"చాలా బాగుందండీ. కానీ...." అన్నాను మళ్ళీ.
"ఏమిటి కానీ?"
"అర్ధం మారిపోయిందండి".
"నోరు మూసుకుని నేను చెప్పింది రాయి" - అన్నారు.
పనికొచ్చి నెలరోజులైనా కాలేదు - ఎన్నో ఏళ్ళుగా పరిచయం వున్నట్లు చనువుగా తిట్టడం, నోర్ముయ్య మనడం, మృదువుగా చీవాట్లు పెట్టడం వరకూ కథ వచ్చేసింది.
నిజంగానే, ఇంకా ఎక్కువకాలం అయితే పాకం ఇంకెంత ముదిరిపోతుందో - అనుకుంటూ వారు చెప్పిన లైను తప్పుగా రాశాను.
"ఏమిటాలోచిస్తున్నావు? ఎక్కడుంది నీ బుర్రని అనిగేరు.
"అదేనండి, మీరు చెప్పేరే. ఆ మాటల మీదే వుంద"న్నాను.
"కాఫీ తెమ్మని చెప్తావూ" బాయ్ చేత కాఫీ తెప్పించి తాగాం.
"చెప్పిన వెంటనే చేశావు. డిసీజ్ గుడ్ థింగ్" - అన్నారు.
'మా మెచ్చుకున్నార్లెండి' - అనుకున్నాను మనస్సులో.
పాడిందే పాడి, రాసిన పల్లవుల్లో మంచి పల్లవి ఎన్నుకుని పల్లవి, అను పల్లవి తయారు చేశాం. చక్కగా వచ్చాయి.
నన్ను పాడమన్నారు. పాడాను చాలా సంతోషించారు.
"చూడు సరోజా! ఏ పాట ఎలా రాయాలో నాకు తెలుసు. నేను రాస్తున్నప్పుడు నువ్వు అడ్డురాకు. చెప్పింది రాయి" సరేనా,
"అలాగేనండి. ఈ పాటకి లిప్ సరిపోయింది గానీ నిజంగా మీనింగ్ సరిగ్గా వచ్చిందాని" - అడిగాను.
"కొన్ని పాటలకి అదే మీనింగ్ వచ్చేలా రాయక తప్పదు సరోజా! కొన్ని పాటలకి మీనింగ్ ఏక్షన్ కి సరిపోతే చాలు.
ఈ పాట పూర్తి చేసిన తఃరువాత మూవియోలాలో చూపిస్తాను. ఎంత చక్కగా యాక్షన్ కీ, సీక్వెన్స్ కి సరిపోతుందో చూడు. స్త్రయిట్ సాంగ్ లా వుంటుంది కానీ డబ్బింగ్ సాంగ్ లా వుండదన్నారు"
ఆ సంగతి తెల్సుకుందాం అన్న ఉత్సాహం మీదనే ఆ రోజంతా నానా తిప్పలూ పడి పాట పూర్తిచేయించాను.
మా పక్క రూములోనే మూవియోలా వుంది. ఇద్దరం వెళ్ళి కూర్చున్నాం. అదే పాట నాలుగయిదుసార్లు చూశాం.
లేడిపిల్ల పారిపోతూ వుంటే, ఎమ్.జి.ఆర్. కోయ వేషంలో బాణం సంధించి, అటూ ఇటూ చూస్తూ వెతుక్కుంటూ వచ్చే సీన్ అది.
ఒళ్ళు మరచిపోయాను. శ్రీశ్రీగారి కాళ్ళమీద పడిపోవాలనిపించింది.
పాట ఎంత బ్రహ్మండంగా వచ్చిందంటే, చెప్పడానికి నాకు మాటలు చాలవు.
"చాలా బాగుందండి. ఈ పాటకి అర్ధం అక్కడక్కడా మారినా పిక్చర్ కి సరిగ్గా సరిపోయిందండి" - అన్నాను.
'దారికి వస్తోందిరా' - అనుకున్నారేమో నా సంతోషం, ఉత్సాహం చూసి "మరోపాట రాద్దామని" - అడిగారు.
"అంతకన్నానా?" అన్నాను.
రాత్రి తొమ్మిది గంటలయ్యేసరికి రెండు పాటలు, రెండు పద్యాలు లాగేశారు.
"ఇప్పుడేమంటావు? రాసేశానా, లేదా? ఎందుకు భయపడతావు! వాళ్ళు రికార్డింగ్ పెట్టే వేళకి మన ఆలస్యం లేకుండా సిద్దంగా ఉందాం. నా కొదిలేయి.
అలాగన్నానని పూర్తిగా వదిలేయడం కాదు. వెనుకనుండి నన్ను రాయడం విషయంలో హెచ్చరిస్తూవుండు. చిరాకు మీద ఏ మాటన్నా పట్టించుకోకు" - అన్నారు.
"అన్నీ బాగున్నాయి. మీ మూడ్సే నాకు నచ్చలేద"న్నా.
"సరే యింటికి పోదాం. పదండి" - అన్నారు. మాట దాటెయ్యడంలో ఆయన కాయనే సాటి.
* * *
మర్నాడు భానుమతిగారి పాట మీద కూర్చున్నాం.
అంతవరకూ భానుమతిగారిని నేను సినిమాల్లో చూడడమే గానీ ముఖాముఖి చూడలేదు. నేనెక్కువగా అభిమానించే ఆర్టిస్ట్ భానుమతిగారే!
శ్రీశ్రీగారు చాలా సీరియస్ గా ఆ పాట మీద కాన్ సన్ ట్రేషన్ చేస్తూ కూర్చున్నారు.
ఏ క్షణంలో ఏం చెప్తారోనని కాగితం, పెన్సిల్ తో సిద్దంగా కూర్చున్నాను. దమ్ము చప్పుడు గట్టిగానే వస్తోంది.
ఈ పిక్చర్లో ఉన్న పాటల్లో మూడు పాటలు ఛాలెంజ్ సాంగ్సని ఇద్దరం అనుకున్నాం.
అందులో ఒకటి పద్మినీ డాన్స్ పాట అంతా యాక్షనే. ప్రతీ లైనుకీ వెనకాల ఆయా సన్నివేశాల చిత్రపటాలు చూపిస్తుంటారు.
అలాగే ఎం.జి.ఆర్. పాట ఒకటి, భానుమతి గారి సోలో ఒకటి.
శ్రీశ్రీగారు ఆ పాటలు చాలా బాగా రాశారు. (ఆ పాటలన్నీ తెలుగు లిపి నా దగ్గరలేవు. నాకు జ్ఞాపకం కూడా లేవు.)
ఒకటికి పదిసార్లు మూవియోలాలో - పాటలు రాయక ముందూ, రాసిన తర్వాత కూడా చెక్ చేశాం. మధ్యలో ఒకటి రెండు చోట్ల లిప్ పోతే అది కూడా నేను వదలనివ్వలేదు.
ఆ పాతాళ వరకూ నా అదృష్టం బాగుంది. నాతో ఏకీభవించి, ఆ లైన్లలో మార్పులు కూడా చేశారు. బాగానే వుందనుకున్నాను.
మరొక్క రెండు పద్యాలు, రెండు పాటలు మిగిలిపోయాయి. తర్వాత రాస్తానని పేచీ పెట్టారు.
"అవి కూడా పూర్తి చేద్దామ"ని నేను.
"తొందరలేదు. ఒకటి రెండు బాకీ వుండనీ" అని శ్రీశ్రీగారు పేచీ పడ్డాం.
"రాసెయ్యండి, మన దగ్గరే వుంటాయి. అడిగితే రాసేశామని చెప్పవచ్చు. బాకీ పెడితే మనస్సుకి ఫ్రీగా వుండదు" అన్నాన్నేను.
మళ్ళీ మా ఇద్దరికీ వాగ్వివాదాలు పెరిగాయి.
మా ఆఫీసుకి పక్కనే వున్న బజారుకి బాయ్ ని సాయం తీసుకుని అమ్మ వెళ్ళింది.
"చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినిపించుకోవు కదా? ఇప్పుడే నా చేత రాయించాలని నీ కెందుకంత పట్టుదల?"
"పట్టుదల అని ఎందుకనుకుంటారు? ఒక పనయిపోతుంది కదా అని ఆలోచించరేం?"
ఇద్దరం మాటా మాటా అనుకోవడం ప్రారంభించాం.
నా మాటలు ఆయనను బాగా రెచ్చగొట్టాయనుకుంటాను. రివ్వున లేచి కుడి చేతిని గట్టిగా విసిరారు.
అది తప్పించుకోవాలనే ప్రయత్నంలో నా కుడిచేతివైపు నుదుటిమీద తగిలింది శ్రీశ్రీగారి చేయి.
ఆ చేతి వెలికి ఉంగరం వుందేమో నా నుదుటికి గట్టిగానే దెబ్బ తగిలింది. ఇదివరకే అక్కడ నాకో గాయం అయివుండడంతో, ఇప్పుడు శ్రీశ్రీగారి చేతి దెబ్బ వల్ల రక్తం వచ్చింది.
నేనే ఏమీ అనలేదు.
శ్రీశ్రీగారు మాత్రం కంగారుపడ్డారు.
నేను వెంటనే బాత్ రూములోకి వెళ్ళిపోయాను.
ఆయనెక్కడ? నేనెక్కడ? ఆయనతో సమానంగా ఆ వాదనేమిటి?
తప్పని నాకూ తెలుసు.
ఈ కొద్ది రోజుల పరిచయం, అనుభవాలతో నేను తెలుసుకున్నది ఏఁవిటంటే శ్రీశ్రీగారితో మంచిగా సరదాగా వుండి పనిరాబట్టలేం. ఆయనను విసిగించి, ఆయన కోపానికి చిరాకుకి ఓర్చుకుని పని చేయించాలి. ఎన్ని పాట్లుపడైనా ఆయన చేతపనిచేయిస్తూ సిద్దంగా వుంటే మంచి పేరు వస్తుంది - అని ముందే నిశ్చయించుకున్నాను.
కానీ ఈ విధంగా జరుగుతుందని ఊహించలేదు.
* * *
ఆ ఉంగరం కథ
రక్తం ఆగడం లేదు. చేత్తో గట్టిగా నొక్కి బాత్ రూం నుండి బైటకొచ్చాను. ప్రొడ్యూసర్ల ఆఫీస్ రూమ్ కి వెళ్ళి "బాత్ రూములో పడ్డాన"ని చెప్పాను. వాళ్ళు హడలిపోయి టించరీస్ వేసి ఏదో మందు రాసి పాస్టరంటించారు. ఇంతలో మా అమ్మకూడా వచ్చేసింది.
నేను కాం గా గదిలోకి వచ్చేసి, నా టేబుల్ ముందు కూర్చున్నాను.
మా అమ్మ దగ్గరగా వచ్చి దెబ్బ చూసి, "ఏమయిందే?" అని గాభరా పడింది.
"ఏమీలేదమ్మా! అంత భయపడిపోతావేమిటి? బాత్ రూమ్ చూడు "ఎంత జారుగా వుందో! జారిపడ్డాను. దెబ్బ తగిలింది" అని చెప్పాను.
ఈ మాటలన్నీ శ్రీశ్రీగారు వింటున్నారు. ఆ సమయంలో ఆయనను చూస్తే గుండె చెరువైపోతోంది.
ఆయన మాత్రం కావాలని చేశారా, చేస్తారా?
కానీ ప్రతివారికి మనస్సాక్షి ఒకటంటూ వుంటుంది కదా! మంచివారు పశ్చాత్తాపపడతారు. మొండివాళ్ళు, దుర్మార్గులు దబాయిస్తారు.
ఈ సంఘటన ఎందుకు రాశానంటే శ్రీశ్రీగారికి కోపమే లేదని చాలామంది అంటారు. లేదంటే ఒప్పుకోను.
