Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 24


    ప్రొద్దున్ననించి భోజనం లేదు. పైగా, పరీక్ష రాసిన అలసట. పద్మ వంటింట్లోకి వెళ్ళింది. కాని ప్రొద్దున్న వంట చేసిన జాడ లేదు అక్కడ కాంతమ్మ భోజనం లేకుండానే కొడుకుకి ఉపచారాలు చేస్తూ కూర్చుంది.
    పద్మ వంట చేసి, భయపడుతూ అత్తగారి దగ్గిరికి వెళ్ళి, "భోజనం చేస్తారా? వంట చేశాను" అంది మెల్లగా.
    "నా కొడుక్కి జ్వరం వచ్చి పస్తుపడుకుంటే నన్ను భోజనం చెయ్యమంటావా? ఏమైనా బుద్ది ఉందా నీకు? అవును, తల్లి ప్రేమ నీకేం తెలుస్తుంది? వాడలా పడుకుని ఉంటే నువ్వు షోగ్గా కాలేజీకి వెళ్ళిరాగలవు. సుష్ఠుగా భోజనం చెయ్యగలవు. నువ్వెళ్ళి మెక్కు. నాకు వద్దు" అంది కాంతమ్మ కోపంగా.
    పద్మ వంటింట్లో లైట్లు ఆర్పి, తలుపు వేసి, వచ్చి తన గదిలో పక్కమీద వాలిపోయింది. కళ్ళలో నీళ్ళు వస్తూంటే 'ఏమిటి ఇంకా నేను శిలగా మారిపోలేదా?' అనుకుంది.
    రెండోరోజు మాధవరావు జ్వరం తగ్గింది. కాని ఆరోజు పథ్యం పెట్టవద్దన్నాడు డాక్టరు. మాధవరావుతోపాటు తల్లికీ, భార్యకీ వస్తే ఆ రోజు.
    'భోజనం, నిద్రాలేకుండా ఎలా ఉండగలదు ఈవిడ?' అని ఆశ్చర్యపోయింది పద్మ. కొడుకు పస్తుంటే లోకంలో ఇంక ఎవరూ భోజనం చెయ్యకూడదు. ఏమి టీ వెర్రి ప్రేమ?
    కాంతమ్మ కొడుక్కి రాత్రింబవళ్ళు ఉపచారాలు చేస్తూనే ఉంది. కోడల్నిమాత్రం మంచందగ్గిరికి కూడా రానివ్వలేదు.
    పద్మ మనస్సు మొద్దుబారిపోయింది. 'వాళ్ళు తల్లీ కొడుకూను! నే నెవరిని? నేను వీళ్ళకేమీకాను' అనుకుంది. పరీక్ష పాసైతేనేం? లేకపోతేనేం? ఏదో వేదాంతం, నిరాశ ఆవరించాయి. నిన్న అత్తగారి మాట లతో తల బొప్పికట్టింది. మళ్ళీ ఈ రోజు పరీక్షకి వెళితే ఏం మాటలు పడవలసివస్తుందో?-ఆ రోజు పరీక్షకి వెళ్ళలేదు పద్మ.
    మూడోరోజు మాధవరావుకి పథ్యం పెట్టారు. ఆ రోజు భోజనం చెయ్యడానికి అత్తగారు అనుమతి ఇచ్చినా, అన్నం తినలేక పోయింది పద్మ. సాయంత్రానికి విపరీతమైన తలనొప్పి, జ్వరం వచ్చాయి. 'ఎవరితో చెప్పుకోను?' అనుకుంటూ మౌనంగా పడుకుంది పద్మ.
    మరునాటికి మాధవరావు ఆరోగ్యంగా లేచి తిరగటం ప్రారంభించాడు. పద్మ మాత్రం ఒళ్ళునొప్పులు, తలనొప్పి, జ్వరంతో పక్కమీద నించి దిగలేకపోయింది.
    ఎనిమిది గంటలకి అటువైపు వచ్చిన కాంతమ్మ కోడలు ఇంకా పడుకుని ఉండటం చూసి, "ఏం మహారాణిగారికి ఇంకా తెల్లవారలేదా?" అంది వ్యంగ్యంగా.
    "జ్వరం వచ్చింది, తల పగిలిపోతూంది" అంది పద్మ మెల్లిగా.
    "ఎవరికేనా ఉరుసు పెడితే ఊరికే పోతుందా? అనుభవించాలి" అంటూ అత్తగారు వెళ్ళిపోయింది.
    గంట తరవాత డాక్టరు వచ్చాడు. పద్మని చూసి, "ఈవిదకీ ఫ్లూయే వచ్చింది. భయం లేదు. ఇంట్లో ఒకరికి వస్తే తక్కినవాళ్ళకి కూడా రావడం మామూలే. అబ్బాయికిఇచ్చిన మాత్రలే యిస్తాను" అన్నారు.
    డాక్టరు అటు వెళ్ళగానే, "విన్నావుగా ఆయన మాటలు. రోజుకి మూడుసార్లు వేసుకోవాలిట ఈ మాత్రలు ఈ బల్లమీద పెడుతున్నాను, వేసుకో" అని బయటికి వెళ్ళిపోయింది కాంతమ్మ.
    'కొడుక్కి జ్వరం వస్తే అన్ని ఉపచారాలు చేసి నావిడ, కోడలికి వస్తే అలా ఎలా విదిలించివేయగలదు? ఒకరిమీద అంత దయ కురిపించి, రెండో మనిషి ఎడల అంత నిర్దయగా ఎలా ప్రవర్తిస్తారు?' అనుకుంది పద్మ.
    జ్వరతీవ్రత, తలనొప్పి ప్రతి మనిషికి కష్టాలలో, అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లి, తండ్రి జ్ఞాపకం రావడం సహజం. పద్మ తల్లిని, తండ్రిని జ్ఞాపకం చేసుకుని ఏడ్చింది. 'పువ్వులలో పెట్టి, ప్రేమంతా కుమ్మరించి, ఎంతో గారాబంగా పెంచి ఈ రాక్షసుల మధ్య ఎందుకు పారేశారమ్మా నన్ను? పెళ్ళి పేరు చెప్పి మీ చల్లటి నీడనించి ఈ అగ్నిగుండంలోకి ఎందుకు తోసేశారంమా? దిక్కులేని దానిలా జ్వరంతో అల్లాడి పోతున్నానని తెలిస్తే ఎంత బాధపడతారో?' అనుకుంటూ దుఃఖించింది.
    పద్మ జ్వరం నాలుగు రోజులదాకా తగ్గలేదు. రోజూ డాక్టరు వచ్చి చూసేవాడు. అత్తగారు కాఫీ కాచి పోసేది. మాధవరావు డాక్టరు తోపాటు రోజూ భార్య గదిలోకి వచ్చి, డాక్టరుతో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఒక్కరోజూ భార్యని మాటవరసకేనా "ఎలా ఉంది, పద్మా, ఒంట్లో?" అని అడగలేదు.
    పద్మ జ్వరంలోనే ఒక నిశ్చయానికి వచ్చింది-'ఈ తల్లీ కొడుకులకి నేను అవసరం లేదు, ఎవరికీ అవసరం లేనిచోట నేను ఉండటంలో అర్ధం లేదు' అని.
    పథ్యం తీసుకున్న మూడవ రోజు పెట్టె, పరుపు సర్దుకుంది. ఆఖరి ప్రయత్నంగా భర్త ఆఫీసుకు వెళ్ళి పోతూ ఉంటే చెప్పింది, "నేను కాకినాడ వెళ్ళిపోతున్నాను" అని. మాధవరావు ఒక్క నిమిషం ఆగాడు. "నీ ఇష్టం" అని ముందుకు వెళ్ళిపోయాడు.
    "వద్దు", "ఇప్పుడెందుకు?", "మళ్ళీ ఎప్పుడు వస్తావు?", "నీరసంగా ఉన్నావు, ఒక్కర్తివీ వెళ్ళగలవా?"-ఏ ఒక్క మాటా అతని నోటినించి రాలేదు.
    సాయంత్రం పనిమనిషి చేత టాక్సీ తెప్పించుకుంది. డ్రైవరు వచ్చి పెట్టె, పరుపు తీసుకువెళ్ళాడు. అత్తగారు హాల్లో నిలుచుని చూస్తూ ఉంది. ఆవిడతో 'వెళుతున్నాను' అని చెప్పనా అని ఆలోచించింది పద్మ. 'ఆవిడికి నేను అవసరం లేనప్పుడు నాకూ ఆవిడ వద్దు' అనుకుని మౌనంగా టాక్సీ ఎక్కి కూర్చుంది.
    మద్రాసు-హౌరా మెయిలు మద్రాసు నించి రాత్రి ఎనిమిది గంటలకి బయలుదేరుతుంది. అందులో ఎక్కి కూర్చుంది పద్మ.
    రైలు బయలుదేరింది. ప్రయాణీకులకు వీడ్కోలు చెపుతూ మద్రాసు పౌరులు చేతులు ఊపుతున్నారు. పద్మకి మాత్రం అక్కడ ఎవరూ లేరు. 'మద్రాసుతో నీ ఋణం తీరిపోయింది' అంది పద్మ మనస్సు. అస్థిపంజరంలా నీరసంగా ఉన్న పద్మ శరీరమంతా వణికింది ఒక్కసారి. 'నేను చేసేది మంచి పనేనా?' అనుకుంది.
    రైలు జనంతో కిటకిటలాడుతూంది. అయినా ప్రయాణీకులంతా అలాగే చోటు చేసుకుని సామానుల మీద వాలి, బెంచీలకింద దుప్పట్లు పరుచుకునినిద్రలో మునిగారు. కూర్చున్న వాళ్ళు ఒకరిమీద ఒకరు వాలి తూగుతున్నారు. నిద్ర సుఖ మెరుగదు మరి! పద్మ ఒకర్తే కిటికీ దగ్గిర కూర్చుని 'నేను ఒంటరిగా మిగిలిపోయాను' అనుకుంటూ రాత్రి అంతా జాగరం చేసింది. మనస్సు ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహించింది. రైలు కృష్ణా బ్రిడ్జిమీద నించి వెళ్ళుతున్నప్పుడు, గోదావరి నది దాటుతున్నప్పుడు రైల్లోంచి గెంతి నీటిలో పడి చచ్చిపోదామనుకుంది. కాని తల్లీ, తండ్రీ 'మమ్మల్ని అన్యాయం చెయ్యకమ్మా' అంటున్నట్టు అనిపించి, జీవచ్చవంలా అలాగే కూర్చుండిపోయింది.
    మరునాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఇల్లు చేరింది పద్మ. తెల్లగా పాలిపోయి, నీరసంగా, అస్థిపంజరంలా ఇల్లు చేరిన కూతురిని చూసిన వరలక్ష్మి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఉత్తరమేనా రాయకుండా ఒంటరిగా ఆ స్థితిలో వచ్చిన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు నారాయణరావుగారు.

                                      26

 

                

    చారుమతి ఇంట్లో అంతా చాలా సంతోషంగాఉన్నారు. మే నెల మొదటి తారీఖున శంకరం దగ్గిరినించి ఉత్తరము, అయిదు వందల రూపాయలకి మనియార్డరు వచ్చాయి. ఆ రోజు శాంతమ్మ సంతోషం చెప్ప నలివికానిది. ఇంట్లో అందరికి కూడా మహానంద మయినది. శంకరం ఉత్తరంలో నాలుగు ముక్కలే రాశాడు.
    "అమ్మకు.
        నమస్కారములు.    
    నేను క్షేమంగా ఉన్నాను. ప్రస్తుతం నేను మధ్య ప్రదేశ్ లో 'బిజోరి' అనే ప్రదేశంలో బొగ్గుగనులలో ఉద్యోగం చేస్తున్నాను. గనులలో పని చేస్తున్నానని భయపడకు. ప్రమాదమేమీ లేదు. ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో నేను మన ఊరు వచ్చినప్పుడు వివరంగా అన్ని చెబుతాను. నా కిప్పుడు నెలకి మూడు వందల రూపాయలపైన దొరుకుతూంది. ప్రతి నెలా నేను వంద రూపాయలు ఇంటికి పంపుతాను.
    తొందరలోనే సెలవు తీసుకుని వస్తాను.
    అందరు అక్కడ బాగున్నారని తలుస్తాను. మామ్మ ఆరోగ్యం ఎలా ఉంది? రేవతక్క, బావగారు, పిల్లలు క్షేమంగా ఉన్నారా? భానక్కని, చారుని, మాలతిని, భగవతిని అడిగానని చెప్పు. అందరిని చూడాలని ఉంది. మన ఇంట్లో ఉండే రామారావు మాస్టారు బాగున్నారా? ఆయనకి నా నమస్కారాలు అందజెయ్యి.
            ఉంటాను,
            -శంకరం."
    ఉత్తరం చదువుకొని ఆనందబాష్పాలు రాల్చింది శాంతమ్మ. తమ సంతోషం పంచుకోవడానికి అత్తకు, భర్త లేరని విచారించింది అంతలోనే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS