Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 24


    "కనకయ్యా! ఆ మాట అనటానికి నీకు నోరెట్లా వచ్చిందయ్యా?"
    "అది మీ మంచికే అనుకొని అన్నాను. తప్పయితే మన్నించండి." కనకయ్య తనమాటల్లో నిజాయితీని ప్రకటించటానికి, చాతనయినంత చేశాడు. లోలోపల కనకయ్య సంతోషపడ్డాడు.
    ఎలాటి బలరామయ్య ఎలా అయిపోయాడు? ఒకప్పుడు చెప్పు ఎత్తిన బలరామయ్య ఎలా జవకారి మాట్లాడాడు? ఈనాడు బలరామయ్య చెట్టుమీదలేడు. విరిగిన కొమ్మను పట్టుకొని వేలాడుతున్నాడు! అది స్పష్టంగా చూడగలిగాడు కనకయ్య.
    "మరో సంబంధం చూడు. నాకున్నదంతా దానికిస్తాను. నేనేమయినా దానికి అన్యాయం చెయ్యను."
    "బిడ్డకు న్యాయం చేస్తున్నాననుకొంటూ అన్యాయం చేస్తున్నారేమో ఆలోచించండి బలరామయ్యగారూ!" కనకయ్య మాట విని బలరామయ్య  తెల్లముఖం వేశాడు.
    "సరే! కట్నం అంటున్నారు. ఏమాత్రం ఇస్తారేం?" విషయాన్ని పక్క దారి పట్టిస్తూ అన్నాడు కనకయ్య.
    "ఉన్నదంతా! నా మేడా, పద్దెనిమిదెకరాల మాగాణి! అంతా దానికేఇస్తా!"
    "అరవై వేల అప్పు? అదేం చేస్తారు?"
    "అప్పు అరవై  వేలయిందా?"
    "నలభైవేలు నాలుగేళ్ళ కిందట వడ్డీ తిరగ్గడితే అరవై దాటుతుంది. అందులో ఆరేళ్ళ కిందటిది ఆరెకరాలు తాకట్టు. వడ్డీతో డబ్బు చెల్లించేకంటే పొలం వదులుకోవటమే మీకు లాభం! అందుకు వాళ్ళని నే ఒప్పిస్తా. ఎనిమిదెకరాలు అమ్మితేగాని ఆదిశేషయ్యగారి బాకీ తీరదు. పోతే మేమిచ్చిందే అసలు ముఫ్ఫైవేలు. వడ్డీలతో అర్ధ 'ల' కారం అవుతుంది. మా భాగస్తుడు శేషావతారం సంగతి నేను మీకు చెప్పాల్సిందేమీ లేదు."
    "ఈ మేడ కట్టుకోమను! ఇదమ్మితే నా అప్పు తీరదా ఏం?" మనసును కుదుటపర్చుకుంటూ అన్నాడు బలరామయ్య.
    "ఈ మేడ లక్ష రూపాయల విలువ చేసేదే. నేను కాదనను. అది ఏ విజయవాడలోనో, గుంటూరులోనో వుంటే! ఈరోజు ఈ పల్లెటూర్లో అమ్మితే ఇరవై వేలకు కూడా కొనరు. ఉన్న సంగతి అది!" కనకయ్య నిష్కర్షగా చెప్పాడు.
    బలరామయ్య కూర్చున్న కుర్చీ కాళ్ళు విరిగినట్టయింది. పాదాల కింద భూమి ఆనడంలేదు.
    "ఇదిగో బలరామయ్యగారూ! దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోవటంమంచిది. మీ పరువూ, మర్యాదా, వంశ ప్రతిష్టా రేపు అప్పులవాళ్ళు కోర్టు కెక్కితే ఏమవుతాయ్? డిక్రీ పొంది వేలంపాట పెట్టాక వూళ్ళో తలెత్తుకు తిరగ్గలరా? అప్పుడు అమ్మాయి పెళ్ళి ఏవిధంగా చేస్తారు? అందాకా ఎందుకు? ఏ కూతురింటికెళ్ళి మీరు తల దాచుకుంటారు? ఏ కొడుకు మిమ్మల్ని గౌరవించి ఆదరిస్తాడు? మీరే ఆలోచించండి!" బలరామయ్య కళ్ళల్లో నీరు తిరగటం చూసి కనకయ్య ఆపాడు.
    "వెంకటపతికి ముఫ్ఫై ఏళ్లదాకా లేవూ?" అనుకోకుండానే అన్నాడు బలరామయ్య.
    "ఛ! ఎవడండీ ఆమాట అంది? ఇరవై ఏడేళ్ళకు పైన ఒకటో అరో అంతకంటే ఉండవు. వెంకటపతి మన కళ్ళముందు పుట్టి పెరిగినవాడే కదండీ?"
    "నువ్వెన్నన్నా చెప్పు కనకయ్యా! చూస్తూ చూస్తూ నా బిడ్డను సాంబయ్య కొడుక్కు ఇవ్వలేనయ్యా!" బలరామయ్య మాటల్లో గట్టితనంగానీ, నిర్ణయంగానీ ధ్వనించలేదు.
    "వెంకటపతికేం? ఆ మాటకొస్తే అట్టాంటి కుర్రాడు ఈ వూళ్ళోనే లేడు. కష్టజీవి. ఒకళ్ళ జోలికి పోయేవాడుకాడు. బస్తీలు పట్టుకు జులాయిగా తిరిగేవాళ్ళపాటి చెయ్యడా వెంకటపతి!"
    కనకయ్య మాటలు బలరామయ్య గుండెల్లో సూటిగా నాటాయి. తన కొడుకులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ బ్రతుకు కేమయింది? ఏ మాట కామాట! తన కొడుకులకూ వేంకటపతికి సామ్యం ఏమిటి? తన బిడ్డల్లో ఒక్కడు వెంకటపతిలాంటి వాడున్నా తన ఆస్తంతా ఇలా పరుల పాలయ్యేదా? బలరామయ్య మనసు తనకు తెలియకుండానే సమాధానపడ సాగింది.
    "ఇదిగో బమరామయ్యగారూ? ఒక్కమాట చెప్తా వినండి. వెంకటపతి మీకు అల్లుడయితే, మీ మిగిలివున్న ఆస్తి, మేడా, మీ వంశంలో వాళ్లలోనే వుంటుంది. అప్పులు తీర్చగల సత్తా, పట్టుదలా సాంబయ్య కుంది. సాంబయ్య ఎంత కష్టకాలంలో అప్పులు తీర్చి నిలబడ్డాడో మీకు తెలిసిందేగా?" కనకయ్య ఆగి బలరామయ్య ముఖంలోకి చూశాడు. తను చెప్పేది శ్రద్దగా వింటున్నాడు బలరామయ్య. అతని ముఖంలో కన్పించిన మార్పును చూసి, పండకాలిన ఇనుముమీద మరో దెబ్బతీశాడు కనకయ్య.
    "మీ తాతలనాటి ఈ మేడా, దొడ్డీదోవా, మరొకళ్ళ స్వాధీనం కాకుండా ఉండాలంటే, మీరు బతికుండగానే ఈ ఇంట్లో గబ్బిలాలు తిరక్కుండా వుండాలంటే, నేను చెప్పిన సలహా వినండి. వీరభద్రయ్యగారి మేడా, వీరభద్రయ్యగారి పొలం, కూతురి బిడ్డకైనా శాశ్వతంగా వుంటాయి. మీ వంశం గుర్తులు ఈ ఊళ్ళో చెరక్కుండా వుండాలంటే ఈ సంబంధం ఒప్పుకోండి. నా మాట వినండి."
    "కనకయ్యా! కనకయ్యా!" బలరామయ్య భుజంమీది తువ్వాలు నోట్లో కుక్కుకొని, మొహం మోకాళ్ళమీదకు వంచి, చేతుల్తో తల పట్టుకొన్నాడు.
    "బలరామయ్యగారూ! ఊరుకోండి! అంతా దైవ సంకల్పం! కరుణామయుడు ఆ పరమాత్ముడే, సాంబయ్యకు మీతో వియ్యమందాలనే బుద్ది కల్పించాడు. కాకపోతే లక్షలకట్నం కావాలని ఎన్నో సంబంధాలు తిప్పికొట్టిన సాంబయ్య, మీ సంబంధాన్ని ఏరి కోరుకోవటం ఏమిటి? అంతా భగవత్ సంకల్పం! మరొస్తా! మాఘమాసం వెళితే మళ్ళీ మూఢం వస్తుంది. ఈ నెల్లోనే ముహూర్తం పెట్టించాలి" అని కనకయ్య బలరామయ్య ముఖంలోకి చూడలేక గేటు బార్లాగా తెరచుకొని వెళ్ళిపోయాడు.
    అసాధ్యమూ, దుర్లభమూ అనుకొన్న పని, ఇంత సులువుగా నెరవేర్చగలగడంతో, కనకయ్యకు తన వ్యవహారజ్ఞానం మీద, వివేకంమీద, తెలివితేటలమీద అపారమైన నమ్మకమూ, ఆత్మవిశ్వాసమూ ఏర్పడ్డాయి. మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఆ సంతోషవార్తను తిన్నగా వెళ్ళి సాంబయ్య చెవుల వెయ్యటానికి అతని ఇంటిముందుకొచ్చి ఆగాడు. అప్పటికే చాలాపొద్దు పోయిందన్న విషయం, రెండుకేకలు వేసినా నిద్రపోతున్న సాంబయ్య  పలక్కపోవటంతో గుర్తొచ్చింది. ఇంటిముఖం పట్టాడు.
    అంత అర్జంటుగా సాంబయ్యకీ విషయం చెప్పటంకూడా అంత మంచిది కాదేమో? గంటలమీద బలరామయ్య సాంబయ్యతో వియ్యమందటం ఒప్పుకున్నాడన్నా అంతమంచిది కాదు. అందులోని తన ప్రయోజకత్వాన్ని గుర్తించలేడు. కొంత నాన్చి, తను అతికష్టంమీద బలరామయ్యను ఒప్పించినట్లు సాంబయ్య దగ్గిర నిరూపించాలి. అప్పుడు గాని సాంబయ్యకు తనమీద గురి ఏర్పడదు. ఆలోచిస్తూ నడుస్తోన్న కనకయ్య బుర్రకు చల్లగాలి తగిలి హాయిగా అనిపించింది.
    కనకయ్యకు వచ్చిన చిక్కు ఏమిటంటే అతనిబుర్ర ఎటుతిప్పినా సమానంగానే పనిచేస్తోంది. అవును! కాదు!" అన్న రెంటికీ ఒకేసమయంలో తగిన కారణాలు, ప్రయోజనాలు వెతగ్గలడు. ఎటు తిప్పినా నష్టం అవతలివాడిదేనన్న ఆత్మవిశ్వాసం అతన్ని పుట్టించిన బ్రహ్మ ఇచ్చిన వరం అనే నమ్మకం కనకయ్యకు ఉంది.
    "ఎవరా మనిషి?"
    కనకయ్య కాళ్ళవేగం తగ్గించి తలెత్తి చూశాడు.
    రామమందిరం దగ్గిర పురాణకాలక్షేపం చేసి తిరిగి వెళ్తున్నవాళ్ళు కనకయ్యకు ఎదురైనారు.
    "ఎవరూ? నువ్వేనా కనకయ్యా! ఇంత పొద్దుపోయి ఇటునుంచి వస్తున్నావ్?" అన్నాడు ఓ పెద్దమనిషి.
    "పురాణ కాలక్షేపానికేమో మరి. ఇప్పుడే అయిపోయింది. ఇవ్వాళ రావణాబ్రహ్మ సీతమ్మ వారిని ఎత్తుకొని పోయే ఘట్టం! ఎంత బాగా నడిచిందనుకున్నావ్ కనకయ్యా?" తనువిన్న పురాణాన్ని ఇంకా మనసులోనుంచి దూరం చేసుకోలేని ఒకాయన అన్నాడు.
    "ఆయన కెందుకయ్యా పుణ్యాలు-పురాణాలూ? రెండుచేతుల్తో ఎడాపెడా సంపాదిస్తున్నాడు" అన్నాడు మొదటి పెద్దమనిషి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS