16

రాజు ఆ నిద్ర నిద్ర చాలా ఘంటలవరకూ లేవలేదు. గాఢంగా ఒళ్లెరగని నిద్ర. రెండు మూడు పర్యాయాలు శాస్త్రిలేచి శ్వాస ఆడుతూందా అన్న సంశయంలో, ముక్కు క్షోణాలవద్ద చూపుడు వ్రేలు పెట్టి చూచి, నిరుకు చేసుకున్నాడు. దానితో ధైర్యం వచ్చింది.
తనూ ఏం తోచక బయల్దేరేడు. ఇదివరలో రెండు పర్యాయాలు వచ్చేడు. నిలువుదోపిడి ఇవ్వకపోయినా తృణం డబ్బీలో వేసేడు. స్వామిని చూచి నమస్కారం పెట్టేడు. ప్రసాదమున్నూ పుచ్చుకున్నాడు. కొట్టిన పిండి అయ్యింది. చుక్కల పర్వతం, మోకాళ్ళ పర్వతాల పేరు విన్నాడేగాని చూడలేని అలవాటు, శ్రమించలేని బస్సు ప్రయాణ సౌకర్యంలో ఇన్నిసార్లూ యాత్రికుడే అయ్యేడు.
ఎందుకు నిర్ణీతంగా వస్తున్నాడంటే ఏం చెప్పలేడు. ఓ మ్రొక్కు లేదు. కోర్కె లేదు. ఉబుసుపోక చూడ్డానికి. తన మనస్సు శాంతంగా ఉంటుంది ఇక్కడ ఉంటే. తీరా ఎవరైనా ఆ ప్రశాంతతను నిర్వచించమంటే చెప్పలేడు.
అడవుల మధ్య గాలి. తోటలో పువ్వులు. మంచి గంధం పూసుకున్న కొండలు. విలాసానికి, వైభవానికి నోచుకున్న కుబేరుడు. వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు క్రొత్త పరిచయం అవుతూనే ఉన్నారు. అదో తృప్తి.
ఈ సరిలో ఎప్పుడూ అనుకోలేదు రాజు కన్పిస్తాడని. రాజుకోసం అక్కడ వాళ్ళంతా వెతుక్కుంటున్నారు. అది తెలుసు. పైగా ఆక్రోశంతో పేపర్లో ప్రకటన. ఇదంతా ఎందుకు జరిగిందో, జరుగుతూందో అన్న కుతూహలాన్ని రేకెత్తించుకునే రావును అడిగేడు. వాడి చీదరింపు తనకు కోపం తెప్పించినా ఏమీ అనలేక వెళ్ళిపోయేడు ఆ రాత్రి.
ఇప్పుడు చూడగానే ఆ మరిచిపోయిన పుండు జ్ఞాపకం వచ్చింది. అది రేగి సలుపుతున్నట్లే అయ్యింది. పైగా ఏ వ్యక్తి చుట్టూ ఇవన్నీ అల్లుకున్నాయో అతనే కనపడ్డాడు. తను తెలుసుకోవాలి ఆ రహస్యం.
అందుకే గదికి ఈడ్చుకు వచ్చేడు. ఇన్ని మంటలూ కాపలా కాసేడు. క్షణికం కీడెంచి మేలు ఎంచాలన్న భావనలోనే టెలిగ్రాం ఇచ్చేడు.
"ఎన్ని ఘంటలైందిరా?"
సవ్యంగానే ఉంటే ప్రశ్న పిచ్చిమాత్రం కాదు అనుకున్నాడు. "రోజున్నర గడిచింది."
"ఆ!" లేచి కూర్చున్నాడు రాజు. "నిజంగానా, వేళాకోళంరా?"
"నిన్న ఆరో తారీఖు. ఉదయం మంచం ఎక్కేవు. ఇవ్వాళ ఏడో తారీఖు. రాత్రి పదకొండు అవవస్తోంది. కావలిస్తే గడియారం చూచుకో."
"ఏమిటో గత......" రాజుకే గుర్తు రాలేదు.
"తెలుసుకురా! మనం దేశద్ర్రిమ్మరులమయ్యేం."
చిన్నగా నవ్వేడు రాజు. కడుపు తడుముకుంటూనే కళ్ళతో చూచేడు.
"మనకి తెలుసురా అవన్నీ" అంటూనే ఎన్నో తెచ్చి ముందర పెడుతూనే "మరి అడ్డపడూ" అన్నాడు శాస్త్రి.
వంచిన తల ఎత్తలేదు. సగం ఖాళీ అయిన తర్వాతనే "శాస్త్రీ, అప్పుడప్పుడు భంగుపీల్చాలని, మధువు తాగాలని, స్త్రీని కోర్కెతో చూడాలని అనిపిస్తుంది. ఎందుకు?" అని రాజు అన్నాడు.
శాస్త్రి నవ్వుకున్నాడు. చూచాయగా ఇదా సంగతి అనుకునే "వయస్సు కోరుతుంది. పైగా మన చుట్టూరా వున్న వాతావరణం మనల్ని చికాకు పరుస్తూ వుంటుంది" అని సామాన్య మానవుడు లాగే జవాబు చెప్పేడు.
"అల్లా ఎందుకనుకోవాలి? శరీరానికి తను జీవించే రోజులు దగ్గర పడ్డాయని, ఈ సుఖ సౌఖ్యాలు జారిపోతాయేమో, తన్ని చవిచూడనివ్వరేమో అన్న ఆవేదనేమో?"
"అదంతా నాకు తెలియదు. మధు వస్తే వాడితో మాట్లాడుదువుగాని" అన్నాడు శాస్త్రి.
"మధు ఎందుకు వస్తాడు?"
"మహారాజాధిరాజ, రాజమార్తాండ, నట శేఖర, ఇంకా ఇప్పుడు వేదాంత శిఖామణి రాజు ఉన్నాడని టెలిగ్రాం ఇచ్చేను."
అర్ధం అయ్యింది. ఆఖురుకు అరణ్యాల్లోకి పారిపోయినా తనవెంట మనుష్యులు ఆచూకీ తీస్తూనే ఉంటారు. తన్ను వదలరు. తన్ను వెన్నాడుతూనే ఉంటాడు. ఇది చికాకు, కుమిలింపు కలిగించింది.
ఎక్కడ తను తప్పటడుగు వేసేడు? ఇదే అర్ధం కాలేదు. సత్యతో ప్రారంభమైన వ్యక్తీ కరణే దీనికి ప్రాతిపదిక అయ్యింది. అది రుక్మిణి, శాంతలతో జరిగిన సంఘటనల్లో వేరుపోసుకుంది. కొసరుగా మధు, రావు, మాల మారాకులు వేసుకున్నారు.
సత్యచేసిన పనికి, తను కర్తకాడు. అయినా తన కర్మ బలీయంగా విజ్రుంభించి భయపడేటట్లు చేసింది. ఇదెందుకు అవ్వాలి? కారణం చెప్పలేని క్రియ. ఆనాడు ఇల్లా జరిగి ఉండకపోతే, తన ప్రయాణం వేరువిధంగా ఉండేది. వ్యక్తిత్వం అంతస్సు తెలియక ఉండిపోయేదే. ఏ బలహీన తకు దాన్ని ముడిపెట్టుకుందామనుకున్నా, ఒక్కటీ నిల్వటం లేదు. అల్లాగే రుక్మిణిన్నీ.
శాంత పాదాలకు మ్రొక్కింది. "నా భర్త!" ఇదే తన్ను, తనుగా, రాజుగా నించోనివ్వటం లేదు. అక్కడ తను చేసిన తపస్సు కూడా విచిత్రంగానే తట్టింది. ఇంతకూ శాంత తన భార్య- ఆ పూర్వ జన్మలో-అనుకోవడం అన్నది. పంచేంద్రియాలూ నిద్రపోయి, మాట్లాడినట్లుగా ఉంది. నమ్మకం కలగచేసేయి. పరిస్థితులు, వయస్సు ఈ సత్యాన్ని చాటి నిలబెట్టలేవు. కాని దావాగ్నిలా మండించే అలజడి తన్ను తరుముతూంది.
అంత వ్యవధిలో తిరుపతే రావాలని అనుకోవడం విచిత్రంగానే తట్టింది. బహిర్గతమైన దైవ విముఖతతో తను చుట్టూరా ఉన్న స్నేహితులవద్ద ప్రవర్తించేడు. వాళ్ళు నమ్మేరు. కాని తన అంతః ప్రవృత్తిలో శివుడు, శివపరం అంటే ప్రీతి. ఉత్సాహం. ప్రేమ ఎందుకో తను ఆ లింగాకారాన్ని చూస్తుంటే వెర్రి ఆనందం కలిగేది. లోకాన్నంతా మ్రింగి కూర్చున్న అమ్మతో ఆయన ఉండి, పట్టి బూడిదబుప్పన్న అవ్వడమే తనకు అర్ధం కాలేదు. పైగా శ్మశానం, పాములు, గంగ, త్రిశూలం వగైరా లన్నీ ఆయన అనుయాయులు. ఏమిటో ఈచిత్రం!
విష్ణుపరంగా తన ఆలోచనలు సాగలేదు. సర్వభోగముల పుట్ట అని అనుకున్నా, ఈనాడు వెంకన్నలో తను శివలింగాన్ని చూచి, ఆ భస్మం తోనే పూజ చేసినట్లు మైకం కలిగింది. తను లేని తన పూజ. తన్ను మరిచిపోయే విధంగా నిలబెట్టిన చీకటి. అందులో ప్రణవం.
శివకేశవులకు భేదమే లేదు అని ఆ వెంకన్న తనకు చెప్పించేడా? అసలు నా క్షేత్రమేం అమ్మకు అద్దెకిచ్చేను అన్నట్లుగా ఆయనే సాదృశ్యం అయ్యేడా? తన చెవుల్లో మార్మ్రోగేటట్లుగా చదివిన అమ్మనామాలు ఎవరు పలికేరు? అవి లలితాంబ పరం అన్న జ్ఞాపకం క్రమ్ముకుంది.
శరీరం పట్లు తప్పినట్లయ్యింది. ఒక్క అనుభూతి మాత్రం ఇప్పటికీ మరిచిపోలేనట్లు గింగురంటూంది. తన్ను ఎవరో పిలుస్తున్నారు. ఎక్కడికో తెలియదు. వెళ్ళడం చాలా దగ్గరలో ఉంది. వెళ్ళితీరాలి. అదెవ్వరు? స్థలం ఏమిటి? అంటే మృగ్యంగా ఉంది.
ఇది నిశ్చయం. ఏ అనంతాల దగ్గరనుండైనా, తను బద్దుడన్నట్లున్న సత్యం. ఆ మైకంలోనే వచ్చి తన్ను మరిచి పోయే నిద్ర పోయేడు.
"ఎందుకురా, శాస్త్రీ, నావెంటబడతారు? ఇప్పుడు నా ఇంటికే నే వెళ్తున్నా."
"ఆఁ!" నోరు తెరిచేడు శాస్త్రి.
"ఎక్కువగా ప్రేమించేను. ఆ అమ్మ అనంతంలో లీనమైంది. మనస్సే వికలమైంది. కొన్నాళ్ళు దేశాలు తిరిగి వస్తే కుదుట కలుగు తుందేమో అనుకున్నా. సత్య నన్ను పంకిలంలోకి దింపాలని దెబ్బతింది. రుక్మిణి జీవితం మారింది. మాల పొదుపుకుంది. ఇక శాంత 'నాభర్తవు' అంది. దశరధం మావయ్య కన్పడటం లేదని ప్రకటన చేసేడు. మధు, రావు బ్రహ్మ ప్రయత్నంచేసి పట్టుకోవాలని చూస్తున్నారు. ఇదంతా ఏమిటి? ఏం తప్పు చేసేను, శాస్త్రీ?"
దుఃఖం వచ్చింది. ఎంత అసభ్యంగా ఉంది! వాళ్ళకు ఔచిత్య విచక్షణ లేకుండానే ఇదంతా చేసేరా? అనునయంగా ఏమనాలో తెలియలేదు.
"నాకు మతిభ్రమణం కలగలేదని, మనస్సు చాంచల్యం పొడచూపలేదని చెప్పడానికి వెళ్తున్నా, శాస్త్రీ."
ఎందుకో నమ్మలేకుండా ఉండలేకపోయేడు. అది చలించని నిర్ణయంలాగే ఉంది.
"డబ్బు వుందా?"
జేబులోంచి తీసి మిగిలింది లెక్కపెట్టు కున్నాడు. నూరుపైగా ఉంది. చూచి శాస్త్రి మాట్లాడలేదు.
మర్నాడు బస్సులో కూర్చున్నప్పుడే, తను వైష్ణవ మతాభిమాని అయ్యేడన్న చురిక తగిలితే హడిలిపోయేడు. "వెంకన్న ప్రభూ! నువ్వు, నువ్వు....." ఏమని ఎత్తిపొడవాలో తెలియక తిక మక పడ్డాడు.
రైలు నడిచింది. రాత్రి తెల్లవారింది. రిక్షా పరుగెత్తింది.
ఇంటి గుమ్మం మెట్లు ఎక్కుతుంటేనే కాళ్ళు వణికేయి అప్రయత్నంగా. అలసట అనుకునే అడుగుపెట్టేడు.
వాలుకుర్చీలో కూర్చున్న రామచంద్రయ్య కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచేసేడు. నిశ్చిష్టతే! నమ్మకంలేని నిజం.
దగ్గరగా వచ్చి "నాన్నగారూ!" అన్నాడు.
బొటబొటా కన్నీళ్లు కారేయి రామ చంద్రయ్యకు. వ్యక్తీకరించలేని, తన రక్తం పంచుకున్న జీవి ఎడ ప్రేమ,వాత్సల్యం, అనురాగం అన్నీ చింది ఉన్నాయి.
"వచ్చేవా, నాయనా?"
"ఎందుకు రానూ?"
"మళ్ళీ వెళ్ళిపోవుకదా?"
"వెళ్ళను. ఎక్కడికీ వెళ్ళను. మీ ఒంట్లో కులాసాగా వుందా?"
ఆనందంలో ఒక్క అంగేవేసి, ఇంట్లోకే వెళ్ళి "రుక్మిణీ, అబ్బాయి వచ్చేడే" అన్న అరుపే.
పరాగ్గా ఆలోచిస్తూ నీళ్ళు తోడుతున్న రుక్మిణికి ఆ పిలుపు మెరుపు కొట్టినట్లే అయితే, తోడే బొక్కెన అల్లాగే వదిలివేసి, పరుగేఎత్తింది. వంటింటి గడప దాటినపుడు భళ్ళుమని, గుడగుడ శబ్దం నూతిలోనే వినిపించింది. అది గాలిలో కలిసి చచ్చేపోయింది.
సావిట్లో రాజు. అవతల కుర్చీలో, కూర్చోలేని కంగారులో రామచంద్రయ్య. ఇల్లా ఉండగానే రుక్మిణి వచ్చేసింది. ఒక్కసారి చూచి మాట్లాడ లేకపోయింది.
"తిరుపతి వెళ్ళి వస్తున్నా, పిన్నీ."
"అది నాకు తెలుసు" అంది రుక్మిణి.
రామచంద్రయ్యకు అర్ధం కాలేదు. పైగా ఇంతవరకూ తన వివాహవిషయం తెలియదని, అది వాడిని చాలా బాధిస్తుందని, తన్ను క్షమించలేడని అనుకుని మధనపడ్డాడు. ఏవిధంగా ఆ విషయం బయటపెట్టాలా అన్న సమరం. వాడి పిలుపులో మార్పు, యథాలాపంగా ఉన్న వార్త వినేసరికి గుండెలు కుదుటబడ్డాయి. నిట్టూర్పు విడిచేడు.
కళ్ళతోనే 'ఎల్లా?' అని అడిగేసి ఊరుకున్నాడు రాజు.
"రాత్రల్లా నిద్ర లేనన్నట్లుంది. పరంధామయ్యతో ఫలహారం, కాఫీ తెమ్మని చెప్పు, రుక్మిణీ." ఆయనే పురమాయించేడు.
తల్లిగా తను లోపలికే వెళ్ళింది.
"ఇదంతా తెలుసునన్నమాట నీకు?"
"అదేమిటి, నాన్నగారూ? నేను ఓరోజు వచ్చి పెండ్లి అయిన తర్వాత పిన్నితో మాట్లాడే వెళ్ళేను.."
"ఆ!"
"పిన్ని మీకు చెప్పలేదా?"
తల ఊపేడు. నిశ్శబ్దం క్షణికం. "ఈ విషయంలో నువ్వు.....నన్ను...." ఏ యుక్తపదం వెయ్యాలో తెలియలేదు రామచంద్రయ్యకు.
"ఎందుకల్లా బాధపడుతారు? అమ్మ ఇన్నాళ్ళూ రుక్మిణి పిన్నిని తెచ్చి, పెంపకంలో మలచి, ఇల్లు చక్కపెట్టడంలో తరిఫీదు ఇచ్చింది. తన తర్వాత తనుగా మీకు ఆసరా ఇవ్వడానికేమో? అల్లా ఎందుకనుకోరు?"
తువ్వాలులో ముఖం దాచుకున్నాడు రామచంద్రయ్య.
అమ్మ జ్ఞాపకం వచ్చి ఉంటుందన్న భావనే కలిగింది రాజుకు.
"నన్ను ఎవ్వరూ మెచ్చలేదు ఈ విషయంలో."
"నేనున్నాను కదా, నాన్నగారూ? ఒకళ్ళ మాటలు మనకెందుకు?"
ఏనుగంత బలం వచ్చినట్లయ్యింది రామ చంద్రయ్యకు. వీడు తనవాడు. తనంతటి తన వాడు. ఆనందం పారవశ్యమే అయితే, లేచి వెళ్ళి కౌగిలించుకుని ఏడ్చేడు. "కనీసం నువ్వేనా" అన్న మధ్య మధ్య చెప్పలేని తునుకలు.
రాజుకు ఈ అవ్యాజ ప్రేమకు కన్నీళ్ళు తిరిగేయి. తువ్వాలుతోనే కళ్ళు వత్తేడు. ఎందుకో ఆగని కన్నీళ్లు. అవి ఊరుతూనే ఉన్నాయి.
ఈ స్థితిలో ఉండగానే రుక్మిణివచ్చి, తండ్రి కొడుకుల ప్రకృతి చూచి, గుమ్మానికే-నిశ్చేష్ట అయి - ఆనుకుంది. తనకు గుర్తు ఉన్నంత వరకూ ఇటువంటి సంఘటన జరగలేదు. చూడలేదు. అది ఎంతగానో హృదయానికి నాటింది. తనకే దుఃఖం వచ్చింది.
ఇంతగా అనురాగం చిమ్మి, పొంగి పొరలుతుంటే దాన్ని ఎల్లా కప్పిపుచ్చుకొని, విరుద్ధ సమ్మేళనం అని లోకాన్ని కన్ను కప్పేసేరే అన్న దిగ్భ్రమే. బావుండదు ఇక అన్నట్లే "వారు ఇక నువ్వు ఈ గడప త్రొక్కవేమో అనుకున్నారు. దానితో బెంగటిల్లిపోయేరు. ఎంతగా చెప్పినా....." అని బల్లమీద ఫలహారం, కాఫీ పెడుతూనే అంది గృహిణీధర్మంలా రుక్మిణి.
"ఎందుకు రానూ?"
"వస్తానన్న గాఢ ధైర్యం నాకు వుంది."
ఈసారి రాజే కాస్త కంగారు పడ్డాడు. ఏమిటా నమ్మకం రుక్మిణిలో? అర్ధం కాలేదు.
"వచ్చేనుకా?"
"ఇక నువ్వు మళ్ళీ వెళ్ళలేవు కూడాను. అయినా మరిచిపోయే, ఆ మధు వచ్చేడా లేక రావా తిరుపతికి?"
కంగారుపడ్డాడు రాజు. బర్రెంక డొంకలా ఉంది.
