Previous Page Next Page 
వంశాంకురం పేజి 26

 

    "మనము చేసిన పనులను సమర్ధించుకోవడానికి అలాగే మాట్లాడాలి?"
    "గతము పోనివ్వు రేఖా. నువ్వు అనుకుంటావు నువ్వే బాధపడ్డావని. నేను మాత్రం సుఖంగా ఉన్నానా? ఈ అయిదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా నిశ్చింతగా ఉండలేదు ప్రతిరోజూ నిదురబోవటానికి గంటల తరబడి పోరాడాను."
    "చెప్పానుగా పిరికివారికి అతి తెలివి గల వారికి సుఖ శాంతులుండవు. పోనివ్వండి. మీ అంతట మీరే వచ్చారు. ఈ అవకాశము జార విడుచుకోరాదు. నేను పతితను. నేను అబద్దాలు మాత్రమూ చెప్పనని విశ్వసిస్తారా ఆనంద్?"
    "ఎందుకు రేఖా. నన్ను అనుమానిస్తావు పిరికితనము తో పొరపాటు చేశాను. మొదట ఈ విషయము చెప్పు. నా ఉత్తరాలకు జవాబు యేందుకివ్వ లేదు."
    "అదంతా పెద్ద కధ. నా కోర్కె నెరవేరి నా బాధ్యత తీరితే అన్ని విషయాలు చెప్తాను."
    "చెప్పు రేఖా. కనీసము నీకు సహాయము చేశానన్న తృప్తి మిగుల నివ్వు."
    "పెద్ద కోర్కె ఏం కాదు. యౌవనము తో కళ్ళు మూసుకుని ప్రవర్తించినందుకు ఫలితముగా. మీ ప్రతి రూపము ఈ ప్రపంచములోకి వచ్చింది."
    "రేఖా ? ఏమన్నావ్?"
    "అందుకే మొదట నన్ను నమ్ముతారా అని అడిగాను. సరే వాడిని చూచినాక నమ్ముదురు గాని లెండి. అచ్చు మీ పోలికే.
    "నిజాము. నిజమా రేఖా?"
    "నిజమే వాడు పుట్టకమునుపే నాశనము చేయించుకోమని ఎందరో సలహా యిచ్చారు. కాని మాత్రుత్వపు మమకారము అలా చేయ్యనియ్యలేదు. కాని ఇప్పుడ విచారిస్తున్నాను ఆనంద్."
    "రేఖా...." ఆనంద్ ఆమెను వాటేసుకున్నాడు.
    "ఆవేశము వద్దు ఆనంద్. భగవంతుడి సాక్షిగా వాడు మీ కుమారుడే వాడిని కన్నాను. నాకే చిరునామా లేదు. వాడిని పెంచి పెద్ద చేసి సంఘము లో అనామకుడు గా వదలలేను. ఆనంద్ నా ఒక్క కోర్కె మన్నించు నీ బిడ్డలతో పాటు భాగము కావాలని అడుగను. కాని ఈ ప్రపంచములో పొట్ట పోషించుకునే అర్హత కలుగజేయి. మరణించిన స్నేహితురాలి బిడ్డడని చెప్పు."
    "రేఖా....రేఖా....నా మాట విను."
    "నా కోర్కె అసమంజసమంటారా?" అతనామే నోరు మూశాడు. ఆమె నెత్తి గిరగిర తిప్పి దించాడు.
    "ఏడీ, వాడెక్కడ?' ఈసారి అతని వంక దీక్షగా చూచింది. అతని కండ్లలోని ఆనందము వర్ణించతరము కానిది. అక్రమ సంతానముందని తెలుసుకుని సంతోషించే తండ్రి ఉంటాడా?"
    "మాట్లాడు రేఖా. వాడెక్కడ?' ఆమె భుజాలు పట్టి కుదిపాడు.
    "వాడు హైదరాబాద్ లో ఓ చిన్న పిల్లల బోర్డింగ్ స్కూల్లో ఉన్నాడు. వాడి బుర్ర అతి చురుకు. ఎన్నో ప్రశ్నలు. ఎన్నో సందేహాలు . దూరంగా ఉంచాలని మనసు రాయి చేసుకున్నాను. వాడికి నెల, నేలా డబ్బు పంపడము గగనమవుతుంది."
    "రా రేఖా. వాడిని తెచ్చుకుందాము రా." ఆమె చెయ్యి పట్టి లాగాడు.
    "ఇంత రాత్రా! రేపు వెళ్దాము."
    "కాదు ఒక్క క్షణము ఆగలేను. వాడు నా కొడుకంటే ఎంతో గర్వంగా ఉంది. వాడు మా కులదీపకుడు రేఖా. కులదీపకుడు."
    "మీకు మతి గాని పోయిందా?"
    "ఆలస్యమయితే మతి పోతుంది." అతను ఆమె చెయ్యి పట్టి ఈడ్చుకు పోయాడు.
    "ఆ ముసలిది వీధిలో వారందరినీ లేపుతుంది. సినిమాకు తీసుకేల్తానని చెప్పండి." ఇరువురూ క్రిందికి దిగారు.
    "సినిమాకి వెళ్ళాలి." ముక్తసరిగా అన్నాడు . "రాత్రికి రాకపోవచ్చు."
    "బయటికి వెళ్ళితే వేరే చార్జీలుంటాయి." అప్పుడతనికి ప్రపంచమంతా పచ్చగానే కనిపించింది. చేతికి వచ్చినన్ని నోటు ఆమె వైపు విసిరినాడు. ప్రసన్నంగా అందుకుంది.
    "మీ ఇంట్లో వారు రాత్రికి ఇంటికి వెళ్ళకుంటే ఏమనుకుంటారు?"
    "ఓహ్!' విసుగ్గా చూచాడు. ఆమెను తీసుకుని వెళ్ళి హాలులో ముందాగి, ప్లీడరు వేంకటరత్నము గారికి ఫోను చేశాడు.
    "రాత్రికి రానని చెప్పి పంపింది. అత్యవసరంగా వెడుతున్నాను..... ఆ వచ్చి వివరాలు చెబుతాను. థాంక్స్." ఫోను పెట్టాడు. అంతవరకు తన ఆలోచనలతో సతమతమవుతున్న రేఖ ఓ నిర్ణయానికి వచ్చింది.
    "ఆనంద్ , మీకు మొగబిడ్డలు కలుగలేదా?"
    "ఏ బిడ్డలు లేరు రేఖా! భవిష్యత్తు లో కల్గుతారన్న ఆశ కూడా లేదు.' తన సంసారము విషయాలు క్లుప్తముగా చెప్పాడు. "నిన్ను అన్యాయము చేసినందుకు ఫలితమనుభవించాను రేఖా."
    "అలా అనకు ఆనంద్. నేనెవరికి అన్యాయము చేశాను?' ఆమెకు ఉన్న స్వల్పమైన ముఖత కూడా తొలగి పోయింది. ఆనంద్ పట్ల. తన కుమారునికి ఆశ్రయము లభిస్తే చాలుననుకుంటే, అధికార పూర్వకమైన హక్కు కూడా లభిస్తుంది. ఆనంద్ కళ్ళలో కొడుకును చూడాలనే కాంక్షకు, ఆమె మురిసిపోయింది. కారు నెమ్మదిగా సాగిపోతుంది.
    "ఇప్పుడు చెప్పు రేఖా నా ఉత్తరాలకు జవాబు యెందుకివ్వలేదు.
    "ఊ చెప్పుకుంటే కాస్త భారము తగ్గుతుంది.
    "మీరు వెళ్ళిపోయాక రెండు రోజులు చదువుతూ గడిపాను. అప్పటికే నాకు అనుమానంగా ఉంది. నేను తల్లిని కాబోతున్నానని. మూడో రోజు ఉదయము , తోచక చెట్లకు నీళ్ళు పెడుతుండగా , కళ్ళు తిరిగి పడిపోయాను. నా దురదృష్టము వల్ల అప్పుడే ఇంటి వారి బంధువుల కారు వచ్చింది. దాంట్లో తీసుకెళ్ళి , ఎగ్మూర్ ఆస్పత్రి లో చేర్పినారు. వారు ఏం చెప్పారో బహుశా గర్భవతి నని చెప్పి ఉంటారు. ఇంటి వారు నా దగ్గరకు రానే లేదు. అటునుండి ఆటే వెళ్ళిపోయారు. బలహీనంగా ఉన్నావంటూ. వారము రోజులు ఆస్పత్రి లోనే ఉంచారు. ప్రతి రోజు ఇంటి వారి రాకకై యెదురు చూచేదానను ఆఖరకు ఆస్పత్రి నుండి వెళ్ళి పొమ్మన్నారు. చేతిలో రాగి కాని లేదు. బయటికి వచ్చి టాక్సీ చేసుకున్నాను. మీరిచ్చిన డబ్బు ఇంట్లో ఉంది. ఇల్లు చేరి ఆశ్చర్య పోయాను. మనమున్న పోర్షన్ లో క్రొత్త వారున్నారు. ఇంటి అయన నన్ను చూస్తూనే ముఖము చిట్లించినారు. నా సామానులన్నీ వరండా లో ఉన్నాయని చూపారు. వెళ్ళి పెట్టె తీశాను. రూపాయలు లేవు."
    "ఏమండీ నా పెట్టె లో పాతిక రూపాయలుండాలి . లేవు."
    "యేవడిని అడుగుతున్నావు. పరుమాలిన వారిని పంచన చేర్చుకుంటే, దొంగ తనము అంటగట్ట కేం చేస్తారు?"
    "నేనేం పరువు మాలిన పని చేశానండి?' నన్ను నేను మరిచిపోయి అడిగేశాను.
    "అయ్యో -- ఆ మాట చెప్పాలా తల్లీ? మరో రెండు నెలలు పోనీ ప్రపంచమంతా ముఖాన అవమానపరుస్తే తెలుస్తుంది'
    "నాకు కిరాయి ఇప్పించమ్మా" టాక్సీ అతని అరుపులు. నా అసహయస్థితికి యెక్కడలేని దుఃఖము వచ్చింది.
    "నా స్వంత విషయాలలో మీ ప్రమేయము అనవసరము. వారు నెలాఖరు వరకు కిరాయి ఇచ్చారు." నోరు పెద్దగా చేసి అరిచాను. తన కిరాయి యేగరిపోతుందనుకున్నాడెమో. టాక్సీ డ్రైవరు నా పక్షము వహించాడు.
    "ఆ అమ్మాయి చెడ్డదో, మంచిదో . మీకు అనవసరము. కిరాయి ఇచ్చినాక, ఆమె సామానులు చెప్పా పెట్టకుండా, బయట పెట్టటము అన్యాయము. ఆ అమ్మాయి కోర్టు కెళ్ళుతుంది. ఆమె సామాను పోయాయని రిపోర్టు ఇచ్చి, కేసు పెడుతుంది."
    "బజారు స్త్రీలకూ వత్తాసు బాగానే వస్తారు." "ఇంటాయన  తగ్గిపోయి మిగిలిన రోజుల కిరాయి తెచ్చి పారేశాడు. " టాక్సీ వాడికి డబ్బులిచ్చి పంపాను."
    "వెంటనే నాకు ఉత్తర మెందుకు వ్రాయలేదు?"
    "పూర్తిగా వినండి. ఇంటి వారితో తగువు పడి పెద్ద పొరపాటు చేశాను. వారికి జాలి కలిగేలా ఏడ్చి, కొన్నాళ్ళు వారి ఆశ్రయము లో ఉంటె నా జీవితమూ మరో మలుపు తిరిగేది. ఉన్న డబ్బు కాక, టేబుల్ , కావాలంటే పుస్తకాలమ్మి బండెక్కుతానని ధైర్యంగా, సామానులు బండిలో వేసుకొని అంబుజము ఇల్లు చేరాను. తమకు తోడు ఎవరు లేరనేమో , మరోమాట లేక ఆశ్రయమిచ్చింది. అమెకున్నది ఒకటే గది. సామానులన్నీ వరండా లో సర్ధించి , బట్టల పెట్టె మాత్రమూ ఇంట్లో పెట్టింది. ఆరాత్రి కలలో ఊహించనిపని,  వరండాలోకి దొంగలు వచ్చి టేబుల్ ఎత్తుకుని పోయారు. దాని పై నున్న పుస్తకాలు. దానిలో ఉన్న మీ అడ్రసు కాగితము అన్నీ పోయాయి."
    "కష్టాలు వంటరిగా రావని ఊర్కేనే అంటారా?"
    "అంతే అయింది. రెండురోజులు జ్ఞాపకము చేసుకుని ఉత్తరము వ్రాశాను. అది సరియైన అడ్రసు కాదని తెలుసు. మీ ఉత్తరాని కై ఇంటి వారి దగ్గరకు వెళ్ళితే నానా మాటలన్నారు. ఏం చేయాలో తోచలేదు. మీరు మద్రాసు వస్తే వెతుక్కుంటూవస్తారనే ఆశతో నిరీక్షించసాగెను. అలా రెండు నెలలు గడిచాయి. నా పాపమూ ప్రత్యక్షంగా కనిపించ సాగింది. అంబుజ మింటికి వచ్చే ప్రతి మొగవాడు నా వంక ఓరగా చూడటము మొదలు పెట్టాడు. ఆ చూపులు భరించ లేకపోయేదాన్ని. ఒకరోజు మార్కెట్టు లో మీకు జూనియర్ గా ఉండే అబ్బాయి కనిపించాడు. మీ విషయము అడిగాను."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS