Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 24


    "మా ఆయన, అవునా?" కల్యాణి చిలిపిగా నవ్వింది. "ఇంకా చెంప దెబ్బ మరిచిపోలేదన్నమాట" అంది. ఆనంద్ అప్రయత్నంగా చెంప తడుముకుని తరువాత నవ్వేశాడు.
    "మరే, ఎలా మరిచిపోగలను, ఇంత మనిషినీ గిరగిర తిరిగాను ఆ లెంపకాయకి. హాస్యానికేంగాని మీ ఆయన యెలా వున్నారు? ఏమంటున్నారు? ఈ మధ్య మళ్ళీ యేదన్నా గొడవ పెట్టారా?" ఆనంద్ నవ్వుతూ మాట మార్చాడు.
    కల్యాణి చిన్నగా నిట్టూర్చింది. "మా ఆయనకేం, నిక్షేపంలాగ వున్నారు. సంపాదించి పెట్టేందుకు భార్య వుంది. హాయిగా తాగడం, పేకాడడం, తినడం, తిరగడం-అదృష్టవంతులు. ఆయనకేం?"
    "అయితే యింకా అలాగే కసిగా డబ్బు తగలేస్తూనే వున్నాడన్నమాట!"
    "ఇదివరక్కంటే యెక్కువయింది బావా! రోజు రోజుకీ ఆయనకి మరింత ద్వేషం పెరిగిపోతోంది. వెయ్యి, రెండువేలు, మూడువేలు ఎంత ఖర్చుపెడుతున్నారో యేమనడానికి లేదు. నోరు తెరిచి యేదన్నా అంటే నోటికిరాణి నానా మాటలు అని నా నోరు మూస్తారు. ఆ బాధ, ఆ గోల పడలేక అడిగినంతా యిచ్చేస్తున్నాను. నేనిలా డబ్బుకోసం రాత్రింబగళ్ళుకష్టపడడం, ఆయనలా తగలేయడం" వ్యధగా తన మనస్తాపాన్ని చెప్పుకుంది కల్యాణి.
    "ప్చ్, బాగుంది. ఏదో నీమీద కసి తీర్చుకుంటున్నానని అనుకొంటున్నాడు గానీ, తన ఆరోగ్యం ఎంత పాడయ్యేదీ, లోకుల దృష్టిలో ఎంత హీనమయిందీ తెల్సుకోలేకపోతున్నట్లున్నాడు.
    "కానీ నే నిలా, ఆయనలా మా బ్రతుకు లింతే బావా. ఈ సంసారం యింతే యింక. ఏదో ఆ పిల్లలు పెద్దవాళ్ళయి ఓ ఇంటివాళ్ళయ్యేవరకు నా పరువు, గౌరవం దక్కితే చాలు! ఎవరి కోసం అయితే యిదంతా సహిస్తున్నానో ఆ పిల్లలు, తల్లి దండ్రులని చూసి అసహ్యించుకునే దుస్థితి రాకూడదని, వాళ్ళకోసం, లోకం కోసం యిలా బ్రతుకీడుస్తున్నాను. సరే, ఎంత చెప్పుకొన్నా యీ గొడవ యింతే. ఒంటిగంట దాటింది. పద భోంచేద్దాం, సుజాత కనిపెట్టుకొని ఉంటుంది" అంటూ లేచింది కల్యాణి.
    
                                            14
    
    సాయంత్రం పిల్లలు స్కూలునుంచి వస్తూనే 'అంకుల్' అంటూ ఆనంద్ మీద పడ్డారు. ఆనంద్ వీళ్ళిద్దరిని దగ్గిరకి లాక్కొని ప్రేమగా ముద్దుపెట్టుకొన్నాడు. వాళ్ళిద్దరిని దగ్గిర కూర్చోపెట్టుకొని వాళ్ళకోసం తెచ్చిన చాకలెట్లు, బొమ్మలు పంచి యిచ్చాడు. వాళ్ళతోపాటు ఆడాడు, గెంతాడు. కల్యాణి - పిల్లలు, ఆనంద్ కలిసి ఆ మూడురోజులు కారులో సినిమాకి, షికార్లకి తిరిగారు. ఆ మూడురోజులు యింట్లో వెల్లివిరిసిన ఆనందం చూస్తుంటే సుజాతకి అన్నాళ్ళకి అది యిల్లులా కన్పించింది. కాని.....కాని....ఆనంద్, కల్యాణిల మధ్య బంధాన్ని మాత్రం ఆమోదించలేక పోయింది. కల్యాణి తప్పు చేస్తుందన్న బాధ సుజాత మనసుని అంటిపెట్టుకుని వదలలేదు.
    ఆనంద్ వచ్చిన రోజు సాయంత్రం కల్యాణి, ఆనంద్. పిల్లలు కారులో పబ్లిక్ గార్డెన్స్ కి బయలుదేరారు. వాళ్ళలా వెళ్ళిన కాసేపటికి రంగారావు యింటికి వచ్చాడు. ఉదయం పదకొండు గంటలకు యెక్కడికో వెళ్ళిన ఆయన సాయంత్రం యిల్లు చేరాడు. వస్తూనే ఫ్రిజ్ లోంచి రెండు గ్లాసుల నీళ్ళు గటగట త్రాగి, అక్కడున్న డైనింగ్ చెయిర్ ముందు కూలబడ్డాడు. ఓ అయిదు నిమిషాలు అలా వుండి "కాఫీ కావాలి" అంటూ సుజాతకి వంటింట్లోకి వినపడేలా ఓ కేక పెట్టాడు!
    ఆరోజు సంఘటన అలా జరిగాక రంగారావు యించుమించు సుజాతతో మాట్లాడడం మానేశాడు. కల్యాణి, రంగారావు పనులు చూడడానికి తర్వాత పదిరోజులలోనే ఒక కుర్రాడిని పెట్టింది. అంచేత' సుజాతకి కూడా ఆయన గదికి వెళ్ళడం. ఎదుటపడి ఆయన కన్నీచెయ్యాల్సిన, మాట్లాడాల్సిన పని లేకపోయింది.
    సుజాత కాఫీ కలిపి యిచ్చింది. మామూలుగా యింట్లో యే విషయమూ పట్టించుకొని రంగారావుకి కూడా యింటిలో ఆరోజు యేదో మార్పు కనిపించింది. ఆ నిశ్శబ్దం అలవాటులేనిదిలా కన్పించి నాలుగుమూలలూ చూస్తూ "పిల్లలేరి, కనపడడంలేదు" అనడిగాడు. సాధారణంగా యే ఆదివారమన్నా పిల్లల్ని సినిమాకి, షికారుకి తీసికెళ్ళినా సుజాతే వాళ్ళని తీసికెళ్ళటం అలవాటు కనక సుజాత యింట్లో వుండి, పిల్లలు లేకపోవడం ఆయనకీ ఆశ్చర్యం కలిగించి వుంటుంది.
    "పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్ళారు" అంది సుజాత.
    "ఒక్కళ్ళూనా....?" ఆశ్చర్యంగా అడిగాడు రంగారావు.
    "ఉహు.....వాళ్ళ అమ్మగారితో...." తరువాత మాట సుజాత చెప్పలేదు. ఆనంద్ సంగతి చెప్పాలో వద్దో తేల్చుకొనే లోపలే ఈసారి మరింత ఆశ్చర్యంగా చూశాడు రంగారావు. ఏదో అడగబోయి అంతలోనే అర్ధం అయినట్టు ఆయన మొహంలో రంగులు మారాయి. కాసేపు ఊరు కొని, "ఎవరొచ్చారు యింటికి?" అన్నాడు. తను ఊహించిన ప్రశ్న మరో విధంగా రావడంతో సుజాత తడబడుతూ చూసింది. "ఎవరెవరు వెళ్ళారు?" మళ్ళీ అడిగాడు. ఈసారి ఆయన గొంతు కరుకుగా వుంది.
    సుజాత కాస్త భయంగా...."ఆనంద్! ఆనంద్ గారట....డాక్టరు గారి బావగారట.....వారొచ్చారు. అంతా కలిసి వెళ్ళారు" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS