9
ఆ రోజు సాయంత్రం నీలమ్మ మొగుడు కాస్త పెందరాళే ఇంటికొచ్చాడు. అతని తల్లి గుడిసె ముందు కూర్చొని, రాగులు బాగుచేస్తూంది. కాస్త దూరంలో వీధి కుక్కొకటి పడి పొర్లుతూంది. ఏడెనిమిది కోళ్ళు గుడిసె చుట్టూ తిరుగుతూ పురుగులను ఏరి తింటున్నాయ్. కెంచమ్మ అప్పుడప్పుడూ వీధివేపు చూస్తూ కోపంతో ఏదో గొణుక్కొంటూ, చేటలోని రాగులు చెరుగుతూంది.
అడుగుల చప్పుడు వినపడగానే, కోపంగా "నీలీ" అని పిలిచింది. శివయ్య దగ్గరగా వచ్చి "నేనమ్మా నీలి ఇంకా రాలేదూ?" అని అడిగాడు.
ఇంతవరకూ లోపలే అణచుకొన్న ముసలిదని కోపం కట్టలు తెంచుకొంది. చేతిలోని చేట క్రింద కుక్కి లేచి నుంచుంది.
"శివా, మంచి పిల్లనే కట్టుకున్నావు గదరా" అంది. ఆమె తెల్లటి వెంట్రుకలు చెదరి ఉన్నాయి. శివయ్య ఆశ్చర్యంతో తల్లివేపు చూస్తూ "ఏటి జరిగిందమ్మా" అన్నాడు. అలసటతో అతనికి నీరసంగా ఉంది. ఉదయం నుండి పొలంలో కష్ట పడి పనిచేసి, అతని దేహం విశ్రాంతికోసం అలమటిస్తోంది. చిరునవ్వుతో ఎదురై, ఉల్లాసాన్ని కలిగించే నీలి బదులు కోపంతో రెచ్చిపోతూన్న, తల్లిని చూసి మరింత నీరసపడిపోయాడు శివయ్య.
తల్లి పక్కలో కూర్చొంటూ "ఏంటయిందో సెప్పమ్మా" అన్నాడు.
"ఇంకా ఏటి కావాల? పొద్దుండగానే, శామప్ప గోరింటికి పోనాదిగందా. ఈపాటికి రానేదు, ఆడేం యెలగబెడుతూందో నాకేటి తెలుసు. నేనో ముసలిముండను. సావకుండా ఉండాను గందాని...... పిల్లది ఏడిసి ఏడిసి, కళ్ళు తేలేసినాది. ఇదేం కాపురం సేయడాని కొచ్చిందేనాంట?......మేతకు పోయిన గేదె ఎటు పోయినాదో తెల్దు. ఇటు పిల్లదాన్ని సూడనా. అటు గేదెకోసం లగెట్టనా? కూడొండనా? ఏటి సెయ్యమంటావు?"
కొడుకుమీద విరుచుకుపడింది కెంచమ్మ. అసలే అలసటతో ఇంటికొచ్చిన శివయ్యకు రెండు సేర్ల పాలిచ్చే గేదె ఎక్కడో తప్పింఛుకపోయిం దనేసరికి, ఒళ్ళు తెలియనంత కోప మొచ్చింది.
పాత బట్టతో కట్టిన ఉయ్యాలలో పడుకున్న పిల్లవేపు చూశాడు. కిరసనాయిల్ బుడ్డీ దీపం వెలుగులో పిల్ల కనుకొలకుల్లో నిలచిన కూడ ఇంకా వెక్కుతూనే ఉంది. ఇది చూసి అతని మనసు కలుక్కుమంది.
"జుట్టెట్టుకు లాక్కొత్తా" అంటూ బయల్దేరి పోయాడు.
తల్లి వారించి, "ఒద్దు కూకో, రాక ఎటు పోతది. ఎంతసేపు కూకుంటదో అదీ సూద్దాం" అంది.
తల్లీ, కొడుకు కోపంతో మండిపడుతూ తలుపు దగ్గరే కాచుక్కూర్చున్నారు.
సాయంత్రం ఏడింటికి, నీలమ్మ చేతిలో పలకబలపం రసాయనంతో నిండిన దొప్ప పట్టుకొని వచ్చింది. నీలమ్మను చూడగానే శివయ్య కాలరుద్రులా పైకిలేచి, జుట్టు పట్టుకొని లాగి బాదసాగాడు.
మొగుడు ఎందుకలా చేస్తున్నాడో అర్ధంకాలా, నీలమ్మకు.
చేతిలోని పలక అంత దూరంలో పడి ముక్కలై పోయింది. రసాయనపు దొప్ప క్రిందపడి, రసాయన మంతా మట్టిలో కలసిపోయింది.
"అయ్యో" అని ఏడుస్తూ అతని నుండి విడిపించుకోవటానికి ప్రయత్నించింది నీలమ్మ. కాని అతని భల్లూకపు పట్టునుంచి తప్పించుకొనటం అసాధ్య మయింది.
"ఎక్కడ సచ్చావే ఇంతసేపు? దీపాలు పెట్టా కనా కొంపకు వస్త? ఎవడి దగ్గర కులుకుతుంటివో సెప్పు" అరుస్తున్నాడు శివయ్య. కెంపమ్మ దూరంగా నుంచుని, గొణుగుతూంది.
"గేదె ఎటుబోయినాదో తెలీదుగందా. దీని మొహం మండా. దీని అబ్బ ఇంటిసొమ్మా గేదె? ఇల్లు గుల్ల సేస్తుందా? పూటకు రెండుసేర్లు పాలు యాడొస్తది? బుల్లి ఏడ్చి ఏడ్చి నిద్దరోనాది"
ఇరుగు పొరుగు గుడిసెలు వాళ్ళంతా నిలబడి చూస్తున్నారు, ఈ దృశ్యాన్ని.
శివయ్య తన చేతులు నొప్పిపుట్టే దాకా కొట్టి ఆఖరికి దూరంగా తోసేశాడు నీలమ్మను. అక్కడే పడి ఏడుస్తోంది నీలి. ఈ గొడవకు నిద్రపోతున్న బిడ్డ లేచి ఏడవసాగింది. నీలి బిడ్డను దగ్గరకు తీసుకోకుండా మూలుగుతూ పడుకుంది. మొగుడిమీద కోపం బిడ్డమీద చూపిస్తూ.
ఉయ్యాల్లో ఆకలికి ఏడుస్తున్న బిడ్డను తెచ్చి కోడలి కిచ్చింది, కెంచమ్మ. నీలి కోపంతో బిడ్డను దూరంగా తోసింది.
"ఏయ్ బిడ్డను ఎత్తుకుంటావా మళ్ళీ నాలుగు తగిలించనా?"
మొగుడికి భయపడి నీలి బిడ్డను దగ్గరకు తీసుకొని పాలివ్వసాగింది.
మరుసటిరోజు, బీరమ్మా వాళ్ళంతా కలసి నీలమ్మను పిలవ వచ్చేసరికి, మొహమంతా వాచి పోయింది నీలమ్మకు.
"ఎవరేడ్చారు ఈ డడుగు గావాలని? నిన్ననగా పోయిన మాయదారి గేదె ఇంకా రానేదు, పదవి ఊళ్ళేలుతావా అని బాదేడు."
చెపుతూ చెపుతూ దుఃఖం ముంచుకొచ్చి ఏడవసాగింది నీలమ్మ. బీరమ్మ.
"ఏటయిందే నీలీ, మొహమంతా వాచిపోయింది" అని అడిగింది.
"ఈడి సేతు లిరగ, ఎట్టా కొట్టినాడో సూడు. ఎదవ సచ్చినోడు."
"అయితే రావా?"
"రానమ్మా ఆరి సదుగుకో దణ్ణం."
బీరమ్మా వాళ్ళంతా అక్కడినుండి రామక్కా వాళ్ళింటి దగ్గరికి వెళ్ళారు.
రామక్కకు మారుగా, దాని ముసలి మామ కర్ర ఆసరాతో బయటికి వచ్చాడు.
"రామక్క నేదా, ఇంట్లో."
"నిన్న పొద్దుపోయినాక ఇంటికొచ్చిందా మరి? 'ఇంత రేతిరాళ యాడ బోయావ్? నాకు కూడెవడు ఒండుతాడు?' అని కొట్టాడు నంజన్న. ఎంటనే రాత్రికి రాత్రే పుట్టింటికి పోనాది."
"మరి సంజన్న ఏడి?"
"ఆడూ ఎల్లాడు, బతిమలాడి తీసుకరాటానికి."
నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ బయల్దేరారు, బీరమ్మ, మిగతావాళ్ళూనూ.
ఒక్కరోజుకే ఇద్దరు శిష్యురాండ్రు తగ్గిపోవటం చూసి, మీర
"నీలమ్మా, రామక్కా రాలేదేం?" అనడిగింది. అలసట చెందిన బీరమ్మ, నీరసంగా అంది.
"నిన్న ఇంటికి ఆలిశంగా వచ్చినందుకు, దాని మొగుడు 'నువ్వు సదుగునేర్పి దొరసానమ్మ గావాల్న?' అట్టాగని చావ బాదాట్ట. రామక్క కోపం సేసుకొని రేత్రికి రేత్రే పుట్టింటికి పోనాదట."
మీర ఉత్సాహం దిగజారిపోయింది,
"నీలమ్మ రాలేదేం?"
"నీలీ వాళ్ళ గేదె నిన్న సందెకాడనగా తప్పిపోనాదట. ఈయాల్టికి కూడ దొరకలా. దాని మొగుడు శివయ్య వొళ్ళు హూనంసేసి వదిలాడు."
"సరే" అంది మీర నిరుత్సాహంతో.
వచ్సినవాళ్ళకే పాఠం చెప్పటం మొదలెట్టింది. తన విద్యార్ధినులకు ప్రోత్సాహ మివ్వడానికోసం, ఆఖరిలో:
"ఒక నెల పూర్తిగా తప్పించుకోకుండా వచ్చిన వాళ్ళకు, ఒక్కో చీర బహుమతి ఇస్తాను" అని చెప్పింది.
కాని చీరమీది లోభం కూడా, ఆమె శిష్యురాళ్ళమీద పని చెయ్యలేదు. సూర్యుడి వేడి తగిలిన మంచుగడ్డలా, మీర శిష్యబృందం కరగిపోసాగింది. ఒక్కొక్కరు, ఒక్కో కారణం చెప్పి రావటం మానేశారు.
ఎనిమిదిమంది పిల్ల తల్లి, చెన్నమ్మకు ఇంటి పనులతోనే సరిపోయేది. కాళ్ళమ్మ ఇంట్లో ఎనిమిది పది గేదె లున్నాయి. వాటికీ మేత అది చూసుకొని పాలు, పెరుగు, వెన్న తీసి వూళ్ళోకి వెళ్ళి అమ్ముక రావటంతో, తీరికన్నమాటే ఉండేది కాదు. చీర మీది ఆశకోసం, బీరమ్మ, కేమ్ప్మ్మ, తిమ్మమ్మ మాత్రం వస్తూ ఉండేవారు. అక్షరాభ్యాసం చేసి నెల కావస్తున్నా, నాలుగు అక్షరాలు కూడా సరిగ్గా రాయటం రాలేదు వీరికి. రోజు ఒకే అక్షరాలు రాసి ఇవ్వటానికి మీరకే విసుగని పించేది. కొత్త అక్షరం నేర్చుకుంటే, పాతది మరచిపోయేవారు. ఒకరోజు మీర,
"బీరమ్మా, ఇన్నిరోజు లయినా అక్షరాలే రాలేదు మీకు. ఇంకాస్త శ్రద్దగా నేర్చుకోలేరా?" అనడిగింది.
బీరమ్మ పలక క్రిందపెట్టి "ఎట్టా నేర్చుకుంటాం తల్లీ. సిన్నపిల్లలపుడైతే, వెంటనే నేర్చుకొనేవాళ్ళం. ఇప్పుడో లచ్చ బాధలు. ఏదని సూస్తాం? మొక్కయి వంగనేదు. ఇప్పుడు ఒంగుతాదా?" అంది.
అక్షరాలు విచిత్రంగా రాస్తున్న తిమ్మమ్మతో,
"ఎన్నిసార్లు చెప్పినా తప్పుగానే దిద్దుతావేం, తిమ్మమ్మా ఇన్ని రోజులయినా, ఒక్క అక్షరం ముక్కరాలేదే, నీకు" అంది మీర.
"అయ్యోరాత! నా కెందుకు తల్లీ ఈ సదుగు. మాకు తెలిసిన ఇద్దె సాలదా? నేను కావలిస్తే ఇపుడు నూరు బిందెలు నీళ్ళు తోడి పోయగల్ను, మీరు తోడగల్రా?"
నెల పూర్తికాగానే, మీర మూడు చేనేత చీరలు తెప్పించి, ఆ ముగ్గురికి ఇచ్చింది. మరుసటిరోజు నుండి, వాళ్ళూ రావటం మానేశారు!
ఒక్క నెలరోజులకే మీర స్కూలు మూతబడింది!!
తనంతట తాను, చదువు చెప్పటానికి పూనుకున్నా, ముందుకురాని రైతు స్త్రీలమీద, మొదట కోపం వచ్చింది మీరకు. సాయంత్రం అయిదు, అధవా ఆరింటికి వచ్చి, చదువుకోటానికి అడ్డేమిటి? ఈ పల్లెటూరివాళ్ళకు. బొత్తిగా జ్ఞానం లేదు, అనిపించినా, కోపం తగ్గాక, వాళ్ళింటి పరిస్థితులను గురించి, ఆలోచించసాగింది.
తెల్లవారిజమున, తను ఇంకా మంచి నిద్రలో ఉన్నప్పుడే, వాళ్ళు లేచి పనిపాటలు చేసుకోవటం మొదలుపెడతారన్న సంగతి మీరకు తెలిసినదే. ఇంటి పనులు చేసుకొని కుర్రాళ్ళతో, ఆవులను, గేదె లను మేతకు పంపి, వంట వండి, పొలాల్లో పని చేస్తున్న మొగవారికి భోజనం తీసుక వెడుతున్న దృశ్యాన్ని తలచుకుంది మీర.
ఇంతకుముందోసారి, ఏదో పండుగరోజున దేవాలయానికి బయలుదేరింది మీర. కొత్తగా తెప్పించుకున్న బిన్నీ జార్జెట్ చీర, ఆమె సన్నటి శరీరాన్ని, అంటిపెట్టుకున్నట్టుంది. మెడలో గొలుసు వేసుకుంది. వెండి పళ్ళెంలో పూజా ద్రవ్యాలు అమర్చుకొని, బయలుదేరింది.
అదే సమయంలో వయస్సుమళ్ళిన బీరమ్మ చిరుగుబట్ట కట్టుకొని, దానితో దేహాన్ని మరుగుపరచుకోవటానికి ప్రయత్నిస్తూ, తలమీద ఓ పాత బుట్టలో తన కొడకు కోసం పొలానికి భోజనం తీసుకు వెడుతోంది. మీరను చూసి ఆగి,
"గుడి కెళ్తుండారా, అమ్మగోరూ" అంది.
"నువ్వెక్కడికి వెడుతున్నావ్?"
"మా కుర్రాడికి, భోజనం తీసుకెడుతున్నా."
"చేతిలో కొడవలి ఉందేం?" మీర వీరమ్మ చేతిలోని కొడవలివేపు చూసింది.
"భోజనంపెట్టి, గేదెకు గడ్డి కోసుకొస్తా."
"ఎన్నింటికి వస్తావ్ మళ్ళీ?"
"పొద్దు చల్లబడేయేళ కొత్తా."
