ఏమయినాసరే ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదని విమలకి స్పష్టం చేశారు.
ఆ రాత్రి విమల నిద్రబిళ్ళలు మ్రింగి పడుకుంది.
తెల్లారి ఆమె ఎంతకూ కదలక పోయేసరికి అనుమానం వొచ్చి చూస్తే వొంటిమీద తెలివిలేని స్థితిలో చావు బతుకుల మధ్యవుంది. లబోదిబో మంటూ హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఎడ్మిట్ చేశారు.
గవర్నమెంటు హాస్పిటలయితే మెడికో లీగల్ కేనవుతుంది. ప్రయివేట్ నర్సింగ్ హోమ్...
అక్కడి డాక్టరు నమ్మకం చెప్పలేవన్నాడు. ఎందుకమతే మాత్రలు మ్రింగి అప్పటికే చాలాసేపయింది చాలా డీప్ కోమాలో వుంది మిగతా చిహ్నాలు కూడా ప్రోత్సాహకరంగా లేవు.
మూడు రోజులు నరకంలా యజ్ఞంలా గడిచింది. ఎప్పటికప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారుతూవుంది. మళ్ళా అంతలో కొద్దిగా మెరుగవుతూ ఉండేది.
చివరికి విమల బ్రతికింది కాని కొన్ని రోజుల వరకూ పూర్తిగా తెలివిలోకి రాలేదు. ఊరికే వెక్కివెక్కి ఏడుస్తూ ఉండేది. ఫిట్ వచ్చి మెలికలు తిరిగిపోయేది.
అనంతమూర్తి. వసంత రోజూ వచ్చి చూసి వెడుతూనే వున్నారు. విమల పరిస్థితి మెరుగై యింటికి తీసుకురావటానికి పదిహేనురోజులు పట్టింది.
ఆమెతో ఎవరూ మాట్లాడరు. ఆమె గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ పెళ్ళి జరిగితే ఆమెకూ తమకూ సంబంధం తెగిపోయినట్లేనని స్పష్టం చేశారు.
విమల రావలసిన నిశ్చయానికి మునుపే వచ్చేసింది. తల్లిదండ్రులదగ్గర శెలవు తీసుకొని షాషాతోకలిసి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళి రిజిష్టర్ పెళ్ళి చేసుకుంది. అనంతమూర్తి వసంతా సాక్షులుగా వెళ్ళారు. పెళ్ళయ్యాక వాళ్ళిద్దర్నీ మూడురోజులు తమ యింటనే వుంచుకున్నారు. తర్వాత చిన్న యిల్లు అద్దెకు తీసుకొని వాళ్ళిద్దరూ కొత్త కాపరానికి వెళ్ళిపోయారు.
* * *
జీవితం ఒక్కోదశ చకచక జరిగిపోయినట్లనిపిస్తుంది. ఒక దశ నెమ్మదిగా సాగినట్లనిపిస్తుంది. ఎందుకో కొందర్ని చూస్తోంటే బాల్య యౌవనాలు అతివేగంగా దాటేసి వృద్దాప్యంలో ఎన్నో వందల సంవత్సరాలు జీవించినట్లని పిస్తుంది.
రాఘవ పెద్దకొడుకు రాఘవతో సంబంధం లేకుండా ఎక్కడో వుంటున్నాడు. రోజుకో ఉద్యోగం చేస్తాడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఒకసారి ఉద్యోగమంటాడు. ఒకసారి బిజినెస్ అంటాడు. తను చాలా మేధావిననుకుంటూ వుంటాడు. తనకు ముందు ముందు మంచిరోజులు వస్తాయనీ ఉజ్వలమైన భవిష్యత్ వుందని అప్పుడు దేశాన్ని చెండుకు తినేస్తానని ఎదురు చూస్తూ వుంటాడు.
రెండోవాడు ఇంజనీరింగ్ ప్యాసయ్యాక మంచి ఉద్యోగమే వచ్చింది. అది కాకినాడలోనే పెళ్ళికూడా అయ్యింది. అతని భార్య అపర్ణ కూడా ఉద్యోగం చేస్తుంది ఉమెన్సు కాలేజీలో.
అత్తకూ కోడలుకూ ఒక్కక్షణం పడదు. ఎప్పుడు ఏవేవో సమస్యలు నిరంతరం రణగొణ ధ్వని.
పిల్లల కోసం తన సర్వశక్తులూ ధారపోశాడు. తను ఇప్పుడు రిటైర్ కాబోతున్నాడు. జీవితంలో ఇంటికోసం పెళ్ళాం కోసం పిల్లల కోసం శ్రమపడి, శ్రమపడి అలిసి పోయాడు. ఇక విశ్రాంతి తీసుకునే రోజులు వస్తున్నాయి. అతనేదో వాంఛిస్తున్నాడు. వాళ్ళనుంచి విధేయత మెచ్చుకోలు ఊరడింపు. సేవలు సుఖాలు....ఏవేవో కోరుకుంటున్నాడు.
కానీ ఏమీ జరగటం లేదు.
అంతేకాదు. అందుకు భిన్నంగా కూడా జరుగుతోంది.
వాసు మునుపటి మనిషిలా కనబడటం లేదు. తనను చూసి విసుక్కుంటున్నట్లు తనకు దూరంగా జరుగుతున్నట్లు తన ఉనికిని భరించలేనట్లు కనబడుతున్నాడు. నిజమేనా? అది భ్రమా! లక్ష్మి కూడా అలాంటి అభిప్రాయం వెలిబుచ్చింది. తాను వాడికేం అన్యాయం చేశాడు. అప్పులు చేసి చదివించాడు. వాడు పరీక్షలు ప్యాసుకావటం కోసం అలమటించి పోయాడు. ఇవన్నీ వాడు ఒక్కసారి కూడా ఆలోచించడా!
వాడికి అక్కరలేదా!
మూర్తిని కలుసుకున్నప్పుడు బాధంతా వ్రెళ్ళగక్కు కున్నాడు.
"నీ బాధలో అపరిపక్వత వుంది అన్నాడు" మూర్తి.
రాఘవ అతనివంక దీనంగా చూశాడు.
"మూర్తీ! చిన్నప్పటినుంచీ ఎన్నో అంశాలలో నన్ను వ్యతిరేకిస్తూ వచ్చేవు. ఈ మనో వ్యధలోనన్నా ఏకీభవించావా!" అన్నాడు.
"ఏకీభవించను."
రాఘవ జాలిగా అన్నాడు.
"పిల్లలను పైకి తీసుకురావటం తల్లిదండ్రుల బాధ్యత. కర్తవ్యం. కాని పిల్లల నుంచి తిరిగి అలాంటి బాధ్యతను ఆశించటం చిన్న పిల్లల చేష్ట పిల్లల ఎదుగుదల చూసి ఆనందించాలి. ఆ ఎదుగుదలలోని మనవాటాని పదేపదే గుర్తుచేసుకోవటం సంకుచితం. మనం పంచిన ప్రేమ తిరిగి పొందాలనుకోవటం స్వార్ధంకాకపోవచ్చు కాని మూర్ఖత్వం. పదేపదే మన ఉనికి మనం చేసిన ఉపకారాల్ని గుర్తుచేస్తూ వుండటం గుర్తుచేసుకుంటూ వుండటం ప్రకర్ష."
"మరి అవసాన దశలో మిగిలేదేమిటి?"
"నీ బాధ్యతల్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించానని తృప్తి నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా జీవించానన్న సంతృప్తి."
"మరి ఈ దశలో వాళ్ళనుంచి కొన్ని అవసరాలుంటాయి కదా!"
"ఏమీ ఉండక్కర్లేదు. అక్కర్లేకుండా ముందునుంచి ప్లాను చేసుకుంటే ఏమీ ఆధారపడటమూవుండదు. ఆశించటమూ వుండదు రాఘవా నువ్వు ఒకరికిచ్చింది తిరిగి తీసుకోవాలను కోవటం మంచి ఆలోచనగా కనబడటం లేదు. కొందరికి కాకతాళీయంగా అలా జరిగితే అది వేరే విషయం. ఎదురు చూడటం-యిందాక చెప్పానే అపరిక్వతే."
రాఘవకు తృప్తిగాలేదు. విరిగిన మనస్సులో వొంగిన తనువుతో అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
* * *
రిటైరయ్యే రోజూ వచ్చేసరికి రాఘవ రెండో కూతురు నిర్మల పెళ్ళికూడా చేసేశాడు.
ప్రావిడెంట్ ఫండ్ లో దమ్మిడీ చేతికి రాలేదు.
ఇంట్లో ఏమీ తోచదు. ఇదివరకు రోజుల తరబడి ఆఫీసుకు సెలవు పెట్టటానికి యింట్లో ఎన్నో సమస్యలు కనబడుతూ వుండేవి. ఇప్పుడు శాశ్వతంగా సెలవుపెట్టి యింట్లో కూర్చుంటే వ్యాపకమే కనబడటంలేదు. ఎగిరే పిట్టల్ని చూస్తాడు. సాయంత్రాలు రోడ్లమీద ఉత్సాహంగా ఆడుకునే పిల్లల్ని చూస్తాడు. మనసులో ఏదో బరువుగా, దిగులుగా కదిలినట్లవుతుంది.
