Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 24


                            అమ్మమ్మ చెప్పని కథ

    తెల్లవారి ఒక సాహిత్య సభలో కథ చదవాలి. రాత్రి తొమ్మిది దాటింది. కాగితాలూ, కలం తీసుకొని కథ రాయాలని కూర్చున్నాను. యెంత ఆలోచించినా కథకు "ప్లాటు" దొరకలేదు. అర్థగంట ఇట్టే గడిచిపోయింది. వంటింట్లోంచి అమ్మ సర్దుతున్న గిన్నెల మోతలు వినిపిస్తున్నాయి. చిరాకు వేసింది. లేచి బయట వరండాలోకి వచ్చి నిల్చున్నాను. చల్లనిగాలికి ప్రాణంలేచి వచ్చినట్లయింది. మల్లెపూలు ఆరబోసినట్లున్న వెన్నెల కళ్ళకు హాయిగా తోచింది. ఆ వెన్నెల్లో మంచం వేసుకొని పడుకొని హాయిగా నిద్రపోవాలనిపించింది. కాని యెలా? రేపటికి ఒక కథ కావాలే? యెందుకొచ్చిన బాధ? బాధ అనుకుంటే కీర్తి దాహం తీరేది యెలా?
    ఇంతలో పక్కనుంచి యెవరో గొణుగుతున్నట్లు వినిపించి తలతిప్పిచూశాను. అమ్మమ్మ ఆరుబయట వెన్నెల్లో నులకమంచంమీద పడుకొని గోవిందనామాలు పాడుకుంటుంది. లేదు చదువుకుంటూంది. అమ్మమ్మ పాటలో శృతి అనటానికి ఆశ్రయం లభించదు. కాని అమ్మమ్మకు తన పాటను గురించి చాలా మంచి అభిప్రాయమే ఉన్నది. అడిగిందే తడవుగా పాట యెత్తుకుంటుంది.
    అకస్మాత్తుగా నా బుర్రలోనుంచి ఓ ఆలోచన దూసుకుపోయింది. (అమ్మమ్మ దగ్గిరే కథకు "ప్లాటు" సంపాదిస్తే? అమ్మమ్మలకు చాలా కథలు వస్తాయి. ఈనాడు పత్రికల్లో వస్తున్న చాలా కథలకంటే అమ్మమ్మలు చెప్పే కథలే బావుంటాయి! "అమ్మమ్మ చెప్పిన కథ" అనే పేరుతో రేపు సభలో కథ చదివేయొచ్చును.) నా సమస్యకు పరిష్కారం దొరికినందుకు ఉత్సాహంగా అమ్మమ్మ మంచంవైపుకు నడిచాను.
    "దా! దా! ఈసారి నిజంగా చచ్చావే!" అంటూ అమ్మమ్మ మంచానికి ఓరగా జరిగి మంచంకిందవున్న తన కర్రకోసం చేతిని కిందకు పెట్టింది.
    "నిజంగానే చచ్చానురా బాబూ! ఈ ముసల్ది నన్ను కుక్క అనుకుంటూంది." అని అనుకుంటూ "అమ్మమ్మ! నేను. నేను." అంటూ గబగబా బిగ్గరగా అనేశాను.
    "నువ్వంటే పిల్లా! నేనింకా.... ...."
    "అదేలే__కుక్క అనుకున్నావు. కాస్తయితే నా కాళ్లు విరగ్గొట్టేదానివే" అంటూ అమ్మమ్మ తల దగ్గిరగా మంచంమీద కూర్చున్నాను.
    "అన్నం తిన్నావా? అమ్మ ఏం చేస్తోంది" ఆప్యాయంగా నా చేతికోసం నులకతాళ్లు పెనవేసినట్లు నరాలు తేలివున్న చేతిని చాచింది అమ్మమ్మ.
    అమ్మమ్మ చేతికి నా చేతిని అందిస్తూ "అమ్మమ్మా!" అన్నాను.
    "ఏం తల్లీ! గోవిందనామాలు పాడమన్నావా?" అమ్మమ్మ అడిగింది ఉత్సాహంగా. నాకు అమ్మమ్మ పాడే గోవింద నామాలంటే చాలా ఇష్టం. తోచనప్పుడల్లా అమ్మమ్మ చేత గోవిందనామాలు పాడించుకొని వింటూ ఉంటాను. అందుకే అమ్మమ్మకు తన మనుమలూ, మనుమరాళ్ళందరిలో నేనంటే ఎక్కువ ఇష్టం.
    "ఎప్పుడూ గోవిందనామాలేనా?" అన్నాను.
    "పోనియ్ ఊర్మిళాదేవి నిద్రపాటపాడతాలే." అంటూ నా జవాబుకు కూడా ఎదురుచూడకుండానే అమ్మమ్మ "ఊర్మిళాదేవి" నిద్రపాటను అందుకుంది.
    "ఊర్మిళాదేవి నిద్రా వద్దు. సీతమ్మవారి అగ్నిప్రవేశమూ వద్దు" అన్నాను చిరాగ్గా.
    అమ్మమ్మ పాట ఠక్కున ఆగిపోయింది. అమ్మమ్మ వర్షంలో తడిపిన నులకమంచంలా బిగుసుకుపోయింది.
    అమ్మమ్మకు కోపం వచ్చింది. తడిసి బిగిసిపోయి కోళ్ళు పైకి లేచిన నులకమంచాన్ని యధాస్థితిలోకి తేవటం ఎంత కష్టమో, అమ్మమ్మ అలకతీర్చటం కూడా అంతే కష్టం అని నాకు తెలుసు.
    "అమ్మమ్మ!" అన్నాను ప్రాధేయపూర్వకంగా, అమ్మమ్మ ఉలకలేదు, పలకలేదు.
    "అమ్మమ్మోయ్!" అన్నాను బ్రతిమాలుకుంటున్నట్లు.
    "ఊఁ ఏం?" అంది అమ్మమ్మ.
    "ఓ కథ చెప్పు. అమ్మమ్మా!" అన్నాను.
    అమ్మమ్మ మంచంలో కదిలింది. ఆ కదలికలో నాకు ఉత్సాహం కనిపించింది. లేచి కూర్చోవటానికి ప్రయత్నిస్తున్న అమ్మమ్మను వారిస్తూ "కూర్చోనక్కరలేదు. పడుకొనే చెప్పు అమ్మమ్మా!" అన్నాను.
    అమ్మమ్మ కూర్చొనే ప్రయత్నం మాని కథ చెప్పటానికి సిద్ధం అయింది. "కథ చెబుతున్నంతసేపూ ఊఁ కొట్టాలి తెలిసిందా?" అంది అమ్మమ్మ అదేదో పెద్ద షరతు పెడుతున్నట్లు.
    "అలాగేలే! త్వరగా కథ చెప్పు అన్నాను. అప్పటికప్పుడే పది దాటిపోయింది. అమ్మమ్మ కథ వినాలి. మళ్లీ దాన్ని నేను రాయాలి.
    "ఉండూ మరి! అట్లా తొందర పెడితే కథ ఎట్లా వస్తుందే!" అంటూ అమ్మమ్మ ఆలోచనలోకి జారిపోయింది.
    ఏం చేస్తాను! నోరుమూసుకొని అమ్మమ్మ ఎప్పుడు ఆ బోసి నోటిని తెరుస్తుందా అని చూస్తూ కూర్చున్నాను.
    "ఈ కథ నాకు మా అమ్మమ్మ చెప్పిందో, నాయనమ్మ చెప్పిందో గుర్తురావటంలేదే అమ్మాయ్." అంది అమ్మమ్మ ఆలోచిస్తున్న ధోరణిలో.
    "ఎవరు చెబితేనేంలే అమ్మమ్మా! నాకు ఆ కథ చెప్పు." అన్నాను నాకు కావాల్సింది కథగదా అని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS