శాంత ఆ కోడలే అయితే, ముత్తయిదువులా ఉందే? ముఖాన్ని బొట్టు పెట్టుకుంది. జడలో పువ్వులు తురుముకుంది. చేతికి గాజులు ఉన్నాయి. ఇవన్నీ ఎల్లా సాధ్యం? పైగా నిత్యాగ్నిహోత్రం ఉందే? తను పొరపడ్డాను అనుకున్నాడు. ఈవిడ ఎవరో బంధువు అయి ఉంటుంది అనీ నిర్ణయం చేసుకున్నాడు.
ఆరాత్రి కవాచీ బల్లమీద పడుకున్నప్పుడే శాకుంతలంలో శ్లోకాలు చదివి వినిపించేడు. శ్రావ్యమైన కంఠం, దానికి తోడుగా కొంత సంగీత జ్ఞానం కలిసి సమ్మోహితుల్నే చేసింది.
"సంగీతంకూడా...."
"లేదండి. మావూరి ఫిడేలు ఆచారిగారు తెల్లవారుఝామునే రోజూ సాధకం చేసేవారు. వారి అనుకరణే కాని ప్రవేశం లేదు."
"సాధన చేస్తే బావుంటుంది" అన్నాడు అవధాని. తనకు అందులో జ్ఞానం ఉందికాని చెప్పేంత దిటవు లేదు. అదే తేడా.
"పొట్ట చేతులో పట్టుకున్నవాడిని..."
"లేదు. విద్య నేర్చుకోవడం స్వార్ధ సంసిద్ధి కొరకు కాదు. అది మానవుణ్ణి మానవుడులా నిలబెట్టడం కొరకు. ఆముష్టికం."
రువ్వుమంది; గురుపీఠం ఆశయం అది. అది తను పాటించాలి.
"మంత్రం, మంత్రసిద్ధి అంటారండి. అదేమిటి?"
ఇదే ప్రశ్న, అదే వయస్సులో, రామం అడిగేడు. ఇప్పుడు మళ్ళీ జీవితంలో చురిక తగిలింది. మానిపోయింది అనుకున్నది, ఈమధ్య సంఘటనలతో మళ్ళీ రేగింది. రేగలేదనుకుని ఊరకున్నా, మళ్ళీ ఇదేమిటి?
మ్రింగుకున్నాడు. "మంత్రం శక్తిని ఉద్భవం చేసి జీర్ణింపచేస్తుంది. దానివల్ల అధిష్ఠాన దేవతతో సమానశక్తి ఇంకిన తర్వాత, ఆ శక్తి స్వరూపం ఆనుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఉచ్చారణవల్ల మనలోని ఆత్మకు కంపనం కలుగుతుంది. సమాన కంపనం కలిగిన దైవంతో ఓ విధంగా రాకపోకలూ, సంభాషణలూ సాగించ వీలవుతుంది. ఇంచుమించు స్వరమేళ శక్తి మయం అన్నమాట."
చెప్పిన తర్వాతనే తను కలగూర గంపవతుచేసి నట్లు తట్టింది. మనస్సు నిలద్రొక్కుకోలేని ఆవేదన. దుఃఖం ఓనాటి విషయం పునరుక్తి.
శాంత వింటూనే ఉంది. మావగారి తడబాటు గుర్తించింది. ఎందుచేత అన్నది అర్ధం కాలేదు. పార్వతమ్మ మాత్రం రుగ్ధకంఠం సవరించు కుంది.
రాజు జ్ఞాపకంలోకి వచ్చేడు. వర్ణనలు, రూపు రేఖావిలాసాలు అన్నీ రామం చాయలే. అయినా అతన్ని తను చూడలేదు. పార్వతమ్మ కూడా. చూచే ఉంటే తన మనస్సు ఏ విధంగా కెలకరించి ఉండేదో? ఏమైనా ఓసారి అతన్ని చూడాలి. ఈకోర్కె చిగురించింది. అది ముందుకు వెళ్ళూ అని ముందుకు పంపటంలేదు. తన కాళ్ళకు బంధం వేసినట్లు ఉంది.
ఇక దశరథం మాటల్లో పాలపొంగులా ఆశ చిగుర్చింది. దత్తతే ఖాయమయితే ఇహపరాల దృష్టికి తను అర్హుడవుతాడన్న కోర్కె కండువా వేసుకుంది. తర్వాత మాత్రం ఎంత స్వార్ధం అని ఎత్తి కుదేసింది. ఏమైనా ఈమధ్య తను పరచిత్తం, పరాకు అయిపోతున్నాడు. నైతికంగా తను దిగవారేడన్న భయమే పట్టుకుంది - ఎవరో వెంటాడుతున్నట్లు బెంగ.
ఎందుకో ఆ మర్నాడు భళ్ళున తెల్లవారే వరకూ తను లేవలేకపోయేడు. అప్పటికి శాస్త్రి అనుష్ఠానాలు పూర్తి చేసుకునే వచ్చేడు.
అంగవస్త్రం ఆరవేసుకుంటున్నప్పుడేకాబోలు "నువ్వు పాలు పిండగలవా?" అంది శాంత.
"తెలియదండీ."
"పాడి లేదూ, మీకు?"
"లేదండి. అసలు ఇల్లే లేదు. రెడ్డి దయ తలిచి వాళ్ళ పాకలో వుండమన్నాడు. వుంటున్నాం."
"లౌకిక జీవనమా?"
తల ఊపేడు. ఈ ప్రశ్నలు సామాన్యం కనుకనే ఎక్కువగా పట్టించుకోలేదు శాస్త్రి. దొడ్లో పువ్వులు కోసేడు. గంధం తీస్తాను అన్నాడు. ఆఖరుకు పార్వతమ్మ వద్దకు వచ్చి.
"మడినీళ్ళు నేను కాలవనుండి పట్టుకు వస్తానండి" అనీ అన్నాడు.
ఒక్కొక్కళ్ళను, ఒక్కొక్క విధంగా కదిల్చి, శాస్త్రి ఇంట్లో ఉండిపోయేడు. ఇమిడిపోతున్నాడు. ఆనాడు చౌదరయ్య వచ్చి కుండ బద్దలు కొట్టి నట్లు అనడంతో శాంతకు అర్ధం అయ్యింది.
"ఎప్పుడో చెప్పేను - వీడిని ఏదో ముహూర్తం చూచి శాంతమ్మకు దత్తత చేసెయ్యి అని. ఇన్నాళ్ళూ ఊరుకునే ఉరేసుకున్నావు." దులిపి నట్లు అనేసేడు.
గతుక్కుమన్నాడు అవధాని.
"ఇన్నాళ్ళూ ఆనాటి విషయం ఆలోచిస్తూనే వున్నా. ఇదంతా మొత్తం మీద అది ఓ దౌర్భల్యంలో ఆవరించిన ఆలోచనేమో అనిపించింది. దాన్ని పట్టుకు వ్రేళ్ళాడ్డం కూడ మూర్ఖత్వం అవుతుంది."
"ఇంత జ్ఞానం వుంది. ఇంగితం వుంది. ఈ విషయంలో ఇంత బేలవైపోయి, ఒట్టి పిరికి వాడవు అయ్యేవు. ఇంట్లో ఆడాళ్ళ మాట వేదం అంటే, బయట తిరిగే రోజులు ఉన్నాయని మరిచిపోకు. తిరిగేవాళ్ళం మనంకాని వాళ్ళుకాదు. ఇదీ గుర్తు వుంచుకో."
అవధానికి పాలుపోలేదు; ఇంత విసురుగా చౌదరయ్య తనమీద దండయాత్ర ఎందుకు 'చేస్తున్నాడా అన్నది. ఏమైనా జరిగిందా? అదీ తెలియదు. చెప్పకుండానే దుయ్యపట్టేడు. ఇది చికాకుగా ఉంది.
"ఏమిటీ అకాల వర్షం, చౌదరీ?"
"లక్ష్మయ్య తల బాదుకుంటూ వచ్చేడు. మొన్న చేనువద్ధ స్వామికి, ఈతనికి మాటలు వచ్చి, నానాకూతలూ కూసేడుట."
ఇక విపులంగా అడగడం భావ్యం కాదనుకున్నాడు. తన ఇంటి చరిత్రలు రచ్చకెక్కుతున్నాయి. ఏది జరగకూడదనుకున్నాడో అదే జరిగింది. ఇన్నాళ్ళూ నడుం విరిగిన పాములా పడి ఉన్న శాంత, తలెత్తడంతోనే, ముసలం పుట్టినట్లుగా అయ్యింది. దీనికి కర్త తనేమో?
తను ఎంతగా 'అమ్మను' నమ్మినా, ఆవిడకు అర్పితం చేసినా, ఇప్పుడు శరీరం తిరగబడి, తనకు ఉద్రేకం ఊడిగం చేయిస్తూంది. దృశ్యా దృశ్యాలమధ్య మానవుడు బంధింపబడడం అన్నది ఎంత అపహాస్యం గా ఉందో అన్న కుమిలింపే. ఒట్టి మిథ్య అవన్నీ అన్న విరక్తి.
"స్వామిని కొట్టేడుట. అదో పంచాయితీ నా నెత్తిమీద. వాడు అంత బుర్రలు పగలు కొట్టుకొనే వైరంలో వుండి, 'మధు ఎందుకొచ్చే డయ్యా?' అంటేనే లక్ష్మయ్యకు కోపం ఆగలేదు. దీనికి తోడుగా ఉత్తరాలు మోస్తున్నా వటగా, తార్పుడుకు అంటేనే ఒళ్ళు తెలియలేదు.
"ఇదే వాడు బహిరంగంగా అంటే నేను తలతీసి ఎక్కడ పెట్టుకోవాలి? మాట్లాడవేం?"
అవధాని ఒళ్ళు కుతకుతలాడింది. అయినా కర్తవ్య శూన్యుడుగానే ఉండిపోయేడు.
"అల్లా బెల్లం కొట్టిన రాయిలా వుంటే ఏం పనులవుతాయి? నువ్వు అంతగా శాంతమ్మతో మాట్లాడలేకపోతే, నేనే మాట్లాడుతా" అనే "శాంతమ్మా!" అన్న కేక పెట్టేడు.
చల్ల చేస్తున్న పార్వతమ్మ చేతిమీద వెన్న చిలుకులతోనూ, విన్న శాంతమ్మ వినీ విన్నా నన్నట్లూ వచ్చేరు. అవధాని మాత్రం పైకి నిశ్చింతగా, గోడకు ఉన్న దేవీపటాన్ని చూస్తూనే ఉండిపోయేడు.
"ఏం పిలిచేవు, చౌదరయ్యా' అన్న చూపు పారేసి శాంతమ్మ పడమటింటి గుమ్మం దగ్గర నిలబడింది. పార్వతమ్మ మండువా వద్ద స్తంభాని కానుకుని కూర్చుంది - 'ఏమిటీ ప్రళయం' అన్న ఆందోళనలో బిత్తర చూపులు చూస్తూ.
'ఇదీ కథ' అనే సింహావలోకనం చేసి "ఇక మన పరువూ ప్రతిష్టా నిలబడాలంటే, ఈ అపోహల్ని మొగ్గలోనే తుంచెయ్యాలి. శాస్త్రిని నువ్వు చూచేవున్నావు. పిల్లవాడు బుద్దిమంతుడు. ఓ లేనివాడికి పట్టెడు వణ్ణం పెట్టినట్లవుతుంది. వాడిని చేరతీసి పెంచడం మంచిది, శాంతమ్మా" అన్నాడు చౌదరి.
శాంత మాట్లాడలేదు.
"అక్కయ్యా, ఇప్పటి పరిస్థితుల్లో మీరు చేరదీసేకంటే, శాంతమ్మకే దత్తత చెయ్యడం మంచిది. దానివల్ల మనం తెరిపిని పడతాము. పైగా ఈ కారుకూతలకు అదో వాత అవుతుంది.
"అందుకే రామశాస్త్రిని అంచెలమీద రావలసిందని మనిషిని పంపే."
"ఆ!" అన్నాడు అవధాని.
"ఒకటి ఆలోచించు, అక్కయ్యా. దశరథం గారి మాటలకు ఎంతవరకూ మనం విలువ నివ్వవచ్చు. పైగా మీ శాఖలు వేరు. అంతస్థులు వేరు. దృక్పథాలే వేరు. ఇల్లంటి పరిస్థితుల్లో, ఆ రామచంద్రయ్య ఒక్కగా నొక్క కొడుకుని, ఈ మిథ్యా నమ్మకంలో కళ్ళు మూసుకుని ఊగిసలాడిన మనకి, దత్తత ఇస్తాడని కాని, ఆఖరుకు గడపైనా ఓసారి త్రొక్కనిస్తాడని కాని ఎల్లా నమ్మగలం? ఎల్లా సాధ్యం? మన ఆశ సఫలం అయి తీరుతుందన్న నమ్మకం నీళ్ళు మూటకట్టడం వతు. కాదంటారా?"
చౌదరయ్య సమీక్ష శ్రుతిమించినట్లు లేక పోవడంతో శాంత మౌనంగానే ఉంది. ఇంతకూ మావయ్య మాట్లాడనిది, మాట్లడలేనిది, చౌదరయ్యతో చెప్పిస్తున్నాడన్న నమ్మకం పునాది వేసుకుంది. మరి ఆయన ఇచ్చిన వాగ్ధానం, పెట్టిన తిలకం విలువలు? అవన్నీ అదోలోకపు చర్యలా? వాట్లకు ఆలోకపు కళ్ళలోనే విలువ ఉందా? ఇప్పుడు స్త్రీ, ఆమెకు ఆవృత్తి అయ్యే చీకట్లు కూడా మననం చేసుకుని, దుఃఖించ డంలో ఔచిత్యం లేదు. తను విచారించడం ఒట్టి తెలివి తక్కువ అవుతుంది. పైగా గతానికి తను ప్రస్తుతంలో ఆనకట్ట వెయ్యాలనుకున్న భావనే, ఎంత జీవచ్చవంగా ఉందో అన్న సంకులమే బయలుదేరింది.
"రామశాస్త్రి ఒప్పుకు......" సగంలోనే బయట చెప్పులు చప్పుడైతేన వంగి చూచేడు చౌదరి. లక్ష్మయ్య జోళ్ళు విప్పడం, శాస్త్రి భుజాన ఉన్న సంచీ అరుగుమీద పెట్టి లోపలికి రావడం కన్పడింది.
"వెయ్యేళ్ళు ఆయుష్షు. అనుకుంటూ వుండగానే వచ్చేడు" అనేసేడు.
మర్యాదా కళ్ళతోనే అన్నట్లు అవధాని చూచి, కొంచెం బల్లమీద జరిగి చోటు చూపించేడు. 'ఇప్పుడే ఆ విషయం పరిష్కారం అవ్వాలి' అన్నట్లు చౌదరయ్య పర్యవేక్షణ చేసేడు.
