ఫిజోకి కావలసినంత సమయంకూడా లభించింది. అటువంటి అవకాశం దొరకడంతో అతడు మరింత విజ్రుంభించాడు. వీరావేశంతో రుద్రమూర్తిలా అయాడు. చురికను రెండు చేతులతో బిగించి పట్టుకున్నాడు. గురిచూచి దాన్ని ప్రయోగించాలి.
సహజంగా ప్రాణులన్నిటికి ఉన్న విధంగానే సర్పాలకు ఆయువుపట్టు అయిన స్థానాలున్నాయి. వెన్నుపూస ఆసాంతమయి మెడ ఎముక ప్రారంభమయే చోటు దాని ఆయువు పట్టు. వాటిని పట్టుకునేవారు అక్కడే పట్టుకుంటారు.
ఎంత పరవడి చేసిన కోడెత్రాచు అయినా మెడఎముక జాయింటులో గట్టిగా బొట్టనవ్రేలుతో నొక్కిఉంచితే నోరు తెరిచేస్తుంది. అక్కడ కలిగిన ఒత్తిడి తగ్గితే కాని అది మరింక నోరు మూయలేదు.
సర్పాలకు ఆయువుపట్టు అయినచోటు ఎక్కడో ఫిజోకి బాగా తెలుసు. ఆచోటుకి గురిచూచి చురికను బలంగా దింపేశాడు ఫిజో. మెడ ఎముక జాయింటులో బలంగా దిగిపోయింది చురిక. పిడివరకూ దిగిపోయిన చురిక దాని శరీరాన్ని ఈవంకనించి చీల్చుకుని ఆవంకకు వెళ్ళు కొచ్చింది.
దానితో అది అపరిమితమయిన బాధతో నోరు తెరిచేసింది. ఆ తెరచిన నోరు మరింక మూయలేదు. దాని శరీరం చుట్టలుగా చుట్టుకుపోయింది.
ఆ చుట్టలు మరింక విప్పుకోలేదు. కొంతసేపటివరకూ దాని శరీరంలో చిన్న చిన్న కదలికలు కన్పించినాయి. ఆ తరువాత అవికూడా లేవు.
అది నిశ్చేతనంగా నిర్ణీతంగా పడిపోయింది. కదలికలన్నీ ఆగిపోయి మృత్యువు కౌగిలింతలో దాని బాధలన్నీ ఆసాంతమయినాయి.
తలభాగం వెల్లకితలా పడిపోయింది.
దాని అసువులు అసాంతమయినాయని దృఢంగా తెలిశాక తన చురికను లాగేసుకుని అక్కడనించి తిరుగు దారిపట్టాడు ఫిజో.
ఆ ప్రాంతాలలో ఎటువంటి జంతువులు ఉంటాయో అతనికి బాగా అర్ధమయింది. ఇలా ఎంతకాలం పయనించాలో ఎంతదూరం పయనించాలో అర్ధంకాని స్థితి.
అందునించి ఫిజో ఒక నీతి నెలవు దగ్గరలో ఆకలి చల్లార్చుకున్నాడు. నీరు నాలుక మొద్దు బారిపోయేంత చల్లగా ఉంది. రవంత విశ్రాంతి తరువాత తిరిగి మౌని అందించిన సూచనల్ని అనుసరించి నడవసాగాడు.
మళ్ళీ వృక్ష సమూహాలు పలుచన అయినాయి. ఆ మైదానం మీద ఒక గంట నడిచాల లోయ అంచులు కన్పించి నాయి. అయితే ఆదిక్కునుంచి అది దిగేందుకు వీలుకానంత క్లిష్టమయినదిగా లేదు. కొంత సజావుగానే ఉంది.
ఫిజో కొంత తెరిపిన పడిపోయినాడు. ఆలోచనలతో కొనసాగుతూ వచ్చిన టెన్షన్ తగ్గిపోయింది, అక్కడనిలిచి చూస్తే ఇంతః పూర్వం తాను దిగేందుకు ప్రయత్నించి విఫలమయిన లోయ అంచు కన్పించింది,
ఇక్కడనుంచి చూస్తే తెలుస్తోంది. ఆ అంచునించి దిగాలని యత్నించటం ఎంత ప్రమాదకరమో తన ప్రయత్నాన్ని కొనసాగించకుండా చుట్టుదారిన వచ్చినందుకు తనను తానే అభినందించుకున్నాడు ఫిజో.
కాని ఆ విచిత్ర ప్రాణి అటునించి ఎలా దిగి వచ్చిందన్న ఆలోచన రాగానే అతనిలో మళ్ళీ అనుమానం తాలూకు నీడలు దోగాడినాయి.
ఆ ప్రాణి ఎటువంటిది అయి వుంటుంది.
మానిటర్ అయివుంటుందా? మైగాడ్ అది కెప్టెన్ మాలతిని చంపివేయలేదు కదా అంత భయంకరమైన ప్రాణి అయివుంటే తాను వెళ్ళి చేయగలిగింది లేక పోగా తిరిగి రావడం గొప్ప సమస్యే అవుతుంది.
రవంతసేపు ఆలోచించాడు ఫిజో.
సాహసోపేతమయిన కార్యక్రమాలను జీవిత లక్ష్యాలుగా నిర్ణయించుకునేటప్పుడే ఆలోచించాలి. కాని ఇప్పుడు ఇలా పిరికిపందలా వెనుకంజ వేయటం కూడనిపని.
తన సహచరుడు అనూహ్యమైన ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మాలతి వెనుకంజ వెయ్యలేదు. అలా చేసిఉంటే ఇప్పుడామెకు ఇలాంటి దుర్దశ ఎదురై ఉండేది కాదు.
తన ఆరాధనీయురాలయిన కెప్టెన్ వీరధర్మాన్ని పాటించింది. ఆమె అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాడు తను. అందునించి తానుకూడా అనివార్యంగా అటువంటి వీరధర్మాన్ని పాటించాలి.
ముందుకు సాగిపోయేందుకే కృత నిశ్చయుడైనాడు. ప్రయాణం సాగించాడు. మనసులో పేరుకుంటున్న భయాలన్నింటినీ అవతలకు నెట్టివేశాడు.
అరగంట నడక తరువాత అతనికి లోయలోకి చేరుకున్నానని అనిపించింది. అక్కడ కూడ కొన్ని గుహల్లాంటివి కన్పించసాగాయి కొన్ని చోట్ల చమరీమృగాల ఎముకలు ప్రోగుల్లా పడేసి ఉన్నాయి.
కొన్నిచోట్ల ఒక నెగడులా మండి చల్లారిన సగం కాలిన కట్టెలున్నాయి. ఆ చల్లారిన నెగనులకు చేరువులోను మాంసం లేని ఎముకనున్నాయి.
10
అవన్నీ ఒక నాగరికతకు సూచించే సంకేతాలని భావించాడు ఫిజో. ఎంత తెలివి గలిగిన ప్రాణి అయినా అది జంతువు అయితే నెగడు వెలిగించలేదు. మాంస ఖండాలను నెగడులో కాల్చుకుని తినలేదు.
అంతేకాక ఆమాంసపు ప్రోగుల ప్రక్కగా "ఛావర్" పదునైన బ్లేడు ఆకారంలో తయారు చేసిన బ్లేడు ఆకారంలోని ఆయుధాలు కన్పించాయి. శిలాయుగంనాటి నాగరికతను అనుసరించే మానవులు ఎవరయినా అక్కడ ఆవాసముంటున్నారా? అని ఆలోచించాడు ఫిజో.
తన ఆలోచనకు తిరిగి తనలో తానే నవ్వుకున్నాడు. ఈ నాగరిక యుగంలో అలాంటివారుండటం అసాధ్యమని అనిపించింది అతనికి. ఆలోచనల మధ్యవున్న అతడు తాను ఒక గుహముఖాన్ని చేరుకున్న సంగతి గుర్తించలేదు.
కాని ఒక భీకరమైన మానవాకృతి గుహలోంచి వేగంగా వచ్చి తనమీద దాడిచేయడంతో వొణికిపోయాడు.
