Previous Page Next Page 
వంశాంకురం పేజి 25


    "తగ్గిపోయింది . ఈపూట ఇంటికి వచ్చింది."
    "ఆరోజు అన్నయ్య మాటలకు నా హృదయం మండి పోతుందమ్మా. అందుకే అలా అన్నాను. క్షమించు."
    "నాకు తెలియదుట్రా. నీకు కోపము తెచ్చే మాటలే అని ఉంటాడు. అవేమీ మనసులో పెట్టుకోకు. రాజన్న కనిపించి కొట్టులోకి కొత్తరకం దుస్తులు వచ్చాయిట . అరుణను తీసుకెళ్ళి ఇప్పించుకురా. అనారోగ్యము సాకుతో దానికి చీరలే కొనలేదు."
    'అలమారు నిండా ఉన్నాయి కదమ్మా."
    "ఉండనియ్యరా మొహమాటమేం వద్దమ్మా. నీకు కావల్సినవి తెచ్చుకో."    
    "మీవి కొన్ని వెలిసి పోయాయి మీరు రండి."
    "నీకు నచ్చినవి నాకు నాల్గు పట్టుకు రావే" బట్టల సాకుతో వారిని పంపితే కాస్త ఒంటరిగా కబుర్లు చెప్పుకుని మనస్తాపము తీర్చుకుంటారని తలచింది. అరుణ తయారయి భర్త వెంట బజారుకు వెళ్ళింది. భార్యాభర్త లిరువురూ కొట్టులోకి వెళ్ళి కావల్సినవి తీసుకుని బయటకు వచ్చారు.
    "కాసేపు కృష్ణ ఒడ్డున కూర్చుందామా?' ఇరువురూ కృష్ణా నది దగ్గరకు వచ్చారు. వారి వంటి వారే చాలామంది వచ్చారక్కడకు. ఎవరి మాటలలో వారున్నారు. ఇరువురూ ఒకచోట కూర్చున్నారు.
    "కాశ్మీరు లోని శీతలము కూడా మీ హృదయాన్ని చల్లబరచలేదులా ఉంది?' భర్త వంక చూచి, అడిగింది అరుణ.
    "నా మరణము తో నా హృదయము లో లేచి నన్ను కాల్చి వేసే జ్వాలలు చల్లారుతాయి మామూలు విషయాలు.....' ఇహ పోనివ్వు అరుణా."
    "ఏమ్మాటలండీ. నేను ఏదో తమాషా కంటే మరణము అంటారేం?' ఆమె చిన్న బుచ్చుకుంది. ఆమె చేయి తీసుకున్నాడు.
    "నేనేదో పిచ్చిగా అనేస్తాను. నువ్వు సీరియస్ గా తీసుకోకు. మొన్న తెచ్చిన క్రొత్త పుస్తకాలు చదివావా?"
    "చదివాను. మీరు యేవో ఇంగ్లీష్ వి కూడా తెచ్చినట్టున్నారు?"
    "చదువుతావాఏం? రేపు అన్నీ క్రిందికి పంపిస్తాను?."
    ఒకటి రెండు చెప్పండి. ఇంటరెస్టింగ్ గా ఉంటె చదువుతాను. చిన్నప్పుడు అన్నయ్య చే అన్నీ మొదట చెప్పించుకుని, తరువాత చదివే దాన్ని."
    "కధ చెప్పటమంటే విసుగు...." అన్నాడే కాని ఆలోచనలో పడ్డాడు.
    "మీకు విసుగ్గా ఉంటె చెప్పవద్దు లెండి."
    'క్లుప్తంగా ఓ కధ చెప్తాను. ఆఖరు చాప్టరు లో ఓ సమస్య ఉంది. అది నువ్వు విడదియ్యాలి." నవ్వింది అరుణ.
    "విక్రమార్కుడి కధనా ఏం?"
    "అలాంటిదే అనుకో."
    'చెప్పండి." అన్నది రాళ్ళు కృష్ణా నదిలోకి విసురుతూ.
    "అనగా, అనగా ఒక రాజు ఉండేవాడు."
    "నిజంగా విక్రమార్కుడి కధే చెప్తారా, ఏం ఖర్మ?"
    "విను. తరువాత ప్రశ్నిస్తువు గాని. ఆ రాజుకు ఒక కుమారుడుండేవాడు . అతనికి పెంకితనం బాగా అబ్బింది. అతన్ని దారిలో పెట్టె విధానం కనక విచారించుచున్న సమయం లో మంత్రి గారి ఓ సలహా ఇచ్చారు."
    "ఏమని పెళ్ళి చేస్తే తిక్క కుదురుతుందనా?"
    "అడ్డు ప్రశ్నలు వెయ్యరాదు. అతనిని ఆశ్రమాలకు పంపితే మంచిదని. రాజుగారు తన ఏకైక పుత్రుడు దూరంగా ఉండటము సహించలేక పోయినా అతని క్షేమము కోరి , అతన్ని దూరంగా పంపాడు. ఈ రాజకుమారునికి ఆశ్రమములో ఒక చిన్నది తటస్తపడింది. ' ఆ మాట చెబుతుంటే అతని గొంతు వణికింది. అరుణ అతని వంక చూడలేదప్పుడు చూస్తె ఆశ్చర్య పోయేదే.
    "ఊ.. కానివ్వండి."
    "తల్లిదండ్రులకు దూరంగా ఉండి విచార పడుతున్న అతన్ని ఒదారుస్తుందా అమ్మాయి . అతనికి కావల్సినవి అందిస్తుంది. అంతస్తు భేదము మరిచి, ఇరువురూ ప్రేమించుకున్నారు. అతను ఆమెను వివాహము చేసుకోవాలని తలచినాడు. విద్య ముగించి రాజధాని చేరినాడు. పుత్రుని యందు సంపూర్ణ విశ్వాసము గల తండ్రి అతని వివాహము సాటి రాజకుమార్తె తో నిశ్చయిస్తాడు."
    "వద్దని తన అభిప్రాయము చెప్పవచ్చుగా. అంత గారాల పుత్రుని మాట వినరా."
    "అక్కడే అతను పొరపాటు చేశాడు. పిరికి తనము దానికి తోడూ అంతస్తు అతన్ని మాటాడ నివ్వలేదు. కనీసము ఆ కన్యను కలుసుకుందామంటే ఆమె ఆశ్రమము విడిచి పోయింది. చిరునామా తెలియక తల్లిదండ్రులు నిర్ణయించిన రాకుమారినే వివాహము ఆడినాడు. ఆమె రావడమే ఏదో వ్రతము పట్టుకుని వచ్చింది."
    "నాలాంటిదే . నేను రోగాన్ని తీసుకుని రాలేదు"
    "వ్రతము ముగిసేవరకు ఆగలేని గారాల పుత్రుడు , స్నేహితుల బలవంతం పై వేశ్యా వాటిక చేరినాడు. అతని ప్రియురాలే అతనికి వేశ్యా రూపములో దర్శన మిచ్చింది."
    అతను "సంతోషంగా ఆమెను పలుకరించి ఉంటాడు. రాజులకు పట్టింపు లేదుగా రెండవ భార్యగా స్వీకరించి ఉంటారు."
    "బావుంది నీ ముగింపు. అతన్నే చూడగానే ఆ అమ్మాయి మూర్చ పోయినది. అతను పిరికి వానిలా పరిగెత్తుకు వచ్చాడు. అతనే రాకుమారుడని ఆమెకు తెలియదు. ఆశ్రమములో అతని ఉనికి తెలియలేదు."
    "పాపము ఆమె పరిస్థితులకు బానిసఅయి పొట్ట పోషించుకోవడానికి వేశ్యా వాటిక చేరిందేమో. అతను ఆగి ఆమె విషయాలు కనుక్కోవాల్సింది."
    'దాని వలన లాభము?'
    "ఆమెను ఆ నరక కూపము నుండి రక్షించవచ్చుగా? అతనికి ధనానికేం కరువు లేదు. ఆమె కిచ్చిన మాట నిలబెట్టు కొకపోయినా , నాల్గు చల్లని మాటలు చెప్పి సహాయపడవచ్చు."
    "నిజంగా నాకీ విషయం తట్ట లేదు సుమా."
    "కొంపదీసి కధ మేరె వ్రాస్తున్నారా ఏం?' అతని వంక చూచింది.
    "రాయాలి. హృదయము లో భరించరాని వేదన బయలుదేరినప్పుడు  చెప్పుకునే స్నేహితులు లేనప్పుడు తన బాధను కాగితము పై వ్రాసి శాంత పడవచ్చుగా? పద చాలా ఆలస్యము అయింది." అతను లేచాడు అతను యెందుకో చాలా తేలిక అయినట్టు అనుభూతి పొందాడు. అతని తలపై నున్న బరువు తేలిక అయింది.
    "అంతా చిత్రంగా మాట్లాడుతారేం?" అతని వెనకాలే ఆమె లేచింది.
    "అమాయకంగా ఉండే మన లాంటి వారి బ్రతుకులలో యెన్నో చిత్రాలు దాగి ఉంటాయి అరుణా." ఆమె వచ్చి కూర్చోగానే కారు స్టార్టు చేశాడు.
    అతని ప్రశ్నకు సమాధానం లభించింది కాని ఆ వీధిలోకి యెలా వెళ్తాడు. రెండు మూడు రోజులు ఆ సందు చివరి వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. మూడో నాడు ఎలా అయినా సరే రేఖను చూడాలని దృడ నిశ్చయము తో అనుకున్నాడు. ఆమె నిలదీస్తే యెలా జవాబు చెప్పాలో, మనసులోనే జవాబు వల్లే వేశాడు.
    "సినిమా వెళుతున్నాను. యెదురుచూస్తూ కూర్చోవద్దు. త్వరగా నిదురపో." అరుణకు చెప్పాడు.
    "నేను వస్తానండి " యెన్నడూ లేనిది అబద్దము ఆడినాడు ఆమెతో.
    "మరోసారి వద్దువు గాని . చాలామంది స్నేహితులు వస్తున్నారు. మరో మాట కెదురు చూడకనే కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు.
    అతను కారు పార్క్ చేసి నడక మొదలు పెట్టాడు. ఇద్దరు ముగ్గురు స్త్రీలు ప్రశ్నిస్తున్నా వారి వంక చూడలేదు. "త్వరగా రేఖ కనిపించిన ఇంటి ముందుకు చేరాడు. అప్పుడే వరహాలు బయటికి వస్తున్నాడు.
    "యెవరూ , బాబుగారా." అతని కళ్ళు ఆనందముగా కదలాడాయి. ఆరోజు అట్లా మాయమయ్యారేమిటి." రోజూ వెతుకుతున్నాను."
    "నా కోసమా? యెందుకు?"
    "భలే ప్రశ్నే." అతను పక్కున నవ్వాడు." అ రోజు యేమి మంత్రము వేశారో, ఊర్వశి మీ చిరునామా కనుక్కుంటే వంద రూపాయలు ఇస్తానంది." అతని మాటలు వినే వోపిక లేదు. వెంటనే అతని చేతిలో పది రూపాయలు నోటు పెట్టి ఇంటిలోకి వెళ్ళాడు. ఆరోజు స్త్రీ పురుషులు కనిపించలేదు. వృద్దురాలు మాత్రమూ దిగులుగా చూస్తూ కూర్చుంది.
    "వచ్చినారా? మీరు ఏమంటూ , మా కొంపలో అడుగు పెట్టారో, బెరాలన్నీ తిరిగి కొడుతుంది బాబూ.' వృద్దురాలి మాటలకు జవాబుగా యాభై రూపాయలు ఆమె వైపు విసిరి, పరిచితమైన మేడ మెట్లు యెక్కి పైకి వెళ్ళాడు. అతని శరీరము గగుర్పాటు చెందినది తెలియని వణుకు బయలు దేరింది. అతి నెమ్మదిగా గదిలో అడుగు పెట్టాడు. తాను ఆ రోజు కూర్చున్న కుర్చీలోనే కూర్చుంది సురేఖ. ముందు చూచినప్పటి అలంకారము లేదు. పొడుగాటి జుట్టు, విరబోసి కొన్నది. తెల్లటి మిల్లు చీర కళ్ళ మీద చేతులు వేసుకుని , వెనక్కు వాలింది. నిదురబోయినదో మేల్కొన్నదో చెప్పటము కష్టము. పిలువాలనుకుంటే అతని గొంతు పెకిలి రాలేదు. ఆమె పాదాలు పట్టుకుని క్షమార్పణ చెప్పు కుందామనిపించింది. అది చేయలేక పోయాడు. ధైర్యము కూడదీసుకున్నాడు.
    "రేఖా...రేఖా...." ఆమె అతని ధ్యాసలో ఉన్నదేమో వెంటనే మేల్కొంది.
    "యెవరూ " లేచింది. జీవము లేని ఆమె ముఖములో అతన్ని చూడగానే జీవకళ ఉట్టి పడింది. "వచ్చారా, వస్తారని తెలుసు. మీరు పిరికి వారె గాని కఠినాత్ములు కారని తెలుసు. యెప్పుడో ఒకప్పుడు వస్తారని తెలుసు. ఇంత తొందరలో వస్తారని మాత్రమూ కాదు. రండి" ఆమె ఆహ్వానము అతనిని కదిలించి వేసింది. నన్ను అన్యాయము చేసిన నీచుడవు అని తిట్టదెం?' నిందించదెం?  
    "రండి మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టలేను."
    "ఎందుకు కూర్చో బెట్టలేవు రేఖా?' అని వచ్చాడు. ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. ఆమె దూరము జరిగింది.
    "ఆనంద్! నన్ను ముట్టుకోవద్దు. పవిత్రమైన రేఖ కాదు. కలుషితురాలు . పతిత."
    "నాకు తెలుసు రేఖా. నీ ఆత్మ పవిత్రమైనది." ఆమె దూరము వెళ్ళి రెండు చేతులలో ముఖము దాచుకుంది."
    "వద్దు వద్దు అంతంత మాటలనకండి. పవిత్రత పెరెత్తే అర్హత లేదు. అతను ధైర్యముగా వెళ్ళి ఆమెను రెండు చేతులలోకి తీసుకున్నాడు. ఆమె ముఖము తన వైపు తిప్పుకున్నాడు.
    "ఎందుకు నన్ను ఆదరంగా చూస్తూ ఇంకా లజ్జితుడిని చేస్తావు? నన్ను నిందించు. తిట్టు నాకు మనః శాంతి లభిస్తుంది. ' ఆవేశంగా అరిచాడు.
    "దాని వలన లాభము యేమిటి ఆనంద్? జరుగవలసింది జరిగిపోయింది. మిమ్మల్ని దూషించితే నా జీవితమూ చక్క బడుతుందా?" అతని చేతులలో నుండి తప్పించు కోవాలని చూచింది. అతడు వదలలేదు. అమెనలాగే పట్టుకుని వచ్చి తన ప్రక్కన సోఫాలో కూర్చో బెట్టుకున్నాడు.
    "రేఖా! యెందుకీ నరకం లోకి దిగావు?' అడగలేక అడగలేక అడిగాడు.
    "విధి లేక .' పేలవంగా నవ్వింది. "ఒక విషయము తెలుసుకున్నాను ఆనంద్. ప్రేమ పేరు తోనో, పేదరికం చాటుననో ఒక్కసారి కాలు జారిన స్త్రీకి ఈ ప్రపంచం లో చోటు లేదు. నిజంగా స్త్రీ లు పెద్దలు ఇన్ని ఆంక్షలు ఎందుకు పెడతారో అర్ధమయింది." నిట్టూర్చింది.
    "రేఖా! పూర్తిగా నా పొరపాటెం లేదు. నేను ఉత్తరాలు వ్రాసినా జవాబు ఇవ్వలేదు. నేను వస్తే ఇల్లు తాళము పెట్టి వుంది."
    "అదే చెప్తున్నాను ఆనంద్. విధికి ఉన్న శక్తి దేనికి లేదు. ఈ పట్టణము లో నికృష్టంగా బ్రతుకుతున్నది నీ కోసము. నిన్ను కలుసుకుని నా బాధ్యత తీర్చుకొని నిశ్చింతగా చచ్చిపోదామని. ఆరోజు నేను యెంత పిలిచినా ఆగకుండా వెళ్ళిపోయారు."
    "నీమీది కోపము చేత కాదు రేఖా నాకు సిగ్గువేసింది. నీకు ముఖము చూపలేక పోయాను."
    "అంత పెద్ద తప్పేం చేశారు. పొరపాటు నాది, వివాహమనే బంధముండగా కాదని కాళ్ళదన్ని గర్వంగా తిరిగాను. ఫలితము అనుభవించాను. పొరపాటు స్త్రీ పురుషులు ఇరువురూ చేస్తారు. కాని ప్రకృతి స్త్రీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తుంది. ఆమె పొరపాటుకు ముద్ర ముఖానే పడుతుంది."
    "లోతుగా మాట్లాడుతున్నావు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS