జాలి
"ఎలాగైనా నీకు జాలి ఎక్కువోయ్" అంటూంటాడు
నామిత్రుడు రామ్మూర్తి.
"మా ఆయనకి ఊళ్ళో వాళ్ళందరిమీదా కలిగే జాలిలో
వెయ్యోవంతైనా నామీద కలగదు" అని కోపం వచ్చినపుడు
మా ఆవిడ అవతలివాళ్ళ దగ్గర నాగురించి సాధిస్తూ అనే
మాటలు.
"వాడిదంతా వాళ్ళ నాన్న పోలికే. ఆయనా ఇలాగే జాలి ఎక్కువైపోయి ఆస్తంతా దానధర్మాలకి తగలెట్టుకున్నాడు" అని, తండ్రి తాగుబోతూ, వ్యభిచారీ అయినపుడు కొడుక్కికూడా అవే అలవాట్లు సంక్రమిస్తే ఎలా అంటారో అచ్చు అలాగే అనేవాడు మామయ్య.
"ఆఁపోదూ అదొకరకం షో అంతే" అని నాతోటివాళ్ళు నేను లేని సమయాల్లో అనుకుంటూ ఉండడం కూడా నేనెరుగుదును.
మొత్తంమీద వీటన్నిటివల్లా కూడా మామూలుగా మనిషన్న వాడికి ఉండాల్సిన జాలి కన్నా నాలో అది చాలా మట్టుకు ఎక్కువగానే ఉందన్న విషయాన్ని మాత్రం యావత్తు మంది కూడా నిస్సందేహంగా తేల్చేశారు, ఒక్క నేను తప్ప.
నా అభిప్రాయం మటుకు అందుకు పూర్తిగా వ్యతిరేకం ఎందుకంటే మనం ఉన్న స్థితికన్నా తక్కువ స్థితిలో ఉన్నవాడికి ఏదైనా సాయం చెయ్యడం జాలి అని నేననను. అది మనిషి తాలూకు కనీస ధర్మం. అదీకాక ఒక చదువుకునే బీదకుర్రాడికి రెండ్రూపాయలిస్తేనూ రోడ్డుపక్క ముష్టివాడికో అయిదుపైసలు వేస్తేనూ అది జాలి అనిపించుకుంటుందేమో నాకు తెలియదు. కాని నేను మాత్రం అవేమీ కూడా జాలి అన్న ఉద్దేశంతో చెయ్యలేదు. అసలా మాటకొస్తే వాళ్ళని చూసినపుడు కలిగే భయంవల్ల మాత్రమే చేసేవాడిని.
దిక్కులేని వాళ్ళని చూసినప్పుడల్లా నాకు వెంటనే నేనే ఆ పరిస్థితిలో ఉంటేనో అనిపించి చెప్పలేని భయం వేస్తుంది. అంతే కాక అటువంటప్పుడు నాకెలా అనిపిస్తుంది అని కూడా అనుకుంటూ ఉంటాను. అయితే వాళ్ళా పరిస్థితిలో, నేనీరకంగానూ పుట్టడం ఎలా జరిగిందో నాకు తెలియని సంగతుల్లో ఒకటి. బహుశా అందరూ అనుకునేటట్లేభగవంతుడనే వాడొకడుండి, వాడే ఇలా పుట్టించాడేమో! కాని భగవంతుడే చేసినా అట్నించిటు మార్చి చేసుంటే నేనలాగే ఉండాల్సిందేమో అని తలుచుకొని భయపడుతూ ఉంటాను.
అంచేత నేను చేసే చిన్న చిన్న దానాలన్నీ జాలివల్లే చేసినవి కావని ఒప్పుకోవాలి. నేనుండకుండా అటువంటి దరిద్రపు స్థితిలో ఇంకొకరున్నందుకు, తద్వారా నన్ను దాన్నుంచి కాపాడినందుకూ వాళ్ళకు నేనిచ్చే ఒకరకమైన లంచం అది.
* * *
దేశం కాని దేశంలో ఉన్న ఆ మహానగరానికి నేను వెళ్ళడం చాలా అనుకోకుండా తటస్థించింది. నేను చేసే వ్యాపారానికి సంబంధించిన ఓ ముఖ్యమైన వ్యక్తి ఆ దిక్కుమాలిన చోట ఉండటంవల్ల నాకా ప్రయాణం తప్పలేదు.
చిన్నతనంలో ఎప్పుడైనాసరే మా నాన్నగారు ఎంత ఆయన ఆఫీసు పనిమీద వెళ్తున్నప్పటికీ ప్రయాణం అంటే చాలు ఆయన వెనకే నేను తోకలాగ తయారయ్యేవాడిని అయితే చిన్నతనంలో సరదాగా అనిపించేది ప్రయాణం అంటే - కాని అది చిన్నతనంతోనే పోయింది.
ఇప్పుడు ప్రయాణం అనగానే అదొక రకమైన వికారం పుట్టుకొస్తుంది. ఎందుకంటే శుభ్రంగా ఇంటిపట్టున వేళకింత తిని కూర్చోకుండా అనవసరంగా డబ్బుదండుగ, నిద్ర దండుగ, అనారోగ్యం తప్ప వాటిలో ఇంకేం లేదనిపిస్తుంది.
అయితే తప్పనిసరి గావడంవల్ల రెండ్రోజులపాటు రైల్లో చచ్చీచెడి ప్రయాణం చేసి ఆ పట్టణం చేరుకొని ఒక చిన్న హోటల్లో దిగేను. అదృష్టం బావుండడంవల్ల ఆ రోజు సాయంత్రానికల్లా నాపని పూర్తయిపోయింది. తిరిగి అర్దరాత్రి బండిలోనే తిరుగు ప్రయాణం పెట్టుకున్నాను.
సాయంత్రం స్నానం చేసింతర్వాత ఏం చెయ్యాలో తెలీక సరే ఊరుచూద్దామనుకున్నాను. కాని ఊరంతా చూడాలంటే చాలా రోజులు పడుతుందని ముందే తెలిసిపోయింది దాంతో హోటలుకి దగ్గరగా బజార్లో మాత్రమే తిరగటం మొదలెట్టాను. దానివల్ల ఇంకొక సదుపాయం కూడా ఉంది. అదేమిటంటే ఎటో పడి పోయినామంటే తిరిగి రావడానికి తోవ తెలీక నానా అవస్తా పడాలి. ఈలోపల రైలుకాస్తా దాటిపోవొచ్చు. అందువల్ల దగ్గర బజారే నయమనిపించింది.
పేవ్ మెంటుమీద నడుస్తూ ప్రక్కనున్న షాపుల్ని, వాటిలో మనుషుల్ని నన్ను తోసుకుంటూ పోతున్న జనాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఏం పనులు చేస్తుంటారో తెలీక. కాని వాళ్ళు మాటాడుకునే భాష నాకు పూర్తిగా రాకుండా పోకపోయినా బాగా మాత్రం రాదు. అందువల్ల ప్రొద్దుటినుంచీ ఎవడితో మాట్లాడదావన్నా తడుముకోవాల్సొస్తోంది. అసలు ప్రపంచంలో యిన్ని వందల భాషలున్నందుకు కోపం కూడా వచ్చింది.
నేనిలా నానా రకాలుగా అనుకుంటూండగా "సాబ్, సాబ్" అన్న మాటలు నన్ను గురించే నన్న ఆలోచన రావడంతో ఆమాటలన్న పెద్దమనిషికోసం చూశాను. అయితే అతను పెద్దమనిషి కాకపోవడమే కాకుండా కనీసం పెద్దవాడుకూడా కాదు. అతనో పది పన్నెండేళ్ళ కుర్రవాడు. అతని జుట్టు చిన్న మూకుడు బోర్లించినట్లుగా ఉంది. అతని లాల్చీ అతని కొలతకి కుట్టింది కాదన్న సంగతి గుడ్డివాడికైనా (తడుముతే) తెలిసేలా ఉంది దానికుండాల్సిన గుండీల్లో అన్ని వూడిపోయి ఒక్కటి మాత్రం ఇంకా నిలబడి దాని రెండు చివరల్ని కలిపి ఉంచింది. అయితే లాల్చీ రంగు మాత్రం చెప్పుకోవడం కష్టం. దానికే జేబుసగం ఊడి మిగతా సగంవల్ల యింకా వేలాడుతోంది. ఆ లాల్చీ క్రింద ఒక అంగుళం మాత్రం పైకి కనిపించి మిగతా భాగం లాల్చీక్రింద దాక్కున్న పొట్టి నిక్కరుంది.
ఆ కుర్రాడి మొహంలో ఆత్రుత కనిపించింది. నేను వెంటనే "ఏమిట"ని అడిగేను వాడు వెంటనే గబగబా మాట్లాడ్డం మొదలు పెట్టాడు. దాని సారాంశం వాడు నా బూట్లు పాలిష్ చేస్తానన్నది. కాని నేనా రాత్రికే పోవాలి కాబట్టి ఎలాగా మళ్ళీ వాటినిండా దుమ్ము తప్పదు. అంచేత పాలిష్ అనవసరం అని వద్దన్నాను.
వాడు వెంటనే వెళ్ళిపోలేదు. బతిమాలడం మొదలుపెట్టాడు. నేను ఆపూట బేరం అన్నాడు ప్రొద్దుటి నుంచీ తిండి లేదన్నాడు. పాలిష్ బ్రహ్మాడంగా చేస్తానన్నాడు. కేవలం 'చారానా' చాలన్నాడు నాలాంటి వాళ్ళే కాదంటే వాడి గతేఁవిటన్నాడు. పాలిష్ నచ్చితేనే డబ్బిమ్మన్నాడు. లేకపోతే ఇంకేదో చెయ్యమన్నాడు.
వాడిని చూస్తూవుంటే నాకు 'అయ్యో' అనిపించింది.
"సరే" అని వాడిచేత పాలిష్ చేయించుకోవడానికి ఒప్పుకున్నాను. సంతోషంతో వాడు గబగబా పేవ్ మెంటు మీద ఓ మూలగా ఉన్న తన సామానువేపు దారి తీశాడు. నేనూ అటువెళ్ళాను. నాబూట్లు విప్పి వాడి ముందుంచాను. వాడు వాటిని శుభ్రంగా తుడుస్తూ మళ్ళీ మాటలు మొదలు పెట్టాడు.
దీనికి మామూలు పాలిష్ అయితే అంత అందంగా ఉండదుట. ఇటువంటి వాటికి వాడే కలర్ పాలిష్ తన దగ్గరుందిట అది వేస్తే మళ్ళీ చాలాకాలం దాకా బూట్ల గురించి ఆలోచించేపని లేదుట వాటిల్లో మొహం చూసుకోవచ్చుట. అందువల్ల అది వేయించుకోమన్నాడు. పెద్ద ఖరీదు కాదని హామీ ఇచ్చాడు.
దాంతో నాకు వాడంటే కొంచెం సరదా వేసింది. పోన్లే అనుకుని వాడితో "సరే అదే కానిమ్మ"న్నాను వాడికి ఉత్సాహంపెరిగింది మళ్ళీ బూట్లతో కుస్తీ ప్ర్రారంభించి మళ్ళీ ఆరంభించాడు.
ఈ ప్రకారం బూట్లు వాడితే వాటి అడుగునున్న సోల్ తొందరగా అరిగిపోతుందన్నాడు. తరువాత రీసోలింగ్ చేయించినా లాభం లేదన్నాడు. పైతోలు దెబ్బతినేస్తుందన్నాడు. అందువల్ల తిరిగీ కొత్తజోళ్ళు కొనుక్కోవాల్సి వస్తుందన్నాడు. ఇప్పుడు బూట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నాడు. అందువల్ల వీటిని జాగ్రత్తగా వాడుకోవాలన్నాడు. దానికోసం "సాబ్ వెంటనే వీటికి అడుగున నాడాలు వేయించుకున్నట్లయితే యిహ జీవితాంతం చెక్కు చెదర"వన్నాడు. కేవలం ఒక్కొక్క నాడా పది పైసలే నన్నాడు. పదినిముషాల్లో వేసేస్తానన్నాడు.
ఈసారి నాకు నవ్వొచ్చింది. వాడి వ్యాపార దక్షతకి ముచ్చటవేసింది. అంత చిన్న తనంలో అంత తెలివితేటలుగా మాట్లాడ్డం ఆశ్చర్యం వేసింది. పోనీ ఎంత కనక? అంతా కలిపి రూపాయి చిల్లరవుతుంది. అందులో పెద్ద నాకు వచ్చిన నష్టం కూడా లేదు. బూట్లు కూడా అరగకుండా ఉంటాయి. వాడికీ పాపం వో రూపాయిచ్చినట్లూ ఉంటుంది. అందుచేత అలాగే చెయ్యమని అదంతా అయ్యేదాకా అక్కడే నించోవడం విసుగనిపించి కొంచెం పక్కగా ఉన్న షాపులు పరిశీలించడం మొదలు పెట్టాను.
ఓ ఇరవై నిముషాలయ్యాక తిరిగి వాడి దగ్గర కొచ్చేసరికి బూట్లు నిగనిగ లాడుతూ చక్కగా కనబడ్డాయి. కుర్రాడు ఫరవాలేదనిపించింది. పర్సు తీసి "ఎంత"ని అడిగేను. వాడు "ఆరు రూపాయల"న్నాడు. నాకు అర్ధం కాలేదు. మళ్ళీ అడిగేను. అయితే వాడు మామూలుగా "అంతే" అన్నాడు నాకు ఆశ్చర్యం దాన్ని మించి కోపం వచ్చాయి. 'ఎలాగ' అని గట్టిగానే అన్నాను.
వాడు తొణక్కుండా బూట్లు చేత్తో పట్టుకొని చెప్పాడు. మామూలు పాలిషయిన పావలాట. కాని కలర్ పాలిషయితే రెండు రూపాయలట. ఒక్కొక్కనాడా పదిపైసల చొప్పున నలభై నాడాలు నాలుగు రూపాయలట. అంచేత రెండూ కలిపితే ఆరురూపాయలని లెక్కని విడమరచి చెప్పాడు.
అయితే నాకు నలభై నాడాలంటాడేవిటని అదేవిటన్నాను. వాడు బూట్లు తిరగేసి చూపించాడు. ఒక్కొక్క బూటుక్రింద అంగుళం అయినా ఖాళీ లేకుండా నాడాలతో తాపడం చేసుంది. నాకు వెర్రెత్తింది.
"ఇన్నెవరు కొట్టమన్నారు?" అన్నాను.
"మరింకెన్ని?" అన్నాడు అదోలా.
"ఒక్కొక్కదానికి మూడు చొప్పున కదా కుట్టాల్సింది?" అన్నాను.
"మీరలా చెప్పందే" అన్నాడు.
ఇంతలో అటూ ఇటూ షాపులవాళ్ళూ, పోతున్న జనం ఆగి పల్లెటూరివాడిని చూసినట్లు చూస్తున్నట్లనిపించింది. అది చూసి వాడు మరీ గట్టిగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. దానితో నాకు యింకా అక్కడ వాదన వేసుకోవడం. అరవడం చిరాకనిపించి మాట్లాడకుండా ఆరు రూపాయలు వాడి ముందు పడేసి జోళ్ళు తొడుక్కొని వచ్చేశాను.
* * *
తరువాత రైల్లో నాకది జ్ఞాపకం వచ్చి ఆలోచిస్తే వాడు నన్ను మోసం చేశాడని తెల్సినా ఎందుకో నాకు కోపం మాత్రం రాలేదు. ఎందుకంటే పాపం వాడిది కూడా అందరి లాంటి బతుకేనని వాడిమీదా ఇంకెవరో ఆధారపడి బతుకుతూండొచ్చనీ, అస్తమానూ వాడికి నాలాంటి కొత్తవాళ్ళు దొరకరనీ, అటువంటి రోజున వాడికి పండుగేననీ అనుకుని, పోన్లే పాపం కనీసం యిదొక్కరోజన్నా నా పేరు చెప్పుకొని ఆనందంగా గడుపు తాడనుకున్నాను.
కాని అంత చిన్నతనంలోనే ఇటువంటి మోసాలు నేర్చుకున్నవాడు పెద్దయిన తరువాత ఏం చేస్తాడో ఊహించటం అంత కష్టం కాదు. బహుశా జేబులు కత్తిరించొచ్చు దొంగతనాలు చెయ్యొచ్చు. అవి చేసినపుడు వాడు అనుభవించబోయే శిక్షలు తల్చుకొని వాడిని అందులో ఊహించేసరికి నాకు వాడంటే విపరీతమైన జాలి వేసింది.
తిరిగొచ్చింతర్వాత యీ కథ చాలా మందితో చెప్పాను. విన్నవాళ్ళంతా అయిపోయిన తరువాత వెధవ మొహం పెట్టి "నువ్వెందుకు పనికిరావోయ్ అన్నారు.
అయితే ఒక్క మా ఆవిడమాత్రం ఇదంతా విని ఏమీ అనలేదు. కాని నా వేపు జాలిగా చూసింది. ఎందుకో మరి?
---౦౦౦---
