్డాడు. అతన్తోపాటు ఒక చిన్న సూటుకేసుండి. అతనో రిక్షాను పిలిచేడు. అందులో కూర్చున్నాడు. రిక్షా కదిలింది.
వాసు గబగబా బిల్లు చెల్లించి ఆ రిక్షా వెనగ్గా మరొక రిక్షాలో బయలుదేరాడు. 'ఈరోజు నన్ను తప్పించుకోలేవు శేఖరం' అనుకున్నాడు వాసు.
రైల్వేస్టేషను దగ్గర రాజశేఖరరావు దిగేడు. రాజశేఖరరావ్ టికెట్టు కొని ఫ్లాట్ ఫారం మీదికి వచ్చేడు. అతన్ని వస్తూ వెంబడించేడు.
రాజశేఖరరావ్ హైద్రాబాద్ వెళ్ళే రైలు ఎక్కాడు. వాసు రైలు కదిలేంతవరకూ ప్లాట్ ఫారం మీదే గడిపి, రైలు కదిలిన తర్వాత తనూ ఎక్కేశాడు.
రైలు వేగాన్ని పెంచుకుంటోంది.
* * *
ఆ సాయంత్రం ఆఫీసయిం తర్వాత రూం కొచ్చేరు పతీ, శంకరమూను. డూప్లికేటు కీతో తాళంతీసి లోపలి కెళ్ళేరు. స్నానం ముగించి వాసు కోపం ఎదురు చూచేరు.
ఫలానీ హల్లో మంచి సినిమా ఆడుతోంది. ఆ సినిమాని తప్పనిసరిగా చూడాలనీ, ఈరోజే వెళ్ళాలనీ వాసు ఉదయం చెప్పాడు. ఆ టూవిమన్ కథ రచయిత అయిన ఆల్బర్ట్ మొరేవియా అంటే అతనికో విధమైన అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 'టూవిమెన్' మంచి పుస్తక మంటాడు. దానికి తగ్గట్టు సోఫియాలారెన్స్ అద్బుతమైన నటను అందించిందనీ పత్రికలు రాశాయిట. డెసీకా 'దర్శకత్వంలో యిది ఒక మణిపూస అనీ అన్నారుట.
ఉదయం యీ సినిమా గురించి యింత గొప్పగా చెప్పిన వాసు యింకా రూంకి రాక పోవడం వింతగా కనిపించింది. వాళ్ళకి.
ఆరవుతున్నా వాసు రాలేదు. ప్రసాదం హడావిడిగా వచ్చి-
"పదండి గురూ. లేటయితే టిక్కెట్లందవు మరి."
"ఇంకా వాసు రాలేదు." అన్నాడు పతి.
"ఎక్కడికి వెళ్ళేడు."
"అదీ తెలీదు. మేమొచ్చేసరికి తలుపు తాళం వేసిఉంది. ఇప్పటివరకూ అతనికోసమే ఎదురు చూస్తున్నాం."
"మనకోసం, థియేటర్ దగ్గరే నిలబడి ఉంటాడు కాబోలు. కమాన్ అతన్ని అక్కడే కలుసుకోవచ్చు" అన్నాడు ప్రసాదం.
గదికి తాళంవేసి థియేటర్ దగ్గరికి వెళ్ళేరు. ఎంత వెదికినా వాసు కనుపించలేదు.
సినీమాహాల్ కి వెడితే వాళ్ళకి మరో అలవాటుంది. వాళ్ళు రూపాయి క్లాసుకే వెడతారు, వెళ్ళి ఎడంవైపు వరుసలో కూర్చుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యీ పద్ధతికి మార్పు జరుగదు.
థియేటర్లో గూడా వాసు కనుపించకపోవడంతో వాళ్ళు కాస్త ఆందోళన చెందేరు.
సినిమా చూచినట్టు లేదు. సినిమా అయిపోయింతర్వాత బోజనంచేసి రూము కొచ్చేరు. అప్పటిగ్గూడా వాసు రాలేదు.
దాదాపు పదకొండు గంటలకి ప్రసాదం రూము కొచ్చి వాసు గురించి అడిగాడు. రాలేదనే చెప్పారు. ఎంత ఆలోచించినా అతనెక్కడికి వెళ్ళిందీ అంతు పట్టడంలేదు. తమకు తెలిసినంతవరకూ వాసుకి ఈవూళ్ళో బంధువులు లేరు. తాము తప్ప చెప్పుకోదగ్గ మిత్రులూ లేరు. అలాటప్పుడు ఇంత రాత్రివేళ వాసు ఎక్కడుంటాడు?
"గురుడుకి నోట్లో నాలుక లేద. ఎక్కడికి వెళ్ళాడో ఏమో" అన్నాడు దిగులుగా ప్రసాదం.
"నీదంతా చాదస్తమోయ్ ప్రసాదం! ఆతవేమైనా కుర్రాడా ఏమిటి? ఆరడుగుల ఆజానుబాహువు-విగ్రహాన్ని చూస్తేనే చాలు జనం జడుసుకుంటారు. కాబట్టి అతనె క్కడికి వెళ్ళినా ఫర్వాలేదు." అన్నాడు పతి.
"వాళ్ళ ఊరు వెళ్ళాడేమో" అన్నాడు శంకరం.
"బహుశా అదే అయి ఉంటంది" అన్నాడు పతి మాటకి.
"మనకి చెప్పకుండానా?" అడ్డుపడ్డాడు ప్రసాదం.
"చెప్పి వెళ్ళాలని ఎక్కడుందోయ్?"
"ఏమో బాబూ! నా కేమిటో యిదిగానే ఉంది!"
"నీకు ఇదిగానే ఉంటుంది గాని వెళ్ళి పడుకో. రేపుదయం అతడొచ్చేస్తాడులే! ఇక వెళ్ళు. మాకు నిద్రొస్తుంది" అన్నాడు పతి.
ప్రసాదం గొణుక్కుంటూనే వెళ్ళిపోయాడు. ఆ మరుసటి ఉదయం గూడా వాసు రాలేదు. మిత్రులు ఆఫీసు కెళ్ళారు.
పదీ, పదకొండు, పన్నెండూ అయినా వాసు రాలేదు. హెడ్ క్లర్కు పతిని పిలిచి వాసు విషయం అడిగేడు.
* * *
