"పద్మావతీ, నేనూ, శైలజా ఇంకా మా హాస్టలంతా రామా?" అడిగింది సురేఖ నవ్వుతూ.
అంతలో పద్మావతి అన్నది "మా అమ్మ ఒక్కర్తీ ఉండిపోతుందండీ ...... తను రమ్మంటే రాదేమోనన్నది....." జంకుగా.
"నేను వచ్చి అడుగుతాలే" అన్నాడు భాస్కరం ధైర్యంగా.
"సురేఖ వస్తుందిలెండి" అన్నది పద్మావతి.
"మధ్య నీ సంగతి చెప్పవోయ్!" సురేఖ విసుక్కుంది.
"అందరూ వస్తాంరా భాయ్! హాయిగా పెళ్ళికేగా ....." నవ్వుతూ నువ్వేమంటావ్ అన్నట్లు చూశాడు శైలజను. ఆ అమ్మాయి అదోలా నవ్వింది.
పద్మావతి సురేఖ యిద్దరూ యిలా మాట్లాడుకోగా చూడటం భాస్కరం యిదే మొదటిసారి. "ఛీ నేనేగా? కారకున్ని!!" అనుకున్నాడు. బాధపడ్డాడు.
అంతలో మూర్తి సరిగ్గా కూచుని "ఒరే! ది గ్రేట్ అరిస్టాటిల్! నేనో చిన్న ప్రపోజల్ అనగా మనవి పెడుతున్నాను" అన్నాడు.
భాస్కరం ఒప్పుకోక తప్పదు. ఎవరి మనసులో చికాకు ఎలా ఉన్నా మూర్తి మనసులో శైలజ ఉంది గదా మరి!-అంతలో మూర్తి పద్మావతిని చూసి "అసలు మీరు వొప్పుకోవాలండీ మొదట" అన్నాడు.
పద్మావతికీ నిజంగా భయం వేసింది.
అయినా "ఏమిటీ?" అన్నది. సభ్యత కోసరం.
"బహుశా ఆయన పెళ్ళికి మనం రావాలని ప్రోమిస్ చేస్తేగాని ఆయన భాస్కరంగారి సిస్టర్ మారేజీకి రారేమోనే" సురేఖ కలుపుగోరుతనంగా నవ్వింది.
పద్మావతి కూడా నవ్వి "ఔనా?" అన్నది శైలజను కొంటెగా చూసి- ఆ మసక చీకట్లో శైలజ సిగ్గూ, పద్మావతి కొంటెతనం ఆ రెండూ భాస్కరంమూర్తీ గమనించలేదేమో గాని సురేఖ పసిగట్టింది.
"ఆఫ్ కోర్సు ..... అది మరీ దూర దృష్టి గాని..... నాది కాస్త హ్రస్వదృష్టి లెండి మనం ఒక పిక్ నిక్ కు వేలలాలి అనుకున్నాం - దానికి మీరూ, మీరూ, మీరూ, వీడూ (భాస్కరాన్ని చూసి)రావాలి.....నేను వస్తాను అది నా ప్రామిస్" -అన్నాడు మూర్తి.
"మా వార్డెన్ బెంగెట్టుకుంటుంది"
"మా అమ్మ కోపం పడుతుంది."
"మా వార్డెన్ సంగతెలా ఉన్నా నేను బోటనీ రికార్డు రాయాలి."
అన్నారు ముగ్గురమ్మాయిలు.
"మరి నీ సంగతిరా?" నిస్పృహగా చూశాడు మూర్తి.
"సరే పోయింది..... గాలీ, వానా వచ్చింది.....ఇక కధ ఏమిట్రా?"
"నో........ నొ...... అలా అనకురా!...... మనం పాత వాళ్ళం వీళ్ళు కొత్తవాళ్ళు...... పైగా సిస్టర్ సురేఖగారు సిస్టర్ పద్మావతీజీ మాంఛి సర్దా ఐనవారూ, పైగా
మిస్ శైలజగారు మాంఛి మాంఛి......"
"కోతో, కొండముచ్చో అనండి......" శైలజ పెంకిగా నవ్వింది.
"అంటాను...... ఎందుకన్నూ..... మీరంతా ఒక్క పిక్ నిక్ కి రాలేరే?..... మరేమనాలి" మూర్తి ఉడుక్కున్నాడు తన ఆశను నిరాశ చేస్తున్న పద్మావతి మీద ముఖ్యంగా కోపం చూపి.
"మరి ఆడపిల్లలం గదా!" అన్నది శైలజ.
"వేరే పిక్నిక్ లుంటాయా మీకు స్త్రీలకు మాత్రమేననీ!" వెటకారమాడడు మూర్తి. కావాలంటే మీ వార్డెనమ్మను తీసుకురాండి.....ఐ డోన్ ట్ హావ్ ఎనీ అబ్జెక్షన్......"
"అది కాదండీ? భాస్కరం తప్పని సరిగా మిత్రుణ్ణి బలపరిచాడు......" మనం హాయిగా ఒక్కరోజులో ఏ సింహాచలమో..... భీముని పట్నమో లేదా దగ్గరగా ఉన్న మాధవధారకేనా సరే..... పోయి సర్దాగా వద్దాం....... మామూర్తి మంచివాడు, అక్కడ సైతం వేరుశనక్కాయలు చిలగడ దుంపలూ, తంపట కాయలూ..... అవీ......"
"అది సరేనండీ! కాని వార్డెనమ్మ ఉత్త సక్కుబాయత్తగారు ....... గార్డియన్ పర్మిషన్ అంటుంది. అదీ సంగతి.......'సురేఖ చెప్పింది.
మూర్తికి ఒక ఐడియా వచ్చింది. "బళ్ళో కెళ్ళొద్దు అనదుగా? మీ సక్కుబాయి యత్తగారు?!.....అంచేత బళ్ళోకని పిక్ నిక్ కి చెక్కేద్దాం......" అని మళ్ళీ మగాళ్ళతో మాట్లాడుతున్నట్లు మాట్లాడేస్తున్నానే అని సిగ్గుపడ్డాడు.
"ఈ అబ్బాయికి ఇంకా కుర్రతనం పోలే" దనుకుంది పద్మావతి. తనకూ వెళ్ళాలనే ఉంది కాని భాస్కరాన్ని ఏడిపించాలనీ ఉంది. బతిమాలించుకోవాలని ఉంది.
చివరికీ సమస్యను సురేఖ తేల్చింది.
"పై వారంమొత్తం హాస్టలంతా పిక్ నిక్ అంటే వన భోజనానికి లారీల మీద బస్సుల మీదా తరలి వెళ్తారుట సీనియర్ లీలావతి చెప్పింది..... అప్పుడు మీరూ రండి.... మేమూ వస్తాం......" అన్నది.
"సరిలెండి! నలుగురితో పాటు నారాయణా!" అనమంటారు. మూర్తి చేతులు ఎత్తి నెత్తిన పెట్టుకున్నాడు.
"మీ ఇష్టం, శైలజా" అనండి సురేఖ నవ్వింది. భాస్కరం శ్రుతి కలిపాడు.
శైలజ కందిపోయింది. "వేరు శనక్కాయలూ అంటారాయన" అన్నది చిన్నగా.
"బెల్లమో అంటారు సురేఖగారు" అని పద్మావతి అందించింది.
"సరే! అది బెటర్ ఐడియానే గాని, నేను పోయినేడాది వెళ్ళాను" అన్నాడు భాస్కరం.
సురేఖ అన్నది "పద్మావతి నేనూ లేం, శైలజా మూర్తిగారూ కూడా అలేరూ"-
"ఓ.కే. మనం వేరే యూనిట్ గా విడిపోదాం......"
మూర్తికి ఆ అవకాశం కూడా పోగొట్టుకోవాలని లేదు.....ఒప్పుకుని ఛెంగున లేచాడు.
సముద్రం హోరున వీడ్కోలిచ్సింది.
పద్మావతిని కూడా రమ్మని సురేఖ శైలజా తమ హాస్టలుకేసి, "కిర్లంపూడి" "కోట"దాకా నడుస్తా"మంటూ మూర్తీ భాస్కరం- చెరో దారీ పట్టారు.
శైలజను "ఈ భాస్కరం గారి గురించి నీ అభిప్రాయం ఏమిట"ని అడిగింది సురేఖ.
పద్మావతి ఆ మాట వింటూనే నొచ్చుకుంది.
"అదేం ప్రశ్నే" అంది కోపంగా.
శైలజ వెంటనే "ఆ ప్రశ్నమీదే పద్మా గారూ! మీరే చెప్దురూ" అన్నది నవ్వుతూ.
"మూర్తిగారు మంచివారు సరేనా!" పద్మావతి రాజీకి వచ్చింది.
"అమ్మదొంగా దొరికార్!" అన్నది శైలజ పద్మావతిని జెడపట్టుకుని లాగి.
సురేఖ చెప్పింది "పద్మా! నువు రేపు వెళ్ళవే ఇంటికీ, ఇవాళ యిక్కడే వుండు" అని.
"అమ్మో! అమ్మ తిడుతుందే" అంది పద్మావతి-
34
ధనమ్మగారికి ఆవకాయ అందినట్లుగా రాసింది సురేఖ. లేకపోతే ఆవిడ మండిపోతుంది.
"పాపం! ఆయనేదో మొహమాటానికి అలాగే అంటే ఆవకాయ ఇచ్చింది దొడ్డమ్మ..... పైగా కాబోయే అల్లుడట?...... వెర్రి దొడ్డమ్మ! చదువుకోలేడు కాలేజీలో..... - పైగా ఓణీలు బాడీలు వయసుకే పెళ్ళి చేసేస్తారుగా వాళ్ళకీ, అందాతనే దొడ్డమ్మకి బొత్తుగా ఈ "లవ్ అఫైర్స్ వాట్ బాధ తెలీదు." అనుకుంది. పుస్తకాలు సర్దుకుంటూ......
భాస్కరం చెల్లెలి పెళ్ళికి ఎలాగా తాను వెళ్ళాలి. దాని పెత్తనం అంతా దొడ్డమ్మదే గనుక- రాక పోతే ఒప్పుకోదు- పాపం? ఇప్పన్నించీ ఆయనను నొప్పించటం ఎందుకూ? పద్మావతికి ఏమీ తెలియదు- అనవసరంగా బాధ పడుతుంది.
శైలజతో ఆ మాటే అన్నది.
"పైగా దానికి జీవితమనే పెద్ద బండ నెత్తిన ఎవరో ఉంచారనుకుంటుంది - ఆడపిల్ల కదా! తాను భాస్కరం గారిని ప్రేమిస్తోంది కదా! అతణ్ణి మురిపించి, ఆకర్షించి దారికి తెచ్చు
కోవాలా? - లోపల ఉడుక్కుని బాధ పడాలా?" అని.
శైలజ సురేఖని అడిగింది. "అయితే సురేఖ గారూ! ఆడపిల్ల ప్రేమించిన వాణ్ణి ఆకర్షించాలా?"
"మరి? ప్రేమంటే!!...... సురేఖ చిలిపిగా చూసింది శైలజను.
"ఒకవేళ ఈ ఆకర్షణనే ప్రేమ అంటే...?-" శైలజకు ఏమని అడగాలో అర్ధం అవలేదు. సురేఖే అన్నది "అంటే అపవిత్రమేం కాదులే! అదే రానురాను అనురాగమై అనుబంధమై రాణిస్తుంది" అని నవ్వింది.
"ఆరాధన చేస్తో ఆవేదన పడుతో ఉంటే ప్రేమ అనుకున్నాను సురేఖగారూ! అదే పుస్తకాల్లో చూశాను నాకు మా 'బామ్మ' ఒకావిడ కులుకుతావెందుకే 'సానిపాపలాగా' అనేది- అప్పటి నించీ, అదో భయం-" అంది శైలజ అమాయకంగా.
"అదంతా, పెళ్లైపోయాక ఒక జీవితా నికి రెండు చక్రాలైతేను - అంతేగాని ఇప్పన్నించి నీవు, మూర్తిగారిని సేవిస్తాను "నేను సావిత్రిని" అన్నావో-ఆ సత్యవంతుడు మరో తిలోత్తమ దగ్గరికి పరిగెడతాడు!"
సురేఖ మాటలకు బోలెడు సిగ్గూ సంతోషమూ పడి గభిక్కున "గురూజీ! థాంక్స్" అని ఆ ఆమ్మాయిని కౌగలించుకున్నంత దగ్గరిగా వచ్చింది.
"శీఘ్రమే! వివాహప్రాప్తి రస్తూ" నవ్వింది సురేఖ అని నవ్వుతో "ఫో? ఆ మూర్తిగార్ని కౌగలించుకో" మన్నది.
"ఇన్ని కబుర్లు చెబుతారు సిస్టర్! మరి మీరు ఎవర్నీ ప్రేమించలా?"
శైలజ కళ్ళింత లేసి జేసుకుని చూసింది. సురేఖకేసి కుతూహలంగా.
"ప్రేమించాను-"
"ఎవర్ని?" దగ్గరిగా జరిగింది శైలజ. సురేఖ అదోలా నవ్వింది.
"మొదట అడిగితే మా దొడ్డమ్మని మళ్ళీ అడిగితే జీవితపు విలువల్ని...." అన్నది.
"పద్మావతిగారికి భాస్కరంగారిమీద కోపం -ఒకవేళ అతను మిమ్మల్ని....."
సురేఖ మధ్యలోనే అందుకుని "ప్రేమిస్తున్నాడని అనుమానం ఔనా? ప్రేమించ కూడదా?" అన్నది. సూటిగా చూస్తూ.
శైలజ చకితయైంది.
"నేను పద్మావతిని ప్రేమిస్తున్నాను. అదీ నన్ను ప్రేమిస్తున్నది." అన్న సురేఖ మాటలకు తేరుకుని శైలజ మళ్ళీ అడిగింది.
"అంటే మీరూ.......అలాగే....."
"నేను పద్మావతిలాగ భాస్కరాన్ని ఆశించడం లేదు ...... తాను ఆశిస్తున్నది ....... అతని ఆకర్షణకు దానిలోని ప్రలోభం తోనే ప్రారంభమైంది అసలు దాని ప్రేమ ..... కాని నా ప్రేమకి మరో పేరు స్నేహం .... ఇది గురూజీ అన్న నీ మీద ఆ పద్మామీదా...... భాస్కరం గారి పట్లా ఒక్కటే.. ఎందుకంటే? ఏమో? నేనే చెప్పలేను. నాకేదో మీ అందరి గురించి ఆలోచిస్తూంటే అదో థ్రిల్ అనుకో....." సురేఖ లేచి నిలబడి,
"రా! పోదామ్! పద్మావతికి ఏమీ చెప్పకూ......అది భాస్కరం తన సొంత సొత్తు అనుకుంటున్నదప్పుడే..... అలా సొంతం చేసుకోడంలోనే పురుషుడు చిక్కకుండా పోతాడు - లేదా ఆ ప్రయత్నంలోనే స్త్రీ అతనికి అలుసయి పోతుంది" అని గబగబ నడిచింది. శైలజ అనుసరించింది.
