
29
తెల్లవారేసరికి తెలియవలసిన ముఖ్యులకు తెలిసిపోయింది, రాత్రి జరిగిన సంగతి. శ్రీనివాస్ పరారి విన్న వెంటనే శ్రీలక్ష్మికికూడా తెలియకుండా కృష్ణ మూర్తిగారికి ఫోను చేశారు రాజశేఖరంగారు. నిస్పృహతో, నిద్రలేమితో అలిసి పోయిన ఆయన తను విన్నదానికంటే ఎక్కువగా ఏమీ తెల్పలేకపోయారు. వెంటనే అనూరాధదగ్గిరికి వెళ్ళాలని ఆరాటపడింది శేఖరంగారి హృదయం. కాని అనూరాధకు ఇందులో ఎంతవరకు తెలుసో, తాము ఎలా చెప్పాలో తెలియక ఎటూ పాలుపోక కర్తవ్యమూఢులయ్యారు. కృష్ణమోహన్ తో సంప్రదించాలని నిశ్చయించుకున్నారు. వెంటనే అతనిని కలుసుకుని ఆ సంగతి చెప్పారు.
"నే నారోజే చెప్పాను రాధ చేస్తున్నది సరైన పని కాదని..." అన్నాడు బాధగా.
"సరే, జరిగినదానికి ఇప్పుడు విచారించి ఏం ప్రయోజనం? ఇప్పుడు జరగవలసినది ఆలోచించాలిగాని..." అన్నారు విసుగ్గా.
"నా ఉద్దేశ్యం అడిగితే, వెంటనే రాధను ఇక్కడికి తీసుకువచ్చెయ్యడం మంచిదంటాను. ఈ ఆందోళనతో దాని ఆరోగ్యంకూడా చెడుతుందేమో! శ్రీనివాస్ సంగతి అంటారా, మనం కొద్దిగా దూరంగా ఉండటం మంచిదేమో! అసలే విసిగిపోయాడు. పలకరిస్తే ఇంకా రెచ్చిపోతాడు. కొద్ది రోజులు అతన్ని ఒంటరిగా వదిలివెయ్యడం మంచిది. అతనంతట అతనే సర్దుకుంటాడు. ఇదివరకు జరిగినవి విన్నాం కదా!"
"నేనూ అదే అనుకుంటున్నాను. రాధకీ విషయాలు ఎంత తెలుసో, ఎలా తెలియడంలేదు. నువ్వెళ్ళి తీసుకువస్తావా?"
"లేదు, నాన్నా నువ్వూ నేనూ ఒంటరిగా వెళితే ప్రయోజనంలేదు. అది తేలికగా ఇక్కడికి రావడానికి ఇష్టపడుతుందో లేదో! అమ్మా, నువ్వూ ఇంతకీ శ్రీనివాస్ ఎక్కడున్నాడో తెలిసిందా? ..."
"ఇంకా లేదు."
"ప్చ్, ఏమిటో ..... కొనితెచ్చుకునే అనర్ధాలివి" అన్నాడు విచారంగా.
"సరే! ఏది ఎలా జరగాలో తప్పుతుందా!"
"నాకెందుకో ఇలాంటిది జరుగుతుందేమోనన్న భయం ఎప్పుడూ ఉంది. తను అదొక రకమయిన మృదుహృదయుడు. ప్రతివాళ్ళు, ప్రతిదానిని తేలికగా స్వీకరించలేరు. అతను చదివినంతమాత్రాన డాక్టరు కావాలని ఏముంది? రాధ అంటే ఏదో చిన్నపిల్ల, అనుభవం లేనిది. కృష్ణమూర్తిగారు ఈ పని ఎలా చేశారో నా కర్ధం కావడంలేదు! చివరికి ఇదంతా రాధకు బాధ. తక్కినవారు బాగానే ఉంటారు."
"చేసేటప్పుడు అందరూ మంచే జరగాలని చేస్తారు. ఒక్కొక్కసారి ఇలా ఎదురుతిరుగుతాయి. ప్రతివారు తాము చేసే పనులకు ఏదో కారణం ఉందని భ్రమిస్తారు. అది ఎదురుతిరిగితే మిగిలేది అంతా వ్యధే!"
"మంచి జరుగుతుందని ఎలా ఆయన అనుకున్నారు, నాన్నా? ఆయన ఆరితేరిన డాక్టరు. ఇందులో సాధకబాధకాలన్ని అవగాహన చేసుకున్నా రాయన. ఆయనే ఇలాటి పనులను ప్రోత్సహిస్తే, ఇక రాధ ననుకోవడం ఎందుకు? ఆయన ప్రోద్బలమే లేకపోతే ఈ రోజు ఈ ఆందోళన ఉండేదికాదు. శ్రీనివాస్ కి కనక ఇలా జరిగింది. అదే నేనయితే అందరిని ఆమడదూరంలో ఉంచి, నాకు నచ్చిన ఏ బిజినెస్సోపెట్టుకునేవాణ్ణి."
మాట్లాడకుండా నిట్టూర్పు విడవడంతప్ప మరొకటి చెయ్యలేక పోయారు శేఖరంగారు. తను కృష్ణమూర్తిని నిందించగలడా! ఆయన స్థానంలో ఉంటే ఎవరైనా అదే పని చేసిఉండేవారేమో?
అదే యువకవయస్సులో ఉన్న కృష్ణమోహన్ కు, మధ్యవయస్కుడయిన రాజశేఖరంగారికి వయస్సు తెచ్చిన తేడా! కృష్ణమోహన్ లో జరిగిన విషయాలు చూచి ఆవేశపడడంతప్ప ఎందుకు జరగవలసివచ్చిందన్న విచక్షణ, ఓర్పు లేవు.
శ్రీలక్ష్మిని తీసుకుని శ్రీనివాస్ ఇంటికి వెళ్ళారు రాజశేఖరంగారు. తలుపు తెరిచిన అనూరాధను చూడగానే తమకు తెలిసిన విషయం రాధకు తెలుసో-లేదో చెప్పక్కరాలేకుండానే అవగాహన అయింది. వాచి ఎర్రపడ్డ కళ్ళు, వడిలిన ముఖం- పీక్కుపోయి బాగా అలిసిఉంది. హృదయావేదన భరించలేక కాబోలు అప్పుడే షవరు తీసుకున్న జుట్టు కొసనుండి ఇంకా నీళ్ళు కారుతున్నాయి.
కొంతసేపు మౌనం రాజ్యం చేసింది. ఎవరికి ఏ విధంగా మొదలుపెట్టాలో తెలియలేదు. కుర్చీలో మౌనంగా వెనక్కి ఆనుకుని శూన్యంగా చూస్తున్న రాధను చూచి గాఢమయిన నిట్టూర్పు విడిచారు శేఖరంగారు.
"పద, అమ్మాయి. మన ఇంటికి వెడదాం! ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తావు?" అంది శ్రీలక్ష్మి చివరికి.
"లేదమ్మా, నేనిప్పుడెక్కడికీ రాను. ఆయనంటూ ఎప్పుడైనా వస్తే నేనిక్కడే ఉండాలమ్మా!" "ఛ అవేం మాటలు, రాధా. ఎందుకు తిరిగిరాడు? తప్పకుండా తిరిగి వస్తాడు. అయినా నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తావు చెప్పు? ఒంటరిగా ఇక్కడున్న నిన్ను చూడకుండా ఉంటే మాకేం తోస్తుంది. పద, వెడదాం. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వచ్చేద్ధువుగాని."
"కాదమ్మా నేను రాలేను. నన్ను బలవంతంపెట్టకు."
"అలాకాదు. అనూ, నువ్విలా పట్టుపడితే నేనూ ఇక్కడే ఉండిపోవలసి ఉంటుంది. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడంమాత్రం జరగని పని. నా మాట విను. పద."
ఇక వెళ్ళక తప్పలేదు అనూరాధకు. ఒంటరిగా ఇల్లు వదిలి వచ్చేస్తూంటే కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి. ఒకసారి ఇంటివైపు చూచి ముఖం తిప్పుకుంది.
ఇంటికి వెడుతూ కారులో అడిగింది, "లలిత ఎక్కడుందమ్మా" అని, ఉన్నట్లుండి అప్పుడే గుర్తుకు వచ్చినట్లు.
"హాస్పిటల్ కు వెళ్ళిందిట, వాళ్ళ అమ్మను చూడటానికి."
"వాళ్ళ అమ్మను చూడటానికా?" అడిగింది ఆశ్చర్యంగా.
"అవును, రాధా. ఆ క్షణంలో దేవుడులా కృష్ణమూర్తిగారు వెళ్ళి చేయవలసిన చికిత్స చేసి ఉండకపోతే, రాత్రికి రాత్రికే ప్రాణం పోయి ఉండేదిట! ఆవిడ స్పృహతప్పిన పావుగంటదాకా ఏ డాక్టరు మీద చెయ్యివేసి చూడలేదుట."
అనూరాధ కళ్ళల్లో ఆశ్చర్యంతోపాటు ఆశావీచికకూడా మెరిసింది. లలిత తల్లి మరణించలేదా? స్పృహతప్పిన ఆమెనుచూచి మరణించిందనుకున్నారా? థాంక్ గాడ్! ఈ ఒక్క వార్త చాలు ఆయన కోలుకునేందుకు! "భగవాన్, తిరిగి మేము కలుసుకునేటట్లు ఆశీర్వదించు." మనసులోనే ప్రార్దించింది. ఆయనకుతెలుసో లేదో ఈ విషయం! ఆయన విన్నారో లేదో, ఎక్కడ ఉన్నారో అన్న ఆలోచన రాగానే తిరిగి భయాందోళనలతో ఒళ్ళు జలదరించింది.
ఇల్లు చేరి తన స్వంత గదిలోకి అడుగు పెట్టగానే రకరకాల భావాలు చుట్టు ముట్టాయి. తలుపు మూసుకుని ఒక్కసారి తన పరుపుమీద వాలిపోయింది. రాత్రి శ్రీనివాస్ అన్న మాటలు ఒకటొకటే చెవుల్లో మోగాయి.
'మిమ్మల్ని ఎలా నమ్మించగలను, మీరుతప్ప నాకేం అక్కరలేదని? నేనంటే ఎంతో ఇష్టమయిన మీరేనా అన్నది ఆ మాటలు? మరొక్కసారి కలుసుకో గలిగితే? ఎక్కడున్నారని వెతికించను? చనిపోయిందని మీరు అనుకున్న ఆమె మరణించలేదు. నన్ను క్షమించండి. మీ ఉన్నతితప్ప మరొకటి ఆశించలేదని మీ కెలా తెలియబరచను? నన్ను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించండి, శ్రీనివాస్! మన బంధాన్ని తెంపాలని ప్రయత్నించకండి.' వలవలా ఏడుస్తూ వాలిపోయిన అనూరాధకు ఎప్పుడు నిద్రపట్టిందోకూడా తెలియలేదు!
30
సాయంత్రం నాలుగవుతూంది. పనులు పూర్తిచేసుకుని కృష్ణమోహన్ స్పెషల్ వార్డువైపు వెళ్ళాడు. మెల్లిగా ఎనిమిదవ నెంబరు గది తలుపు తెరిచి చూసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళాడు. తలుపుదగ్గిర చప్పుడయ్యేసరికి లేచి నుంచుంది లలిత. కళ్ళు కన్నీరు కార్చి, కార్చి ఎర్రపడిపోయాయి. ముఖం వడిలి, బాగా అలసట చూపుతూంది. ఆమెను కళ్ళతో పలకరించి, మంచంవైపు వెళ్ళి తగిలించిఉన్న ఛార్టు చూచి అక్కడే పెట్టేశాడు. లలితవైపు తిరిగి "ఇంటికి వెడుదురుగాని....పదండి" అన్నాడు.
"వద్దండీ. ఇప్పుడు వెళ్ళను. రాత్రికి ఎలాగూ ఉండటానికి వీలులేదు. ఇంకా కొంచెంసేపు ఉండి వెడతాను."
"ఎంతసేపుఉన్నా మీరు చెయ్యగలిగేదేముంది? పొద్దుననగా వచ్చారు! నా మాట వినండి."
"ఇంకా కొంచెం సేపయినాక వెడతాను. మళ్ళీ రేపు పొద్దుటివరకు రావడానికి వీలుకాదు."
"ఆవిడికి ఎలాగూ తెలివి రాదు. ఆమెకు పూర్తిగా విశ్రాంతికోసం ఇంజక్షన్ ఇచ్చారు. పదండి నా మాట విని..." అంటూ చనువుగా బుజం మీద చెయ్యి వేస్తూ తలుపువైపు దారి తీశాడు. తలుపుదాకా వచ్చి, ఇంకొకసారి వెనక్కి తిరిగి చూచి సుదీర్ఘమయిన నిట్టూర్పు విడుస్తూ మోహన్ పక్క నడిచింది.
"మధ్యాహ్నం భోజనం చేశారా?" అడిగాడు కారు స్టార్టు చేస్తూ. తల ఊగించింది.
"అబద్ధం ఎందుకు ఆడతారు చెప్పండి! మీ మొహం చూస్తేనే తెలుస్తూంది తిన్నది, లేనిది. ఇలాంటి సమయాలలో ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి! కాని, భోజనంకూడా మానేస్తే మీరుకూడా నీరసపడటం తప్ప మరేమీ జరగదు" అంటూ హోటల్ ముందు ఆగి దిగమన్నాడు.
"నా కిప్పు డేమీవద్దు. దయచేసి నన్ను మా ఇంట్లో దింపండి!" అంది ప్రాధేయపడుతూ.
కళ్ళనిండా నీళ్ళు నిండుకున్న ఆమె ముఖంవంక చూసి మాట్లాడకుండా హోటల్ లోపలికి వెళ్ళి పాకెట్సుతో తిరిగివచ్చాడు.
"అధైర్యపడకూడడు, లలితా! మీ అమ్మగారికి కొద్దిరోజులలో నయమయిపోతుంది."
"నిజంగా చెబుతున్నారా, మోహన్, ఒక డాక్టరుగా! లేక ఊరికే నన్ను ఊరడించడానికేనా?" కళ్ళల్లో ఆశాభావం అల్లలాడింది.
