"మాలకూడా వస్తానని ప్రయాణం అయ్యిందే?"
క్రమ్ముకుంటూనే "ఎవ్వరూ రాలేదు" అన్నాడు చికాగ్గా.
"అసలు నేనే వద్దామనుకున్నా. కాని శాస్త్రి ఎవరో తెలియదు."
తనకు కోపం వస్తూంది. అది దిగమ్రింగు కునే "మా పిన్ని, నాన్నగారూ, గొప్ప పత్తేదా రని నాకు తెలియదే" అనేసేడు.
సంగతి సందర్భాలు తెలియకపోయినా, రామచంద్రయ్య, ఆపేక్షలో రుక్మిణిని చూస్తూ నవ్వేసేడు.
అల్లా చిలుకులూ వెళ్ళేయి. కబుర్లూ దొర్లేయి. సంధ్య చీకటి పడేసరికి, వార్త అంది నట్లే సుభద్రమ్మా వచ్చింది. ఎక్కువగా ఏమీ తరిచి అడగలేదు. వచ్చేడన్న సంబరమే. ఇక రామచంద్రయ్య ఆటలు కొంతవరకూ కడుతాయన్న ధైర్యం. పైగా తన ఆశయం ఉంది.
దశరథం గారు ఊళ్ళో లేరనిమాత్రమే తెలిసింది. ఏవి ఎల్లా ఉన్నా 'మావయ్య తనకోసం చాలా చాలా వెతుకుతున్నాడు' అనే వ్యక్తీకరణ చేసింది. కృతజ్ఞత తెల్సుకోమంటూ తమ్ముడి వైపు చూచింది.
"అక్కడి నుండి కాళహస్తి వెళ్ళిరావల్సిందిరా" అంది - ప్రయాణాలన్నీ అనుకునే జరుగుతున్నట్లు. రామచంద్రయ్య విన్నాడు. బెల్లం కొట్టిన రాయిలాగే ఉన్నాడు - ఇవన్నీ తన్ను కదల్చవన్నట్లు; తనకు ఒక్క విషయమే ముఖ్యం అన్నవతులోనూ.
"అక్కయ్యా, నువ్వూ బావా వెళదాం అనుకున్నారుకా" అన్నాడు; ఏదో ఒకటి మాట్లాడకపోతే బావుండదు అని.
నవ్వింది సుభద్రమ్మ, జవాబన్నట్లే.
అంతవరకూ రుక్మిణి మాట్లాడలేదు.పైగా అపహాస్యంగా ఉన్న నువ్వు చూస్తేనే ఒళ్ళు మండింది.
"అత్తయ్యా! నువ్వు రాజుని ఎల్లాగైనా దత్తత చేసుకోవా లనుకుంటున్నావుటకా?"
చీమ కుట్టినట్లు రామచంద్రయ్య, వింత వార్త వింటున్నానన్నట్లు రాజు తెల్లబోయేరు.
"ఆ వూహ ఉంది. అబద్ధం ఎందుకాడాలి? అల్లా అయితే ఇటూ అటూ కూడా కలుస్తుందని ఆయనకూ ఉంది."
"అదెల్లాగే, అక్కయ్యా! వాడు నాకొక్కడే కదా?"
'పడుచు పెళ్ళాం ఉందికా' అని అనేద్దామనే అనుకుంది మొదట్లో. కాని సంబాళించుకుంటూనే, ఓసారి ఇదిగా రుక్మిణి వైపు చూచి "మీ ఇష్టంఅయితేనే కదరా" అనేసింది సుభద్రమ్మ.
"మా ఇష్టం అనే ప్రమేయం లేకుండానే రావినూతలపాడు అవధానులుగారికి దత్తత ఇచ్చెయ్యడానికి మావయ్య వాగ్ధానం చేసేడుట."
చురిక విసిరినట్లయ్యింది. ఏమిటి రుక్మిణి మాట్లాడేది? తల దింపుకుని రాజు ఆలోచనలో పడ్డాడు. శాంత పన్నాగమా? అర్ధం కాలేదు. ఆ వరుసలో అయితే తను భార్య క్రిందనే చెలా మణీ అనవచ్చనా? ఆ అవధానులు దంపతుల్ని తను చూడలేదు.
"నాకు తెలిసినంతవరకూ అల్లాంటివేమీ జరగలేదు, రుక్మిణీ ఎవరైనా కిట్టని వాళ్ళు...."
"ఎల్లా తెలిసింది అనిమాత్రం అడక్కు. ఒక్కటి నిర్ణీతంగా చెపుతున్నా. అది మావయ్యకు కూడా చెప్పు. దత్తత అన్న ప్రమేయం లేదు. అది కలలోకూడా జరిగే పని కాదు.
"అత్తయ్య పోతూ, తన తదనంతరం రాజును నాకు ఒప్పచెప్పింది. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంతసేపూ, ఆ విధినిర్వాహణకే పాటుపడుతాను." ఇక మాట్లాడేది లేదని లోపలికి వెళ్ళింది రుక్మిణి.
గుమ్మం దాటుతున్నపుడు రాజు అడిగేడు-"ఏమిటిదంతా, అత్తయ్యా?" అని.
"నాకు మతిపోతోందిరా."
"మావయ్య ఎప్పుడు వస్తాడు?"
"రేపో, ఎల్లుండో రావాలి. కోర్టు పనిమీద వెళ్ళేరు."
"ఓవేళ మీకు దత్తత చేసుకోవాలన్నా, అది పరిస్థితులు ఇంత పచ్చిగా ఉన్నప్పుడే ...."
"నేను దాన్నిగురించి ఒక్క పొల్లయినా రానిచ్చేనురా-రుక్మిణి విరుచుకుపడింది కాని?"
ఇంటివరకూ దిగబెట్టేడు సుభద్రమ్మను.వెనక్కు తిరిగినపుడే - "ఏవి ఎల్లా ఉన్నా కాస్త కళ్ళు తెరిచి ఉండు" అనేసింది.
నిర్ఘాంతపోయేడు. ఏమిటి అత్తయ్య లోతు? ఎక్కడ, ఏ విధంగా బండి పట్టాలు తప్పింది? తప్పబోతూంది? ఆ తప్పుట ఎవరి స్వార్ధం కోసం? అన్నవే విపులంగా లేవు. నాన్నారు కాని, పిన్నికాని, స్వలాభాపేక్షలో ఉంటే తనకు ఆ ఇంట్లో తావు లేదు. తన ఉనికి, ఎంత బాహికానికి అబద్ధం చెప్పినా, అట్టే కాలం లేదని ఎందుకో అనిపిస్తూంది. అయినా తను కళ్ళు మూసుకుని ఉండకూడదు.
ఛలోక్తులతో భోజనాలయ్యేయి. తాంబూల సేవనం అయ్యింది. డాబామీద కూర్చునే కబుర్లు. అంటీ ముట్టనట్లున్న చల్లగాలి.
హుషారుగా మెట్లు ఎక్కి వస్తూనే "ఒరే రాజూ! కొన్నాళ్ళు ఏ మద్రాసైనా వెళ్ళాలని ఉంది" అన్నారు రామచంద్రయ్యగారు.
ఈయనకు ఇప్పుడు ఇదేం అనుకున్నా, పడుచు భార్య ప్రక్కగా అన్న గుర్తింపు వచ్చే సరికి "వెళ్ళండి" అన్నాడు.
"ఆ బస్సుల వ్యవహారం కాస్త చూడాలి." ఆ వరసలోనే ఎన్నో అన్నారు. అన్నిటికీ తల ఊపేడు. పిన్నిమాత్రం చలనం లేనట్లు అన్నీ వింటూనే ఉంది.
"ఏమంటావే?" ఆఖరున ఆయన ముదల కింపు.
"రాజూ, కొన్నాళ్ళు మాలని, సత్యని పిలవా లని ఉంది" అంది మధ్యలో.
వీళ్ళందరూ ఎల్లా తెలుసన్న సంశయంలోనే "వాళ్ళు రారేమో?" అన్నాడు రాజు.
"నే పిలుస్తే వస్తారు."
"ఎవరే వారు?"
"అబ్బాయికి స్నేహితురాండ్రు" అనే సింది. రాజు తల వంచుకున్నాడు.
"రాండి. పడుకుందురుకాని" అంటూనే ఆయన సరసనే మెట్లు దిగింది.
తన్ను సూదులతో గ్రుచ్చాలి. ఇదే రుక్మిణి మారిన ప్రవృత్తా? అత్తయ్య అన్న లోతులు, గోతులు ఇవేనా? దానివల్ల ప్రయోజనం లేదు. పైగా అది ఆవిడకే దెబ్బ తీస్తుందేమో అన్న బెరుకు కలిగింది.
'రుక్మిణి నిన్ను ప్రేమిస్తోంది'. వెనకాల ఎవరో అన్నట్లే అయ్యింది. తూలిపడ్డాడు. క్రమంగా క్షోణాలు బిగపట్టేడు. ఏమిటి ఈ వాసన? మధువు ...
నాన్నారు త్రాగుతున్నారా? కైపులో ....
గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. తను ఏ స్థితిలో ఇవి అవగాహన చేసుకోవాలో తెలియలేదు, గట్టిగానే "ఏమిటిది, వెంకన్నా, ఇల్లా మార్చి పంపేవు?" అన్న ఎలుగే!
క్రిందికి దిగేసరికి సావిట్లో మధు, రావులు కూర్చొని ఉన్నారు.
* * *
17

రామశాస్త్రులు కొడుకు వెంకటశాస్త్రి అనుకోకుండానే, అవధానులుగారింటికి, సంధ్య చీకటివేళ వచ్చేడు. అప్పటికి ఇంకా దేవతార్చనకు వారు లేవలేదు. మొదట్లో దూరంగా ఆనిన ఆ వటువును చూచి, ఎవరో పరాయి ఊరనుకున్నవాడు, గుర్తుకు తెచ్చుకుంటూనే "నువ్వా?" అన్నాడు.
పాదాభివందనం చేసి "నాన్నారు అస్వస్థ తలో ఉండడంవల్ల, అన్నకాలానికి రాలేక పోయేను. దానికి నాన్నగారు క్షంతవ్యున్ని అని చెప్పమన్నారు" అన్నాడు వెంకటశాస్త్రి.
"దానికేం ఉంది? పెండ్లిండ్లు ఒకదాని మీద ఒకటి. శరీరం నలిగి ఉంటుంది. ఇప్పుడు లేచి తిరుగుతున్నారా?"
"కాస్త కోలుకున్నా రండి."
"పేరయ్య శాస్త్రి?"
"అంతా క్షేమం అండి."
వినయం చూస్తేనే ముద్దు హెచ్చవు తూంది. తీర్చి దిద్దితే మెరికే అవుతాడు. అది ఆనాడే లోపల బీజాంకురం అయ్యింది. ఆనాడు కలిగినవి ఇతర భావాలు. ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. అవి ఆనాడు ఉన్మత్తాభిప్రాయంలో కలిగేయి. వాట్ల విలువకు ఈ విచిత్ర పరిణామం వచ్చిన స్థితిలో అన్వయం కుదరటం లేదు. తను, దశరథంగారు వెళ్ళిన తర్వాత చాలా ఆలోచించేడు, నిర్వచనంకోసం శాస్త్రాలు తిరగవేసేడు. ఉండబట్టలేక మీమాంస చెయ్యమని ప్రాజ్ఞులకు జాబులున్నూ వ్రాసేడు.
ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా ధర్మ సూత్రాలు వ్రాసి పంపేరు. వాట్లవల్ల తల మరింతగా బ్రద్దలు కొట్టుకోవడమే అయ్యింది. దారీ తెన్నూ నిర్ణీతంగా దొరకలేదు. ఒట్టి అలజడిమాత్రం కలిగింది.
ఆప్తుడు, హితుడు అయిన చౌదరయ్యను కదిల్చి చూడకపోలేదు. బావుందని తన స్థాయిలో సలహా ఇచ్చినా, మనస్సు ఆమోదం ఇచ్చినట్లు లేదు. టెంకాయ పిచ్చికొండ అయ్యింది సంభాషణ.
మిగిలింది పార్వతమ్మ. ఈ విషయం ప్రస్తావించాలనుకున్నా ధైర్యం చాలిరావడంలేదు. ఏదో చెప్పలేని దిగతీత. ఒక్కటి - ఇన్నాళ్ళ సంసార జీవితంలోనూ, దాన్ని ఆదేశించడమే అలవాటు. అది అతిక్రమించి, ఓ వ్యక్తిత్వం ఆపాదించి, సలహా పుచ్చుకోవడం అన్నది న్యూనతలా తట్టింది. ఓవేళ అడిగినా శాంత అభిప్రాయం ఎల్లా ఉంటుందో అల్లాగే చెయ్యండి అనేస్తుందన్న నిరుకు. అదే అయితే తను ఓడిపోయినట్లవుతుంది.
తను అమ్మను సర్వస్వం అని నమ్మేడు. ఇందులో జరిగేవి చూస్తూ ఉండడమే కర్తవ్యం అనుకున్నా, వచ్చేవి ఊపు ఊచి, కూలంకషంగా కదల్చేవే వస్తున్నాయి. ఇవన్నీ ఆవిడ పరీక్షలా? లేక తన మధు నుదుట గీత అనుభవం తప్పదన్నట్లు ప్రతీహారులా?
ఏది ఏమైనా వెంకటశాస్త్రి రాకమాత్రం, ఈ సమయంలో ప్రబలంగానే పరిణమిస్తుంది. అది తధ్యం. ఆ గడపలో కాలు పెట్టినప్పుడే క్షణికం గోచారం చూసేడు. విద్యకు అవిఘ్నంగా ఉన్నా ఉనికికిమాత్రం పాట్లు తప్పవు. అవి ఆవృత్తి అయి ఊపు ఊపేటట్లే ఉన్నాయి.
"లే. అనుష్ఠానాలు పూర్తి చేసుకో" అన్న ఆదేశింపు చేసి "ఏమేవ్! వెంకటశాస్త్రి వచ్చేడు" అన్నాడు దన్నెంమీద గావంచా భుజం మీద వేసుకుంటూను.
"ఎవరూ?"
"వెంకటశాస్త్రే!"
లోపలినుండే అంది: "ఓరే వెంకన్నా, రత్తమ్మ కులాసాయేనా?"
అవధానికి నవ్వాగలేదు. ఆ వెంకటశాస్త్రి ఆవిడకు వేలుమడిచిన మేనమామ కొడుకు.
"వాడు కాదే!"
"మరి ఎవరూ?" అంటూనే సావిట్లోకి వచ్చింది.
"రామశాస్త్రి కొడుకే."
"అది ముందర చెప్పవద్దండీ? ఆ పిల్లాడు ఏమనుకున్నాడో, ఏమో?"
"ఫరవాలేదు లేవే."
శాస్త్రి వచ్చి కాళ్ళకు నమస్కరించేడు.
"చిరంజీవ" అంది. శాంత అన్నీ వింటూనే ఉంది. కాని ఒక్కటిమాత్రం అవగాహన కాలేదు. ఈ సమయంలో మామగారు, వాడిని ఎందుకు రప్పించేరు? నిజంగా విద్యాభ్యాసం కోసమేనా? లేక అంతరంగికంలో వేరు ఉద్ధేశ్యాలు ఉన్నాయా? తనకు గుర్తు ఉన్నంతలో మామయ్య శిష్యుల్ని పెట్టుకోలేదు. అటువంటప్పుడు ఇప్పుడే ఆ కుర్రవాడిని తెచ్చుకోవడం, గురుభావం వహించడానికి అన్నదే సరిపెట్టుకోలేని సంగతిలా ఉంది.
ఏమైనా దీని విసురు తనమీద కొంత వస్తుంది. అది తప్పదు. ఏ విధంగా అన్నది అవగాహన అయీ అవనట్లు ఉన్నా తనుమాత్రం నిర్లిప్తంగా ఉండి, అన్నీ సహించడమే అనుకుంది. ఆ నిర్ణయంతో ఆలోచనలకు ఆనకట్ట కట్టుకుంది.
భోజనాలవద్దే, పెరుగు వడ్డిస్తున్నప్పుడే శాంత వాడిని చూచింది. ముఖంలో తెలివి తేటలు, వర్చస్సు ఉన్నాయి. బుద్దిమంతుడులా తట్టింది.
చెప్పకపోతే సమంజసంగా ఉండదనే అవధాని "మా కోడలు" అని ఊరుకున్నాడు.
తెప్పరిల్లినట్లు, అయాచితంగానే, చూచి తల దింపుకున్నాడు శాస్త్రి. ఆ క్షణికం చూపులో సర్వస్వం అవగాహన అయినట్లయ్యింది అవధానికి-కుర్రవాడికి ఎక్కువే తెలుసని. మౌనం వహించినాడు.
లోపల్లోపల మాత్రం శాస్త్రికి ఈ పరిచయం వింతగా కన్పడినట్లయ్యింది. తనతండ్రి ఊరు పొలిమేరవరకూ దిగబెట్టి "ఆయనకు పిల్లలు లేరు. ఉన్న ఒక్క కొడుకూ దగాచేసి వెళ్ళి పోయేడు. ఇంట్లో ఉన్న ఆ వెధవ కోడలు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇక అక్కడ నీ ప్రవర్తన, అణకువే నీకు కిరీటం అవ్వాలి. ఆ కోటలో పాగా వేసినావా ఈ బీదరికానికి మనం తిలోద కాలు ఇచ్చుకోవచ్చు. ఇదే గుర్తుంచుకో" అనే చెప్పేడు.
