అతడలా ప్రక్కకు చూపుత్రిప్పిన మరుక్షణం ఏనుగు తొండంలాంటి వస్తువేదో అతడి శరీరాన్ని చుట్టసాగింది నడుము దగ్గర ఓ చుట్టు తిరిగి విశాలమయిన ఉన్నతమైన వక్షస్థలాన్ని ఆక్రమించింది. తాను ఊహించినదీ ఒకటైతే జరిగినది మరొకటి కావటంతో అప్రతిభుడై నాడు ఫిజో.
అడవిదారులవెంట తిరుగుతూ ఉండటం అలవాటయిన వాడుకావటం నించి అతడు మరుక్షణంలోనే గ్రహించాడు. తనను చుట్టివేస్తోంది ఒక కొండ చిలువ అని.
పైథాన్ అతనిప్రక్కనే ఉన్న ఒక వృక్షకాండానికి చుట్టుకుని ఉంది. తలభాగం వృక్షకాండం ప్రక్కనే నేల మీదకు కనిపించే లావుపాటివేరుమీద పదిలంగా అమర్చుకుంది గుహలా భయంకరంగా తెరచుకుని ఉన్ననోటి నుంచి విషవాయువులు ఉధృతంగా వీస్తున్నాయి నాలుక చీలిక బయటకు తొంగిచూస్తోంది. కాండానికి ఒక చుట్టచుట్టి తలను వేరుమీద పదిలంగా అమర్చుకుందుకు దాని శరీరంలోని సగభాగం సరిపోయింది. మిగిలిన సగభాగాన్ని ఫిజో శరీరంమీదకు ప్రయోగించింది పైథాన్. ఆ వంకకు చూచిన ఫిజో విచలితుడయినాడు.
దాని పొడవు ఇంచుమించు ముఫ్ఫై అడుగులుంటుంది. ఒకపాటి తాటిబొడ్డు రూపాన్ని తలపిస్తోంది అది. ఫిజోని తన శరీరంతో రెండు చుట్టుచుట్టి తనవైపుగాలాక్కోవాలని ప్రయత్నం చేస్తోంది కొండచిలువ.
దానివైపుగా లాగేసుకోవాలని అదిచేసే ప్రయత్నం సఫలమయితే ముందుగా ఫిజో తలభాగం దాని నోటిలోకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత మెల్లమెల్లగా అతని శరీరం గుహలాంటి ఆ నోటిలోకి వెళ్ళిపోతుంది.
తాను మ్రింగిన ప్రాణి గర్భకోశాన్ని చేరుకున్న తరువాత అది తన శరీరాన్ని వృక్షకాండం చుట్టూ చుట్టేస్తుంది. అంతటితో అతని ఎముకలన్నీ తునాతునకలు అవుతాయి. రక్తమాంసాలు నుజ్జునుజ్జు అవుతాయి.
శరీరంలోని ప్రతి అనువు కొండచిలువ ఆకలిని తీర్చేందుకు వినియోగమవుతుంది. ఒకపూట ఆకలి తీరినందుకు సంతోషిస్తూ అది హాయిగా నిద్రపోతుంది.
ఆ తరువాత అదికూడా తన ఆకలితీర్చిన ప్రాణిగురించి మర్చిపోయి మరోపూట ఆకలి తీర్చవలసిన ప్రాణికోసం అన్వేషణలో పడిపోతుంది.
ఆ విధంగా తాను దిక్కుమాలినచోట మరొక మానవప్రాణి చూచే అవకాశం లేకుండా చనిపోతానని భయపడసాగాడు. ఫిజో భయం అతని శరీరాన్ని లొంగదీసుకుంది.
చల్లని గాలి వీస్తున్నా అతని శరీరం శ్వేద బిందువు లతో తడిసి ముద్ద అయిపోయింది. ఫిజో భయపడగానే అతడి శక్తులన్నీ నిర్వీర్యమయినాయి కృంగిపోయినాడు.
ఎప్పుడైతే అతడు అనూహ్యమైన సంఘటన వల్ల భయపడిపోయినాడో. వెంటనే కొండ చిలువకు బలం అధికాధికమయింది. అది తన ఆకలి తీర్చుకుందుకు దొరికిన ప్రాణి మీద చేస్తున్నదాడి మరింత ఉధృతం చేసింది. ఫిజో శరీరంలోని ఎముకలన్నీ విరుగుతున్నట్లు అనిపించినాయి. అతడు క్షణక్షణం గుహలాంటి కొండచిలువ నోటికి దగ్గర అయిపోతున్నాడు.
మరికొద్ది క్షణాలలో తనకు మరణం అనివార్యమనిపించాక అతడికి చివరిసారిగా ఆలోచనలు నిద్రలేచినాయి. ఇంతఃపూర్వం చేలో సిద్దంగా పట్టుకున్న చురికతన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో తనకు సాయపడగలదనిపించింది.
గుహలా తెరచిన కొండచిలువ నోటినించి వస్తున్న విషవాయువులు నులివెచ్చగా ముఖాన్ని తాకుతున్నాయి. అతడు సాహసోపేతమయిన మాలతి వ్యక్తిత్వాన్ని ఒక్కసారి స్మరించాడు.
ఆనాటి అర్దరాత్రి సమయానసిన్హాను ఎత్తుకుపోతున్న గుర్తు తెలియని ప్రాణిమీద ఆమె విరుచుపడి అతనిని రక్షించిన ఉదంతం జ్ఞాపకానికి వచ్చింది.
సాహసం ఒక్కటే ప్రాణులను కాపాడుతుంది. ఆనాడు ఆమె రవంత వెనుకంజవేసి ఉంటే సిన్హా బలి అయేవాడు. అందునించి తీరప్రమాదం ముంచుకువచ్చాక భయపడడమనేది కేవలం దుర్భలత్వం.
ఊపిరి ఉన్నంతవరకూ ధైర్యంగా పోరాడగలిగిన వారే విజేతలు కాగలుగుతారు. అతడిలో నిర్వీర్యమయిపోతున్న శక్తులన్నీ తిరిగి జాగృతమయినాయి.
తన శక్తిని తాను స్మరించాడు.
చురికను ప్రయోగించేందుకు సిద్దంగా పట్టుకున్నాడు. గుహలా తెరచిన నోటికి దగ్గరగా చేర్చుకుంది పైథాన్. వెనువెంటనే చీలికలవలె బయటపడుతున్న నాలుకలమీద చురికను ప్రయోగించాడు ఫిజో.
కొండచిలువ నాలుక తెగి నేలమీద పడింది. దాని నోటి నుంచి రక్తం జలయంత్రంలోంచి నీరు చిమ్మినట్లుగా చిమ్మసాగింది.
ఆయువుపట్టున గాయం తగిలేసరికి అది తన బాధను స్మరిస్తూ పట్టురవంత సడలించింది.
వెంటనే దాని కౌగిలినించి బయటపడినాడు ఫిజో. దాని శరీరం అతనిని బంధించి ఉంచాలని చేసిన ప్రయత్నం విఫలమయిపోయింది. నోరు మరింతగా తెరచి కబళించాలని ప్రయత్నించసాగింది. కొంచెంగా దొరికిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడతను.
మెరుపువేగంతో వృక్షకాండం చాటుకు తప్పుకున్నాడు. తను వేటాడినమనిషి కనుమరుగు కావడంతో పైథాన్ పరిస్థితి అయోమయమయింది. ఒకవంక అనుకోని వేగంతో జరిగిన దాడినుంచి యింకా తేరుకోలేదు. మరొక వంక నాలుకల చీలికలు తెగి రక్తం కారుతున్న బాధ.
యింతలో తన ఎరమాయం కావడం ఈమూడు సంఘటనల నుంచి అది అయోమయంలో పడింది. కొట్టు మిట్టాడసానంది దాని కన్నులు చింతనిప్పులు అయినాయి.
ఈ అవకాశాన్ని వృధా పోనివ్వదలుచుకోలేదు ఫిజో చెట్టు వెనుక తట్టు నించి దాని తలభాగం ఉన్న వైపుకు వచ్చాడు. దాని చూపులు ముందుకు కేంద్రీకృతమయినాయి. విరోధి మరొకవంక నుంచి మరొకదాడి ప్ర్రారంభించాడని అది గుర్తించలేకపోయింది.
