Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 26


    అదే సమయాన 'వాసుదేవరావుగారూ' అన్న పొలికేక వినిపించింది.
    వాసు అదిరిపడ్డాడు. తల గుమ్మంవైపు తిప్పాడు. అక్కడ స్పృహతప్పి పడి ఉన్న యువతి ప్రక్కగా వసుంధర భయంగా నిలబడి ఉన్నది.
    వాసు అచేతను డయ్యాడు. ఈ అదను కనిపెట్టి రాజశేఖరరావు గభాలున లేచాడు. లేచిన రాజశేఖరరావు పైన మళ్ళా లంఘించి ఉరికేడు వాసు.
    "ఆయన నా భర్త, వాసుదేవరావుగారూ! మీ ప్రయత్నాన్ని ఆపండి" అన్నది వసంధర గట్టిగా.
    ఈ మాటలో అతన్ని వదిలిపెట్టేశాడు వాసు. ఆమె వాసు రెండు చేతులూ పట్టుకుంది.
    "ఆనాడు నా పెళ్ళి మీ చేతుల్తోనే చేశారు. ఈనాడు అదే చేతుల్ని పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. ఆయన్ను క్షమించండి" అన్నది జాలిగా వసుంధర.
    వాసుకి దూరంగా నిలబడి మెడ సవరించుకుంటూన్న రాజశేఖరరావునీ, కళ్ళల్లో నీళ్ళు నింపుకుని ప్రాధే-యపడుతున్న వసుంధరనీ క్షణం సేపు చూసేడు వాసు. అతని కాలికింది భూమి జరుగుతున్నట్టయింది.
    "ఈ నీచుడికి మీరూ బలైపోయారా వసుంధరా!" అన్నాడు బాధగా.
    ఆమె కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది.
    గుమ్మాని కవతల పోలీసులు నిలబడటంలో అదిరిపడ్డాడు వాసు. వాళ్ళతోపాటు తన నిక్కడికి తీసుకుని వచ్చిన టాక్సీ డ్రైవరూ ఉన్నాడు. ఒక కానిస్టేబుల్ని చాటు చేసుకుని నెమరువేస్తూ బెరుగ్గా అన్నాడు డ్రైవరు-
    "ఈయనే సాబ్ ..... శేఖరం సాబ్ ని హంట్ చేసింది."
    సబిన్ స్పెక్టర్ ముందుకు వచ్చాడు. అతన్ని చూడగానే రాజశేఖరరావుకి ప్రాణం లేచివచ్సిన ట్లయింది-
    "సమయానికి వచ్చారు. వీడు ...... ఈ ఫూల్ నన్ను చంపడానికి వచ్చాడు. కాస్త లేటయితే నా ప్రాణం పోయిఉండేది. ఐయామ్ వెరీ థాంక్ ఫుల్ టూ యూ." అన్నాడు జాలి గొలిపే గొంతుతో.
    వాసు చేతికి బేడీలు పడ్డాయి. అతను తలొంచుకుని అన్నాడు.
    "బక్క వాడివైనా నక్కలాటి వాడివి నువ్వు. అరుణ పోయినప్పుడే నేను చచ్చిపోయాను. ఇక అనుభవించే శిక్ష కాదు నాకు. కానీ ..... ఒక్కటే దిగులు .... నీలాటి పాపిష్టివాడు యీ జన్మలో మంచికీ, మానవత్వానికీ దగ్గరవుతాడా అని."
    "షటప్ యూ స్కౌండ్రల్!" అరిచేడు రాజశేఖరరావు.
    వసుంధర తన చేతుల్తో మొహాన్ని కప్పుకుంది.

                                           14

    "ఇవాళ సాయంత్రం త్వరగా వొచ్చేస్తాను
    మృణా!"
    "ఏమిటి విశేషం బావా!"
    "అప్పుడే మరిచావుటోయ్! ఇవ్వాళ మీ అభిమాన నటుడు శ్రీ విశ్వంభరశాస్త్రిగారి నాటకం గదా!"
    "ఏమి నాటకాల్లెద్దూ...... నే రాను."
    "అదేమిటి?" గొప్ప ఆశ్చర్యపడిపోయాడు ప్రసాదం.
    "అది అంతే."
    "చూడాలనుకుని టిక్కెట్లు గూడా కొనుక్కున్నాం గదా! మరిప్పుడిదంతా దండగే?"
    "ఎన్ని దండగ ఖర్చులు కావడంలేదూ ఇదీ ఒకటి?"
    "మరి శాస్త్రి నాటకమంటే నీ కిష్టం లేదా?'
    మృణాళిని తల అడ్డంగా ఊపింది.
    "ఆ రోజున అతను చెప్పిందంతా ఎందుకు విన్నట్టు?"
    "చెప్తూన్నాడు కాబట్టి."
    "మీ కాలేజీ బెస్ట్ యాక్టరంటూ యిన్నాళ్ళూ వెనకేసుకొచ్చా వెందుకూ?"
    "అతను కాలేజీ బెస్ట్ యాక్టర్ కాబట్టి ఇంక నన్ను అట్టే వాగించకు బావా! నేను నాటకానికి రాదలుచుకోలేదు. అంతే."
    మృణాళిని మాటలు అతనికి ఆనందం కలిగించింది. కళ్ళు మూసుకుని గుండెలమీద చెయ్యి వేసుకుని 'ఆహా! నేనెంత అదృష్టవంతుడ్నీ' అన్నాడు గాలిలో ఊగిపోతూ.
    మృణాళిని పకపకా నవ్వేసింది.
    "మా బావ వట్టి వెర్రిబాగుల మనిషి" అన్నది వంట గదిలోకి వెళ్ళిపోతూ.
    "మంచి మనిషికి మరో పేరు యీ వెర్రి బాగులవాడు" అన్నాడు స్వగతంగా. ఆపైన ఆఫీసు కెళ్ళాలని జ్ఞాపకం రాగానే గబగబా బట్టలు వేసుకుని పతి కోసం వాళ్ళ గదికి వెళ్ళేడు. పతి ఇంకా రెడీ కాలేకపోదాం చూచి.
    "ఏమిటి గురూ! బద్ధకం. త్వరగా తెములుమరి" అన్నాడు.
    "రాత్రి నిద్రలేదు ప్రసాదం."
    "ఎందుకని?"
    "వాసు కథ చదివాను."
    "అతను కూడా కథలు రాస్తాడేమిటి ఖర్మం."
    "కాదు: అతని స్వంత కథ."
    ప్రసాదానికి ఏమీ బోధపడలేదు.
    "అతని డైరీ చదివాను. చాలా చిత్రమైన మనిషి వాసు. అతను ఒక వ్యక్తికోసం వెతుకుతున్నట్టు తోచింది."
    "ఎందుకు?"
    "అదంతా మరో పెద్ద కథ. వాళ్ళ చెల్లెలి ప్రాణం తీసినవాడిని క్షమించాలేననీ, తను బ్రతికుండగా వాడి చావు చూడాలనీను వ్రాశాదు. అప్పుడతను అకస్మాత్తుగా వెళ్ళిపోవడంలో తోచిన కారణ మేమిటంటే-ఎవరికోసం తను యిన్నాళ్ళు వెతుకుతున్నాడో ఆ వ్యక్తి అతనికి కనిపించి ఉండచ్చు. మరొకటి గూడా అనిపిస్తుంది. ఆ యిద్దరి మధ్యా జగడమూ జరిగి ఉండచ్చని. ఏమైనా వాసు మనకి కనిపించినంత సాధారణ మైన మనిషి కాడు." అన్నాడు పతి.
    మరికొంతసేపు వాసూ, అతని చెల్లెలి గురించిమాతడుకుని ఆఫీసుకు వెళ్లారు. ఇప్పడు ఆఫీసులో గూడా కలతలు లేవు. పైపెచ్చు తమపైన అందరికీ గౌరవభావం కలిగింది, ఒక్క శాస్త్రి మినహా. కుసుమ అసలు కథ తెలియగానే చాలా మంది పశ్చాత్తాప పడ్డారు. కల్పించి చెప్పుకున్న కథలు వాడుకలో పెట్టిన పెద్దమనుషులు నాలికలు కర్సుకున్నారు. ఏమైనా ఆఫీసు వాతావరణం సుముఖంగా ఉన్నమాట నిజం.
    ఆఫీసుపని జరుగుతుండగా సాయంత్రం నాలుగు న్నర ప్రాంతాల, ఆఫీసుముందు ఒక కారు ఆగిఉంది. దాన్లోంచి ఒక బట్టతల ఆసామి దిగి, ఆఫీసులోకి వచ్చి తిన్నగా ఆఫీసరు గదిలోకి వెళ్ళారు. ఆయనలా వెళ్ళిన మరు నిమిషంలో పతికి పిలుపు వచ్చింది. పతి వెళ్ళాడు. మరో పది నిమషాల్లో ఆ బట్టతల ఆసామితోపాటు కారులో వెళ్ళిపోయాడు.
    ఇంతవరకూ జరిగిన యీ తతంగం ప్రసాదానికి అర్ధంకాలేదు. ఆ వొచ్చివాయ నెవరు? ఆయనకీ పతికీ సంబంధ మేమిటి? ఇలాటి ప్రశ్నలు అతని బుర్రలో గిర్రున తిరుగుతూనే ఉన్నాయి సరైన సమాధానాలు లేక.
    ఆఫీసు అవడంలోనే గబగబా పతీ వాళ్ళ రూమ్ కి వెళ్ళేడు అక్కడ ఇందాక వచ్చిన కాఉర్ని చూసి గతుక్కుమన్నాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ యింట్లోకి వెళ్ళేడు. లోపల నుండి మాట లొస్తూండటంవల్ల తప్పనిసరిగా బయట ఆగిపోవలసి వచ్చింది.
    "నే నిక్కడికి వొచ్చేముందు మీరన్నమాటలు గుర్తుకు తెచ్చుకోండి" పతి అన్నాడు.
    "అవున్రా-డబ్బు అవసరమనే అన్నాను. మనకో అంతస్థు అంటూ ఒకటున్నది గనుక మనం చేసే ప్రతి పనీ దానికి సంబంధించి ఉండాలి మరి. అలాంటప్పుడు మనం పాటించ వలసిన విషయాలూ చాలా ఉంటాయి గదా."
    "అందుకని నా యిష్టా యిష్టాల్తో ప్రమేయం లేకుండా మీరు మాట యిచ్చిన వాళ్ళమ్మాయినే చేసుకోవాలి. ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యుడ్ని కావాలి. అంతేగా."
    "కన్న కడుపు ఆగుతుందిట్రా లక్ష్మీ. ఆ కోపములో నిన్ను అనరాని మాటలే అన్నాను. నిజమే. అంతమాత్రంచేత నువ్వు నా కొడుకునీ, నేను నీ తండ్రినీ కాకుండా పోతామా? మన మధ్య యీ బంధం తెగిపోతుందా? చెప్పు......"
    "ఆనాడు మీరు అలాగే మాటాడారు."
    "నన్ను బాధపెట్టకురా లక్ష్మీ! నావెంట వొచ్చేయ్. ఎదుగూ బొదుగూ లేని ఈ గుమాస్తా గిరి నీ కెందుకూ? అంత అవసరం నీకేమొచ్చింది? కావలిస్తే నీ చేతిక్రింద వేయి మంది గుమాస్తా లని పెట్టుకోవచ్చునే, అలాటి నువ్వు ఇన్ని బాధలు పడుతూ జీవితం ఎలా గడుపుతావ్ రా?"
    "ఏమో, నాకీ బ్రతుకు హాయిగా ఉంది. నాలుగు గోడల మధ్య, అంతస్థులనే పరిధిలో బ్రతకడం కంటే యిలా స్వేచ్చగా, స్వయం సంపాదనతో బ్రతకడమే హాయిగా ఉంది."
    "ఈ ఆస్థిపాస్తులూ, వ్యాపారం ఎవరికిరా?"
    "ఏమో! నన్ను మీ యింటినుంచి ....."
    "వద్దురా లక్ష్మీ వద్దు! ఇప్పుడు చెపుతున్నా. నీ  యిష్టం వచ్చినట్టు తిరుగు. నిన్ను శాసించే అధికారం ఎవరికీ లేదు. నా మాట విని వొచ్చేయ్ బాబూ!"
    "అయితే ఒక షరతు."
    "చెప్పు."
    "నా పెళ్ళిగానీ, మరే యితర స్వవిషయాలు గానీ నా యిష్ట ప్రకారమే జరగాలి."

 

                                
    "ఆమాట నేనే అన్నాగా."
    "అయితే మీతోపాటు వస్తాను. కానీ- యిక్కడ చక్కబెట్టుకోవాలసినవి కొన్ని మిగిలి పోయాయి."
    "ఏమిటవి?"
    "ముఖ్యంగా నా పెళ్ళి విషయం" అన్నాడు పతి ధైర్యంగా.
    "శంకరం అని నాకో స్నేహితుడున్నాడు. అతని చెల్లెల్ని చేసుకోవాలని నా ఉదేశ్యం. కాబట్టి- మీరీ విషయమై వాళ్ళతో సంప్రదించవలసిన అవసర ముంటుంది."
    పతి వెల్లడించిన ఈ మహత్తర విషయం విని ఎగిరి గంతేశాడు ప్రసాదం! ఆ ఆనందోద్రేకంలో చుట్టు ప్రక్కలు మరచి,
    "గొప్ప మాటన్నావ్ గురూ!" తిన్నగా గదిలోకి వచ్చేస్తూ.
    ఇతని వాలకం అర్ధంకాని ఆ పెద్దమనిషి బిత్తర పోయాడు.
    "నా మిత్రుడు పేరు ప్రసాదరావ్. వీరు మా నన్న చెంగల్రావ్ గారు" ఇద్దరికీ పరిచయం ముగిసిన తర్వాత గాని, అతనెక్కడున్నదీ గుర్తించలేదు ప్రసాదం. గ్రహించిన తర్వాత సిగ్గుపడిపోతూ,
    "సారీ ...... మరోమాటు వస్తాను" అన్నాడు వెనక్కి తిరిగి.
    "ఫర్వాలేదు నాయనా రా ...... ఇలా కూర్చో" అన్నాడు చెంగల్రావ్. ఆ ఆహ్వానాన్ని కాదనలేక వచ్చి కూర్చున్నాడు ప్రసాదం. ఆ తర్వాత చాలా సేపు ప్రసాదం చెంగల్రావ్ ల మధ్య సంభాషణ నడిచింది.
    -ఆ రాత్రికే చెంగల్రావ్ గారు వెళ్ళిపోయారు.
    ప్రసాదం సందడి యింతా అంతా కాదు. నిమిషానికి అరవై మాటు 'గొప్ప నాటకం ఆడాపు గురూ' 'అయ్య బాబోయ్, పతి లక్షాధికారిరోయ్' అని వాగేయడం మొదలుపెట్టాడు.
    పతి అతని భుజం కుదిపి,
    "చూడు ప్రసాదం, నేను మామూలు పతినే. నీ స్నేహితుడ్ని. అంతేగాని చిత్రమైన జంతువుని గాను" అన్నారు.
    "జంతువని ఏ ఫూల్ అన్నాడు?"
    "మరి నీ హంగామా చూస్తుంటే అలాగే ఉంది."
    "లేదు గురూ ..... మీ రందరూ కలిసి మొదట్నుంచీ నన్ను సస్పెన్సులో చావగొడుతూనే ఉన్నారు. ఒకడికి మించినవాడు మరొకడు. కుసుమ శంకరానికి బంధువైందీ, అమరావతిలో వాసు కథ కదిలిందీ, నువ్వేమో లక్షాధికారి బిడ్డ వైపోయావూ? చూశావా? మీ రందరూ గొప్ప గమ్మత్తయిన మనుషులు. సమయం వొస్తేనే గాని మీ గమ్మత్తు తెలీలేదు. వెర్రి మొహం వేసేది నే నొక్కడ్నా? దేవుడనేవాడు ఉంటే నాగ్గూడా ఒక రహస్యం పెట్టరాదూ! నేనూ ఒక ఊపు ఊపేవాడ్ని. పూర్ ఫెలో ...... వాడికీ తెలుసు, వీడి దగ్గర అసలు రహస్య మంటూ ఉంటే అది రహస్యంలా ఉండి చవదూ అని." అన్నాడు ప్రసాదం.
    పతి నిండుగా నవ్వేడు.
    "నీలాటి స్నేహితుడు అందరికీ దొరకడు ప్రసాదం."
    "మోపేయ్ గురూ! ఏడ్చిపోతానని నాకో స్పెషాలిటీ తగలేస్తున్నావ్. కానీయ్."
    "ఇది ముఖస్తుతి కాదు. నీలా సర్వ వేళలా నవ్వుతూ, పక్కనున్న వాళ్ళని నవ్విస్తూ 'జీవిత మంటే యిదేనూ' అని పాఠం చెప్పగల వ్యక్తులు చాలా తక్కువ."
    ప్రసాదం మరి నోరెత్తలేకపోయాడు. అతణ్ణి సిగ్గు నిలువునా ముంచేసింది.    
    ఇద్దరూ గదినుండి బయటకు వచ్చారు. అంతలో వాళ్ళ ఆఫీసు ఫ్యూన్ చేతిలో ఓ పేపరు పట్టుకుని హడావిడిగా రూమ్ వైపు పరుగెత్తుకు వచ్చాడు. వొచ్చి పేపరు వాళ్ళ చేతుల్లోపెట్టాడు.
    "వాసుదేవరావుగారి గురించి సార్...." అన్నాడు బాధగా-ఒక న్యూస్ మీద చేయి ఉంచుతూ.
    మిత్రుల మొహాల్లో కళ తప్పింది. ఆత్రంగా ఆ న్యూస్ ని చదివేరు.
    "....................................హత్య చెయ్యటానికి ప్రయత్నించిన శ్రీ వాసుదేవరావుని సబిన్ స్పెక్టర్ శ్రీ.....మరో ముగ్గురు కానిస్టేబుల్స్ సహాయంతో అరెస్ట్ చేశారు."
    అది చదివిన తర్వాత పతి మనసు వికలమైంది. కళ్ళనిండా నీళ్ళు నింపుకుని గాద్గదికంగా అన్నాడు. "ఇలాటి అఘాయిత్యమేధో చేస్తాడని నేననుకున్నమాట నిజమైంది. పాపం ..... వాసు హాయిగా బ్రతకటానికి నోచుకోలేదు ప్రసాదం."
    ప్రసాదం అక్కడున్న అరుగుమీద కూలబడి పోయి చంటి పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
    పతి అతని భుజాన్ని తట్టాడు.
    "ధైర్యంగా ఉండు ప్రసాదం! ఈ కేసు విషయమేధో మనం అంతు చూడాలి. వాసుదేవ రావు పెట్టెలో వాళ్ళ చెల్లాయి డైరీ, ఫోటోలూ ఉన్నాయి. అవేమైనా మనవాడికి సహాయం చెయ్యవచ్చునేమో. అదీ చూద్దాం." అన్నాడు పతి.
    ప్రసాదం బేలగా అతని కళ్ళల్లోకి చూచేడు.
    
                                     *    *    *

    జానకిరామయ్యగారి స్థితి ఆందోళనకరంగా ఉంటోంది.
    రోజులో రెండు, మూడు మాటలు అందర్నీ మర్చిపోయి, మగతగా కళ్ళు మూసుకుని, ఏవో కలవరింతలూ ఏవిటో పిచ్చిగా గొణుక్కుంటారు. ఆ తర్వాత కళ్ళలో నీళ్ళు నింపుకుంటారు.
    'ఆయన మనసులూ ఏదో దాచుకున్నారు. అది మనిషిని కృంగదీస్తోంది.' అన్నారు డాక్టర్లు.
    నాన్న దాచుకున్న దేవిటి?
    జానకిరామయ్యగారు జీవితంలో చాలా ప్రశాంతంగా బ్రతికారు. చిల్లర సమస్యల్ని గోటితో తుంచి చిరునవ్వుతో ఆయన కాలం గడిపేరు. తన సంతతిని ప్రయోజకులుగా చేశారు. అవుననిపించుకున్నారు. అలాంటి మనిషి మనసులో ఏమి దాచుకుని ఉంటారు?
    శంకరానికి అంతు పట్టడంలేదు.
    -ఆ రాత్రి పది గంటలకి ఆయన మళ్ళా తెలివి పోగొట్టుకున్నారు! ఇంటిల్లిపాదీ ఆయన మంచం చుట్టూ కూర్చున్నారు భయంగా.
    "నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా శంకరం!" అన్నాడు రాజారావు.
    శంకరం డాక్టరుకోసం పరుగెత్తాడు. అతను వెళ్ళిన కాసేపటికి జానకిరామయ్యగార్కి తెలివొచ్చింది. కళ్ళు విప్పి చుట్టూతా చూశారు. కాళ్ళ దగ్గర రాజారావు, అతని పక్కనే కుసుమ-ఆయన కుడివైపున సుశీలా ఎడంవైపున రేణుకా, తల దగ్గర నిరంజనం-అందరి మొహాల్లోనూ ఆందోళన స్పష్టంగా కనుపిస్తోంది.
    అందర్నీ తృప్తిగా చూశారాయన.
    "శంకరం ఏడీ?" అని అడిగేరు.
    "డాక్టరు కోసం వెళ్ళేడు మావయ్యా!" అన్నాడు రాజరావు.
    రాజారావుని చూస్తూ, తన దగ్గరగా రమ్మని పిలిచారు. అతను వొచ్చాడు. జానకిరామయ్య అన్నారని.
    "తప్పులు నువ్వు చేస్తావ్.....నేనూ చేస్తాను. అందరూ చేస్తారు. ఆమాటకొస్తే తప్పు చెయ్యక పాదమే ఒక మహా తప్పు అనేవాడు మా హెడ్ మాస్టరు. కాబట్టి, తప్పు చేసిన తర్వాత విచారించడం తగదు. ఆ తప్పు సరిదిద్దుకోడం మన ధర్మం. కుసుమ ఆడపిల్ల. ఆ పిల్ల అవమానాల్తోనే పుట్టింది. అవమానంతోనే పెరిగి పెద్దదయ్యింది. వాళ్ళమ్మ భూదేవిలాటిది. తల్లికి తగిన కూతురు కుసుమ. నువ్వు ఆ పిల్లకి మరెప్పుడూ అన్యాయం చెయ్యనని మాటివ్వు రాజూ....."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS